Friday, October 6, 2017

CHIDAANAMDAROOPAA-ENAADINAATHA NAAYANAARU


 చిదానందరూపా-ఎనాది నాధ నాయనారు-27

  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

  "ఎనాది" ఖడ్గవిద్యా గురువు,భర్గుని నమ్మిన భక్తుడు
   శివభక్తుల పాలిట ఎప్పుడు తానొక కల్పతరువు

  ఫాల విబూదిరేఖలను చూసి పరమేశునిగానే తలుచు
  ప్రాణము విడుచుటకైనను వెనుకాడక ముందర నిలుచు

  ఈశుని లీలయనంగ  అతిసూరను అడిగెను  పోటి
  ఈసును తెలియని  శౌర్యము వివరించెను లేరని సాటి

  శివభక్తుని వేషపు సాయము శిరమును దునుమాడినదిగా
  విశ్వేశ్వర సన్నిధిచేరగ విభూతి  కారణమాయెగ

  చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక
  చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

CHIDAANAMDAROOPAA-KALIKAAMBAA NAAYANAAR


 " చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగ తలపడేని
కలుగ నేటికి తల్లుల కడుపుచేటు."
చిదానందరూపా-కలికాంబా నాయనారు
*******************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కపర్ది భక్త విధేయుడు కలికాంబా నాయనారు
కడుభాగ్యము కలిగినదని కల్మషమెరుగక కొలుచువాడు
వానిభక్తి పరీక్షించ తలిచాడు పరమేశుడు
వాని పూర్వ సేవకుని అతిధిగా పంపించాడు.
తన-పర భేదమును మరచినాడు తన్మయత్వములోన
అతని భార్య సేవకుడని అతిధిపూజ చేయలేదు
అమాంతముగా ఆమెచేతులు నరికి తనపూజను కొనసాగించాడు
అహమును తొలగించుటకు అవిటితనము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక
" సభాభ్యో సభాపతిభ్యో నమోనమ:" సభను నిర్వహించేవాడు-సభాసదులు రెండుగా మనకు తోచు చున్నను రెండింటిలో నున్న వాడు శివుడొక్కడే అని నమ్మి కొలుచువాడు పెన్నగడం లోని కలికాంబ నాయనారు.ఆయన ధర్మపత్ని కూడ పరమ శివభక్తురాలు.అనుకూలవతి.
నంది-భృంగి తన ద్వారపాలకులుగా సేవిస్తుంటే, తాను బాణుని శోణపురికి కాపరిగ ఉన్న పరమేశుని లీలలు పరమ మనోహరములు."విశ్వేభ్యో-విశ్వ పతేభ్యో" అయిన సామి తన లీలను పునర్వ్యక్తీకరించుటకు పావులను కదపసాగాడు.మహామాయ కలికాంబ మదిలోని విజ్ఞతను కప్పివేసింది హృదయ రాజీవము రజోగుణ పూరితమైనది..కపిలేశ్వరుడు కదిలాడు నాయనారు ఇంటిలో పనిచేసి మానేసిన సేవకుని ఆకృతిలో.రసవత్తరమైన ఆట మొదలైనది.అతిధినిసేవిస్తూ అమితానందమును పొందుతున్నాడు నాయనారు.కాని అదేమి చిత్రమో యజమానురాలినన్న భావము సామ్రాజ్యమేలుచుండగా అతిథిని, సేవకుడిగా గుర్తించి,సేవకుని అర్చిచుటకు అహము అడ్డుగోడగా మారింది.ఈశ్వరభావము ఆమె కన్నులకు ఇసుమంతైనను కలుగనీయలేదు అమెలో ఆ మూడు కన్నుల వాడు..కలిగితే కథ మరోలా ఉండేది కదూ." బుద్ధిః కర్మానుసారిణి" అని అంటారుకదా.భర్త మాటను పెడచెవినిపెట్టి, శివభక్త పూజలో పాల్గొనలేదు.కమలాక్షునర్చించు కరములు కరములు-చేయనప్పుడు అవి నిష్ప్రయోజనమేనని తక్షణమే ఆ చేతులను నరికివేసి తన పూజను కొనసాగించెను నాయనారు. నిశ్చలభక్తికి సంతసించి నాయనారు దంపతులను అనుగ్రహించిన నాగాభరణుడు మనలనందరిని అనుగ్రహించుగాక.
(ఏక బిల్వం శివార్పణం.).


