Monday, January 8, 2018

JAI SREEMANNAARAAYANA- 27


 కూడారై వెల్లుం శీర్ గోవిందా!ఉందన్నై
 పాడిపఱై కొండు యాం పెరుసన్మానం
 నాడు పుగళం పరిశినాళ్ నన్రాగ
 శూడగమే తోళ్వళియే తోడై సెవిప్పువ్వే
 పాడగమే ఎన్రనైయ పల్కలనుం యా మణివో
 ఆడైయడు ప్పోం అదన్ పిన్నే పాల్ శోరు
 మూడనెయ్ పెయ్దు  ముళంగై వళివార
 కూడి ఇరుందు కుళిరుందు  ఏలో రెంబావాయ్.

  ఓం నమో నారాయణాయ-27

విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది

గాజులు-కడియాలు చీరెలు-సారెలుయైన
శ్రీహరి దీవించుచున్న దీర్ఘ సుమంగళములో

కర్ణిక చుట్టిన రేకులు కన్నని గోపికలైన
పెరుమాళ్ళుకు తినిపించే పెద్ద సన్మానములో

వేళ్ళసందు నంజుడున్న "భ్రాజిష్ణు: భోజనం భోక్త" యైన
ఎంగిలి భోజనాల కూడారై పాశురములో

చల్దులారగింప వేగ చెలులారా రారె
ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె

భావము

మన గోపికకు స్వామి కరుణతో పోతన భాగవత తత్త్వము ప్రసాదింపబడి కూడారై ప్రసాద-పాశుర విశిష్టతను వివరించగలుగుతోంది.

"కమలాక్షునర్చించు కరములు-కరములు" రీతిలో మనగోపికలు స్వామిని ప్రసాదించమన్నవి సౌభాగ్యములు.

స్వామిని పద్మమునకు కర్ణికగా,గోపికలను చుట్టిన రేకులుగా "జలజాంతస్థిత"
దర్శించడము జ్ఞానానికి సంకేతము.

అసలు కూడారై అంటే ఏమిటి? ప్రసాదము అనుకుంటే అది బాహ్యమా లేక ఆధ్యాత్మికమా?

పాలతో కలిసి ఉడికిన బియ్యము మధురమును పూర్తిగా కలుపుకుని నేతిలో పూర్తిగా మునిగిపోయిన ప్రసాదము" కూడారై" ( బాహ్యమునకు )

గోపికలు ప్రసాదమును తినునపుడు వారి మోచేతిదాకా నెయ్యి కారవలెనని అమ్మ ప్రార్థించినది.ఏమిటి దీని అంతరార్థము?

పాలు స్వచ్చమైన స్వామి గుణగణములు .బియ్యము స్వామి సాహచర్యముకోరు నిశ్చలభక్తి .వాటిని ఉడికించునది స్వామి సాంగత్యమును కోరు ,భక్తుల తపన అనెడి అగ్ని .ఉడికిన పాలు-బియ్యమునకు స్వామి అనుగ్రహమను మథురము తోడైనది.భక్తుని-భగవంతుని విడతీయలేని లేహ్యమైన నెయ్యి. పూర్తిగా పదార్థమునురుచిలో(తాదాత్మ్యతలో) ముంచి వేస్తోంది. ..నెయ్యిమోచేతివరకు పొంగి పొరలుట నవనీతుని దయసంద్రము పొంగి పొరలుట.ఎప్పటికిని భక్తుని భగవంతుని కలిపి ఉంచగల అవ్యాజ ప్రేమయే ఆ ఆజ్యము.

ఈ సందర్భములో మనము ఆండాళ్ తల్లి యతిరాజ సోదరిగా కీర్తింపబడే విశేషమును ముచ్చటించుకుందాము.తల్లి స్వామి కూడారై ప్రసాదమును స్వీకరించినట్లైతే, 108 గుండిగల ప్రసాదము సమర్పిస్తానని,నెరవేర్చుకొనలేకపోయినది.రామానుజాచార్యులవారు అన్నగా ఆ బాధ్యతను తాను స్వీకరించి శ్రీ రంగములోని స్వామికి అమ్మ అన్నమాట ప్రకారము సమర్పించారు.అమ్మ సంతోషించి రామానుజ సోదరిగా "యతిరాజ సోదరి"గా కీర్తింప బడుచున్నారు.

మనుషులు విరక్తులు-తటస్థులు-అనురక్తులు అను భక్తి విషయములో విభజింపబడతారు.దేవుడులేనే లేదనువారు విరక్తులు.తానే వచ్చి రక్షిస్తాడనుకునే వారు తటస్థులు.క్షణమైన స్వామిని విడిచి ఉండలేనివారు అనురక్తులు.(మన గోపికలు)

"భ్రాజిష్ణు: భోజనం భోక్తా" ఆహారమును సృజించువాడు-ఆహారము-ఆహారమును భుజించువాడు మూడు పరమాత్మనే.ఆ స్వామి వేళ్ళ సందున ఊరగాయిని నంజుడికి పెట్టుకుని,గోపబాలులు ఇంటినుండి తెచ్చుకున్న చద్దిని,ఆకులపైననో,చేతులలోనో తీసుకుంటు,పక్క వాడి ముద్దను వాడిచేతినుండి లాక్కొంటు,వాడేడిస్తే ఇంకొకడి చద్దిని పెడుతూ,ఎగురుతూ,ఆడుతూ-పాడుతూ,గిల్లికజ్జాలతో,వారిని ఊరిస్తూ,వారితో మమేకమై ఆనందిస్తు, ఆనందింప చేస్తూ,తాను ఆనందమై వారిని అనుగ్రహించుచున్న శ్రీ కృష్ణభక్తురాలిగా మన గోపికను భావిస్తు, నా మనసు అమ్మవెంట చల్దులారగించుటకు బయలుదేరుచున్న గోపికలతో బాటు తన అడుగులను కదుపుతోంది.

