Monday, June 1, 2020

OM NAMA SIVAAYA-75

  ఓం నమః శివాయ-75
  *******************

 అగ్నికార్యఫలితములు అన్నీ ఇంద్రునికైతే
 బృహస్పతి చేరాడు బుధ్ధితో ఇంద్రుని

 సరస్వతి చేరింది బృహస్పతిని చూసి
 వరుణుడు చేరాడు ఆదరణకై ఆ ఇంద్రుని

 భూమికూడ చేరింది ఈవి కోరి ఆ ఇంద్రుని
 గాలివీచసాగింది నేరుగా ఆ ఇంద్రుని

 అవకాశము ఇది అని ఆకాశము చేరింది
 ఆశ్వనీదేవతలు ఆశ్రయించారు ఇంద్రుని

 పంచభూతములు కలిసి నిన్ను వంచించేస్తుంటే
 పంచాల్సిన ఫలితమును అంతా దోచేస్తుంటే

 స్వార్థమంత గుమికూడి అర్థేంద్రముగా మారింది
 నిన్నొక్కడినే వేరుచేసి ఓ తిక్కశంకరా.


 వేదశాస్త్ర ప్రకారము దేవతలు యజ్ఞకృత హవిస్సును ఆహారముగా స్వీకరిస్తారు.వారికి ఆ అవకాశమును  అనుశివుడేగ్రహించాడు.కాని వారు శివుని లెక్కచేయక,శివునికి తెలియకుండా,చెప్పకుండా,తామందరు కుమ్మక్కై ,శివుని యజ్ఞ హవిస్సులో సగభాగమును ఈయకుండా,తామే స్వీకరించాలని వెళ్ళిన శివుడు వారినేమి అనకుండా మౌనముగా చేతకాని వలె నున్నాడు-నింద.

 యజ్ఞం నమః శివాయ-యజ్వ నమః శివాయ
 కర్త నమః శివాయ-భోక్త నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ



 " అగ్నిశ్చమ ఇంద్రశ్చమే-సోమశ్చమ ఇంద్రశ్చమే
   సరస్వతీచమ ఇంద్రశ్చమే-బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే"

   రుద్రచమకము లోని ఆరవ అనువాకము అర్థేంద్ర అనువాకముగా ప్రసిధ్ధిపొందినది.చమకము అగ్నా- విష్ణూ, రెండు మహత్తర శక్తులను జతగా వచ్చి,జయమును కలిగించమంటుంది.అదే విధముగా స్థితికార్యమును నిర్వహించు సమయమున మగేశ్వరుడే మహేంద్రుడిగా కీర్తింపబడుతుంటాడు.యజ్ఞ నిర్వహణకై మహేశ్వరుడు తన నుండి కొన్ని అద్భుత శక్తులను ఆవిర్భవింపచేసి,వాటికి కొన్ని బాధ్యతలను అప్పగిస్తాడు.వాటి సద్గుణములే దివ్యనామములై విరాజిల్లుచున్నవి.స్వామి వాటిని విస్తరింపచేయగలడు.అవసరము లేదనుకుంటే తనలో విలీనము చేసుకోగలడు.సాధకుని యజ్ఞమును సమర్థవంతము చేయుటకు ఇంద్రునిగా తాను వారిని  వెంటపెట్టుకుని

వచ్చి,యజ్ఞ హవిస్సులలో    సగభాగమును వానికిచ్చి,మిగిలిన సగమును తాను స్వీకరించి "లోకాన్ సమస్తాత్ సుఖినో భవంతూ అను ఆర్యోకిని నిజము చేస్తాడు యజ్ఞము-యజ్ఞకర్త-యజ్ఞభోక్త -యజ్ఞహర్త అయిన పరమేశ్వరుడు. స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.





.


















OM NAMA SIVAAYA-74


  ఓం నమః శివాయ-74
  ***************

 వెండికొండ దేవుడవని వెండికొరకు నే వస్తే
 దండిగా ఉన్న మంచు వెండివెండి నవ్వింది

 మేరుకొండ విల్లుందని మేరువుకై నేవస్తే
 చాటుగా ఉన్న విల్లు చిలిపిగా నవ్వింది

 రాగిజటాజూటమని రాగికొరకు నేవస్తే
 విరాగియైన జట మరీ విచిత్రముగా నవ్వింది

 నీలలోహితుడవని ఇనుముకొరకు నేవస్తే
 చాల్లే అంటూ విషము గేలిగా నవ్వింది

 కుబేరుడు ముందున్నాడని ధనమునకై నేవస్తే
 చేతులు కట్టుకున్నానని చేతకాక నవ్వాడు

  ఎండమావులను నీళ్ళనుకుని కుండపట్టుకు వచ్చిన,

   నా ఎక్కిళ్ళని ఆపవేర ఓ తిక్కశంకరా.


' రుద్రచమకములో శివుడు "హిరణ్యంచమే-సీసంచమే-త్రపుశ్చమే-శ్యామంచమే-లోహంచే ' అన్ని లోహములను పొందినవాడును-అనుగ్రహించగలిగిన వాడును అని చెప్పుకున్నాడని,భక్తుడు వాటికొరకు శివుని సమీపించి,ఘోరముగా పరాభవింపబడినను శివుడు చేతకాని వాడిలా కదలక మెదలక ఉన్నాడు.-నింద.

  పసిడి నమః శివాయ-వెండి నమః శివాయ
  రాగి నమః శివాయ -సీసము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

  రుద్రనమక-చమకముల అంతరార్థము అర్థముకానిది.కాని అద్భుతమైనది.లోహములను వివరించు చమకము ఐదవ అనువాకములో వాటిలో దాగిన అంతరార్థములను అలంకారికులు విశ్లేషించినారు.బాహ్య వాచకార్థమునకు ఇవి లోహ నామములే అయినప్పటికిని,ఆధ్యాత్మికముగా అన్వయించుకుంటే సాధకుని ఆధ్యాత్మిక పయనములోని అడ్దంకులను తొలగించి-అభ్యున్నతిని సూచించు అత్యద్భుత ప్రణాళికలు.ఉదాహరణకు హిరణ్యంచమే-బంగారము అనునది సామాన్యార్థము.కాని నిశిత పరిశీలకులకు హితం-రమ్యం హిరణ్యం గా అర్థమవుతుంది.హితమును కలిగించునది-రమ్యమైనది హిరణ్యం.అంతే పరబ్రహ్మ జ్ఞానము.అదే విధముగా సీసంచమే అను పదము "సినోతి బధ్నాతి  సర్వ బుధ్ధీం ఆధ్యాత్మికే ఇతి సీసం" జనుల బుధ్ధివృత్తులను ఆధ్యాత్మికత యందు బంధించెడి భావము.సాధకులు-జ్ఞానులు పొందెడి భావము ఇనుము.రాగి మొదలగు లోహములన్ "లూఞ్-ఛేదసే" జనుల బుధ్ధులను అన్నివైపులనుండి ఛేదించి,ధ్యానముపై కేంద్రీకృతము చేయించే స్వభావము.ఈ విధముగా కొన్ని భావములు ఆధ్యాత్మికతకు కలుగు అడ్దంకులను తొలగించుచుంటే మరి కొన్ని సుగమము చేయుచు సాధకుని ప్రయత్నమును(యజ్ఞమును) సఫలీకృతము చేయును.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.



