Thursday, March 23, 2023

ANIRVACHANEEYAM ADITYAHRDAYAM(PRAJA-PRANA)-10

 పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ।

వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥


 పితరో నమః
 ***********
 పరమేశ్వరుని ఇంద్రియములే/శక్తులే దేవతలు అని పెద్దలు చెబుతారు.ప్రస్తుత శ్లోకము గనములకు సంకేతమైన బహువచనమును అన్వయించుచున్నది.

  పితృగణమును-వసుగణమును,సాధ్యగణమును,అశ్వినీదేవతలను ఇద్దరిని,మరుత్ గణములను,మనుగణములను,వాయుగణములను,వహ్నిగణములను,ఋతుగణములను,ప్రభాకిరణములను ప్రస్తావించుచున్నది.

 రుద్రములో చెప్పినట్లు"పత్తీనాం పతయే" మార్గములను ఏర్పరచి నడిపించుపరమాత్మ కిరణ సమూహములే బహు రూపములతో,తత్త్వములతో సమీకరింపబడుతూ సహాయపడుచున్నవి.

 పితరో నమః
 *********
 " మాతాచ-పితాచ పితరో" ఆర్యోక్తి.తల్లి-తండ్రులే పితరులు.
 జీవునికి జన్మజన్మలయందు ఉపాధికి తగిన అనుగుణమైన ఆహారమును అందించు వ్యవస్థయే పితృదేవతా వ్యవస్థ.
పితృయానమునకు సహాయపడు కిరణ సమూహములు.
 సనాతన ధర్మముననుసరించి ఉపాధిని వీడిన జీవుడు వసు రూపమును,రుద్ర రూపమును,ఆదిత్యరూపమును క్రమముననుసరించి పొందుతాడని దానికి అనుగుణమైన కర్మలను ఆచరించవలసిన బాధ్యత వారసులదని నమ్ముతుంది.ఒక విధముగా జీవుల వివిధ ఉపాధులను స్పందింపచేయు శక్తియే పితరో శక్తి.
 

 వసవః నమః
 *********
 వసు అనగా సంపదగా అన్వయించుకుంటే,సంపదలను/భూగర్భ సంపదలను అందించుటకు సహాయపడు సూర్యచైతన్యమే వసువులు/కిరణములు.ఒక విధముగా ఇవి ప్రకృతి తత్త్వమునకు ప్రతీకలు.
 ఐతిహాసిక ప్రకారము 
 అనిలః,అనలః,ఆపః,ధర్మః,ధ్రువః,ప్రత్యుషః,ప్రభాసః అను నామములను,వాయుతత్త్వముగాను,అగ్నితత్త్వముగాను,జలతత్త్వముగాను,ధర్మ సమ్రక్షణముగాను భావిస్తారు.ఏ కిరణముల ప్రసారము వలన భూగర్భ సంపదలైన చమురులు.లోహములు,ఇంధనములు,జలములు,ఖనిజములు మొదలగు వాని ఉత్పత్తికి సహకరిస్తాయో అవే వైజ్ఞానిక పరముగా వసుకిరణములు.
 పునర్వసు నక్షత్రమునకు అధికారిణిగా అదితీదేవిని భావిస్తారు.
 సాధ్యః నమః
 **************
 'సాధనాత్ ప్రాప్యము సాధ్యం"
  సాధనకు అనుకూలతను-సాధ్యమునకు అనుగ్రహమును కలిగించి సూర్యశక్తి విభాగమే సాధ్యకిరణములు.
 ఐతిహాస ప్రకారముగా బ్రహ్మ ముఖమునుండి ప్రేకటింపబడిన దేవతాశక్తులైన వీరిని
 మను-ప్రాణద-జయ-నయ-ప్రభు-విదు-వీర్యవాన్ గా కీర్తిస్తారు.
 అశ్వినౌ(బహువచనము-02) నమః
 *********************
 ఐతిహాసిక ప్రకారముగా సూర్యభగవానుడు సంజ్ఞాదేవి కుమారులుగా అశ్వనీదేవతలను ,వైద్యులుగాను భావిస్తారు.
 నాసక్యుడు-దస్రుడు వీరి నామధేయములుగా చెబుతారు.విస్తృత వ్యాపకత్వ చిహ్నముగా అశ్వ అశు వ్యాప్తో అన్న దానిని సమర్థిస్తూ గౌణనామముగా వీరిని అశ్వనీదేవతలుగా సంభావిస్తారు.వీరు ఇద్దరు.ఒకరు రోగనిర్ధారనను-రోగనిర్మూలనమును కలుగచేస్తారు.


