Tuesday, March 6, 2018

SAUNDARYA LAHARI-33

సౌందర్య లహరి-33
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
కుండను తయారు చేయగ నిమిత్తము కుమ్మరి
మన్ను ఉపాదానమైనది కుండ నిజము కాదంటు
ఆభరణము తయారు చేయగ నిమిత్తము కంసాలి
బంగారము ఉపాదానమైనది నగ నిజము కాదంటు
నీ మూర్తిని తయారుచేయగ నిమిత్తము శిల్పి
నీ మహత్తు ఉపాదానమైనది అన్నీ నీవే అంటూ
ప్రథమము.ప్రధానము,ప్రకృష్టము "నీవే" కద తల్లీ!
నా నికృష్టపుతనము, పరమోత్కృష్టముగ మారుచున్నవేళ
నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
భావము
నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ నిన్ను నిశిత దృష్టితో చూసిన నిజము అర్థమగును.కుండలను చేయుచున్న కుమ్మరి నిమిత్తమాత్రుడు జీవులనే కుండలను చేయుచున్న బ్రహ్మ నీ అనుగ్రహపాత్రుడు.సాధారణముగా చూస్తే కుండ కనిపిస్తుంది కాని నిశితముగా చూస్తే అది మట్టి.కుండ పగిలిపోతుంది.మట్టి మిగిలిపోతుంది.ఇదే విధముగా నగలను చేయుచున్న కంసాలి,నీ మూర్తిని తయారుచేయుచున్న శిల్పి నిమిత్త మాత్రులు.అన్నిటిలో ఉన్నది నీ మహిమ.కుండ,కూజా,మూకుడు.ఇటుక,పొయ్యి,బాన ఇలా అనేక రూపములలో ఉన్నది మట్టి.అదే విధముగా నింగి,నేల,నదులు,సముద్రములు,వనములు,కొండలు,చరాచరములలో దాగిఉన్నది నీ శక్తి.ప్రతి దానిలో మొదలు,ముఖ్యము,ఔన్నత్యము అన్నీ నీవే తల్లీ.నాలోని నీచాతినీచ స్వభావము ఉన్నతముగా మారుచున్న వేళ నీ దగ్గరనేనున్న నా వేలిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.
....
....

SAUNDARYA LAHARI-32

 పరమ పావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 మంచి పనులు చేయించుచున్న ఇంద్రియములు ఐదు
 వానికి సంకేతములు ఇచ్చుచున్న ఇంద్రియములు ఐదు
 సప్త ధాతువులు మనసు ఎనిమిది కలిసిన
 అష్టాదశ పీఠముల నా హృదయ మందిరము
 నిశ్చల భక్తిని నినుగొలువ నిష్ఠను చేరినదమ్మా
 మనో వాక్కాయ కర్మలను ముగ్గురు మిత్రులతో
 ఏమని వర్ణించను ఏ నోము ఫలితమో ఇది
 నా శరీరము పావన శక్తి పీఠముగా మారుచున్న వేళ
 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.
     భావము


 నా మనసనే తోటలో విహరించే తల్లీ.చెవి,ముక్కు,కన్ను,నాలుక,చర్మము అను జ్ఞానేంద్రియములు,పాణి,పాద,పాయు,ఉపస్థ,వాక్కు అను ఐదు కర్మేంద్రియములు,రస,రక్త,మాంస,మేధ,అస్థి,నుజ్జు,శుక్ర అను ఏడు ధాతువులు,మనసు మొత్తము పద్దెనిమిది ఉన్న నా హృదయము మనస్సు,మాట,పని అను ముగ్గురు మిత్రులతో నిష్ఠగా నిన్ను సేవించుటకు బయలుదేరినవి.ఎంతటి అదృష్టము.ఈ శుభకర సమయములో నీ చెంతనేనున్న నా వేలిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.

SAUNDARYA LAHARI-31

సౌందర్య లహరి-31
 పరమ పావనమైన నీ పాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
 అనంత కాల తత్వమే కాళికా మాతగా
 సమయ పాలనా శాంతి బగళాముఖి తీరుగా
 అణువణువు నిక్షిప్తత ఛిన్న మస్త రేణుకగా
 క్రియా శక్తి రూపము భువనేశ్వరి ఆకృతిగా
 చండాల కన్యకైన శివరాణి మాతంగిగా
 తార,ధూమవతి,షోడశి ఆకాశ,పొగ,యవ్వన రూపాలుగా
 త్రిపుర సుందరి,భైరవి తత్వ ప్రకాశములుగా
 నీ దశ మహా విద్యలు నా దిశా నిర్దేశము చేయుచున్న వేళ
 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా


 మానస విహారి ఓ సౌందర్య లహరి.

