Friday, February 2, 2018

SIVA SANKALPAMU-20


 ఎంగిలి జలములతో నీకు అభిషేకము చేయలేను
 ఎంగిలి పడ్డ పూలతో నీకు అర్చనలు చేయలేను

 ఎంగిలున్న నోటితో ఏ మంత్రములు చదువలేను
 సుగంధిపుష్ఠికర్తకు ఏ పరిమళము అందీయగలను

 జ్యోతిర్లింగమునకు ఏ నీరాజనమును అందీయగలను
 నీదికానిదేదైనా నీకు నైవేద్యము చేయాలిగా

 నైవేద్యానంతర సేవలు నా శివునికి చేయాలిగా
 కాదనక కనికరించి కొనసాగనీయని పూజను

 నిన్ను ధ్యానించమనిన తన పని కాదంటుంది
 నిలకడగ ఉండమంటే అటు ఇటు పరుగిడుతుంది

 బుద్ధి లేక ఉంటుంది,హద్దు మీరుతుంటుంది,నా
 తైతక్కల మనసు నీది ఓ తిక్క శంకరా.
.....................................................................................................................................................................................................శివుడు ఎంగిలి వస్తువులతో చేయబడిన పూజలు స్వీకరించే దేవుడు కనుక కుదురులేని పిచ్చి మనసు నైవేద్యము చాలని నింద

భావమునేగానిబాహ్యమును చూడని పరమ శివునికి ఆత్మార్పణమును మించిన నైవేద్యము లేదని స్తుతి..

     ఏక బిల్వం  శివార్పణం

SIVA SANKALPAMU-19

తిరిపమెత్తు వాడవని నిరుపేద శ్రీనాథుడు
 గల గల ప్రవహించనీయవని గడుసువాడవని గంగ

 చర చర పాకనీయవని చతురుడవని పాము
 పరుగులు తీయనీయవని పాశమున్నదని లేడి

 కిందకు జారనీయవని నిందిస్తున్నది విషము
 గంతులేయనీయవని వంతపాడు చంద్రుడు

 కట్టడి చేస్తున్నావని కట్టుకున్న కపాలము
 హద్దు దాటనీయవని వద్దనున్న వృషభము

 ఆ లయకారుడు అసలు ఆలయమున ఊంటాడా? అంటూ
 మేమెంతో గొప్పవారిమని వంతులవారీగా

 నీ చెంతనే ఉంటూనే కాని చింతలు చేస్తుంటే,వారి
 పక్కదారి మార్చవేరా ఓ తిక్క శంకరా.
..............
 శివా..గంగ,పాము,లేడి,విషము,చంద్రుడు,పుర్రె,ఎద్దు శ్రీనాఠుడు అను కవి తామెంతో గొప్పవారమని నీవు వారిని నిర్బంధించావని,లయకారుడు ఆలయములలో ఉండడని నింద

.అవి అలా శివుని దగ్గర ఉండగలుగుట శివుని దయ.శివుడు భక్తుల గుండెలనే ఆలయములో నివసిస్తాడు అని
 స్తుతి.

  ఏక బిల్వం  శివార్పణం

SIVA SANKALPAMU-18

 విశ్వ నాథుడివని నిన్ను విబుధులు మాట్లాడుతుంటే
 అనాథుడిని నేనంటూ ఆటలాడుతావు

 పరమ యోగీశ్వరుడవని నిన్ను ప్రమథగణము   అంటుంటే
 పార్వతీ సమేతుడినని ప్రకటిస్తూ ఉంటావు

 భోళా శంకరుడవని నిన్ను భక్తులు భళి భళి అంటుంటే
 వేళాకోళములేయని   వేడుకగా  ఉంటావు

 నాగాభరణుడవని నిన్ను యొగులు స్తుతి చేస్తుంటే
 కాలాభరణుడిని అంటు లాలించేస్తుంటావు

 విషభక్షకుడవు అంటు ఋషులు వీక్షిస్తుంటే
 అవలక్షణుడిని అంటూ ఆక్షేపణ తెలుపుతావు

 మంచి చెడులు మించిన చెంచైన దొర నీవు
 వాక్కు నేర్చినాడవురా ఓ తిక్క శంకరా.
.....................
 తల్లితండ్రులు లేనివాడు,విష భక్షణము చేసిన అవలక్షణుడు,నిర్దాక్షిణ్య స్వభావముకల బోయవాడు ,చెప్పిన ప్రతిదానిని వ్యతిరేకించే స్వభావము కలవాడు అని నింద.

కాలాతీతుడు,శక్తి సమేతుడు,చెడును శిక్షించి,మంచిని రక్షించే బోయవాడు,మనందరిని తన సంసారముగా భావించే సన్యాసి శివుడు-స్తుతి.

