శివార్పణం
*************
ఈశ నిన్ను గాననైతిని ఈశు మనమున నిండగా
పాశములు తొలగించు నా మది కాశివాసము చేయగా
పాశములు తొలగించు నా మది కాశివాసము చేయగా
నే చీమనైనా కాకపోతిని శివుని ఆనతి చాటగా
పామునైనా కాకపోతిని సామి గళమును చేరగా
సాలెనైనా కాకపోతిని శూలిగూటిని నేయగా
కరిని యైనా కాకపోతిని కనికరమును పొందగా
లేడినైనా కాకపోతిని వేడుకగా దరిచేరగా
పులితోలునైనా కాకపోతిని నూలుపోగుకు మారుగా
పందినైనా కాకపోతిని బొందెనే అందీయగా
ఎద్దునైనా కాకపోతిని పెద్ద దేవుని మోయగా
బూదినైనా కాకపోతిని ఆదిదీవును తాకగా
జటనుయైనా కాకపోతిని జటిలమును తొలగించగా
జటనుయైనా కాకపోతిని జటిలమును తొలగించగా
విషమునైనా కాకపోతిని విషయమును గ్రహియించగా
పుర్రెనైనా కాకపోతిని వెర్రితనమును బాపగా
వాని యోగమో యేమో ఉపయోగములుగా మారగా
నన్నూ తరియింపనీ నీ అనవరతపు కరుణగా.