CHIDAANAMDAROOPAA-KAMCHAARA NAAYANAARU



 చిదానందరూపా-కంచార నాయనారు-26

 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన  వరమనుకొందునా

 కంచార నాయనారు  చోళదేశ సేనాపతి
 శివతపోఫలితముగా  కుమార్తె జన్మించింది

 యుక్తవయసు రాగానే యోగ్యుని అల్లుడు అనుకొనె
 దీవించగ ఏతెంచెను మహా వ్రతుడు వధువును

 విధేయముగా వధువు వంగి పాద నమస్కారమును చేసె
 విచిత్రముగా అతిథి వధువు  కేశపాశమును కోరె

 సందేహించక  ఏమాత్రము కోసి ఇచ్చేసెనుగా
 కైవల్యమును పొందగ కోసిన కేశపాశము కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు  చింతలు తీర్చును గాక


 శివ భక్తులను కొలుచుట ఆదరించుట శివపూజగా భావించు కంచార నాయనారు చోళరాజ్య సేనా నాయకుడు.సదాశివుడు నాయనారు భక్తికి మెచ్చి సకల సద్గుణరాశియైన ఒక కుమార్తెను అనుగ్రహించాడు.యుక్త వయసువచ్చిన ఆమెకు సివ భక్తుదైన ఇయర్కాన్ కాలికమార్ను వరుడుడుగా నిర్ణయించాడు శివుడు.

   " ఆట కదరా శివా ! ఆట కద కేశవ- ఆట కదరా నీకు అన్ని పనులు."

  భక్తుని చరిత్ర అందముగా మరందముచిందాలని నిందను స్వీకరించుటకు ముందుకొచ్చాడు ఆ నందివాహనుడు. జడలు కట్టినకొప్పును అలంకరించుకొన్నాడు. ఓం కపర్దినేచ నమో నమ: అంతటితో ఆగకకొన్ని కేశములను యజ్ఞోపవీతమును చేసుకొని అలంకరించుకొన్నాడు,నమో వృక్షేభ్యో-హరికేశేభ్యో" అని సన్నుతులందువాడు.ఒక మహావ్రతుని రూపుదాల్చి నాయనారు ఇంటికి వేంచేశాడు.మహదానంద పడిన నాయనారు శివుని పూజించి,తనకుమార్తెను పిలిచి సాధువుకు నమస్కరించమని స్వామి దీవెనలు అందుకోబోతున్న తన బిడ్డను చూసి దొడ్డ సంబరమును పొందాడు." ఆనతి నీయరా శివా" అంటు మైమరచిపోయాడు.

   కపర్డిగా వచ్చిన సాధువు ఆశీర్వచనమునకై వంగిన వధువు కబరీ బంధమును (కేశ సంపద-జడ) చూసి తనను తాను వ్యుప్త కేశుడిగా (కేశములు లేని వాడిగా) భావించుకొని,నాయనారుతో అమ్మాయి కేశ సంపదను తాను మోహించానని,దానితో పంచవటిని నిర్మించుకుంటానని,
 కనుక తనకు ఇయ్యమని కోరాడు.శివ శివ! అమంగళము ప్రతిహతమగుగాక. ధూర్జటి చెప్పినట్లు అన్నీ తన దగ్గరనే ఉన్నను ఆత్మార్పణశక్తిని పరీక్షించుచు మైమరచిపోతుంటాడు ఆ భోళా శంకరుడు.ఏ మాత్రము ఆలోచించకుండా తత్క్షణమే కోసి దానిని శివార్పణము చేస్తూ "జటాజూట ధారి-శివా చంద్రమౌళి,నిటాలక్ష నీవే సదా మాకు రక్ష అని ప్రార్థించిన మన కంచార నాయనారు కుమార్తెను దీర్ఘ సుమంగళిగా దీవించిన ( ఆమె కేశపాశము తిరిగి వచ్చేసింది) జటలలో గంగమ్మను బంధించిన మనలందరిని తన కరుణతో బంధించును గాక.

