Sunday, October 15, 2017

SAUMDARYA LAHARI-08


   సౌందర్య లహరి-08

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  గర్భస్థ శిశువుగ దుర్భరవేదన పడుతు
  బాల్యావస్థలో పడరానిపాట్లు ఎన్నో పడుతు

  సంసార సాగరాన్ని శక్తిలేక ఈదుతూ
 అరిషడ్వర్గపు ఆటలలో అనుక్షణము ఓడుతూ

  నిండైన జీవితము ఎందమావి అని చాటుతూ
  అమ్మ పాదాలే దిక్కని అనుక్షణము చాటుతూ


  పటిష్ఠతను కోల్పోయి పండు ముసలి చేయుచున్న
  పంచాక్షరి నామాలే పంచామృత స్నానమగుచున్న వేళ

   నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
   మానస విహారి ఓ సౌందర్య లహరి.

 



SAUMDARYA LAHARI-09


   సౌందర్య లహరి-09

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  గౌరీపతి కదకు గంగ పరుగులెత్తుతోంది
  శ్రీరాముని కాళ్ళు కడుగ గోదావరి కదిలింది

  రాధామాధవ లీల యమున గంతులేస్తోంది
  దుర్గమ్మను అభిషేకింపగ కృష్ణమ్మ సాగుతోంది

  పుణ్యతీర్థ సంపద త్రివేణి సంగమమైనది
  నదులు-ఉపనదులు పరమపదమునంద గోరి

  సాగర సంగమమునకై వేగముగా సాగుచున్న
  సురుచిర జలధారలు నీకు శుద్ధోదక స్నానమైన వేళ



 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 



saumdarya lahari-10


   సౌందర్య లహరి-10

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  సకలవీర తిలకమే సకుంకుమ విలేపనముగ
  సకల కళల లోగిళ్ళు నీ ఎర్రని చెక్కిళ్ళుగా

  చిరునవ్వుల చూపులే సిరుల కంఠమాలలుగ
  కరుణాంతరంగమే అరుణోదయ భంగిమగ

  సకలము ఆవరించియున్న సత్ప్రకాశ మేఖలగ
  అందరిని ఆదరించ్చు అమ్మ చీర కొంగుగా

  లేత ఎరుపు ప్రకాశించె నీ ఎర్రని పాదాలుగా
  సకల శాస్త్రాలు నీ ఎర్రని వస్త్రములగుచున్న

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 



SAUMDARYA LAHARI-11


   సౌందర్య లహరి-11

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  లోభమునకు లోబడి రోగియైన నా మనసు
  పనికిరాని పనులతో సతమతమౌతుంటుంది

  కన్నుమిన్ను కానరాక కల్లుతాగిన కోతిలా
  దండిగ పనులను బహుదండిగ చేస్తుంటుంది


  చిమటలా కొరుకుతూ చీదరపుట్టిస్తుంటుంది
  మితిమీరిన తెలివితో తలక్రిందులు వేలాడుతు

  చీకటిలో ఉబ్బితబ్బిబ్బౌ గబ్బిలము అవుతుంది
  గబ్బిలమౌ మది పూజలో గుగ్గిలమగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 



SAUMDARYA LAHARI-12


   సౌందర్య లహరి-12

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 శృంగనాద పరవశయై చిక్కిపోవు లేడివలె
 దీపకాంతి మోహితయై నేలరాలు శలభము వలె

 చర్మేంద్రియ లౌల్యముచే చతికిలబడు కరివలె
 జిహ్వచాపల్యముచే పద్మమున చిక్కు తుమ్మెద వలె

 ఎర వాసన తనకొరకు కాదను ఎరుకలేని చేప వలె
 ఇంద్రియ లౌలత్యముతో మందబుద్ధి చెలిమి వలె

 స్వప్నావస్థను వదిలి సత్యాన్వేషణ చేయలేని,నా
 శాపములు అమ్మ పూజలో -దీపములగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 