 మరొతో నమః
 ***********
 "కుపితేన అనేన  మృయతే లోకః ఇతి మరుతః"
 ఎవరికి కోపం వస్తే లోకములు నాశనము అవుతాయో ఆ సూర్యశక్తులే మరుత్తులు.ఒక విధముగా వాతావరణములో విపరీత పరిణామములను కలిగించుటకు సహకరించు చలిగాలులు,వడగాలులు,తుఫానులను కలిగించు గాలులు అని కూడా అంటారు.
 తనకు మరణము లేకుండా ఇతరులకు మరణమును కలిగించు సూర్యశక్తులు మరుత్తులు.
  
 ఐతిహాస కథనము ప్రకారము దితిదేవి బలపరాక్రమ సుతునికై (దేవతలకు సాటియైన వానికొరకై) పయోవతమును ప్రారంభించి నియమపాలనచేయసాగినది.
 విషయమును గ్రహించిన ఇంద్రుడు దితి వద్దకు రాగానే సత్యవచనయై తన వ్రతమును గురించు ఇంద్రునికి చెప్పింది.దానికి సమాధానముగా ఇంద్రుడు అక్కడే ఉండి ఆమెకు(పిన్నికి) సపరిచర్యలు చేసేందుకు అనుమతిని పొంది అవకాశము కోసము ఎదురుచూస్తున్నాడు.కాల నిర్ణయం అతిక్రమించలేనిది అన్నట్లుగా ఆమె వ్రత నియమమునకు విరుద్ధముగా కురులు విరబోసుకొని గడపపై తలను వాల్చి సమకాని వేళ నిదురించినది.అంతే ఇంద్రుడు తన వజ్రాయుధముచే ఆ గర్భస్థ పిండమును ఏడు ముక్కలుగా ఖండించినాడు.మారుతః అన్న శబ్దము ఛేదించవద్దు అని వినబడుతున్నప్పటికిని మరింత కసితో ఒక్కొక్క భాగమును ఏడు భాగములుగా ముక్కలు చేసెనని,
 అందుకనే మరుత్తులు ఏడుగురు అని,వారికి గల అనుచరులు కలుపుకుంటే 49 అని భావిస్తారు.
 వారి నామములను వ్యవహః,అనువాహ,పరివాహ,ఆవాహ,వహ,వివహ మొదలగునవి అని కూడా గౌణములుగా చెబుతారు.
  కాని ప్రకృతి సమతౌల్యములో వీరి ప్రాధాన్యత ఎంతో ఉంది.
 నమో మనుః
 **********

  మనుః ఇతిసర్వజ్ఞ ఆదిరాజస్యనాన్యతః అస్త్మంతః-ఏ పని ఎప్పుడు చేయవలెనో తెలిసినవాడు మనువు.మను శబ్దము నుండి మానవ శబ్దము-జాతి విస్తరించాయని చెబుతారు.
 మనువు పరిపాలనా కాలమును తెలియచేయునది మన్వంతరము.
 పురాణములకు ఉండవలిసిన లక్షణములైన సర్గ-ఉపసర్గలతో పాటుగా మన్వంతరము ప్రధానమైనది.మనము ప్రస్తావించుచున్న ఆదిత్యహృదయములో సైతము సూర్య భగవానుని శక్తులు/కిరణములు కొన్ని మనువులుగా పూజింపబడుచున్నవి.

