పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥
ఆదిత్యహృదయ ఉపోద్ఘాత-ఫలశృతి అనంతరము అగస్త్యుడు ప్రస్తుత శ్లోకములో స్వామి యొక్క అతిశయ గుణవిశేషములను మనకు అనుగ్రహించుచున్నాడు.
ఇదే విషయమును విశ్వామిత్రుడు,
"కౌసల్యా-సుప్రజా రామా-పూరాసంధ్యా ప్రవర్తితే
ఉత్తిష్ట నరశార్దూల-కర్తవ్యం-దైవమాహ్నికం"
అని తెలియచేసాడు.
స్వామి యొక్క ఉదయము సముద్యంతం గా ప్రస్తుతింపబడుతున్నది.
స్వామి" సమ్యక్-ఉద్యంతి" సమస్త లోకములను-చరాచరములను జాగృతము చేయుచున్నాడు.నిద్రావస్థ నుండి చేతనావస్థకు తరలించుచున్నాడు.అంటే స్వల్పకాలిక లయమును ముగించుకొని
అనుష్ఠానమును ప్రారంభించవలసిన సమయమాసన్నమైనదన్నమాట.
సూర్య భగవానుడు భువనములకు సంపదలను-ఈశ్వరత్వమును ప్రసాదించువాడు.కనుక భువనేశ్వరుడు.భువనములను పరిపాలించువాడు.
ఇక్కడ మనము స్వామి అనుగ్రహమును-మనము చేయవలసిన అనుష్ఠానము ఒకచర్యకు గల రెండు పార్శ్వములను తెలియచేస్తున్నారు.
స్వామి రశ్మిమంతుడు.అనగా తన కిరణ ములతో సకలచరాచరములను జాగృతము చేయుశక్తి కలవాడు.
సకలదేవతా చైతన్య సంకేతములే రశ్ములు.
పంచేంద్రియ జ్ఞానమును జాగృతము చేసే శక్తులు రశ్ములు.
పంచేంద్రియ జ్ఞానము ద్వారా పరమాత్మ ఉనికిని తెలుసుకునేలా చేసేవి చైతన్య ప్రతిరూపములైన రశ్ములు.
అన్నమయ్య చెప్పినట్లు ఆ పరబ్రహ్మమునకు చరాచరములను చైతన్యము చేయుటలో తారతమ్యత లేదు.కనుకనే అడవిలో నైన-కడలిలోనైనా,ఏనుగుపైన అయినా-శునకము పైన అయిన తన కిరణములను విస్తరింపచేసి రాజునిద్రనుండి-బంటును నిద్రనుండి జాగృతపరుస్తాయి.
జాగృతమైన దేవతలు-అసురులచే నమస్కరింపబడువాడు ఆదిత్యుడు.మనము రావణాసుడు ఆత్మలింగమును వినాయకునికి ఇచ్చి అర్ఘ్యసమర్పణమునకు తరలుట తెలిసినదే.
అంతే కాదు సూర్యరథ గమనముతో పాటుగా యక్షులు,మునులు,అప్సరసలు,యాతుధాన్యులు,గంధర్వులు కదులుచుండుట మనము చూస్తూనే ఉన్నాము..జగములకు కావలిసిన నైసర్గిక వనరులను అందించు పరమార్థమే ఇది.
వారు "న మమ" మేముకాదు స్వామి ప్రపంచమునకు ఆధారభూతులము,మాలోదాగిన నీ నిత్యనూతన చైతన్యమే అని గుర్తించుటయే నమస్కృతం అన్న పదము యొక్క భావము.
దానికి కారణము స్వామి వివస్వంతుడు.
విశేషాన వసుమాన్-వేశేషముగా తన బంగరు కిరణములతో వేడిని-వెలుగును విస్తరింపచేసి భువనములకు పోషకత్వమును కూర్చువాడు.ఆ విస్తరనకు కారణము స్వామి భాస్కరత్వము.అంటే భాసించు కరములు కలవాడు.ఒక విధముగా చెప్పలంటే స్థితికర్త యైన మహావిష్ణువునకు-భాస్కరునకు భేదములేదు.
విస్తరింపచేయుచున్న బంగరు కిరణములతో ఉదయిస్తూ సకలజీవులచే త్రిగుణములకలవారిచే,త్రిగుణాతీతులచే సైతము నమస్కరింపబడుచున్న ఆదిత్యుడు మనలను అనుగ్రహించుగాక.
తం సూర్యం ప్రణమామ్యహం.