SAUMDARYA LAHARI-13


   సౌందర్య లహరి-13

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  పసిశిశువుకు ఆకలై పాలుకోరు ఇచ్ఛాశక్తి
  ముసురుకొన్న పాపాలను తొలగించే ఇచ్చాశక్తి

 పాలకొరకు అమ్మ స్తన్యము జుర్రుకొనే జ్ఞానశక్తి
 ఆర్తితీర అమ్మస్తవము జుర్రుకొనే జ్ఞానశక్తి

 పాలుతాగి కడుపునింపుకొనే క్రియాశక్తి
 మురిపాలుతీర అమ్మఒడి పరవశమగు క్రియాశక్తి

 మూడుపనులు చేయించే మూలచిఛ్చక్తివి
 నా బంధములు అలదుచున్న గంధములగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 



SAUMDARYA LAHARI-14


   సౌందర్య లహరి-14

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపం

  పసి శిశువుకు ఆకలియై పాలుకోరు ఇచ్చాశక్తి
  ముసురుకొన్న పాపాలను తొలగించే ఇచ్చాశక్తి

 పాలకొరకు అమ్మ స్తన్యమును జుర్రుకొనే జ్ఞానశక్తి
 ఆర్తితీర అమ్మ స్తవము జుర్రుకొనే జ్ఞానశక్తి

 పాలుతాగి కడుపు నింపుకునే క్రియాశక్తి
 మురిపాలు తీర అమ్మఒడి పరవశమగు క్రియాశక్తి

 మూడుపనులు చేయించే మూలచిచ్చక్తివి
 నా బంధనములు అలదుచున్న గంధములగుచున్నవేళ


 అభ్యమునీయమని నేవ్రాసిన అభ్యర్థన పత్రపు
 దస్తూరి సకలము తల్లి కస్తూరిగ మారువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.



SAUMDARYA LAHARI-15


   సౌందర్య లహరి-15

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపం

 విస్తృత ప్రస్తుతులతో ఆ కస్తురిమృగమే
 పంకజాక్షి ప్రియమైనది కుంకుమ సంగమమై

 ముత్తైదువ తనముతో కొత్తకాంతులీనుతు
 కనుబొమలనుకొను మంగళ తోరణముల పైన

 కదిలే ముంగురుల నడుమ సింగారపు తోడుగ
 విశాల ఫాలభగమున వెలుగులు విరజిమ్మగా

 అభ్యమునీయమని నేవ్రాసిన అభ్యర్థన పత్రపు
 దస్తూరి సకలము తల్లి కస్తూరిగ మారువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.



SAUMDARYA LAHARI-16


   సౌందర్య లహరి-16

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపం

  గురుభక్తిని చాటలేని గుణహీనపు చంద్రుడు
  గణపతిని గేలిచేసి శాపమొందిన చంద్రుడు

  చవితిని అపనిందల పేర్మోసిన చంద్రుడు
  చంచలమగు మనసుతో పోల్చబడు చంద్రుడు

  పున్నమియైన గ్రహణమున కానరాని చంద్రుడు
  వంకరలు అన్నితొలగి స్థిరమగు అష్టమి కళతో

  అమ్మ సిగను అతిశయముగ ఆరాధ్యతను పొందుతు
  పరిపరి విధములుగా పూజలను   అందుకొనుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.



SAUMDARYA LAHARI-17


   సౌందర్య లహరి-17

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  అమ్మవింటి బాణములు అందమైన పువ్వులు
  అమ్మ ధమ్మిల్లమున సంపెంగలు-మల్లెలు

  ఎదపైన మాలలో ఎర్రని మందారములు
  తుమ్మెద ఝుంకారమైన శబ్దముతో పువ్వులు

  మృదుస్పర్శతో పులకించు ముచ్చటైన పువ్వులు
  అపురూప పరిమళపు అమ్మ చిరునవ్వులు

  శబ్ద-రూప-స్పర్శ-గంధ-రస గుణములు  కలిగిన
  పువ్వులుగా   మది సవ్వడులు పూజించుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.