    ఏక బిల్వం  శివార్పణం

SIVA SANKALPAMU-17

    ఓం నమ: శివాయ-17
నీ క్షమాగుణము చూసి పులి శాంతముగా మారింది
పాపం,పులిని బెదిరిస్తూ లేడి తరుముకొస్తోంది
నీ పిరికితనమును చూసి పులి పిల్లిగా మారింది
పాపం,పిల్లి అనుకుని ఎలుక ఎగిరిపడుతోంది
నీ మంచితనము చూసి అగ్గికన్ను తగ్గియుంది
పాపం తగ్గిందంటు దానిని మంచు ముంచివేస్తోంది
నీ వ్యాపకత్వమును చూసి పాము తాను పాకుతోంది
పాపం,పాకుతోందంటూ దానితోక చలిచీమ కొరుకుతోంది
నీ పెద్దతనము చూసి కదలకుండ ఎద్దు ఉంది
పాపం,మొద్దు ఎద్దు అంటు జగము ఎద్దేవా చేస్తున్నది
సహనముతో నీ సహవాసము కోరిన వాటి
ఇక్కట్లను చూడవేరా ఓ తిక్క శంకరా.
......................................................................................................................................................................................................శివుని క్షమ,శాంతము,వ్యాపకత్వము,పేదరికమునుచూసి, శివుని దగ్గర ఉన్న పులి,పాము,ఎద్దు,మూడో కన్ను అదే విధముగా ఉందామనుకుని ఇబ్బందులు పడ్దాయి-నింద  
.శివుని దగ్గర ఉండి శివుని అనుసరించుట వలన అవి లోక పూజ్యములైనవి.సహనముతో సహవాసము స్వర్గమే కదా.

    ఏక బిల్వం  శివార్పణం

SIVA SANKALPAMU-16


  కూడు తినగనీవు కునుకు తీయగనీవు
 నీరు పారనీవు నాతీరు మారగనీవు

 పుర్రె జారగనీవు గొర్రె పెంటికలో ఉంటావు
 హాస్యము చూపిస్తావు వేశ్య చన్నులో ఉంటావు

 జన్నములు కానీయవు అన్నము దొరకనీయవు
 జలకమాడనంటావు జలములో ఉంటావు

 కాశి నేను అంటావు కార్తీకము అంటావు
 మంచిచెడులు చూడవు మాయలు చేస్తుంటావు

 రూపముతో ఉంటావు అరూపిని అని అంటావు
 ప్రదోషములో ఆడతావు అవశేషములు ఏరుతావు

 మరుభూమిలో తిరుగుతావు పరిపాలన జరుపుతావు
 చక్కదిద్దుకోవేమిరా  ,నీ తీరు ఓ తిక్క శంకరా.
 ................
 శివుడు ఉపవాసము,జాగరణ చేయమంటాడు.దక్ష యజ్ఞము జరుగనీయలేదు.కాశిలో అన్నము దొరకనీయలేదు.సమయము స్థలము తానే అంటాడు.బ్రహ్మ పుర్రెను పట్టుకుంటాడు.లింగముగా అలంకారములతో సుందరేశునిగా దర్శనమిస్తాడు.సాయంకాల నాట్యము చేస్తాడుశ్మశానములో మిగిలినవి ఏరుకుంటు ఉంటాడు.పరాక్రమవంతుడైనను పారిపోతున్నట్లు నటిస్తాడు.ఒక్కచోట అభిషేకముతో,వేరొక చోట అపరిశుభ్రముగ కనిపిస్తు ఉంటాడు-నింద
.భక్తులు పూజించుటకై ఎక్కడెక్కడో దర్శనమిస్తాడు.భగవంతునికి దగ్గరగా ఉండుటయే కద
 ఉప.దగ్గర.వాసము.ఉండుట.మన దగ్గరగా ఉండటానికి శివుడు అలా చేస్తాడు అని స్తుతి.