.

















OM NAMA SIVAAYA-73


  ఓం నమః శివాయ-73
  ******************

 నీకన్న నీగుడులు నిరతము కిక్కిరిసి పోతుండగ
 నీకన్న నీ బసవని అనయము కొనియాడుతుండగ

 నీకన్న నీసిగశశి చాంద్రమానమగుచుండగ
 నీకన్న నీజటలో గంగ నీరాజనములను పొందుచుండ

 నీకన్న నీ కృత్తిక నిఖిలకీర్తినొందుచుండ
 నీకన్న నీనామము నలుదెసల నర్తించుచుండ

 నీకన్న నీ పరివారము ప్రస్తుతింపబడుచుండగ
 నీకన్న నీభక్తుల కథలు మారుమ్రోగుచుండగ

 నీకన్న నీ భోళాతనమే వేళాకోళమగుచుండగ
నువు చూసి-చూడనట్లుగా-తెలిసి తెలియనట్లుగా

 పోనీలే అంటుంటే-కానీలే అని మిన్నకుంటే
 తొక్కేస్తారుర నిన్ను ఓ తిక్క శంకరా


 శివుని కన్న శివుని గుడులు-బసవడు-చంద్రుడు-గంగ-కృత్తిక-నామము-ప్రమథగణములు-పరివారము మిక్కిలి ప్రశస్తిని గాంచినవి కాని శివుడు మాత్రము కిమ్మనకుండా ముక్కుమూసుకొని జపము చేస్తూ కూర్చుంటాడు కాని తన వైభవమును ప్రదర్శించుటకు సిధ్ధముకాడు-నింద.

 చంద్రుడు నమః శివాయ-బసవడు నమః శివాయ
 కృత్తిక నమః శివాయ-కృత్యము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.



  " నిత్యానంద రసాలయం సురమునిస్వాంతాంబుజజాతాశ్రయం
    స్వచ్ఛం సత్ద్విజ సేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం
    శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంసస్థిరం
    కిం క్షుద్రాశ్రయ వల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి."

  శివధ్యానము నిత్యానందమనే సరోవరము.శివుని దయతో దేవతల-మునుల-భక్తుల హృదయమనే పద్మములకు ఆ సరోవరము ఆశ్రయమిచ్చినది.చిత్తచాంచల్యములనే కాలుష్యములను తొలగించి,సంస్కారములనే సువానలను వెదజల్లునది అది.శివా నేనింతవరకు అజ్ఞానమనే తెరచే కప్పబడి నిన్ను-నీ బసవని-గుడులను-చంద్రుని-గంగను-కృత్తికను-నామమును-ప్రమథులను-పరివారమును అన్యముగా భావించితిని.అజ్ఞానమనే బురదగుంటలో నుండుటచే వాటికి ఆ వైభవమును కల్పించినవాడివి నీవేనని తెలిసికొనలేకపోతిని.పరమ దయాళు!నీ అనుగ్రహవీక్షణము నా కనులను తెరిపించినది.నన్ను నిశ్చలమనసుతో నిత్యానంద సరోవరములో నిర్మల సరోజము వలె ప్రకాశించనీయితండ్రీ.నమస్కారములు.-స్తుతి.

  ఏకబిల్వం శివార్పణం.

.

















OM NAMA SIVAAYA-72


  ఓం నమః శివాయ-66
  **********

 నీ రూపము చూపించే కన్ను కన్నుమిన్నుకానకుంది
 మళ్ళీ చూప్[ఇంచమంటే మళ్లను నేను అంటున్నది

 నీ నామము వినిపించే చెవి చెవిటివాడనని అంటోంది
 మళ్లీ వినిపించమంటే శంఖమూదరని అంటున్నది

 నీ నామము పలికించే వాక్కు నన్ను సన్నగా నొక్కుతోంది
 మళ్ళీ పలికించమంటే కిక్కిరుమనకు అంటున్నది

 నీ చుట్టు తిరుగుకాలు నాపై ఒంటికాలిపై లేస్తున్నది
 మళ్ళీ తిరుగుదామంటే పనిలేదా అంటున్నది

 నీ చెంత వంగు తల నన్ను అతలాకుతలము చేస్తున్నది
 మళ్ళీ వంగమన్నానని అవతలకు పొమ్మని అంటున్నది

 శివునికేమి చేయాలని చీకాకుపెడుతున్న వాని
 కొక్కిరాయి పనులను ఆపవేర ఓ తిక్కశంకరా.


 శివుడు సర్వము తన కనుసన్నలలోనే నడుస్తుందని గొప్పలు చెప్పుకుంటాడు కాని భక్టుడు తన ఇంద్రియములు తన మాట వినటములేదని మొరపెట్టుకుంటున్నా ,వాటిని మందలించి,సరిచేయలేని అసమర్థుడు-నింద.

  కన్ను నమః శివాయ-కనుసన్న నమః శివాయ
  కరుణ నమః శివాయ-కైవల్యము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.



 " మనస్తే పాదాబ్జే నివసతుః వచః స్తోత్రఫణితౌ
   కరౌచాభ్యర్చాయం శ్త్రుతిరపి కథాకర్ణనవిధౌ
   తవధ్యానే బుధ్ధిర్నయన యుగళం మూర్తివిభవే
   పరగ్రంధైః కిం వా పరమశివ జానే పరమతః"

    శివానందలహరి.

  ఓ సదాశివా! నా మనస్సు నీ పాదపద్మములందు,వాక్కు నీ స్తోత్రపఠనము నందు,చేతులు నీ పూజయందు,చెవులు నీ కథలను వినుట యందు,బుధ్ధి నీ ధ్యానమునందు,కన్నులు నీ దివ్య స్వరూపమును దర్శించుట యందు,లగ్నమగునట్లు చేయువాడవు నీవొక్కడివే.ఇతరులకు సాధ్యము కానిపని.నీ అనుగ్రహము లేని మానవప్రయత్నము వృధాప్రయాస.నా ఇంద్రియములను సంస్కరించి,నన్ను కృతార్థుడను చేయుము శివా.అనేకానేక నమస్కారములు.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.
