SAUMDARYA LAHARI-18


   సౌందర్య లహరి-18

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  నీ నయనసంకేతములే పదునాలుగు భువనములు
  నీ కరుణ ప్రవాహమే కొనసాగు వాహినులు

  నీ కొనగోటి కల్పనలే ఎనలేని వనరులు
  నీ పుట్టింటి చుట్టరికమే రక్షించే గుట్టలు

  సేదతీర్చు నీ ఒడియే సేద్యపు   ఒరవడులు
  నీ ఆగ్రహానుగ్రహములు హెచ్చరిక మచ్చు  తునకలు


  పట్టివిడుచు గ్రహణములుగ గ్రహియించిన గ్రహముల వలె
  నా అపరిణిత సూక్తులు అథాంగపూజ యగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.



SAUMDARYA LAHARI-19



   సౌందర్య లహరి-19

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  నల్లనైన చీకట్లో నేను అల్లరులే చేస్తున్నా
  అల్లకల్లోలమైన మనసు నన్ను సన్నగా గిల్లుతోంది

  ఎర్రనైన కోపములో నేను వెర్రిపనులు చేస్తున్నా
  చిర్రు-బుర్రులాడు మనసు నన్ను గుర్రుగా చూస్తోంది

  తెల్లనైన తెలివితో నేను తెలిసికొనగ తప్పులన్నీ
  తెల్లబరచె నాలోని  తెలివి తక్కువతనాన్ని

  సత్వ-రజో-తమో   గుణములు సద్దుమణుగుచుండగా
  నా ఆత్మ నివేదనమే మహా నైవేద్యమగుచున్న


 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.





SAUMDARYA LAHARI-20


   సౌందర్య లహరి-20

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  కంటనీరు జారనీయని సహజకవిని చేసినది
  గొర్రెమేధ వానిని గొప్పకవిని చేసినది

  కఠినబోయవానిని  ఆదికవిని చేసినది
  వివరము లేని వానిని    వికట కవిని చేసినది

  ఆనంద మయునిగా అన్నమయను చేసినది
  మూక పంచశతి గ్రంథము నీ కృపచే వెలిసినది

 ఉన్న పాటుగా వారిని ఉన్నతులుగ చేసినది
 వారి వాంగ్మూలములు  తాంబూలము   అగుచున్న వేళ


 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.



SAUMDARYA LAHARI-21


   సౌందర్య లహరి-22

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  సూర్య-చంద్రులు సూక్ష్మముగా చేరిరి నీ నయనములు
  కార్య నిర్వహణము జరుగునులే ఆనందముగా

  సూర్య-చంద్రులు పోషణగా  చేరిరి నీ స్తనములు
  అలరారుచున్నారు  అన్నపూర్ణ రూపముగా

  సూర్య-చంద్రులు నాదముగా చేరిరి నీ తాటంకములు
  నిరాటంకమైనారు ఆనందస్తవములుగా

 వ్యక్తావ్యక్త స్వరూపములైన వారి సమర్పణలు
 సర్వము కర్పూర హారతి  గ  ప్రకాశించు చున్న వేళ


 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.



SAUMDARYA LAHARI-22


   సౌందర్య లహరి-22

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  నీ విలాసపు కన్ను కైలాసపు దారిని చూపించింది
  సరస సల్లాపముగా భుజము తట్టి నడిపింది

  త్రికరణ శుద్ధిగా నీకు పూజను చేయించింది
  వేదన పడుచుండగా వీడలేని విధముగా

  భక్తి అనే పద్మమును నీ పాదపద్మములు చేర్చమంది
  నా ధ్యాసను మార్చేసి ధ్యానము చేయమంది

  ధ్యానము-ధ్యాస అను కుడి-ఎడమ అడుగులతో
  నా పాదములు భక్తితో ప్రదక్షిణము  చేయువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.