( ఆండాళ్ తిరు వడిగళే శరణం )

JAI SREEMANNAARAAYANA-26


  మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్
 మేలైయార్ శెయ్వనగళ్ వేండువన కేట్టియేల్
 ఞాలత్తై యెల్లాం నజుంగ మురల్వన
 పాలన్న వణ్ణత్తు ఉన్ పాంచశన్నియమే
 పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడై యనవే
 శాలప్పెరుం పఱయై పల్లాండి శైప్పారే
 కోలవిళక్కే కొడియే వితానమే
 ఆలినివైయాం అరుళ్ ఏలోరెంబావాయ్

 ఓం నమో నారాయణాయ-26

విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది

చెంతనున్న స్వామిసేవ చెదరని వ్యామోహమైన
దాచలేని గోపికల "మాలే" అను పిలుపులో

గాయకులు- శంఖములు మేలుకట్లు కోరుకున్న వారైన
అర్థులు-దాతలు ఒక్కరైన అద్వైత భావములో

పదునాలుగు భువనముల స్థూలము సూక్ష్మముయైన
పదిలముగా పరుండిన వటపత్ర శాయిలో

పరాత్పరుని కోరుతూ " పరను" వద్దన్నవారైన
నల్లనయ్య సన్నిధిలో పాడుతున్న" పల్లాండ్లలో"

సారసాక్షుని సన్నిహితపు సాహచర్యమునకు రారె
ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె.

భావము

వ్యాపించిన మోహములో మునిగిన గోపికలు శ్రీ కృష్ణుని దాసోహభావముతో మాలే!(వీడలేని వ్యామోహమా!) అని సంభోదిస్తూ,వటపత్రశాయిగా (శయనించేస్వామి-శాయి) స్వామిని దర్శించుచు,వారికి శంఖములు-భాగవతులు-మేలుకట్లు,( చతురస్త్రాకారము వస్త్రముతో కప్పబడిన గొడుగుల వంటివి) కానుకలుగా కావాలంటు కాసేపు అంతలోనే కానుకలు వద్దు -కన్నయ్యతో సాన్నిహిత్యము కావాలంటు విష్ణుచిత్తులవారు స్వామికి స్వామిని ప్రస్తుతించినవైన మంగళాశాసనమైన పల్లాండ్లను పాడుచున్న గోపికలను దర్శించిన మన గోపిక
వారి మనోభావములను అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది.

ప్రళయ సమయములో ప్రపంచమంతయు మునిగిపోయినను(స్వామి ఉదరములో దాగినను)మార్కండేయ మహాముని చెక్కుచెదరక (చిరంజీవికదా) పుణ్యఫలముగా వటపత్రశాయిని దర్శించగలిగినాడట.స్వామి ప్రత్యక్షమై వరము కోరుకోమనగానే పులకితుడై కృష్ణమాయలో లేశమును తాను అనుభవించే భాగ్యమును కలిగించ మన్నాడట.వెంటనే స్వామిదయతో జలములోనికి వెళ్ళినాడట
చూసిన అక్కడ ఏమీ కనీసము స్వామికూడా మునికి కనిపించలేదట.చింతాక్రాంతుడైన మునిని కరుణించి స్వామి పున:దర్శన భాగ్యమును కలిగించాటడ.మన గోపికకు, గోపికలలో మార్కండేయ మహాముని తత్వచింతనయే తలపునకు వచ్చింది.

" కరార విందేన పదారవిందం
ముఖార విందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటెశయనం
బాలం ముకుందం మనసా స్మరామి"-బాల ముకుందాష్టకం (లీలా శుకులు)

అమృతమును వదిలి యోగులు నా పాదపద్మముల మకరందమును ఎందుకు కోరుకుంటున్నారు అని చిన్ని కృష్ణుడు లేత పద్మము వంటి తన చిన్ని కాలి బొటనవేలుని.లేత పద్మములవంటి తన చేతులతో పట్టుకుని,ఎర్రని లేత పద్మమువంటి తన నోటిలో పెట్టుకుని తాదాత్మ్యమునందుచున్నాడు. స్వామి! నమో నమ:

ప్రపంచము పరిణామ స్వభావము కలదికాని పరిసమాప్తి స్వభావము కలదికాదు.స్వామికి-మర్రి చెట్టుకు గల సారూప్యము ఏమిటి? మర్రి విత్తనం సూక్ష్మము-చెట్టు స్థూలము.తిరిగి సూక్ష్మము-పెరిగి స్థూలము.పున: పున:.ఇదే స్వామి వట పత్ర శయన రహస్యము.స్థూల లోకములన్నీ సూక్ష్మమై ప్రళయ కాలమున స్వామి ఉదరములో దాగియుండుట-తిరిగి ప్రళయానంతరము స్థూలముగా స్వామిచే ప్రకటింప బడుట అను విశేష స్వరూపమును దర్శించుచున్న గోపికపై నిమగ్నమైన నా మనసు అమ్మవెంట నడచుచున్న గోపికలతోపాటు తన అడుగులను కదుపుతోంది.

( ఆండాళ్ తిరువడిగళే శరణం )

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...