OM NAMA SIVAAYA-71


  ఓం నమః శివాయ-71
  ********************

 నిను గుర్తించిన శ్రీ-కరి-కాళములకు గుడినే కట్టించావు
 గుడిగోపురమును చూసిన పాపనాశనము అన్నావు

 గుడ్డితనమును పోగొట్టి చూపునిస్తుంటావు
 గురువుగా మారి వారిని తరియింపచేస్తావు

 గుడిలో కూర్చుని గురుతర పూజలందుకుంటావు
 గుహుని తండ్రివి వారి అహమును తొలగిస్తావు

 గుగ్గిల నాయనారు భక్తిని గుబాళింప చేస్తావు
 గుణనిధిని కరుణించిగుండెలో దాచుకుంటావు

 గుచ్చిన బాణమును చూపి పాశుపతమునిచ్చావు
 గుర్తించని వారికి భక్తిగుళికలు అందిస్తావు

 గుక్కతిప్పుకోకుండా ఎక్కిఎక్కి ఏద్చునన్ను,నీ
 అక్కున చేర్చుకోవేమిరా ఓ తిక్క శంకరా.












OM NAMA SIVAAYA--70


  ఓం నమః శివాయ-70
  ********************

  ఎత్తైన కొండలలో భోగనందీశ్వరుడనని అంటావు
  చేరలేనంత ఎత్తులో చార్ధాంలో ఉంటావు

  లోయలలో హాయిగా త్రిసిల్లిరి మహాదేవుడనని అంటావు
  దూరలేనంత గుహలలో అమరనాథుడివై ఉంటావు

  కీకారణ్యములలో అమృతేశ్వరుడనని అంటావు
  ఏదారులలో వేడుకగా అమృతేశ్వరుడనని అంటావు

  కనుమల దగ్గర కామరూపకామాఖ్యుడనని అంటావు
  జలపాతాల లోతులలో బాణేశ్వరుడనని అంటావు

  భూగర్భమున దాగి హంపి విరూపాక్షుడినని అంటావు
  ఈదలేనంత గంగఒడ్డున ఈశ్వరుడినంటావు

  నామదిని వదిలేసావు దయలేక తెలియదుగా
  నీకు ఎక్కడ ఉండాలో ఓ తిక్క శంకరా.


 శివుడు ఎత్తైన కొండలలో-లోతైన లోయలలో-ఎడారులలో-కీకారణ్యములలో-ఎక్కడెక్కడో ఉంటాడు కాని నిత్యము నిర్మలభక్తితో కొలిచే భక్తుని మదిలో ఉండాలని తెలియనివాడు.-నింద.

 ఎత్తు నమఃశివాయ-లోతు నమః శివాయ
 అడవి నమః శివాయ -ఎడారి నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" గుహాయాం గేహేవా బహిరపి వనేవాద్రి శిఖరే
  జలేవా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలం
  సదా యస్త్యైవాంతహ్కరణమపి శంభో తవపదే
  స్థితంచేద్యోగోసౌసచ పరమయోగీ సచ సుఖీ"

  శివానందలహరి.

 పరమశివా నీ నిజతత్త్వమును తెలిసికొనలేని నా మనసును గుహలోకాని-ఇంటిలోకాని-వెలుపల కాని-పర్వతశిఖరముపై కాని నీటిలో కాని,నిప్పుపై కాని నిలిపిన ఏమి లాభము? పరమదయాళు!దానిని ఎల్లప్పుడు నీ పాదపద్మములయందు స్థిరముగా నిలిచియుండు యోగమును అనుగ్రహింపుము.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.











OM NAMA SIVAAYA-69


  ఓం నమః శివాయ-49

  ****************

  రుద్రాక్షలు ఇష్టము-చిన్ముద్రలు ఇష్టము
  అభిషేకము ఇష్టము-అవశేషము ఇష్టము

  బిల్వములు ఇష్టము-బిలములు ఇష్టము
  తుమ్మిపూలు ఇష్టము-తుమ్మెదలు ఇష్టము

  తాండవము ఇష్టము-తాడనము ఇష్టము
  అష్టోత్తరము ఇష్టము-నిష్ఠూరము ఇష్టము

  చందనాలు ఇష్టము-వందనాలు ఇష్టము
  కాల్చుటయు ఇష్టము-కాచుటయు ఇష్టము

  లయగ ఆడుట ఇష్టము-లయముచేయుట ఇష్టము
  మహన్యాసము ఇష్టము-మహాశివరాత్రి ఇష్టము

  కష్టాలలోనున్న నాపై ఇష్టము చూపించకుండుట

 నీ టక్కరితనమేరా ఓ తిక్కశంకరా.

 శివుడు రుద్రాక్షలను-అభిషేకములను-తుమ్మిపూవులను,మారేడు దళములను-కొండగుహలను చందనములను ఇష్టమని ప్రకటించుకున్నాడు.ఇంతేనా ఇంకా ఏమైన వున్నాయా అని అడిగితే చిన్ముద్ర-అవశేషాలు-నాట్యములు-దండించుట-తుమ్మెదలు-నమస్కారములు కాల్చుట-కాచుట మహన్యాసములు ఇష్టమనినాడు.తనకు కావలిసిన సమాధానము రాలేదని ఇంకా ఏవైనా మరిచిపోయినావా శివా అని అడిగితే దరహాసం చేస్తాడు కాని తనపై దయ ఉందని మాత్రము అనడు-నింద.

 బిలము నమః శివాయ-బిల్వము నమః శివాయ
 కాల్చుట నమః శివాయ-కాచుట నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" గలంతీ శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో
  దలంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయితాం
  దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం
  వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ"

 శివచరిత్రమను నదినుండి ప్రవహించుచు,పాపమనే ధూళిని కడిగివేయుచు,సంసారములో పరిభ్రమించుటచే నాలో ఏర్పడు సంతాపమును ఉపశమింపచేయుచు,నా హృదయమనే సరస్సులో నిలిచే ఆనందప్రవాహము శుభములను చేకూర్చును గాక.-స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.