SAUMDARYA LAHARI-23


   సౌందర్య లహరి-23

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 దుర్గ-లక్ష్మి-సరస్వతి-గాయత్రి-రాధ ప్రకృతి రూపములు
 అనసూయ-అరుంధతి-శచీదేవి-లోపాముద్ర కళాంశ రూపములు

 పెద్దమ్మ-పోలేరమ్మ-ఎల్లమ్మ-మైసమ్మ-అమ్మ అంశ రూపములు
 ప్రతి స్త్రీమూర్తి పవిత్ర అంశాంశ రూపములు

 ఆరాధన ఆనందపు ఆలవాలమైనది,నా ఈ
 పూజను పునీతము గావించు నీ అనుగ్రహము

 ప్రతి స్త్రీమూర్తి పరమేశ్వరి ప్రతిరూపములే కద
 నా మాంస శరీరమును మంత్రపుష్పముగా మారుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.



SAUMDARYA LAHARI-24


   సౌందర్య లహరి-24

 పరమ పావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ధర్మపు మర్మము తెలిసి నిర్మలమైన నా మనసు
 తనివితీర కొలువగ తరలుచున్న నా తనువు

 వశిన్యాది దేవతానుగ్రహమైన నా వాక్కులు
 ఊహాతీతశక్తి ఉనికిని తెలిపిన పనులు

 పరస్పరానురాగ ఫలితమైన నా తపనలు
 సమానాధిక్యములేని సన్నిధానభావము

 ఓడిపోనివ్వని ఒడిలాలన ఒరవడిలో
 నా త్రికరణములు అమ్మపాద శరణాగతి కోరువేళ

 నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-25


   సౌందర్య లహరి-25

 పరమ పావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపం

 నీ గౌరీ-కాళి తత్త్వములే ఇలను దివారాత్రములని
 నీ కరుణ ప్రవాహమె ఇల సాగు వాహినులని

 నీ కొనగోటి వ్కల్నలే ఎనలేని వనరులని
 నీ పుట్టింటి చుట్టరికమె రక్షించే గుట్టలని

 సేదతీర్చు నీ ఒడియే నా సేద్యపు ఒరవడి అని
 ఆగ్రహానుగ్రహములు హెచ్చరిక మచ్చుతునకలని

 పట్టివిడుచు గ్రహణములని గ్రహియించిన రవి-శశి వలె
 నా   అణువణువు  నీ చరణముల ఆత్మార్పణ యగువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.


.

SAUMDARYA LAHARI-26


   సౌందర్య లహరి-26

 పరమ పావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 మధుకైటభులను సంహరించితివి  మాధవ సోదరి
 భండాసురుని వధించి భువనభాందమును రక్షించితివి

 రక్తబీజుని అంతమొందించిన శక్తిస్వరూపిణివి
 విషంగ-విశుక్రుల విషమును అరికట్టితివి

 మహిషాసురుని మర్దించిన మహిమాన్వితవి
 అవనీ పాలనకై ఎన్నో అవతారములనెత్తితివి

 అహరహము ఆదించు అరిషడ్వర్గములనణచు
 అసుర సంహారమే నీకు అమితానందమైన వేళ

 నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-27

    సౌందర్య లహరి-27

 పరమపావనమైన నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 నా జీవితమను పుస్తకమును ఒకచేత ధరించి
 ముకుళిత హస్తవందనములు ప్రీతితో గైకొనుచు

 విభవ అభయముద్రను మరొకచేత ధరించి
 భవతిమిరములను పరిహారము చేయదలచి

 విచలిత విస్పోతకములను దూరముచేయ దలచి
 విరాజితమైనావు తల్లి స్పటికమాల ధరించి

 కలవరమును తొలగించే వరదముద్ర కరముదాల్చి
 కనుల జాలువారు కరుణ అమృతధార యైన వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-28


  సౌందర్య లహరి-28

  పరమపావనమైన నీపాద రజకణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  నిలబడ గలిగానని నిలువెత్తు పొంగితిని కాని
  నీ శక్తితో నిలబడ్డానని తలచనే లేదు

  అడుగుమడుగులొత్తాలని అనుకున్నానేగాని
  నీ శక్తి నన్ను తడబడనీయలేదని తలచనే లేదు

  పలుకు కులుకు చాటిచెప్ప పలుకరించానే గాని
  నీ శక్తి చిలుక నా పలుకని తలచనే లేదు

  అన్నీ నేనే చేసానని అహంకారమొకటి చేరె
  నా మూర్ఖత్వమే చర్చకు తర్కముగా మారువేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి.