SIVA SANKALPAMU-15

నీ నెత్తిమీది గంగను చూసి నదులు బెంగపడ్దాయట
మా నెత్తిమీదికి ఏ ఆపద ముంచుకొస్తుందో అని
నీ కంఠమంటిన పామును చూసి కొండచిలువలు బెంగపడ్దాయట
మా కంటిముందు ఏ దండన వెన్నంటి ఉందో అని
నీ చేతిలోని మృగమును చూసి వాటికి సంతోషము మృగ్యమై పోయెనట
వాడి బాణమేదో తమను దాడిచేయనుందని
నీ గజ చర్మమును చూసి గజములు గజగజలాడుతున్నాయట
పొట్టచీల్చి ఎవరు తమను పొట్టను పెట్టుకుంటారో అని
నీ బ్రహ్మ పుర్రెలు చూసి జనము విలవిలలాడుతున్నారట
రిమ్మతెగులు తగులుకొని దుమ్ము నోట కొడుతుందేమో అని
"దయనీయశ్చ దయాళుకాస్తి" అని సువర్ణమాల అనగానే
నే ముక్కున వేలేసానురా ఓ తిక్క శంకరా.
భావము
నదులు,పాములు,కొండచిలువలు,లేళ్ళు,ఏనుగులు,పుర్రెలు శివుని చూచి భయపడుచున్నారు.వీటన్నిటిని హింసిస్తు శివుడు దయామయుడు అని కీర్తింపబడుచున్నాడు-నింద.
అహంకారపు బుద్ధి అను గంగ,చెడు ఆలోచనలు అను విషకోరలు గల పాములు,నిలకడ లేక పరుగులు తీయు మనసు అను లేడి,స్వార్థ సారూప్యమైన ఏనుగు,విచక్షణారహిత పుర్రె శివ కారుణ్యముతో జగత్పూజ్యతను పొందగలిగినవి-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)

SIVA SANKALPAMU-14

కళల మార్పుచేర్పులతో కదులుచున్న చంద్రుడు
నీ సిగముడుల చీకట్లో చింతిస్తూ ఉంటాడట
కుబుసపు మార్పుచేర్పులతో కదలాడు పాములు
నీలలోహిత చీకట్లో చింతిస్తూ ఉంటాయట
కునుకురాక తెరువలేక కుదురులేని మూడోకన్ను
తెర తీయని చీకట్లో చింతిస్తూ ఉంటుందట
ఆకాశము నుండి సాగి జార అవకాశము లేని గంగ
బందిఖానా చీకట్లో చింతిస్తూ ఉంటుందట
చీకటిని తొలగించలేని జ్యోతి శివుడేనట
చింతలు తొలగించలేని వింతశక్తి శివుడట
దోషము తొలగించలేని వానికి ప్రదోష పూజలా అంటూ
ఒక్కటే గుసగుసలు ఓ తిక్క  శంకరా!
భావము
చీకటిని దోషము అనికూడ అంటారు.(మానసిక) చీకట్లను తొలగించుటకు అవి కమ్ముకునే ముందు చేసే పూజలను ప్రదోష పూజలు అంటారు.గంగకు,చంద్రునికి,కన్నుకు,పాములకు చీకట్లను తొలగించలేని శివుడు దోష హరుడుగా ప్రదోష పూజలు అందుకుంటున్నాడు-నింద.

కళలు మారు చంద్రుడు,జనముల మధ్య స్థానము లేని పాములు,గతి తప్పిన గంగ,పరంజ్యోతి యైన శివుని కరుణచే లోకారాధ్యులుగా శివుని దయచే కీర్తింపబడుచున్నారు.స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)

SIVA SANKALPAMU-13

సూక్ష్మము నేనంటావు స్థూలముగా ఉంటావు
వీరుడినని అంటావు పారిపోతు ఉంటావు
ఆది నేను అంటావు అనాదిగా ఉంటావు
సన్యాసిని అంటావు సంసారిగ ఉంటావు
పంట భూమినంటావు బీడునేలవవుతావు
జలాశయమునంటావు ఒయాసిస్సువవుతావు
రాజుని నేనంటావు బంటుగా మారుతావు
ప్రణవము నేనంటావు ప్రళయముగా మారుతావు
స్థాణువు నేనంటావు తాండవమాడుతుంటావు
అనుక్షణము సాగుతావు ఆరునెలలు దాగుతావు
దాగుడుమూతలు చాలుర కుదురు లేకుంటేను
వెక్కిరింతలేనురా ఓ తిక్క శంకరా.
భావము
శివుడు చెప్పేది ఒకటి,చేసేది మరొకటి.విరుద్ధ స్వభావములు కలవాడు-నింద.
సర్వాంతర్యామి,సర్వ జగద్రక్షకుడు శివుడు అన్నీ తానుగా మారి మనలను,వాటిని రక్షించుచున్నాడు.స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం )

SIVA SANKALPAMU-12

దారుణ మారణ కాండను కారుణ్యము అంటావు
పొట్ట చీల్చి గజాసురుని మట్టి కరిపించావు
చుట్టుకుంది అతని తల నీ సుతు శరీరమునే
కన్ను తెరిచి మన్మథుని కన్ను మూయించావు
కన్నుల పండుగ ఐనది నీ కళ్యాణముతో
బాణమేసి వరాహము ప్రాణమే తీసావు
పాశుపతము చేరినది అర్జునునికి ఆశీర్వచనమై
హరిని అస్త్రముగా వాడి త్రిపుర సమ్హారము చేసావు
విరచితమైనది వీరముగా హరి మహిమ
ఎటు చూసిన పాతకమే నీ గతముగా మారితే
నీకు "మహాదేవం,మహాత్మానాం,మహా పాతక నాశనం" అని స్తుతులా అంటే
చక్క బరచుట అంటావురా ఓ తిక్క శంకరా.
భావము
శివుని గతము అంతా పాపమయము-నింద.చెడును దునిమాడాననుకొని తానే నష్ట పోతూ ఉంటాడు.పొట్ట చీల్చి గజాసురుని చంపాననుకుంటే ఆ ఏనుగుతల తనకొడుకుని చుట్టుకొంది.మన్మథుణ్ణి జయించాననుకుంటే,ఆ బాణమునకు లొంగి పార్వతీపతిగా మారాడు.పందిని గెలిచాననుకుంటే,పాశుపతమును పోగొట్టుకున్నాడు.త్రిపురాసురులను జయించాననుకుంటే,ఆ ఘనత అస్త్రముగా మారిన హరికి దక్కింది.ఇలా ప్రతిసారి శివుడు తాను గెలిచాననుకుంటూ,ఓడిపోతూ ఉంటాడు-నింద.
పరమేశ్వరుడు తాను ఓడిపోతున్నట్లు నటిస్తూ,భక్తులను గెలిపిస్తూ,ఆనందిస్తుంటాడు.-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)

SIVA SANKALPAMU-11

తిరిపమెత్తువాడవని నిరుపేద శ్రీనాథుడు
గలగల ప్రవహించనీయవని,గడుసువాడవని గంగ
చర చర పాకనీయవని చతురుడవని కాళము
పరుగులు తీయనీయవని పాశమున్నదని లేడి
కిందకు జారనీయవని నిందిస్తున్నది విషము
కదలనేనీయవని వంతపాడు జాబిలి
కట్టడి చేస్తున్నావని కట్టుకున్న కపాలములు
హద్దు దాటనీయవని వద్దనున్న వృషభము
ఆ లయకారుడు అసలు "ఆలయమున" ఉంటాడా?
మేమెంతో గొప్పవారమంటూ వంతులవారీగా
నీ చెంతనే ఉంటూ కాని చింతలు చేస్తుంటే వాని
పక్క దారి మార్చవేరా ఓ తిక్క శంకరా.
భావము
శివుడు బిచ్చగాడు.గంగను ప్రవహించనీయడు.పాములను పాకనీయడు.లేడిని పరుగెత్తనీయడు.విషమును కంఠమునుండి క్రిందకు జారనీయడు.చంద్రుని కదలనీయడు.ఎద్దును రంకెవేయనీయడు.పక్కనే ఉండి తనను నిందిస్తున్నా వినీ,విననట్లుంటాడు..-నింద.
అహమును,చపల చిత్తమును,అహంకారమును శివుడు నియంత్రించి,భక్తులను అనుగ్రహిస్తున్నాడు.-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం )

SIVA SANKALPAMU-10

"పెద్ద దేవుడనని" అని నీవంటే" మద్ది" తెల్లబోయింది
"అంబే శివుడిని" అని నీవంటే "జంబూ" బెంబేలెత్తింది
"భూత నాథుడిని" అని నీవంటే "చూతము" చూతమంది
"దొడ్డవాడిని" అని నీవంటే " గడ్డి" అడ్డుచెప్పకుంది
"చెలకని వాడను" అని నీవంటే "చెరకు" ఊరుకున్నది
"మీ రేడును" అని నీవంటే "మారేడు" మారాడకున్నది
"ఉబ్బు లింగడిని" అని నీవంటే "కొబ్బరి"నిబ్బరించుకుంది
"నిర్వాహకుడిని" అని నీవంటే "ఉర్వారుకము"నవ్వింది
"యోగిని" అని నీవంటే నీవంటే "రేగి" ఆగి పోయింది
" వృక్షేభ్యో- హరికేశేభ్యో" అని మొహమాటముతో అనగానే
"అన్ని చెట్లు" నీవంటే "అక్కసుతో" పచ్చి అని,నిన్ను
వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా.
భావము
మద్ది చెట్టు,నేరేడు చెట్టు,మామిడి చెట్టు,రేగి చెట్టు,గరిక,చెరకు,మారేడు చెట్టు,కొబ్బరి చెట్టు,దోస పాదు, హరితమునందిస్తుంటే భక్తులు శివుని పచ్చనైన కేశములతో విరాజిల్లు హరికేశునిగా పొగడగానే శివుడు వాటి గొప్పదనమును తనపై ఆపాదించుకొను చున్నాడు-నింద
శ్రీశైల స్థల వృక్షమైన మద్దిచెట్టు,జంబూ ద్వీపముగా ప్రసిద్ధి చెందిన నేరేడు చెట్టు,పావన బదరికా వనముగా రేగి చెట్టు,త్రిగుణాత్మకతతో పువ్వులు లేకుండానే కాయలు అందించే మారేడు చెట్టు,కంచిలో ఆమ్రేశ్వర రూపమైన మామిడిచెట్టు,
అచంచలతకు ప్రతీకయైన కొబ్బరి చెట్టు,తుఫాను సైతము కదల్చలేని గడ్డి,హింసించినను మధురతను ఇచ్చు చెరుకు,మృత్యుంజయ మంత్ర వివరణ యైన దోస పాదు,పరమేశ్వరుని దయచే జగత్పూజ్యములైనవి.
(ఏక బిల్వం శివార్పణం )