OM NAMA SIVAAYA-68


  ఓం నమః శివాయ-41
  ****************

  సగము మహాదేవుడట-సగము మహాదేవి అట
  సగము తేట తెలుపట-మరొకసగము పసిడిపసుపట

  సగము చంద్రబింబమట సగము మల్లెదండలట
  సగము జటాజూటమట-సగము ధమ్మిల్లమట

  సగము బూదిపూతలట-సగము కస్తురి తిలకమట
  సగము నాగహారములట-సగము నానాహారములట

  డమరుక దక్షిణ హస్తమట-వరద వామ హస్తమట
  సగము పులితోలేనట-సగము చీనాంబరములట

  సగము తాండవపాదమట మరొకసగము లాస్య పాదమట

  చెరిసగము స్త్రీ-పురుషులటసృష్టి కొనసాగింపునకట

 నగజ అనఘ జతలో మిగిలిన సగమేది అంటే
 దిక్కులు చూస్తావేమిరా ఓ తిక్క శంకరా.


 అమ్మను దర్శించుకుందామని వస్తే ఏదో వెలితిగా ఉంది.అమ్మ మల్లెదండల థమ్మిలమునకు  బదులు సగభాగము గంగను ధరించిన జటాజూటము కనిపించుచున్నది.కస్తురి తిలకముతో కన్నులవిందు చేయు ముఖమును బూదిపూతలు అడ్డుచున్నవి.మంగళకరమైన అమ్మ సొమ్ములను పాములు దాచివేయుచున్నవి.చీనాంబర శోభను పులితోలు కప్పివేయుచున్నది.పాదనమస్కారమును చేద్దామనుకుంటే లాస్యపాదము-తాండవ పాదము కనిపించుచున్నవి.ఆరాతీస్తే ఆ ఆదిశంకరుడు అమ్మను సగము ఆక్రమించేశాడు.మిగిలిన సగభాగమును ప్రశ్నించగా,సమాధానమును చెప్పక దిక్కులు చూస్తున్నాడు-నింద.

 అర్థము నమః శివాయ-పూర్ణము నమః శివాయ
 అమ్మయు నమః శివాయ-అయ్యయు నమః శివాయ
  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
 " నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం
   పరస్పరాశ్లిష్ట వపూర్ధరాభ్యాం
  నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం
  నమోనమః శంకర పార్వతీభ్యాం"


"  చాంపేయ గౌరార్థ శరీరకాయ
  కర్పూర గౌరార్థ శరీరకాయ
  ధమ్మిల్లకాయైచ జటాధరాయ
  నమః శివాయైచ-నమః శివాయ."

  అర్థనారీశ్వర స్తోత్రము.

 సంపెంగ పువ్వు వలె ఎర్రనైన అర్థశరీరము కలది,కొప్పు ధరించినది అగు పార్వతికి,కర్పూరము వలె తెల్లనైన అర్థశరీరము కలవాడు-జటాజూటమును ధరించిన శివునకు నమస్కారములు.-స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.




















OM NAMA SIVAAYA-67

  ఓం నమః శివాయ-67
  ******************

 అగ్గిలో  కాల్చావు ఆ భక్తనందనారుని
 అఘోరవ్రతమన్నావు ఆ చిరుతొండనంబికి

 అంబకము అడిగావు ఆ బోయ తిన్నడిని
 చర్మకార దంపతుల చర్మము ఒలిపించావు

 ఆ అయ్యలప్ప అర్థాంగినే ఆశగా కోరావు
 దొంగతనము నేర్పావు ఆ కన్నడ బ్రహ్మయ్యకు

 కళ్ళను నరికించావు కఠినముగా మహదేవుని
 కళ్ళను పీకించావు కటకట మల్లికార్జుని

 అంత పరీక్షించావు అమ్మాయి గొడగూచిని
 నీ వీరశైవగాథలు కౄరత్వపు దాడులు

 మోక్షమనె పేరుగల ఘోరమైన శిక్షలు
 అక్కరలేదనవేమిరా ఓ తిక్క శంకరా.


 శివుడు కౄరుడు.కనుకనే నందనారుని అగ్నిలో దూకమన్నాడు.చిరుతొండనంబిని (సిరియాళుని తండ్రి) చిత్ర-విచిత్రముగా పరిక్షించినాడు.తిన్నడిని కన్ను అడిగాడు.హరలయ్య-కళ్యాణమ్మల చర్మమును కోసుకునేలే చేసాడు.కాళ్ళు నరికించుట-కళ్ళుపీకించుట చూస్తూ ఉరుకున్నాడు.ఇదింకా మరీ చోద్యం.తన భక్తుడైన ఇయర్వగై నాయనారు ధర్మపత్నిపై తనకు మోహం కలిగినదని,తన వెంట ఆమెను పంపించమన్నాడు.హవ్వ.ఎంత నీచపు ఆలోచన.పాపము గొడగూచి అను చిన్న పిల్లపై ఆమె తల్లితండ్రులపై నైవేద్య క్షీరమును శివుని సమర్పించక తాగినదని,నిందారోపణమును చేయించి,నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నావు.నిజము నిన్ను అడుగుదామని వస్తే నిర్దాక్షిణ్యముగా నీలో లీనము చేసుకున్నావు.ఎక్కడున్నది నీ భోళాతనము-నింద.

  శిఖయు నమః శివాయ-రక్షయు నమః శివాయ
  కాయం నమః శివాయ-సాయం నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


 నమో ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరఘోర తరేభ్యో-రుద్రం. ఘోర (రౌద్ర) రూపము-అఘోర (శాంత) రూపము,ఘోరఘోర (సామాన్య) రూపము అన్ని శివుడే.తన భక్తులను చరితార్థులను చేయుటకు ఆడిన లీలా విశేషములే.వారందరిని తిరిగి అనుగ్రహించి-ఆశీర్వదించినది శివుడేగా.

 " మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషు రీరిషః
   వీరాన్మానో రుద్రభామితోవధీర్హ విష్మంతో నమసా విధేమతే."

   పరమశివా! మేము నీకు కోపము వచ్చునట్లు ప్రవర్తించినను ,నీకు అపచారములను చేసినను మమ్ములను క్షమించి,మా (తోకే) సంతానమునకు,(ఆయుషి) ఆయువునకు,(గోషుమానో) గోవులకు,(అశ్వేషు) గుర్రములకు,((మారీరిష) బాధను కలిగింపకుము.మేము హవిస్సుకలవారమై (నీకు అర్పించుటకు) నిన్ను సేవించుకొను భాగ్యమును ప్రసాదింపుము.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.


