ఒకానొక సభలో దక్షునకు అల్లుడైన శివుడు గౌరవమునీయలేదను కోపముతో (రజోగుణముతో) తాను యజ్ఞముచేయ సంకల్పించినపుడు శివుని ఆహ్వానించలేదు దక్షుడు.సతీదేవి పుట్టింటి మీది ప్రేమతో పిలుపు లేనప్పటికిని యజ్ఞమును చూచుటకు వెళ్ళెదనన్న సందర్భములో శివుడు ఆమెకు కలుగుఇబ్బందులను సూచించగా,భర్త తనశక్తిని శంకించుచున్నాడని కోపించి,ఆగ్రహముతో తననుండి పది శక్తులను సృష్టించి,కైలాసమునకు కాపలగ ఉంచినదట.పరమేశుడు అమెను శాంతపరచిన తరువాత తల్లి ఆ సక్తులను ఉపసమ్హరించినదట.తనలో కలిపివేసుకొన్నదట.తంత్ర స్వరూప పూజా విధానములతో,నియమ నిష్ఠలతో అర్చించేవారికి,దశమహావిద్యలు అనుగ్రహహిస్తాయని శ్రీవిద్యోపాసకుల నమ్మకమని తెలుసుకొన్న సమయమున చెంత నున్న నా చేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.  

SAUNDARYA LAARI-30

సౌందర్య లహరి-30
పరమ పావనమైన నీ పాద రజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఉండి,పోవునవియేగ మానవ నాలుగుదశలు
ఉండి పోవునవి యేగ మనిషి కోపతాపములు
ఉండి,పోవునవియేగ ఋతువులు ఏడాదిలో
ఉండి, పోవు వారేగ రవిచంద్రులు దినములో
ఉండి, పోవునవేగ ఆకలిదప్పులు జీవికి
ఉండి ,పోవునదియేగ ఈ జగతి ప్రళయములో
ఉండి,పోవునవియేగ మంచిచెడులు మనుగడలో
ఉండి,పోవు ఈ జీవి నీ పదములకడ ఉండిపోవుచున్నవేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
భావము
నా మనసనే తోటలో విహరించుచున్న ఓ తల్లీ.ప్రతి మనిషి జీవితములోని బాల్య,కౌమార,యవ్వన,వార్థక్య దశలు ఉండి మారిపోవు చుండును.పగలు సూర్యుడు,రాత్రి చంద్రుడు ప్రకాశించి అస్తమించుచుందురు.మనిషిలోని స్వభావములు మారుచుండును.ఋతువులు కాలచక్రములో మారుచుండును. జగతి ఉండి ప్రళయములో మునిగిపోవు చుండును.ప్రతి జీవి జనన మరణ చక్రములో తిరుగుచు ఉండిపోవును.ఉండి-పోవు ఈ ప్రాణి నీ చరణములకడ ఉండిపోవునట్లు అనుగ్రహించుము.అనేక వందనములు.

SAUNDARYA LAHARI-29

 సౌందర్య లహరి-25

 పరమ పావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపం

 నీ గౌరీ-కాళి తత్త్వములే ఇలను దివారాత్రములని
 నీ కరుణ ప్రవాహమె ఇల సాగు వాహినులని

 నీ కొనగోటి కల్పనలే ఎనలేని వనరులని
 నీ పుట్టింటి చుట్టరికమె రక్షించే గుట్టలని

 సేదతీర్చు నీ ఒడియే నా సేద్యపు ఒరవడి అని
 ఆగ్రహానుగ్రహములు హెచ్చరిక మచ్చుతునకలని

 పట్టివిడుచు గ్రహణములని గ్రహియించిన రవి-శశి వలె
 నా   అణువణువు  నీ చరణముల ఆత్మార్పణ యగువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి


  " ఆదిన్ శ్రీసతి కొప్పుపై ....నూతన మర్యాదతో స్వామిచేయి గ్రహీతగ బలిచక్రవర్తిచేయి దాతగ ఉండుట ఎంతటి భాగ్యము అని జరుగనున్నది తెలిసియు తనకు తాను  వామనమూర్తికి ఆత్మార్పణ చేసుకొన్నవాడు .ధన్యుడు.

  "అనన్యాచింతయంతోమాం
   యే జనో పర్యుపాసతే
   తేషాం నిత్యాభియుక్తానాం
   యోగక్షేమం వహామి-అహం."

  మొక్క జంతువులు తనను తినివేస్తాయేమోనని భయపడుతుంటుంది.అదే మొక్క వృక్షముగా ఎదిగిన తరువాత దానికిజంతువులవలన ప్రాణహాని లేనట్లు,భక్తిలో ఎదిగిన వారికి ఎటువంటి భయము ఉండదు.వారి  యోగ క్షేమములను స్వయముగా పరమాత్మ చూసుకుంటాడని గీతావాక్యము.

  వృక్షములలో నారికేళము,సుగంధద్రవ్యములలో కర్పూరము,షడ్రుచులలో లవణము,భక్తాగ్రేసరులలో బలిచక్రవర్తి కీర్తింపబడుచుండగా ,నాలో అనిర్వచనీయమైన ఆనందలహరులు ఆడుకొనుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు. 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...