 

SAUMDARYA LAHARI-29


  సౌందర్య లహరి-29

  పరమపావనమైన నీపాద రజకణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  ముల్లోకములు నిన్ను ముదముద స్తుతియింప
  శుకములు పరుగులిడు స్తుతులను నినుచేర్చ

  ప్రియముగ విని తాము పులకించిపోవ
  తమను మురిపించునని తాటంకములు ఆడె

  ఆ కర్ణాంత నయనములు ఆ దారినే సాగ
  అటుఇటు పోలేని అసహాయపు నయనము

  అందపు కెందామరాయె చేరి నీ అనునయము
  నీ పాద ధూళి రేణువు నా ఆధారమైన వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాదకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి.

 

SAUMDARYA LAHARI-30

    సౌందర్య లహరి-31

  పరమ పావనమైన నీ పాదరక కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  చపలత్వముతో ఎగురుచున్న చేప వంటి నన్ను చూస్తూ
  కపతత్వముతో మింగనున్న కొంగ నుండి రక్షిస్తూ

  తప్పుడు పనులతో మునుగుతున్న ఉప్పెనలో నన్నుచూస్తూ
  చెప్పరాని దయతో తేలుతున్న తెప్పవేసి రక్షిస్తూ

  అడుగు పాతాళములోనికి దిగు సుడిగుండములో నన్ను చూస్తూ
  పడనీయక పైకిలాగి అందదండగా రక్షిస్తూ

  వీక్షణమాత్రమైన పాదధూళి విస్తారపు కరుణగా
  తల్లి సంసార సాగరమును దాటించగ నౌకగ మారిన

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి .

SAUMDARYA LAHARI-31

    సౌందర్య లహరి-31

  పరమ పావనమైన నీ పాదరక కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  మన పారాయణ కొరకు సహస్రనామ స్తోత్రములు
  కరమున ఆమలకములుగ అలరారుచున్నవి

  మన జపతపములకు అనేక దివ్య మంత్రములు
  జయజయధ్వానములై విరాజిల్లుచున్నవి

  జ్ఞాన తృష్ణ తీర్చుతకు అనేక దివ్య చరిత్రలు
  కైవల్య పాత్రతను కరుణను అందించుచున్నవి

  మధురాతిమధురముగా వినబడుచున్న కథలు
  మార్గ దర్శకముగా నా శ్రవణభక్తి అగుచున్న వేళ



  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి .

SAUMFARYA LAHARI-32

    సౌందర్య లహరి-32

  పరమ పావనమైన నీ పాదరక కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  నీ చేలము కోరగ నే కుచేలుడిని కాదు
  వరము ఏమి అడుగలేని అభిమానము తోడుగా

  నీ చేలమును కోరగ నే కుబేరుడిని కాదు
  శివుని ముందు విప్పలేని చేతులతో నిలబడగా

  నీ చేలము కోరగ నే రతీదేవిని కాను
  నగజ కరుణ అనంగుని సతిగా కొనసాగగా

  చెలియలి కట్టే తెలియని చెలువపు నీ స్నేహము
  నా ఉపాఖ్యానములో సఖ్యముగా మారువేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి .

SAUMDARYA LAHARI-33

   సౌందర్య లహరి-33

   పరమపావనమైన నీపాదరజ కణము
   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

   పనులను చేయించుటకు పగటి పూట సూర్యునిగా
   అలసట తొలగించుతకు అమృతమూర్తి చంద్రునిగా

   ఆహారము అందించే ఆదిత్యునిరూపుగా
   ఆ జోలను తేలించే ఆ చంద్రుని చూపుగా

   కలతలు కనపడనీయని కాళికారూపుగా
   మమతల కరువు రానీయని మాతల్లి గౌరిగా

   అనవరతము ఏమరక అవనిలో అలరారుచున్న
   సూర్య-చంద్ర ప్రవర్తనలు సంకీర్తనలగు వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి.  