OM NAMA SIVAAYA-66


  నీ చిన్మయముద్రను నేను అనురక్తితోచూస్తుంటే
  నీ తలపని గంగమ్మ నన్ను తుంగతొక్కుతానంటున్నది

  నీ జటాజూటము నన్ను దక్షుడు అనుకుంటున్నది
  నీ శిరమున శశి  గ్రహణము నాకేనని అంటున్నది

  నీ కంఠములోని విషము నన్ను కబళించాలనుకుంటున్నది
  నీ చేతి డమరుకము నా వివరము అడుగుతున్నది

  నీ నడుము పులితోలు కలవరమేఅంటున్నది
  నీ వాహనమైన ఎద్దు నన్ను గద్దిస్తోంది

  నీ మంజీరమైన పాము నాపై బుసలు కొట్టుతున్నది
  వేడుకొనుట దేవుడెరుగు నిన్ను చూడనీయకున్నవి

 నీ వైనము ఏమిటి? నావైపు చూడవు భయముతో
 ఉక్కిరిబిక్కిరి అవుతున్నానురా ఓ తిక్క శంకరా!


 శివ దర్శనమునకై వెళ్ళిన భక్తుని శివుని గంగ-జటాజూటము-చంద్రుడు-విషము-డమరుకము-పులితోలు-మంజీరము ఎద్దు ఎద్దేవా చేస్తూస్వామి దగ్గరకు వెళ్ళనీయకున్నవి.శివుడు వాటిని మందలించలేని అసమర్థతతో,కళ్ళుమూసుకొని ధ్యానముద్రలో నున్నట్లు నటిస్తున్నాడు.

వైనము నమః శివాయ-ధ్యానము నమః శివాయ
భయము నమః శివాయ-అభయము నమః శివాయ

 నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" జటాభిర్లంబమానాభిరృత్యంత  మభయప్రదం
  దేవం శిచుస్మితం ధ్యాయేత్ వ్యాఘ్రచర్మ పరిష్కృతం"

  వ్రేలాడుచున్న జటలతో కూడినవాడై,నృత్యము చేయుచున్న వాడును,అభయమునిచ్చువాడును,స్వచ్చమైన చిరునగవు కలవాడును,వ్యాఘ్రచర్మముచే అలంకరింపబడినవాడును అగు సదాశివుని ధ్యానించెదను.

OM NAMA SIVAAYA-65


   ఓం నమః శివాయ-65
   ********************

  సుగంధిపుష్టి కర్తకు సుప్రభాత దీపములు
నిటలాగ్ని హోత్రునికి నిత్య ధూప దీపములు
పాషాణపు దేవునికి ప్రభల వెలుగు దీపములు
కందర్ప దర్పునికి కర్పూర దీపములు
పరంజ్యోతి రూపునికి ప్రమిదలలో దీపములు
జలజాక్షునికి వేడుకగా జలములోన దీపములు
ప్రమథ గణాధిపతికి ప్రదోషవేళ దీపములు
ఆశాపాశ రహితునికి ఆకాశదీపములు
మా ఆర్తిని తొలగించే కార్తీక దీపములు
దీపములను పేర వెలుగు నీ నామ రూపములు
జాణతనము తోడుకాక జ్వాలాతోరణములో
చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా.
.............................................................................................................................................................................................................................సుగంధ భరితుడు,పోషకుడు,వృద్ధికారుడు అని చెబుతు శివుడు పొద్దున్నే వెలిగించే దీపాలకై ఎదురుచూస్తుంటాడు.కామ దహనము చేసానంటు కర్పూర దీపాలను కోరతాడు.లింగము రాయి కనుక దీపాలను చూడలేదు. పద్మములు జలములో నున్న దీపాల వేడిని తట్టుకోలేవు.మన ఆశలన్నిటిని దూరము చేస్తానంటు శివుడు ఆకాశదీపాలకై తేరిపారి చూస్తుంటాడు. తన భక్తుల రూపము నామము ఈ దీపములే అంటు ఎటుపారిపోయే దారిలేక,చేతకాక శివుడు చేతకానివాని వలె అందు ప్రవేశిస్తాడు.నింద. పరంజ్యోతి అయిన
శివుడు మన పాప ప్రక్షాళనకై మనకొరకు తాను మనలను ఉద్ధరించుటకు "జ్వాలా తోరణ ప్రవేశము" చేస్తాడని. స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)










.

OM NAMA SIVAAYA-64

గలగలపారే గంగను జటలో చుట్టేసినావు
 భగభగ మండే అగ్గిని నుదుటను కట్టేసినావు

 శశకమనే చంద్రుని  సిగను సింగారించునావు
 విర్రవీగు విషమును కంఠమునబంధించినావు

 చరచర పాకు పాములను చతురత పట్టేసినావు
 కూరిమితెలియని పులినిఒలిచిపెట్టేసినావు

 రిపులగు త్రిపురాసురులను మట్టుపెట్టేసినావు
 పరమనీచులైన వారి పాపములను పాపినావు

 తిర్యక్కులను గాచితిమిరము నెట్టేసినావు
 నీ చుట్టు తిరుగుచున్న నా పాపములను చుట్టేసి

 శ్రీరస్తు అని కావగ శ్రీకారము చుట్టమంటే
 పక్క చూపులెందుకురా ఓ తిక్క శంకరా.


 గంగానదికి పూజ్యతను కలిగించాడు.అగ్గిని ఆరాధ్యనీయము చేసాడు.శాపగ్రస్థుడైన చంద్రుని శిరమున ధరించాడు.హాలాహలమును తనలో దాచుకొని అర్చనలను పొందునట్లుచేసాడు.పరమనీచముగా ప్రవర్తించిన రాక్షసులను పవిత్రులను చేసాడు.క్రిమికీటకములకు సైతము పాపపుణ్యములను లెక్కించక ఆదరించిన శివుడు,నాపై తన కృపాకటాక్షమును ప్రసరించుటకు నిర్లక్ష్యము చేస్తున్నాడు-నింద.

 లక్ష్యం నమః శివాయ-నిర్లక్ష్యం నమః శివాయ
 ద్వంద్వం నమః శివాయ-నిర్ద్వంద్వం నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


" ఉపేక్షానో చేత్కిం నహరసి భవధ్ధ్యాన విముఖాం
  దురాశా భూయిష్ఠాం విధిలిపిమ శక్తో యదిభవాన్
  శిరస్తద్వైధాత్రం న న ఖలు సువృత్తం పశుపతే
  కథంవా నిర్యత్నం కరనఖ ముఖేనైవ లులితం"

  శివానందలహరి.

