సౌందర్య లహరి-మరకతమణి ప్రాకారము
**********************************
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
సకలము మరకత మణిమయము- సాక్షాతు స్వర్గము
ముక్కోటి దేవతా విలసిత షట్కోణ భవనము
ఊర్థ్వ త్రికోణ బిందువులో బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు
అథోకోణ బిందువులలో వారు శక్తుల గూడిన వారు
వేద అక్షమాలా సమేత మేథా దక్షిణామూర్తి
ఈశాన్య కోణములో తేజ రత్నగర్భ గణపతి
సకలదేవతలకు సన్నిహితము సకలమైన
మరకత మణి ప్రాకారము తారకమగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
మాహేశ్వరి మనోసంకల్ప నిర్మిత మరకతమణి ప్రాకారము మహిమాద్భుతము.ఇందులో రెండు త్రికోణములు గలభవనము కలదు.పైవైపున నున్న త్రికోణ బిందువులలో త్రిమూర్తులు తేజరిల్లుచుంటారు.క్రిందివైపునకున్న త్రికోణ బిందువులలో వారు శక్తులతో ఉంటారు.గణపతి-కుబేరుడు-దక్షిణామూర్తి ఇంకా ఎందరెందరో దేవతలు అమ్మదయతో అధిష్ఠితులై ఉంటారు.పవిత్రత-ప్రశాంతత-ప్రావీణ్యత గల ఆ మరకతమణిప్రాకారమున నున్న నన్ను పరమేశ్వరి అనుగ్రహము తరింపచేయుచున్నట్లున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.