SAUMDARYA LAHARI-34

   సౌందర్య లహరి-34

   పరమపావనమైన నీపాదరజ కణము
   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

   ఉద్ధరిస్తుందంత ఉలిదెబ్బలు తిన్న అమ్మ
   పుడమిని పాలిస్తుందంట-పూజలముకుంటున్నదమ్మ

   అడుగుతడబడనీయదట ఆరడుగు లేనిబొమ్మ
   కరుణను కురిపిస్తుందట కనురెప్పలు వేయదమ్మ

   చేయందిస్తుందంట  చలనమె లేని బొమ్మ
   రాతను మారుస్తుందట రమ్మని ఈ రాతి బొమ్మ

   అమ్మలను గన్న అమ్మ ,ఆ మల గన్న అమ్మ
   నా అపహాస్యములన్నీ దాస్యములగుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-35

   సౌందర్య లహరి-35

   పరమపావనమైన నీపాదరజ కణము
   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  కనిపించు భూమి నీ పంపును పాటించదని
  ఉప్పొంగు కడలి నీ చెప్పుచేత లేదని

  రగులుచున్న దావాగ్ని నీ మాట దాటివేయునని
  కదులుచున్న గగనము నీమాట వినుట గగనమని

  వీచుచున్న పవనము నీ మాటను జవదాటునని
  పొంచియుండి జగములను ప్రళయములో ముంచునని

  పంచభూత తత్త్వము మంచిని పంచలేదను
  కోపావేశము నీ సన్నిధికి సోపానములైన వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYALAHARI-36


  సౌందర్య లహరి-36

  పరమపావనమైన నీపాద రజకణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  నిన్ను కసురుకున్నా గాని ముసిముసి నవ్వే అనుకో
  నేను చేయి పట్టుకోనన్నా నన్ను గట్టిగా పట్టుకో

  మారాములు చేస్తే నే గారాల పట్టిననుకో
  వట్టిమాటలే అయినా కట్టుకథలు కావనుకో

  గాజుకళ్ళతో నిన్ను చూసినా రాజి పడిపో
  తెలిసో తెలియకో నిన్ను వేడుకొనుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-37


  సౌందర్య లహరి-37

  పరమపావనమైన నీపాద రజకణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  కన్నుమిన్ను కానకుండుట నా స్వభావము
  కన్నతల్లిగా కాచుచుండుట నీ ప్రభావము

  నోరు వాయి మీరుచుండుట నా స్వభావము
  చేరదీసి బ్రోచుచుండుత నీ ప్రభావము

  పాప పుణ్యములు లెక్క బెట్టని
నా స్వభావము
  పాలమనుకొని చక్కదిద్దుట నీ ప్రభావము

  ఘోరనేరములే చేయుట నా స్వభావము
  చేరి తీరమునే చేర్చుట నీ ప్రభావమైన వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి. 

SAUMDARYA LAHARI-38


  సౌందర్య లహరి-38

  పరమపావనమైన నీపాద రజకణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  గతి తప్పిన మతిచేసే మితిమీరిన చేష్టలతో
  సూటిపోటి మాతలనే తూటాలతో పొడుస్తూ

  మర్మము తెలియక కర్మలను ఖర్మలుగ భావిస్తూ
  బావిలోని కప్పవలె నిన్ను భావించగ లేనైతిని

  కన్నుమిన్ను కానరాక నిన్నెంచగ లేనైతిని
  పద్ధతి అన్నది విడిచి హద్దుపద్దు లేక నేను

  వద్దన్నవి ఎన్నోచేస్తు పెద్దమూట కట్టుకున్న
  సంచితములు నీ దయతో సత్చింతనములగుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-39


 సౌందర్య లహరి-39

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ఆలనపాలనలేక  ఉన్నావన్న అపోహతో
 సూర్యునికి దివిటీలా నీముందొక   దీపముతో

 చంద్రునికి నూలుపోగులా నీకొక చిన్ని వస్త్రముతో
 జలధారకు దప్పితీర్చగా చిన్ని అర్ఘ్యపాత్రతో

 సామగాన రూపానికి రానికూనిరాగముతో
 స్థితికారిణి పూజలో చిన్ని నైవేద్యముతో

 అమ్మగా నీతోనేను  బొమ్మలాటలాడునపుడు
 నా బుద్బుద శరీరము పరమాద్భుతమగుచుండగ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి  ఓ సౌందర్య లహరి.     