 విష్ణుసహస్రనామము సైతము భగవంతుని శక్తిని
 "విశ్వకర్మా మనుః త్వష్టా" అంటూ ప్రస్తుతించినది.
  కాలనిర్యనమునకొస్తే,
 నాలుగు యుగముల కలయిక మహాయుగము.71 యొక్క మహాయుగముల కాలపరిమితి మన్వంతరము.అనగా అంతకాలము మనువు యొక్క పరిపాలన కొనసాగుతుంది.
 ప్రళయానంతరము తిరిగి మరొక మనువు మానవ పరిపాలనాబాధ్యతలను స్వీకరిస్తాడు.ఆ సమయములో సప్తఋషులు,దేవతలు,పరమాత్మ ,ఇంద్రుడు వేరువేరు నామములతో పిలువబడుతూ జగన్నిర్మాణమునకు స్థితికి సహాయపడుతుంటారు.
  సనాతన సంప్రదాయ ప్రకారముగా పదునాలుగుమందిని ముఖ్య మనువులుగా పేర్కొంటారు.వారే
1.స్వాయంభువ మనువు
2.స్వారోచిషమనువు
3.ఉత్తమ మనువు
4.తామస మనువు
5.రైవత మనువు
6.చాక్షుస మనువు
7.వైవస్వత మనువు
8.సూర్య సావర్ణిక మనువు
9.దక్ష సావర్ణిక మనువు
10.బ్రహ్మ సావర్ణిక మనువు
11.ధర్మ సావర్ణిక మనువు
12.రుద్ర సావర్ణిక మనువు
13.దేవ సావర్ణిక మనువు
14.ఇంద్ర సావర్ణిక మనువు
 మనమిప్పుడు ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరములో 28 వ మహాయుగములో ఉన్నాము.


ప్రజాప్రాణః నమః
*****************
 సకలజీవులలో ప్రాణస్వరూపముగా నున్న సూర్యతేజస్సునకు ప్రణామములు.
 వాయుః-వహ్ని నమః
 *******************
 సర్వచైతన్యము కుండలినీ సక్తిగా అగ్నితత్త్వమై వాయుతత్త్వమును తనతో కలుపుకొని ఊర్థ్వ పయనమును సాగించు చైతన్యశక్తికి నమస్కారములు.

 ఋతుకర్త నమః
*************
 రెండుమాసముల కాలమును ఋతువు అని అంటారు.ఒక సంవత్సర కాలములో ఆరు ఋతువులు ఉంటాయి.ఆరు ఋతువులు అనేక వైవిధ్యముతో ఒకదానికి ఒకటి సహాయపడుతుంటాయి.ఋతము అనగా వేదము/సత్యము.కాదనలేనిది.దానిని గ్రహింపచేయు జ్ఞానమే ఋతువు.ఋతువులను నిర్ధారించు నిర్వహించు ప్రజ్ఞాన చైతన్య సూర్యశక్తియే ఋతుకర్త.
 వసంతము గ్రీష్మమునకు అనుకూలవాతావరణమును ఏర్పరచి,జరుగుతుంది.అదే విధముగా గ్రీష్మము వర్షమునకు అనుకూల వాతావరణమును,నైసర్గిక వసతులను కలిగించి మరలుతుంది.వర్షము శరత్తునకు,శరత్తు హేమంతమునకు,హేమంతము శిశిరమునకు మార్గదర్శకములుగా మాఎఉటకు సూర్య శక్తి తన కిరనములను చంద్రునిద్వారా భూమిమీదకు ప్రసరింపచేస్తూ పరిపాలిస్తుంటాడు.


 ప్రభాకరః నమోస్తుతే
 ****************
 ప్రకృష్టమైన భాసత్వము కలవాడు ప్రభాకరుడు.వెలుగునే/కిరనములనే కరములుగా కలవాడు.వెలుగును కలిగించేవాడు.

 తం సూర్యం ప్రణమామ్యహం


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...