Saturday, February 3, 2018

SIVA SANKALPAMU-24

 కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవా
 సిగపూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలదా

 కట్టుకున్న గజచర్మము నీకు పట్టుపుట్టములు అందీయగలదా
 నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను అందీయగలదా

 అలదుకున్న విబూతి నీకు వైభవమును అందీయగలదా
 కరముననున్న శూలము నీకు వరములను అందీయగలదా

 పట్టుకున్న పాములు నీకు పసిడిని అందీయగలవా
 కరుగుచున్న నగము నీకు నగలను అందీయగలదా

 కదలలేని చంద్రుడు నీకు ఇంద్రపదవి ఈయగలడా
 కాల్చుచున్న కన్ను నీకు రత్నరాశులను అందీయ గలదా

 "ఓం దారిద్ర్య దు:ఖ దహనాయ" అనగానే నువు ఔనంటే విని
 ఒక్కరైన నమ్మరురా ఓ తిక్క శంకరా
.................
 శివుడు ధరించిన విబూది,రుద్రాక్షలు,ఎద్దు,శూలము,కరిచర్మం,పా(ప)ములు,గంగ(పాలు)మూడో కన్ను(నాశనం) దరిద్ర్యమును తొలగించునని పొగడుట,శివుడు దానిని అంగీకరించుట హాస్యాస్పదము-నింద.



 సంపద,భద్రత,ధర్మము,పవిత్రత,విఘ్న నివారణము,త్రికాల జ్ఞానము కలిగిన శివుడు అనేక విధములైన దారిద్ర్యములను తొలగించగల మహా దేవుడు-స్తుతి.

SIVA SANKALPAMU-23

  
 నీ పిరికితనమును చూసి నీ నామము భయపడింది
 ఎందుకైన మంచిదని పొంచి పొంచి దాగినది

 రెండు వేదముల మధ్య యజుర్వేదమును పెట్టినది
 యజుర్వేద మధ్యలో రుద్రాధ్యాయమును చూసినది

 అష్టమ వాకము రక్షణ అని సుస్పష్టము చేసినది.
 రక్షణదాయినిగా పంచాక్షరిని పట్టుకుంది

  రెండక్షరముల దాచలేని దైవము నీవేనంది
 పంగ నామము పెడతావని నీనామము  అనుకుంటోంది

 గంగపాలు చేస్తావేమో నన్ను నీ చేతకానితనముతో
 ఆది మధ్యాంత రహితుడా వాదనలేలర కావర


 ఇన్నాళ్ళు నమ్ముకున్న నన్ను ఇప్పుడు కాదంటే 
 ఎక్కడికి పోవాలిరా ఓ తిక్క శంకరా
.....................................................................................................................................................................................................నీ వీరత్వము మీద నమ్మకములేక "శివ"అను నీ పేరు వేదముల మధ్యనున్న యజుర్వేద మధ్యలోనున్న ,రుద్రాధ్యాము మధ్యలోనున్న అష్టమవాకమున చేరి,ధైర్యము చాలక "నమ:"అయ" అను రెందింటి మధ్య దాగినది నింద

.శివ అను నామము వేదపూజ్యమై,వేదనను పూజ్యము(సున్న)చేయుచున్నది స్తుతి.
.

SIVA SANKALPAMU-22

      
 శివునితల్లి బెజ్జమహాదేవి అంటున్నారు
 శిలాదుడు తండ్రి అని వింటున్నాను

 శివుని అక్క మగాదేవి గారాబము చేస్తుందట
 శివుని పత్ని పార్వతి పరిపాలించేస్తున్నదట

 గణపతి,గుహుడు నీ సుతులంటున్నారురా
 శివుని సఖుడు హరి అట చెప్పుకుంటున్నారు

 శివ భక్తి పక్షులదని చాటిచెప్పుతున్నాయి
 శివ లీలలు యుగయుగము కనువిందుం చేస్తున్నవి

 భావనతో నిండినది బహుచక్కని కుటుంబము
 "బ్రహ్మ జ్ఞాన వలీనము"బహు బాగుగ చెబుతున్నది

 "అసంగోహం అసంగోహం అసంగోహం పున: పున:" అంటు
 చక్కనైన మాటలేర ఓ తిక్క శంకరా.
........................................................................................................................................................................................................శిలాదుడు,బెజ్జ మహాదేవి భార్య భర్తలు కారు వేరు సమయములకు ప్రదేశములకు చెందిన వారు.శివుని పుత్రునిగా భావించి ధన్యులైనారు.మగాదేవి తమ్మునిగా భావించి తరించింది.స్నేహితుడుగా హరి,భక్తులుగా సకల జీవరాశులు కొలుస్తుంటే వారిని అనుగ్రహిస్తు ,నాకెవరితో సంబంధము లేదు అని శివుడు అంటున్నాడని నింద

.శివుడు వసుధైక కుటుంబీకుడు అని స్తుతి.

SIVA SANKALPAMU-21

మౌనము మాటాడునట మాయేదో చేసావులే
 మేథా దక్షిణా మూర్తిగా బోధించేది మాయేలే

 మూగయు మాటాడునట మాయేదో చేసావులే
 మూక పంచశతిగా కీర్తించేది మాయేలే

 కాళ్ళకింద పద్మాలట మాయేదో చేసావులే
 పద్మపాదుడు అతడట గురుభక్తి మాయేలే

 పూవులే పళ్లట మాయేదో చేసావులే
 పుష్పదంతుడు అతడట పుణ్యాల మాయేలే

 బోడిగుండు శివుడట మాయేదో చేసావులే
 శంకర భగవత్పాదుడట శంక లేనే లేదులే

 మాయా సతిని చూసి అమ్మయ్య అని నీవు మోస్తుంటే,నే
 బిక్కచచ్చి పోయానురా ఓ తిక్క శంకరా.


...................................................................................................................................................................................................... శివుని మౌన వ్యాఖ్య,మూక పంచశతి,పద్మపాదుడైన సునందుని స్తుతి పుస్పదంతుని భక్తి,సాక్షాత్ శివ స్వరూపమైన ఆది శంకరుని స్తోత్రములు శివుని పూజనీయుడిని చేస్తున్నాయని స్తుతి
శివుడు మాయామోహ పూరితుడై దక్షయజ్ఞ కుండమునుండి తిరిగి వచ్చిన మాయా సతిని ,తన భార్య అనుకుని మోసుకెళ్లాడని నింద.
అలా శివుడు మాయ నటించినది అష్టాదశపీఠ ఆవిర్భావమునకు అని స్తుతి.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...