SIVA SANKALPAMU-09

" నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చవోనమః".
" కుంభకారులకు నమస్కారము. లోహకారులగు మీకు నమస్కారము."
ఓం నమ: శివాయ
"కుమ్మరివి నీవంటే" ఓటికుండ నవ్వుకుంది
"కమ్మరివి నీవంటే "లోహము నమ్మకమే లేనంది
"వడ్రంగివి నీవంటే" కొయ్యముక్క అయ్యో అంది
"విల్లమ్ములు నీవంటే" రెల్లుపూజ చెల్లు అంది
"పైరు పచ్చ నీవంటే" పంట-పంటలేసుకుంది
"వైద్యుడివి నీవంటే" ఔషధము నైవేద్యాలే అంది
"గురువువి నీవంటే" స్వరము విస్తుపోయింది
"చల్లని ఇల్లు నీవంటే "ఇల్లరికము ఇదే అంది
"నమో విరూపేభ్యో విశ్వ రూపేభ్యో" అని అనగానే
"అన్ని రూపములు నీవేనని" ఆరోపించుకుంటుంటే ,నీతో
చిక్కేనురా ఎప్పుడు ! ఓ తిక్క శంకరా.
భావము
మట్టికి,లోహమునకు,మందులకు,విల్లమ్ములకు,శ్మశానమునకు,శిష్యులకు,కైలాసమునకుశివుని పనితనముపై నమ్మకము లేక అవి బాధపడుచున్నాయి-నింద.
" ఆడలేక మద్దెల ఓడన్నట్లు" తాము సరిగా శివుని గుర్తించక,మట్టి,లోహములు,మందులు,విల్లమ్ములు,శ్మశానము,శిష్యులు,కైలాసము, వాగర్థములైన పార్వతీ పరమేశ్వర కృపచే ప్రకటితమగుచున్న శివుని విశ్వరూపత్వమును సందర్శించగలుగు చున్నవి/చున్నారు.
( ఏక బిల్వం శివార్పణం )

SIVA SANKALPAMU-08

" సంపూర్ణ కామదం సౌఖ్యం భక్తేష్ట ఫలకారణం
సౌభాగ్యదం హితకరంచ మహాదేవం నమామ్యహం "
ఓం నమ: శివాయ
ఉదారతను చాటగ " అసురుని ఉదరములో నుంటివి"
" గంగిరెద్దు మేళము" నిన్ను కాపాడినది ఆనాడు.
వరముగ కోరాడని " అసురుని హస్తమున అగ్గినిస్తివి"
" మోహిని అవతారము" నిన్ను కాపాడినది ఆనాడు.
భోళాతనమును చాటగ " అసురునికి ఆలినిస్తివి"
" నారద వాక్యము" నిన్ను కాపాడినది ఆనాడు.
ఆత్మీయత అను పేర " ఆ అసురునికే ఆత్మలింగమునిస్తివి"
" గణపతి చతురత" నిన్ను కాపాడినది ఆనాడు
భ్రష్టులైనవారిని "నీ భక్తులు" అని అంటావు
రుసరుసలాడగలేవు "కసురుకొనవు అసురతను"

 మ్రొక్కారని అసురులకు " గ్రక్కున వరములు ఇస్తే"
" పిక్క బలము చూపాలిరా" ఓ తిక్క శంకరా.
భావము
శివుడు వరముగా గజాసురుని ఉదరములో నుండెను.తలపై చేయి పెట్టిన వారు భస్మము అగుదురని రాక్షసునుకి వరమిచ్చెను.రావణునికి అర్థాగిని మరియు ఆత్మ లింగమును వరముగా ఇచ్చెను.ఆలోచించకుండా శివుడు అసురులకు వరములిచ్చి ఆపదలలో చిక్కుకునిపరుగులు తీస్తుంటాడు-నింద.
బ్రహ్మాది దేవతలకు తమ భక్తిని చాటుకునే అవకాశం ఇచ్చాడు శివుడు.నారదుని,గణపతిని లోక కళ్యాణ కారులుగా,భక్తులకు" గోకర్ణేశ్వర క్షేత్రమును" అనుగ్రహించాడు.విష్ణువు యొక్క కరుణ అనే జగన్మోహనత్వమును ప్రకటింప చేసిన "పరమ శివుడు" దయా సముద్రుడు.-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం )

SIVA SANKALPAMU-07


10/26/15
     
 గడ్డి పరకలతో చేసే బహుదొడ్డవైన పూజలు
 మే,మే అని స్తుఇంచే మేకతల రుద్రాలు

 కమ్ముకోను మేమనే నమ్ముకున్న తుమ్మిపూలు
 ప్రత్యర్థుల బెదిరింపుకు పుట్టమైన పులితోలు

 తప్పనిసరి ఐతేనే విచ్చుకునే కన్నులు
 పరుగుతీయలేనట్టి మృగమున్న చేతివేళ్ళు

 అమ్మ బాబోయ్ చలి అంటు మూతపడ్డ గుడులు
 హద్దులు మీరుతు ఆకాశాన్నితాకే జడలు

 దుమ్మెత్తిపోస్తుంటే గమ్మత్తుగ నవ్వులు
 పాడుబడ్డగుహనున్నావని పాడుచున్న భక్తులు

 పరిహాసాస్పదుడవగుచు  పరమ శివుడు నేనంటే
 ఫక్కున నవ్వుతారురా ఓ తిక్క శంకరా.
 ............
 చులకనయైన గడ్డిపోచ పూజలు,మేకతల పలికెడి మే మే మంత్రాలుకప్పుకున్న పులితోలు,ఎప్పుడు మూసిఉండే కన్ను ,ఆరునెలలు మూసిఉండే గుళ్ళు,హద్దులులేని జటలు,దుమ్మెత్తిపోసే జనాలు,ఉంటున్న పాడుబడ్డ గుహలు నిన్ను పరమ శివుడు అంటే పగలబడి నవ్వుతారు-నింద
...........
 పవిత్రత,దక్షత,ప్రశాంతత,బూది అభిషేకాలు గలిగి,మన హృదయములో అతి రహస్యముగా నివసించుచున్న శివుడు మనలను రక్షించుగాక-స్తుతి.

SIVA SANKALPAMU-06

" ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ||"

ఆపివేయ పలికినదియేగా "శివతాండవ స్తోత్రము"
శాపమీయ పలికినదియేగా "శివ మహిమ స్తోత్రము"
కనకాభిషేకమునకై కదిలినదేగా" కాశీఖండము"
వీర శైవ ఉన్మాదమేగ" బసవ పురాణము"
శాశ్వత స్థావరమునకేగా "శంకరాచార్య విరచితములు"
మేక మేథ బోధలేగ "నమక చమక స్తోత్రములు"
దిగ్గజ అక్కజమేగా" శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యము"
అడిగి ఆలకిస్తావు ఆనంద భాష్పాలతో
అతిశయముగ చూస్తావు హర్షాతిరేకముతో
"నిష్కళంక మనసు" నిన్ను కొలిచినది" శూన్యము"
యుక్తితో ముక్తి కోరువారిని "నీ భక్తులు" అను మాయలో
చిక్కు కున్నావురా! ఓ తిక్క శంకరా.
భావము
రావణుని కైలాస ప్రవేశము చేయనీయనపుడు ప్రవేశమునకైరావణుడు శివ తాండవ స్తోత్రమును పలికెను(రుద్రవీణ)(అహంకారముతో)
పుష్ప దంతుడు అను గంధర్వుడు తిరిగి తన శక్తులను పొందుటకు శివ మహిమ స్తోత్రమును రచించెను.(స్వార్థముతో)
శ్రీనాథుడు రాజాస్థానముచే కనకాభిషేకమును ఆశించి కాశిఖండమును రచించెను.(కీర్తి కొరకు)
బసవడు అన్యదైవ దూషణ అను మనో వికారముతో బసవ పురాణమును రచించెను.(వీర శైవ ఉన్మాదము)
ఆది శంకరులు తమ వాగ్వైభవమునకు శాశ్వతత్వమును ఆపాదించుటకు అనేక స్తోత్రములు చేసిరి.(లుప్తాయచ-వ్యోమ కేశాయచ)
మేకతల మేధస్సు నుండి జనించినవి నమక చమక స్తుతులు.(గుడ్డిగా మందను అనుసరించుట మేక స్వభావము)
వీరందరు భక్తితో తనను స్తుతిస్తున్నారని పొంగిపోవుట శివుని తెలివితక్కువ తనము-నింద.
వారిలో దాగి వారిని తనను కీర్తింప చేసినది ఆ భోళా శంకరుడే.స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం )

SIVA SANKALPAMU-05

" గళే ౠండమలం "తనౌ సర్పజాలం"
మహాకాలకాలం గణేశాధిపాలం
ఝటాజూటభంగోత్తరంగైర్విశాలం
శివం శంకరం శంభుమీశానమీడే. "

" విషమును దాచిన వాని వివరము" నీకెందుకంటు
అతని భక్తులము మేము "అనుక్షణము వదలమంటు"
నీ" పాద మంజీరమైన పాము" వదలని" ఆపదగా మారింది"
నీ" నడుముకు చుట్టుకున్న పాము" "నరకము తానేనంది"
నీ" జందెమైన పాము" నన్ను" బంధించిస్తోంది"
నీ" కరకంకణమైన పాము" నాపై "కనికరమే లేదంది"
నీ "మోచేతిని తాకుపాము" "వెతలకతగ మారింది"
నీ "మెడను తిరుగు పామేమో" "సంసారము తానంది"
"నీ జడను ఆడుచున్న పాము" నన్ను" జడముగా మార్చింది"
పోనీ అని "నువ్వు వాటిని రానిస్తే","కాని పనులు చేస్తూ"
కాలకూటము చిమ్మి "నన్ను" కాటువేయ చూస్తుంటే
" ఒక్క మాటైన అనవురా" ఓ తిక్క శంకరా.
భావము
విషముతో నిండిన పాములను శివుడు ఆదరముతో అలంకరించుకుంటే,కృతజ్ఞత లేక అవి భక్తులను బెదిరిస్తుంటే,శివుడు వానిని దండించుటలేదని-నింద.
భక్తి పరిపూర్ణతతో పునీతమైనపాములు, తమ విషయవాసనలు అను విషమును విడిచి, "శంకరాభరణములైనవి" అని నీ దయచే తెలుసుకొనిన నా మనసు, నాయొక్క" భక్తితత్పరతా లోపముచే" నీ దరి,చేరలేకున్నానని గ్రహించాను."పరమ శివా"
నా విషయ వాసనలను విషమును, నీ కంఠమున బంధించి,నన్ను అనుగ్రహించు. నీల కంఠేశ్వరా!-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)

SIVA SANKALPAMU-04



"అసంగోహం అసంగోహం-అసంగోహం పున: పున:"

శివుని తల్లి "బెజ్జ మహాదేవి" అంటున్నారు
"శిలాదుడు" తండ్రి అని నేను వింటున్నాను
శివుని అక్క "మగాదేవి" గారాబం చేస్తుందట
శివుని పత్ని "పార్వతి" పరిపాలించేస్తోందట
గణపతి-గుహుడు శివుని సుతులంటున్నారు
శివుని సఖుడు "హరి" అట చెప్పుకుంటున్నారు
శివ భక్తి "తమదని" పక్షులు చెప్పుకుంటున్నాయి
శివ లీలలు "యుగయుగములు" కనువిందు చేస్తున్నవి
భావనలో నిండినది "బహు చక్కని కుటుంబము"
"బ్రహ్మజ్ఞాన వలీనము" బహు చక్కగ చెబుతున్నది
"అసంగోహం-అసంగోహం
అసంగోహం-పున:పున:"
చక్కనైన మాటలేరా ఓ తిక్కశంకరా.
భావము
శివ కుటుంబము చిద్విలాసము చేయుచుండగా,శివుడు ఎవరులేనివాడను,ఏ బంధములేని వాడనని అనుట అబద్ధము-నింద.
బెజ్జ మహాదేవి తల్లిగా భావించింది.శిలాదుడు తండ్రిగా లాలించాడు.(పారమార్థిక దృష్టితో చూస్తే వీరు శివుని తమ బిడ్డడుగా భావించారు.)మహాదేవి అక్కగా శివుని ఆదరించింది.పార్వతీ దేవి శివుని పత్నిగా ప్రకాశిస్తూ, పరిపాలిస్తోంది.వినాయకుడు-కుమార స్వామి పుత్రులుగా ధాత్రినేలుతున్నారు.విష్ణుమూతి నిన్ను చేర్చి కార్తీక దామోదరుడైనాడు.పశు పక్ష్యాదులు,కాలచక్రము నిన్ను తనవాడివని అచంచల భక్తితో కొలుచుచున్నవి.
పశుపతి, మోహ బంధములకు అతీతుడైన భవుడు, భవతారకుడు-స్తుతి..
( ఏక బిల్వం శివార్పణం.)