  శివా! నీవు కాలభైరవుని సృష్టించి వాని కొనగోటితో బ్రహ్మ అహంకారపు తలను గిల్లించినాడవు.కాని నిన్ను ధ్యానించుటకు వెనుకాడుచున్నది,నీ అనుగ్రహమును నిరంతరము శంకించుచున్నది,దురాశతో నిండినది అయిన మనసుగల నా తలరాతను మార్చుట కానిపనికాదు. ఆలస్యము చేయక,నన్ను అనుగ్రహించుతండ్రీ -స్తుతి.


 ఏక బిల్వం శివార్పణం.





























OM NAMA SIVAAYA-63


నీకు పూజచేస్తే పున్నెమని విన్నానురా,భక్తితో
అర్ఘ్య పాద్య జలములడుగ  కస్సుమన్నదిర గంగ
స్నానమెట్లుచేయిస్తు సముదాయించర గంగను

ఆసనమీయ చూడగ తుర్రుమన్నదిర పులి
కట్టుకోను  బట్టలన్న కనుమరుగైనది కరి

జందెమైన ఇద్దమన్న  చరచర పాకింది పాము
నైవేద్యముచేయ బోవ విషజంతువులన్ని మాయం



అక్కజమేమున్నదిలే నీ  అక్కర తీరినదేమో
ఒక్కటైనకలిసిరాదు నీకు చక్కనైన పూజసేయ

తక్కువేమి చేసావని పక్కదారి పట్టాయి
మక్కువ మాకంటూనే పిక్కబలము చూపాయి
వానిని చక్కదిద్దవేమిరా ఓ తిక్కశంకరా.






OM NAMA SIVAAYA-62


  ఓం  నమః శివాయ-62
  *********************

 రూపులేని గాలిని అన్నిరూపులలో నిలుపుతావు
 అలసటలేకుండ కదులుతు ఉండాలంటావు

 కల్పవృక్షాలనైన కాళ్ళతో నీళ్ళుతాగమంటావు
 కాస్తంత బంధించి కొమ్మలను కదుపుతుంటావు

 భూమాతను సైతము కాళ్ళతో తాడనము చేస్తావు
 కనికరములేకుంద కదులుతుండాలంటావు

 ఆకాశము నే చూడమంటు హడావిడి చేస్తావు
 వ్యోమకేశుడిని అంటు వదలక తాకుతునే ఉంటావు

 గలగలల జలము మీద జాలిలేక ఉంటావు
 గంగను బంధించి చుక్కచుక్క తాగుతునే ఉంటావు
 పంచభూతములని చూడవు పంచమంటుంటావు
 తొక్కేసినావుర వాటిని ఓ తిక్క శంకరా.






.

OM NAMA SIVAAYA-61


  ఓం  నమః శివాయ-61
  *********************


విశ్వనాథుడవని నిన్ను విబుధులు మాటాడుతుంటే
అనాథుదను నేనని ఆతలాడుతుంటావు

పరమయోగీశ్వరుదవని ప్రమథగణము అంటుంటే
పార్వతీ సమేతుడనని ప్రకటిస్తు ఉంటావు

భక్తులు భోళాసంకరుదా భళిభళి అంటుంటే
వేళాకోళములే అని వేడుకగా అంటావు

నాగాభరణుడవని యోగులు స్తుతిచేస్తుంటే
కాలాభరణుడనని లాలించేస్తుంటావు

విషభక్షకుడవని ఋషులు వీక్షిస్తుంతే
అవలక్షణుదను అంటు ఆక్షేపణ తెలుపుతావు

మంచి-చెడులు మించిన మా మంచి చెంచుదొర
వాక్కు నేర్చినాదవురా ఓ తిక్క శంకరా
.

OM NAMA SIVAAYA-60


   ఓం నమః శివాయ-60

   ********************

  కాశీఖందమును వ్రాసి వాసికెక్కినవాడు
  తిరిపమెత్తువాడవని తిట్టిపోసినాడు

  కుమారసంభవమును వ్రాసి అమరుడైన వాడు
  మార సంహారకుదవని పరుషమాడినాడు

  కాళహస్తీవర కథను వ్రాసి ప్రశస్తి పొందినవాడు
  కాలాంతకుదవు నీవని మేలమాలినాడు

 శివపురాణమును వ్రాసి రాణించినవాడు
 కాశినగరమునకు పెద్ద శాపమీయబూనినాడు

 బసవపురాణమును వ్రాసి యశమునందిన వాడు
 లింగమే నీవంటూ అంగలార్చినాడు

 భూషణమో/దూషణమో/నీ లీలా విశేషమో
 ఎక్కడైన ఇదికలదా? ఓ తిక్క శంకరా.













OM NAMA SIVAAYA-59


   ఓం నమః శివాయ-59

   ********************
 పట్టుబడతానన్న భయముతో పరుగుతీసిన దొంగ
 ప్రదక్షిణము చేసానని ప్రగల్భమే పలుకుతాడు

 సోమరియై నిదురపోవు తామసియైన దొంగ
 నిష్కళంక సమాధియని నిబ్బరముగ అంటాడు

 సందుచూసి విందు భోజనము చేయుచు ఒక దొంగ
 వివరపు నైవేద్యమంటు వింతగ మాటాడతాడు

 కడతేరుస్తారేమని కవచధారియైన దొంగ
 కానుకగా ప్రాణమంటు పూనకమే పూనుతాడు

 మాయదారి పనులనే మానసపూజలు అంటూ
 ఆయాసము లేకుందా ఆ యసమే కోరుతుంటే

 పోనీలే అనుకుంటూ నువ్వు వారిని ఏలేస్తుంతే
 ఇంకెక్కడి న్యామురా ఓ తిక్క శంకరా.












OM NAMA SIVAAYA-58


   ఓం నమః శివాయ-58
   ********************

  నేను అభిషేకము చేస్తుంటే అభినివేశము ఏది అంటావు
 దీపారాధనమును చేస్తుంటే భక్తి ఉద్దీపనమేది అంటావు

 చందనము అలదుతుంటే అలదే చందమా ఇది అంటావు
 పూల హారములు వేస్తుంటే పాప పరిహారములా అంటావు

 మహన్యాసము చదువుతుంటే చాల్లే అపహాస్యము అంటావు
 ఆరగింపు చేస్తుంటే పండ్లను ఏరలేదా అంటావు

 హారతులను ఇస్తుంటే శేవానిరతి ఏది అంటావు
 మంత్రపుష్పమర్పిస్తే సంపెంగ పుష్పమంటావు

 సకల ఉపచారములను చేస్తే త్రికరణ ఏది అంటావు
 శక్తి కొలది పూజిస్తే అనురక్తిలేదు అంటావు

 నువ్వు సంతుష్టిని పొంది-పరిపుష్టినిచ్చేందుకు
 భక్తి రొక్కమెంత కావాలిరా ఓ తిక్క శంకరా.