   ( ఏక  బిల్వం శివార్పణం.) .



.

CHIDAANAMDAROOPAA-MAYIPOERUL NAAYANAARU.

"వార్ధక్యే చేంద్రియాణాం విగతగతిమతిశ్చాధిదైవాదితాపైః
పాపై రోగైర్వియోగైస్త్వనవసితవపుః ప్రౌఢహీనం చ దీనమ్ |
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో"

 చిదానందరూపా-మయిపోరుల్ నాయనారు
*************************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 మయిపోరుల్ నాయనారు మహారాజు-శివభక్తుడు
 చిక్కుజడలు-విబూది-రుద్రాక్షల  అనురక్తుడు

 కొండకోన సేతి ప్రజల అండనున్న శివయోగి
 ధర్మముతో గెలువలేని శత్రువైనాడు  కపటయోగి

 మంత్రొపదేశమంటు రాజమందిరమును  ప్రవేశించె
 కుతంత్రమును చూడమంటు కత్తిదూసి హతమార్చె

 శత్రువును పొలిమేర దాటించగ రాజు శాసించె
 కైవల్యమును పొంద కపటయోగి సేవ కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

  సేతి (కొండజాతి) ప్రజల రాజు మయిపోరుల్ నాయనారు.ధర్మయుద్ధములో గెలువలేని శత్రువు కపటముతోనైనా గెలవాలని నిశ్చయించుకొని శివయోగి రూపములో ద్వారపాలకుడు ధూతను వలదని వారిస్తున్నా వినకుండా అంత:పురములోనికి ప్రవేశించి,రాజును కత్తితో పొడిచాడు.చూసిన ధాతను  వలదని వారిస్తున్నా, వినకుండా అంత:పురములోనికి ప్రవేశించి, నాయనారును కత్తితో పొడిచెను.చూసిన ధాతను పట్టిబంధించబోగా వలదని వారించి,శత్రువును క్షేమముగా పొలిమేర దాటించమని తన పెద్ద మనసును వ్యక్తపరచిన నాయనారును అనుగ్రహించిన పెద్ద దేవుడు,మనందరిని అనుగ్రహించుగాక.

అపకారికి సైతము నెపమెంచక ఉపకారముచేసే సంస్కారము కలవాడుమెయిపోరల్ నాయనారు.మెయిపోరల్ అనగా భగవంతుడొక్కదే "సత్యము" అని నమ్మేవాడు.మిలాడ్ నాడు ప్రాంత సైన్యాధ్యక్షుడు.తిరుక్కొయిలూరు విరాటేశ్వర స్వామి భక్తుడు.భగవంతునియందు భగవద్భక్తుల యందు సమదృష్టి కలవాడు.పొరుగు రాజైన ముత్తునాథన్ శౌర్య ప్రతీకలైన మెయిపోరల్ సైన్యమును ధర్మయుద్ధమున జయించలేక కపటయోగి రూపమున ముత్తునాథన్ తిరుక్కొయిలూరు ప్రవేశించి,అంతః పురములోనికి ప్రవేశించబోవగా ధాతన్ అను ద్వారపాలకుడు అడ్డుకొనెను.వేదవిద్యను రహస్యముగా బోధించుటకు వెళ్ళవలెనని అసత్యమాడి
లోనికి వెళ్ళెను.మెయిపోరల్ ఆ యోగిని ఉన్నతాసనముపై కూర్చుండబెట్టి పూజించుచుండగా కత్తితో నిర్దాక్షిణ్యముగా దునుమాడెను.గమనించిన ధూతన్ బంధించబోగా మెయిపోరల్ నివారించి క్షేమముగా పొలిమేర దాటించి రమ్మని ఆనతిచ్చెను.అతను తిరిగివచ్చువరకు వేచియుండి,తన కుటుంబమునకు రాజ్యము శివసామ్రాజ్యముగా భాసిల్లాలని కోరిన నాయనారును రక్షించిన సదాశివుడు మనందరిని రక్షించుగాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)

CHIDAANAMDAROOPAA-VIRAALMIMDU


  " నాలోన శివుడు గలడు-నీలోన శివుడు గలడు
   నాలోన గల శివుడు నీలోన గల శివుడు
   లోకంబులేల గలడు కోరితే శోకంబు బాపగలడు."

