Saturday, April 7, 2018

SAUNDARYA LAHARI-82

 సౌందర్య లహరి-ఏకవీరిక

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 కామధేనువును కోరినాడు  కార్తవీర్యార్జునుడు
 జమదగ్నిని చంపినాడు-రేణుకను గాయపరచినాడు

 రాముడు తల్లి-తండ్రులున్న కావడితో  సాగెను
 సంస్కారములు గావింపగ  సహ్యాద్రిలో  ఆగెను

 దైవ సంకల్పమేమో  వెనుదిరిగిన క్షణమువరకు
 మస్తకము ప్రకటిత మాయెను-తాంబూల ప్రసాదమాయెను

 మాయాసతి కుడిచేయి మహిమాన్విత మాతాపురియై
 ఏకవీరాదేవి  నా శోకములను  బాపువేళ

 నీ మ్రోలనే  నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య లహరి.

  
  "దత్తాత్రేయ సమారాధ్యా అనసూయాత్రిసేవితా
   ఏకవీరా మహాదేవి మస్తకేనైవ శోభిని
   రేణుకామాతా  మాయా సంహార రూపిణి
   కృపయా పాతునస్సర్వాన్ మయూరే  ఏకవీర్యకా".

    "ఏకైవ అనేక రూపేషు-ఏకవీరా."

    " ఏకైక"
  శక్తి స్వరూపము జగత్కళ్యాణము కొరకు అనేకములుగా గోచరింపచేయునది ఏకవీరాదేవి.ఏకైక వీరత్వ స్వరూపము ఏకవీరాదేవి అని లలితా సహస్ర నామ స్తోత్రములో"సమానాధిక వర్జితా" అని కీర్తింపబడినది.అనగా అమ్మశక్తికి సమానమైన శక్తిగాని,అధికశక్తి కానిలేదు.
  ఒకే స్థితిలోనున్న శక్తి అనేక గతులలో ప్రవేశించి ప్రకటింపబడునది ఏకవీరాదేవి.ఈ తల్లిని ఏకవేణిదేవి అని కూడా కొలుస్తారు.అదితి అని, ఛిన్నమస్త అని కూడా భావిస్తారు.
  మాయాసతి కుడిచేయి మాహూరప్రాంతములో పడి రేణుకాదేవిగా/ఏకవీరాదేవిగా ఆవిష్కరింపబడినదని స్థలపురాణము చెప్పుచున్నది.,కార్తవీర్యార్జునునిచే కామధేనువును బలాత్కారముగా జమదగ్నిఆశ్రమము నుండి తీసుకొని వెళ్ళునపుడు ,రేణుకా దేవి కుడిచేయి భాగము 21 చోట్ల గాయపరచబడినదట.సహ్యాద్రిలో దత్తాత్రేయస్వామి వారి ఆధ్వర్యములో సహగమనము జరుగు సమయమున వెనుకకు తిరిగి చూడకుండ పరశురాముడు,నిష్క్రమించవలెనను షరతు కలదట.దైవలీలలు ఎవరికెరుక.కొంతదూరము సాగిన పరశురాముడు కుతూహలముతో వెనుదిరుగగనే,భస్మ రాశి నుండి అమ్మవారి ప్రకటన ఆగిపోయినదట.శిరము మాత్రమే దర్శ్నమిచ్చుటచే.భక్తులకు తాంబూలమును ప్రసాదముగ పంచుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

SAUNDARYA LAHARI-81

 సౌందర్య-మహలక్ష్మి

 పరమ పావనమైన  నీ పాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 భోగవతి-తులసి-రంభ-కసరి-దమని అను
 పంచగంగ తీరమున-పన్ హాల పర్వతమున

 శుభకర మాసములలో సూర్య కిరణాభిషేకములు
 అవిముక్త క్షేత్ర విరాజిత  లక్ష్మీ-నారాయణులు

 శాంత-క్రోధ సంకేత పద్మ-సింహ ఆసనములతో
 పుడమి పుణ్యక్షేత్రమైన  కరవీర పురములో

 మాయా సతి నేత్రద్వయము మహిమాన్విత మూర్తియై
 కొళను సంస్కరించిన కరుణ నాపై ప్రసరించుచున్న వేళ

 నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

" స్థూల సూక్ష్మే మహారౌద్రే  మహాశక్తి ప్రదాయిని
     మహాపాప హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే."