OM NAMA SIVAAYA-57


   ఓం నమః శివాయ-45
   ********************

  పొగడ్తలకు లొంగిపోతే ఉబ్బులింగడు అంటున్నారు
  చిరాకుని చూపిస్తే చిందేస్తున్నాడంటున్నారు

  కోపముతో ఊగుతుంటే వీరభద్రుడంటున్నారు
  చిట్టిచీమ కుట్టగానే శివుని ఆన అంటున్నారు

  శుచిలేనిది చూస్తుంటే శివ-శివ అంటున్నారు
  కలిసిరాక దిగులుంటే గంగపాలు అంటున్నారు

  బిచ్చగాడివి నీవని ముచ్చటించుకుంటున్నారు
  అమాయకతతో నుంటే అది నీ మాయ అంటున్నారు

  దిక్కుమాలిన పోలికలతో నిన్ను తొక్కేస్తున్నారు
  తీరులేనివాడివంటు నిన్ను తీర్మానిస్తున్నారు

  మంచుకొండ దేవుడిలో మంచితనము లేదంటు
  వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా.


తన అవలక్షణములను సందర్భానుసారముగా సమన్వయించుకునే చనువును శివుడు ఇచ్చాడు కనుకనే వారు ఉబ్బులింగడు-చిందేస్తాడు-వీరభద్రుడు-చీమలను కుట్టమంటాడు-గంగపాలు-బిచ్చగాడు అంటూ శిబునితో పోల్చుకుంటూ,అపహాస్యము చేస్తున్న వారిని ఏమీ అనలేక ఊరుకుంటాడు-పిరికివాడు శివుడు కనుక సర్దుకుని పోతాడు.-నింద.

 లోకము నమః శివాయ-లోకులు నమః శివాయ
 పోలిక నమః శివాయ-ఏలిక నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం
 జటాభారోదారం చలదురగహారం మృగధరం

 మహాదేవం దేవం మయిసదయ భావం పశుపతిం
 చిదలంబం సాంబం "శివమతివిడంబం" హృదిభజే."

    శివానందలహరి.

  శివుడు అత్యంత మనోహరుడు.నాగభూషణాలంకృతుడు.అవియును కదులుచున్న సర్పములను ధరించువాడు.కాలమనే లేడిని ఒడిసి పట్టుకున్నవాడు.త్రిపురాసురులను సంహరించినవాడు.మహా వీరుడు.చిత్ప్రకాశకుడు.అన్నింటికిని మించి,ఎవ్వరు-ఎన్నటికి-ఎక్కడైనను అనుకరించుటకు సాధ్యము కానివాడు.-స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.












OM NAMA SIVAAYA-56


   ఓం నమః శివాయ-44
   ********************
 నీకు మల్లే నీ నామమునకు నిలకడలేదు శివా
 పెదవులు తెరుచుకోగానే పదమని పరుగెడుతుంది

 శంభో అని పిలువగానే అంభోరుహము చేరుతుంది
 శివ శివ అని పిలువగానే శిఖరాగ్రము చేరుతుంది

 మహాదేవ యని పిలువగ తుహినముగా మారుతుంది
 నీలగ్రీవ అనగానే వినీలగగనము అవుతుంది

 విశ్వనాథ అని పిలువగ విశ్వమంత తిరుగుతుంది
 ఈశ్వరా అని పిలువగ ఈడ ఉండనంటుంది

 ఉమాపతి అని పిలువగ ఉరూరుచాటి వస్తుంది
 పశుపతి అని పిలువగానే వశమయ్యానంటుంది

 ఎవరేమని పిలిచినా ఎక్కడికి పోవద్దని,దానికి
 ముక్కుతాడు వేయరా ఓ తిక్క శంకరా.

 శివనామము శివుని ఖాతరుచెయ్యదు.దానికేమి శివుడంటే భయము లేదు,కనుకనే తన ఇష్టమొచ్చినచోటికి వెళ్ళిపోతుంది.మళ్ళీరావాలనిపిస్తే,అది వీలుచూసుకుని ఎప్పుడో కుదిరినప్పుడు మెల్లగ వస్తుంది.తనకు ఎన్నో పర్లున్నాయని మురిసిపోయే శివుడు,వాటిని నియంత్రించలేని అసమర్థుడు.-నింద.

 నామం నమః శివాయ-నామి నమః శివాయ
 సామి నమః శివాయ-సర్వం నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

 శివశివశివ అనరాదా శివనామము చేదా-శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి.త్యగరాజస్వామి మరెందరో శివునకు శివనామమునకు వ్యత్యాసములేదని వక్కాణించిరి.నిరాకార-నిర్గుణ-నిరంజనుని ఏ పేరుతో పిలువగలము? ఏమని వర్ణించగలం?

  అన్నినామములిందే ఆవహించెను అన్నట్లుగా అన్ని రూప-నామములు తానైనవాడు-మనలను తరియింపచేయువాడు ఒక్కడే.



 నమ సూద్యాయచ సరస్యాయచ్రుద్రనమకం.

 బురదకలప్రదేశము సూద్యము.అందున్నది కమలము.అందుండువాడు సూద్యుడు.సరస్సున నుండువాడు సరస్యుడు.బురదకల సంసారమునందుండినను దానిని నంటనీయక అంతర్యామియై యున్న శివునకు నమస్కారములు-స్తుతి.

   ఏక బిల్వం శివార్పణం.











OM NAMA SIVAAYA-55


   ఓం నమః శివాయ-50
   ********************

  అడ్డనామాలతో-నిలువు నామాలతో
  శివుడు-శ్రీరాముడు ఆరాధిస్తారు పరస్పరము

 శివరామ సంగమమేగ ఆ రామేశ్వర క్షేత్రము
 సీతారామ కళ్యాణము చేయించినది శివధనుర్భంగము

 శివ-శక్తికి ప్రతిరూపమేగ వారి దాంపత్యము
 శివస్వరూపము రామునకు సంతోషదాయకము

 సీతా వియోగ సమయమున శివ అంశయే సహాయము
 సేవానిరతి పొందినది శ్రీరామ ఆలింగనము

 శివుడు పార్వతికి చేశాడు శ్రీరామ మంత్ర ఉపదేశము
 శివరామ సంగమమె శుభకరమగు అభంగము

 ఈ శివుడే ఆ రాముడని-ఆ రాముడే ఈ శివుడని
 ఒక్క మాట చెప్పవేరా ఓ తిక్క శంకరా.


