ఈశావాస్యం ఇదం సర్వం.
************************
" నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చవో నమః"
స్వామిని ప్రత్యక్షముగా దర్శిస్తూ పఠించే ఉభయతో నమస్కారము ఇది. మంత్రము ఇరువైపులా "నమః" శబ్దముతో విరాజిల్లుతుంటుంది. అఖిలాండరక్షకునకు అనేకానేక నమస్కారములు.
ఈశ్వర చైతన్యము బహుముఖ ప్రకాశము.ఈశ్వరానుగ్రహము బహుముఖ ప్రశంసనీయము.
" నమః శివాయచ-శివతరాయచ."
ప్రతి ఉపాధి ఈశ్వరమయమే అయినప్పటికిని,మన అజ్ఞానము ఉపాధులలోని, ఉచ్చ-నీచ తారతమ్యములను ఊహించేలా చేస్తుంది.కాని సత్వగుణ సంపన్న సాధకులు,సమస్త ఉపాధులలోను సర్వేశ్వర సాక్షాత్కారమును పొందగలిగిన ధన్యులు.
" ఋషీనాం పతయే నమో నమః".
1.బ్రహ్మజ్ఞానమును గుర్తించగలుగు ఉపవీతి,
2.క్షాత్రమను ఖడ్గమును ధరించిన విషంగుడు,
3.సృష్టి వ్యాపార సూత్రధారుడైన రోహితుడు,
4.కులవృత్తుల ప్రవృత్తుల ప్రతి ఉపాధి
సదాశివుడే-ముదావహుడే.
" భూతేభ్యోః-భూత పతిభ్యో నమో నమః."
ఉదాహరణకు,
1.మట్టిపాత్రలను చేయు కుమ్మరులు. కులాలేభ్యః
2.లోహకారులైన కమ్మరులు- కర్మారేభ్యః
3.చేపలను పట్టు జాలరులు- నిషాదేభ్యః
4.పక్షులను వేటాడు బోయవాడు-పుంజిష్ఠేభ్యః
5.మృగములను వేటాడు ఆటవికుడు-మృగయభ్యః
6.చెక్క పనులు చేయు వడ్రంగులు-స్తక్షభ్యః
7చోరకళా ప్రవీణులు-తస్కరులు
ఇంకా-ఇంకా అనేకానేక ఉపాధులలో నున్నవారందరు రుద్రులే.ఈశ్వరుని ఆమోద ముద్రలే.దయా సముద్రులే.
" మహేభ్యో క్షుల్లకేభ్యో నమో నమః"
అంతే కాదు,
1 భూమిని విస్తరింపచేయు రాజు-భువంతయే
2.మంత్రాంగముతో రాజునకు సహాయపడు మంత్రి-మంత్రిణాం
3.విల్లులను తయారుచేయు -ధన్వానేభ్యః
4.బాణములను తయారుచేయు- ఇషుమభ్యః
5.రథములను తయారుచేయు-రథకారేభ్యః
6.శిరస్త్రాణమైన-బిల్మిని
7.శరీర కవచమైన-కవచిని
8.పెద్దరవముతో శత్రువులను వణికించు-పత్తీనాంపతి
అసలు ఇన్నిమాటలు ఎందుకు,
ఆయుధము ధరించి తిరుగు ఆతతావి ఆ ఆదిదేవుడే.
" విశ్వేభ్యో విశ్వ పతిభ్యో నమో నమః".
స్వామి మనకోసం మోహలంపటునిలా కనిపిస్తాడు.అది ఆయన లీలా విశేషము.
భక్తులకు మాత్రము ఆ పరమాత్మ,
1.తీర్థాయచ-తీర్థములలో ప్రవాహరూపములలో నున్నవాడు,
2.తీర్థ తీరములలోను ఉన్నవాడు-కూల్యాయచ
3.అవతలి గట్టున నున్నవాడు-పార్యాయచ,
4.ఇవతలి గట్టున ఉన్నవాడు తానే-వార్యాయచ,
ఉండి ఏమిచేస్తున్నాడంటే,"మనలను"
1.ఇవతలి ఒడ్డునుండి అవతలి ఒడ్డునకు చేర్చువాడు-ప్రతరణాయచ,
2.అవతలి ఒడ్డునుండి ఇవతలి ఒడ్డునకు చేర్చువాడు-ఉత్తరణాయచ.
అదేనండి కర్మఫలములను సంసారసాగరమునకు ఇరువైపులా తానుండి జీవలకు జననము ఒక ఒడ్డు-మరణము మరొక ఒడ్డు.జనన-మరణములను తీరములకు చేర్చుచున్నాడు ఆ కరుణాసాగరుడు.
"జగతం పితరే వందేం పార్వతీ పరమేశ్వరం" మన కర్మఫలములను క్షయింపచేసి,తీరములను చేరు పనిని తీసివేసి తరింపచేస్తాడు.తనలో లీనము చేసుకుంటాడు-ఆతార్యాయచ.
ఆ ఆతార్యునకు అపరాధక్షమాపణ నమస్కారములు.
ఏక బిల్వం శివార్పణం.
శివస్వరూపులు నా ఈ దుస్సాహసమును మన్నించి,తప్పులు సవరించుట శివసేవగా భావించి,
నన్ను ఆశీర్వదించెదరు గాక.
నన్ను ఆశీర్వదించెదరు గాక.
ఓం తత్ సత్.