   కొండజాతులచే ఈ తల్లి కొల్లమ్మ గా పూజింపబడుచున్నది.శిలాహార రాజుల ఇలవేల్పు మహాలక్ష్మి.
   మహాలక్ష్మి పీఠము మణిద్వీప సమానము.వజ్రశిలారూపిణిగా  అనుగ్రహించుతల్లి ఒకచేత మాదీఫలము,మరొక చేత గద,వేరొక చేత కేటకము అను ఆయుధము,నాల్గవచేత అక్షయ పాత్రతో కాంతులీనుతుంటుంది.తలపై కుండలినీశక్తి ప్రతిరూపముగా పాము,సర్వజగతికి సంకేతముగా పానవట్టము,త్రిశక్త్యాతంగా లింగమును ధరించి యుండును.పద్మాసనమునకు మారు సింహవాహినిగా చిద్విలాసముతో ఉంటుంది

  కొల్ హాపురము గాను,కొల్లాపురము గాను,కరవీరపురముగాను ప్రసిద్ధిచెందుటకు ఒక ఇతిహాసము కలదు.దాని ప్రకారము బ్రహ్మ మానసపుత్రులు గయ-లవణ-కొల్ హ.వారు పరమశివుని అనుగ్రహమునకై ఘోరతపములు చేసి,వరప్రసాదులైరి.గయ-లవణఉలు ఇంద్రుని-యముని జయించి,దేవతలను స్వర్గమునుండి తరిమివేసిరి.దేవతలు తమ అసహాయతను విష్ణువునకు విన్నవించుకొనగా హరి వారిని యుద్ధములో అంతమొనరించెను.ఈ విషయము తెలుసుకొనిన కొల్ హ దేవతల సంతోషమునకు లక్ష్మీదేవి వారి అండనుండుట అని తెలుసుకొని ఆమెకై ఘోరతపమాచరించి తనరాజ్యమునందుండునటూల వరమును పొందెను.తన తమ్ములను చంపిన వారిపై పగతీర్చుకొనుటకు వారిపై దండెత్తెను.కొళ అను రాక్షసునకు డోల అను మరొక పేరు కలదు.వాని కుమారుడు కరవీరుడు.లక్ష్మీదేవి 100 సంవత్సరములు తనరాజ్యమును వీడదన్న అహంకారముతో వాని దుష్కృత్యములు హద్దుమీరగా ధర్మసంరక్షణార్థము తల్లి ,లంక భైరవుడు-కాల భేతాళుడు మొదలగు భారీ సైన్యముతో,పద్దెనిమిది చేతులతో సింహవాహినియై దండెత్తగా,అమ్మ ఆయుధములు తాకిన కొల్హ శరీరము పునీతమై పశ్చాతప్తుడై అమ్మను శరణు వేడి,మూడు వరములు కోరెను.అవి ఆ స్థలమును పవిత్రమైన పుణ్యక్షేత్రముగా దీవించుట,తన పేరున,తన కుమారుని పేరున ఆ స్థలము పిలువబడుట,అమ్మ తన నిజరూపమున అక్కడనే ఉండి అందరిని ఆశీర్వదించుట. వానిని అనుగ్రహించిన నిర్హేతుక కృపాకటాక్షము నాపై ప్రసరించుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