SAUMDARYA LAHARI-40


 సౌందర్య లహరి-40

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  పలకాలను సంకల్పము పరాశబ్దరూపముగా
  భావ ప్రకాశమే  పశ్యంతీపరిణామముగా

  లోలోపలి పరిణామము మధ్యమగా మారుతూ
  ప్రకటింపబడుటయే వైఖరి అను నీవుగ

  ఆదిక్షకారాంత విద్య అక్షరరూపిణిగా
  నామపారాయణతో గొల్చిన నందివిద్య నీవని

  అమృతాదిమహా శక్తుల ఆరుచక్రాలలో నెలకొన్న
  అతీంద్రియ దృష్టి నాలో అతిశయించుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి  ఓ సౌందర్య లహరి.   

SAUMDARYA LAHARI-41


 సౌందర్య లహరి-41

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 గులకరాయిగా నన్ను గుర్తించినదే తడవుగా
 పాద ధ్యానమునకు నన్ను తరిలించినదేమొ

 భావనామాత్రతతో భావోద్వేగములను తొలగించగ
 అనుక్షణ రక్షణలో శుభలక్షణములను అలదినదేమో

 పరిశుద్ధమైన మనసుకు పరిపక్వతనందించగ
 అతిశయ అనురాగముతో అజ్ఞానమును తొలగించినదేమో

 జాడ్యములను తొలగించి జ్ఞానమును కలిగించగా 
 సానపెట్టి రాతిమనసు సాలగ్రామమగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య లహరి. 

SAUMDARYA LAHARI-42


 సౌందర్య లహరి-42

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 అమృతాది మహాశక్తులతో విశుద్ధి చక్రముగా
 కాళరాత్రాది రేకులతో అనాహత చక్రముగా

 డామర్యాది విరాజిత మణిపురచక్రముగా
 బందిన్యాది సమన్విత స్వాధిస్ఠాన చక్రముగా

 వరద,శ్రీ షండ,సరస్వతీ మూలాధార చక్రముగా
 హంసవతీ,క్షమావతీ, ఆజ్ఞాచక్రముగా

 సర్వ వర్ణోపశోభితము  సహస్రారము కాగా
 నీ త్రివిక్రమ పరాక్రమము శ్రీచక్రముగా మారువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-43


 సౌందర్య లహరి-43

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 సంసార సాగరపు సారము గ్రహియింపనెంచి
 అంధకార బంధురమౌ అజ్ఞాన మంథరమును ఉంచి

 ఆశాపాశములను  వాసుకి అని భ్రమించి
 దైవాసుర గణములను చెరివైపున ఉంచి

 నిలకడలేని మనసుతో చిలుకుట ప్రారంభించి
 విషజ్వాలల విజృంభణకు నే వివర్ణమగుటను గాంచి

 జాలితో హాలాహలమును హరింపగా హరుడు,మించిన
 అంతర్మథనములో  అమృతము జనించుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-44


  సౌందర్య లహరి-44

  పరమపావనమైన నీ పాదరజకణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 చీకాకు చీకట్లను చింతలు తొలగించగా
 దీపము మౌనముగా తేజము వ్యాపింపచేయునట్లు

 నిర్జీవరాశులలో స్థితికార్యము భాసించునట్లుగా
 జీవునిలో మౌనముగా వాయువు శ్వాసించునట్లు

 ఉద్యుక్తతనొందుచు తమ విద్యుక్తధర్మముగా
 రవి చంద్రులు మౌనముగా ఉదయాస్తమానమగునట్లు

 పోరాటరూపములో నా ఆరాటములు తరిమివేయగా
 వివిధరూపములలో నీ విరాట్రూపము తోచుచున్నవేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...