  చిదానందరూపా- విరాల్మిండ నాయనారు
  **************************************

 



 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 అతియారులు అతిశయ ఆరాధ్యులనుచు కొలుచును విరాల్మిండు
 శివభక్తుల సేవయే శివార్చన అనుచు ఆనందించుచు నుండు

 కూరిమి సేవింప శివుని తిరువారూరుకి తీర్థయాత్ర వెడలె
 నేరుగ చను సుందరారు తీరుకు కోపించి పలికె

 శివభక్తుల  చేరనీక  సుందరు చేసినది శివాపరాధమనె
 దానిని మన్నించిన ఆ శివుడు కూడ దోషి అని నిందించె

 తిరువూరారుకు రానని తీర్మానించుకొనియె,త్యాగరాజును  తరుముచు
 తిరిగి ప్రవేశించెనాయె, మహేశుని పొందుటకు మాట తప్పుట కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక .


    నేను-నాది అను భావాలను అధిగమించిన (వాడు ) విరాల్ మిండ నాయనారు భగవంతుని సేవకన్న భక్తుల సేవకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాడు.శివభక్తులకు గౌరవములేనిచోట క్షణకాలమైనను ఉండుటకు ఇష్టపడడు ఏ విధముగా శ్రీరామునికన్నా రామనామమహిమ గొప్పతనము శ్రీ రామాంజనేయ యుద్ధము ద్వారా ప్రకటింపబడినది కదా! ,విరాల్మిండ భక్తిలో సాత్వికతను దాచివేసి రౌద్రము తన ముద్రతో రుద్రుని మెప్పించింది.శివ భక్తులను సాక్షాత్ శివ స్వరూపముగా భావించి,వారిని గౌరవించుటలో చిన్న నిర్లక్ష్యమును కూడ సహించలేని విలక్షణుడు విరాల్మిండ నాయనారు.శివుని వ్యహారములు పాప పరిహారములో-పావన తారకములో తెలియాలంతే చర్మచక్షువులతో కథలుగా కాక,మనసులోతునుంచి వాని తత్త్వమును అర్థముచేసుకొనుటకు మనము ప్రయత్నించాలి కదా!సుందరారు తేవారములను సుమధురములుగా మనకు అందించాలనుకొన్నాడు ఆ సుందరేశ్వరుడు.నేరుగా అడిగేకన్నా,నేర్పుగా అందించాలని పరీక్షగా.. ఒకనాడు సుందరారు, శివభక్తులను నిర్లక్ష్యము చేసి( తిరివారూరులోని) సరాసరి శివ దర్శనమును చేసుకొనునట్లు చేసి,అదిచూసి ఇసుమంతయు తాళలేని విరాల్మిండ అతనిని దూషించి, శివ భక్తుల పట్ల చేసిన అపరాధము (వారిని గౌరవించక-ప్రథమ దర్శనము చేయనీయక,శంకరుని చదరంగపు [పావుయైన సుందరారు)భక్తునితోపాటు భగవంతుని కూడా వెలివేస్తున్నానన్నాడు. "ఆట కదరా శివా! ఆట కద నీకిది అమ్మ తోడు".పావులు కదిలాయి.పావన తేవారములు ప్రకటింపబడినాయి. తప్పు తెలిసికొనిన సుందరారు తాను శివభక్తుల సేవకుడనని "తేవారముల"తో కీర్తించి విరాల్ నాయనారును శాంతపరిచాడు.శివ సంకల్పముచే తన ప్రతినను మరచి,తప్పుచేసిన వారిని తరుముతు తిరిగి ప్రవేశించిన విరాల్మిండ నాయనారును రక్షించినట్లు ఆ పరమేశ్వరుడు మనలను రక్షించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)


 





TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...