SIVA SANKALPAMU-03


 ఆంతర్యము ఏమోగాని వెలుగసలే తెలియని
 అమావాస్య జననానికి ఆనందపడతావు

 విడ్డూరము ఏమోగాని వినయమే తెలియని
 గంగ అభిషేకములకు పొంగిపోతు ఉంటావు

 పూర్వపుణ్యము ఎమోగాని పువ్వులే తెలియని
 మారేడు దళములకు మగ ఆనందపడతావు

 ఇంద్రజాలమేదోగాని అందమే తెలియని 
 బూది పూతలకు మోజుపడుతుంటావు

 నీదయ ఏమోగాని నియమములే తెలియని
 నికృష్టపు భక్తులని నీదరి చేర్చుకుంటావు

 కనికట్టో ఏమోగాని అసలు నీ జట్టే తెలియని
 ఒక్కడిని ఉన్నానురా ఓ తిక్క శంకరా
.............
 అమావాస్య చీకటి,అహంకారి గంగ,బూడిద,పూవు చూడని మారేడాకు,నీతి మాలిన,భక్తులు ,అసలు నేను నిన్ను తలచుట నీ మాయ-నింద.

వెలుగునిచ్చుట,గంగను పవిత్రము చేయుట,త్రిగుణములేనిది మారేడాకు అని చెప్పుట,మానవుల చివరి రూపము తెలియచేయుట,నిన్ను నిందించిన నన్ను క్షమించి దయచూపుట-స్తుతి

   

 ( ఏక బిల్వం శివార్పణం )

SIVA SANKALPAMU-02


   ఓం నమ: శివాయ-02

  ధర్మాధర్మములా సకలదేవతలారా! ఇవి
  నిర్మితము శివునిచే నిమిత్తమాత్రము నేను

  మదముతోటి మాటలని నన్ను మన్మథునిగ చూస్తాడో
  వదరుబోతు పదములు అని ఆదరమే చూపుతాడో

  పుట్టుట-గిట్టుట నడుమ శివుని తిట్టుట అనుకుంటాడో
  కట్టుబాటు  నేర్పించగ మెట్టుదిగి  వస్తాడో

  ప్రమథ గణములకు  నన్ను పరిచయమే చేస్తాడో
  ప్రమదములో ముంచుతాడో-ప్రమాదమే  అంటాడో

  కాలకూట విషముకన్న కఠినము తానంటాడో
  కన్నతండ్రిని  అని క్షమించి వదిలేస్తాడో

  మితిమీరిన ప్రేమతో తిక్క శంకరుడని అన్నానంటూ
  నా పక్కనే ఉంటాడో ఆ తిక్క శంకరుడు.



ద్వంద్వ భావములు నాలో చేరి,నేనే  వ్రాసాను అని కాసేభ్రమపడుతు,మరి కాసేపు శివుడే వ్రాసాడు అనికనిపెడుతు,కాసేపు స్తుతియిస్తు, మరికాసేపు నిందిస్తు మాయామోహితుడనైన నన్ను క్షమించి రక్షించుతాడో-కోపించి శిక్షించుతాడో-అంతా ఈశ్వరేచ్చ.

  ( ఏక బిల్వం  శివార్పణం.)

SIVA SANKALPAMU-01


     ఓం నమ: శివాయ-01

    అర్హత ఉందో-లేదో  అసలేనేనెరుగను
    అర్చన అవునో-కాదో అదికూడా నేనెరుగను

    నమక-చమక అంతర్గత  గమకము నేనెరుగను
    కోట్ల అపచారములో షోడశోపచారములో

    అహంకార గద్యమో  అపురూప నైవేద్యమో
    అశక్తతా కళంకమో   భక్తి నిష్కళంకమో

    దు:ఖ నివృత్తియో ఇదిసత్కృతియో  నేనెరుగను
    దుష్ట పరిహారమో  ఇది ఇష్ట పరిచారమో

    కుప్పల తప్పులు చేస్తూ నే ఒప్పులుగా భావిస్తే
    గొప్పదైన మనసుతో నా తప్పిదములు క్షమియిస్తూ

    సకల దేవతలతో పాటు  సముచితాసనుడివై
    సన్నిహితుడుగ మారరా లోక సన్నుత ఓ శంకరా.



 భగవత్ స్వరూపులారా!

 నన్ను పరికరముగ మలచి ఆ సదాశివుడు తనకు తాను వ్రాసుకొనిన "శివ సంకల్పము" అను 108 నిందా స్తుతులతో కూడిన స్వేచ్చా స్తుతుల సంకలనములో అహము చొరబడి నేను చేసిన తప్పులను సహృదయతతో సవరిస్తారని ఆశిస్తూ,నమస్కారములు.

  ( ఏక బిల్వం శివార్పణం.)


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...