SAUNDARYA LAHARI-80

సౌందర్య లహరి-జోగులాంబ-76
పరమ పావనమైన నీపాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
బ్రహ్మ పొందినాడు తిరిగి బ్రహ్మత్వము ఇచట అనగ
పది బ్రహ్మల మందిరములు ప్రత్యక్ష నిదర్శనములు
తేలు-బల్లి-గుడ్లగూబ యోగిని ఆభరణములు
తేలికగా తీసివేయు,నరఘోష నివారణములు
ఉత్తర వాహినియైన తుంగ-భద్ర సంగమము
ఉత్తమ వాహిని యైన కాశి గంగ సమానము
మాయాసతి పైపలువరుస మహిమాన్విత మూర్తిగ
బాల పరమేశ్వర జోగులాంబ పాలించుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
"లంబస్తనీ వికృతాక్షి ఘోరరూపాం మహా బలాం
ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం"
స్వభావములోనేకాదు స్వరూపములో కూడ అమ్మ ఉగ్రముగా ఉండి తలపై తేలు,బల్లి,గుడ్లగూబ, శవము మొదలగు వాని ఆభరణములుగా అలంకరించుకొనును.
పూర్వము ఋషిశాపము వలన తన బ్రహ్మత్వమును కోల్పోయిన బ్రహ్మ ఈ పుణ్యస్థలమున శివుని గురించి ఘోరతపము చేసెనట.పరమేశుడు సంతుష్టుడై బాల బ్రహ్మ,తారక బ్రహ్మ,పద్మ బ్రహ్మ,కుమార బ్రహ్మ,ఆత్మ బ్రహ్మ,వీర బ్రహ్మ,విశ్వ బ్రహ్మ,గరుడ బ్రహ్మ,శబ్ద బ్రహ్మ అను నవ బ్రహ్మ రూపములలో సాక్షాత్కరించి అనుగ్రహించెనట.శివ బ్రహ్మమే జగమంతా అని భావించిన రస సిద్ధుడు నవబ్రహ్మ మందిరములను నిర్మించెనట.అరుదైన విశేషముగా నవ బ్రహ్మ మందిరములు పూజలనందుకొనుచున్నవి.
యోగిని అను పద వికృతి పదమే జోగిని.మరొక ప్రత్యేకత బ్రహ్మాణి,ఇంద్రాణి,మాహేశ్వరి,కౌమారి,చాముండి,వారాహి,వైష్ణవి అను సప్తమాత్రికలతో సంతసములనందించుతల్లి యోగినీ మాత యైన జోగులాంబ శ్మశానవాసిగానున్న శివుని, తల్లి ఆరాధిస్తుంది.వికృతములన తేలు,బల్లి,కపాలము,గుడ్లగూబ ధరించుటలో గల పరమార్థము బల్లిని శకునములకు,తేలును దానధర్మములకు,కపాలమును తాంత్రిక విద్యలకు,గుడ్లగూబను ఐశ్వర్యమునకు (లక్ష్మీదేవి వాహనము) సంకేతములు భావించి వానికి శాశ్వతత్వమును ప్రసాదించుటయే.అమ్మ వికృతములను తాను ఆభరణములుగా ధరించి నరఘోషకు ఆధిపత్యమును వహించుచున్నది.( తాను తీసివేయుచున్నది)
గోపాదరూప బాలబ్రహ్మేశ్వరస్వామి అనవరతము జలధారను ప్రవహింపచేస్తూ,భక్తులకు తీర్థమునందించుచున్న వేళ, నాలోని కుండలినిశక్తి (అమ్మ కరుణ) జాగృతమగు చున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.

SAUNDARYALAHARI-CHAMUNDA-79

సౌందర్యలహరి-చాముండా-75
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
పరమేశ్వరి క్రోధపు కనుబొమల ముడినుండి
దంష్ట్రా-కరాళ వదనముతో ప్రభవించితివి
ధర్మ సంస్థాపనమునకై ప్రచండ యుద్ధము చేసి
చండ-ముండ శిరములను ఖండించితివి, స్వస్తి.
సప్త మాతృకవో నీవు సంతృప్త శ్రీమాతవో
పుడమి పుణ్య క్షేత్రమైన చాముండి కొండమీద
మాయాసతి శిరోజములు మహిమాన్వితమైనవి
కాళియే చాముండిగా మమ్ము కాపాడుచున్న వేళ
నీమ్రోలనే నున్న నా కర్లు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
" దం ష్ట్రా కరాళవదనే శిరోమాలా విభూషణే
చాముండే ముండమదనే నారాయణి నమోస్తుతే"
చండముండాసుర శిరస్ఛేదము చేసిన తదుపరి సింహవాహిని యైన కాళి పరమేశ్వరిని దర్శించగా, తల్లి చండముండ ఖండిత శిరములను కాళి రెండుచేతులలో చూసి" చాముండా" అని పిలిచినదని దేవీభాగవతము పేర్కొంటున్నది.చాముండి పర్వతముపై వెలిసిన తల్లి కనుక చాముండేశ్వరీదేవి అనికూడా కొలుస్తారు.శుంభ- నిశుంభులు తమ స్వార్థమునకు బ్రహ్మగురించి తపమాచరించి వరములు పొందిన తరువాత కన్నుమిన్ను కానని వారుగా మారి పరమేశ్వరిని పొందవలెనని చండముండాసురులను అమ్మపై యుద్ధమునకు పంపిరి ఇది బాహ్యార్థము..తామస రజోగుణములు (శుంభ నిశుంభులై )సత్వగుణమూర్తియైన తల్లిని( శరణు)కోరుకున్నవి ఇది ఆంతర్యము..అనుగ్రహించ దలచిన తల్లి చండ-ముండులను నిమిత్త మాత్రులను చేసి,నిర్వాణమొసగినది.అసురత్వము అధికమై గగనమునకెగబాకి యుద్ధముచేయుచున్న వారిని,గరుత్మంతుని రెక్కలయందు బంధించి,శుంభ-నిశుంభులను పునీతులుగ చేసిన చాముండా దేవి నాకు అండయైన సమయమున చెంతనే నున్న నా చేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు..

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...