 శివుడు సీతారామ కళ్యాణమునకు తన ధనస్సును పాత్రధారిని చేసి,శివధనుర్భంగమను చూడచక్కని సీతారామకళ్యణ కథను నడిపించినాడు.ఒరిగినది ఏమిటి? తన ధనస్సు విరిగిపోయింది.పార్వతీదేవికి గొప్పగా తారకమంత్రమని శ్రీరామ మంత్రమును ఉపదేశించినాడు.జనులు శివుడు తన నామము ఏమీ చేయలేనిదని భావించారు.సీతా రాములను కలుపుటకు తన అంశ ఆంజనేయుని లంకకు పంపి రామకార్యమును నెరవేర్చినాడు.ఘనత మాత్రము రామునికే దక్కినది.రావణ సంహారము బ్రాహ్మణ హత్య కనుక పాపమును తొలగించుటకు తానున్న ప్రదేశములో వారధిని బంధింపచేసి ,శివలింగమును ప్రతిష్ఠింపచేసినాడు.కాని రాముడు ప్రతిస్ఠించిన శివలింగమని-రామేశ్వర పుణ్యక్షేత్రమని (చారదాం) పేరు మాత్రము రామునికే వచ్చినది.కష్టము వెనుక నున్న శివునిదే అయినా రాముడే కీర్తింపబడుతుంటే చూస్తూ ఊరుకుంటాడు కాని,రాముడంటే తనకు ఇష్టమని,నిజానికి మేమిద్దరము "ఏకాత్మా ద్వయీ రూపా" రెండు రూపాలతో నున్న ఒకేఒక చిత్స్వరూపమని చెప్పలేని వాడు శివుడు-నింద.


 హేతువు నమః శివాయ-సేతువు నమః శివాయ
 రాముడు నమః శివాయ-శివుడు నమః శివాయ

 రమింపచేసే రాముడు-శుభంకరుడగు శివుడు

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


 మార్గ బంధు దయాసింధు దేవదేవ నమో నమో
 దీన బంధు  దయాసింధు మహాదేవ నమోనమో
 మహా లింగ మోహనాశ జంగమేశ నమోనమో
 సర్వ రక్ష సాంబదేవ సారసాక్ష నమోనమో.

  ఏక బిల్వం శివార్పణం.







OM NAMA SIVAAYA-54

ఓం నమః శివాయ-కార్తిక దామోదర నమో నమః.

**************************************

పాల కడలి జనించిన గరళము నిను చేరితే

మురిపాల పడతి లక్ష్మి హరిని శ్రీహరిని చేసింది

శరభ రూపమున నీవు శ్రీహరిని శాంతింప చేస్తే

విభవమంత హరిదేగా ప్రహ్లాద చరిత్రలో

చిలుకు ఏకాదశినాడు చక చక నిద్ర లేచేసి

దామోదరుడు నిన్ను చేరినది మోదము కొరకేగా

అభిషేక జలాలతో నీవు ఆనందపడుతుంటే

అలంకారాలన్ని హరి తన ఆకారాలంటాడు

అనుక్షణము నీవు అసురత చండాడుతుంటే

లక్షణముగ హరి తులసిని పెండ్లాడాడు

అలసటయే నాదని ఆనందము హరిది అని

ఒక్క మాట చెప్పవేరా ఓ తిక్క శంకరా!.

శివానుగ్రహ శివసంకలపము అను నిందాస్తులలోనిది తులసికళ్యాణమును పురస్కరించుకొని.

ఏక బిల్వం శివార్పణం. 

OM NAMA SIVAAYA--53


   ఓం నమః శివాయ-53
   ********************
 మరుని శరము నిన్ను చేరి మనువాడమని
 మదనుడు అనగానే గౌరీపతివి అయినావు

 క్షీరసాగర మథనమున విషమును స్వీకరించమని
 అమ్మ నిన్ను అడగగానే గరళకంఠుడివి అయినావు

 గంగవెర్రినెత్తిమీద సుతిమెత్తగ మొత్తమని
 భగీరథుడు అనగానే గంగాధరుడుగ మారినావు

 గంగిరెద్దు మేలములో నీకు రంగవస్త్రమౌతానని
 కరిరాజు అనగానే గజచర్మధారివి అయినావు

 భ్రంగి సైగ చేయగనే నీ సింగారపు నాట్యమట
 " సంధ్యారంభ విజృంభితవు" నీవు కావని

  " సంజ్ఞారంభ  విజృంభితుడవు" పాపం నీవని

 పెక్కుమార్లు విన్నానురా ఓ తిక్క శంకరా.


 శివుడు తాను స్వంతముగా ఆలోచించి పనులను చేయలేని వాడు కనకనే ఇతరులు చెప్పిన పనులను చేస్తూ,దానికి తగినట్లుగా గౌరీపతి-గరళకంఠ-గంగాధర-గజచర్మాంబరధర-సంధ్యారంభ విజృంభిత నాట్య అను కొత్త పేర్లను కలుపుకుంటాడు.కన్నుల పండుగగా నున్నానని సంతోషపడుతుంటాడు కాని అందరు వారికిష్టమైన -కష్టమైన పనులను శివునిచే చేయించి,లబ్ధిని పొందుతున్నారన్న విషయమును గ్రహించలేని అమాయకుడు-నింద.

 చర్మము నమః శివాయ-మర్మము నమః శివాయ
 బాణము నమః శివాయ-భార్య నమః శివాయ

 నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీస్ఫురన్మాధమా
  హ్లాదో నాదయుతో మహాసి తవపుః పంచేమణాచాదృతః
  సత్చక్షు స్సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో
  రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసే విభుః"

     శివానందలహరి.

  స్వామీ నీ కరుణను అర్థము చేసుకోలేని మా అజ్ఞానము వీడినది.శ్రీశైల భ్రమరాంబికాపతి,భృంగిని సంతోష పరచుటకు అతని కనుసన్నలలో నాట్యముచేస్తున్నట్లు నటిస్తున్నావు.కరిని కనికరముతో అనుగ్రహించి కరిచర్మాంబరధరుడివి అయినావు.నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రుడవైన పరమశివా నీవు మన్మథునికి సహకరించవలెనను తలపుతో దానికి లక్ష్యముగా మారినావు.నీ ఈ పనులన్నిటికి కారణము నీకు మాపైగల అవ్యాజానుగ్రహమే కాని నీ అసమర్థత ఏమాత్రమును కాదు.సదాశివా! నా మనసనే సరస్సులో సదా విహరించుచు,సకలజగములను చల్లగా కాపాడు తండ్రీ.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.












TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...