Saturday, April 7, 2018

SAUNDARYA LAHARI-80

సౌందర్య లహరి-జోగులాంబ-76
పరమ పావనమైన నీపాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
బ్రహ్మ పొందినాడు తిరిగి బ్రహ్మత్వము ఇచట అనగ
పది బ్రహ్మల మందిరములు ప్రత్యక్ష నిదర్శనములు
తేలు-బల్లి-గుడ్లగూబ యోగిని ఆభరణములు
తేలికగా తీసివేయు,నరఘోష నివారణములు
ఉత్తర వాహినియైన తుంగ-భద్ర సంగమము
ఉత్తమ వాహిని యైన కాశి గంగ సమానము
మాయాసతి పైపలువరుస మహిమాన్విత మూర్తిగ
బాల పరమేశ్వర జోగులాంబ పాలించుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
"లంబస్తనీ వికృతాక్షి ఘోరరూపాం మహా బలాం
ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం"
స్వభావములోనేకాదు స్వరూపములో కూడ అమ్మ ఉగ్రముగా ఉండి తలపై తేలు,బల్లి,గుడ్లగూబ, శవము మొదలగు వాని ఆభరణములుగా అలంకరించుకొనును.
పూర్వము ఋషిశాపము వలన తన బ్రహ్మత్వమును కోల్పోయిన బ్రహ్మ ఈ పుణ్యస్థలమున శివుని గురించి ఘోరతపము చేసెనట.పరమేశుడు సంతుష్టుడై బాల బ్రహ్మ,తారక బ్రహ్మ,పద్మ బ్రహ్మ,కుమార బ్రహ్మ,ఆత్మ బ్రహ్మ,వీర బ్రహ్మ,విశ్వ బ్రహ్మ,గరుడ బ్రహ్మ,శబ్ద బ్రహ్మ అను నవ బ్రహ్మ రూపములలో సాక్షాత్కరించి అనుగ్రహించెనట.శివ బ్రహ్మమే జగమంతా అని భావించిన రస సిద్ధుడు నవబ్రహ్మ మందిరములను నిర్మించెనట.అరుదైన విశేషముగా నవ బ్రహ్మ మందిరములు పూజలనందుకొనుచున్నవి.
యోగిని అను పద వికృతి పదమే జోగిని.మరొక ప్రత్యేకత బ్రహ్మాణి,ఇంద్రాణి,మాహేశ్వరి,కౌమారి,చాముండి,వారాహి,వైష్ణవి అను సప్తమాత్రికలతో సంతసములనందించుతల్లి యోగినీ మాత యైన జోగులాంబ శ్మశానవాసిగానున్న శివుని, తల్లి ఆరాధిస్తుంది.వికృతములన తేలు,బల్లి,కపాలము,గుడ్లగూబ ధరించుటలో గల పరమార్థము బల్లిని శకునములకు,తేలును దానధర్మములకు,కపాలమును తాంత్రిక విద్యలకు,గుడ్లగూబను ఐశ్వర్యమునకు (లక్ష్మీదేవి వాహనము) సంకేతములు భావించి వానికి శాశ్వతత్వమును ప్రసాదించుటయే.అమ్మ వికృతములను తాను ఆభరణములుగా ధరించి నరఘోషకు ఆధిపత్యమును వహించుచున్నది.( తాను తీసివేయుచున్నది)
గోపాదరూప బాలబ్రహ్మేశ్వరస్వామి అనవరతము జలధారను ప్రవహింపచేస్తూ,భక్తులకు తీర్థమునందించుచున్న వేళ, నాలోని కుండలినిశక్తి (అమ్మ కరుణ) జాగృతమగు చున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...