Friday, September 18, 2020

PRAPASYANTEE MAATAA-04

ప్రపశ్యంతీ మాతా-04 ****************** యాదేవి సర్వభూతేషు భువనేశి రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః వేదములచే అదితి ( అఖండము) గా కీర్తింపబడుచున్న భువనేశ్వరి మాత,ఇచ్ఛా-క్రియా శక్తుల సంగమమై,తన బిడ్డల కోసం ఆకాశాన్ని సృష్టిస్తుంది.అవసరమైతే తానే ఆకాశముగా మారుతుంది.అందులో ఎన్నో మనకు ఉపయోగపడే వాటిని నియమిస్తుంది.మన ఆరోగ్యము కోసము కాలమును వికసింపచేసి దిక్కులను స్పష్టపరుస్తుంది.సూర్య మండల మధ్యస్థయై సూర్య కిరణములను తన కరములతో సస్యములుగా-శాకములుగా-పండ్లగా-కలి (ఆహారము) రూపమును దాల్చి,సారవంతమై,మన ఆకలిని పోగొడుతుంది.మాతృవాత్సల్య పూరిత ఇచ్ఛాశక్తి కనుక అమ్మ "ఈక్ష" అని కీర్తింపబడుతు,తన సూచనలతో,స్థూలజగతిని సుభిక్షము చేస్తుంది. తల్లి సూక్ష్మ స్థితి-గతులను పరిశీలిస్తే,బయటి ఆకాశము వలె,మన లోపల నున్న దహరాకాశము (హృదయము) తల్లి నివాసస్థానము.నిజమునకు మన అన్నకోశము-ప్రాణ కోశము-మనోమయ కోశము-విజ్ఞాన కోశము-ఆనంద కోశము జడములై ప్రేతస్థితిలో పడియున్నవేళ,భువనేశి,నిద్రాణమై యున్న కుండలినిని జాగృత పరచి వాటిని శక్తివంతము చేస్తుంది.అన్న కోశము ఆకలిని గుర్తించి ఆహారమును వెతుకుతుంది.దొరికిన తరువాత అన్నమును పరబ్రహ్మ స్వరూపమని భావిస్తుంది.అన్నకోశము తన శక్తిని ప్రాణ కోశమునకు,మనోకోశమునకు,విజ్ఞాన కోశమునకు తల్లి దయతో అందించి,ఆనందమయ కోశమును చేరి ఆనందో బ్రహ్మముగా అమ్మ ఉనికిని గుర్తించకలుగుతుంది తప్పులున్న దయచేసి సవరించగలరు..అమ్మా నాలోని ఆకలి నీవు దానిని తీర్చే ఆహారము నీవు అన్న విషయమును అర్థము చేసుకొనిన నన్ను ఆర్తితో అర్చన చేయనీ, ధన్యోస్మి మాతా ధన్యోస్మి.

prapaSyantee maataa-03

ప్రపశ్యంతీ మాతా-03 ****************** యా దేవి సర్వభూతేషు షోదశి రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః. కాళి-తార మాతలు వామాచార పధ్ధతులలో పూజింపబడుతుంటే దానికి విరుధ్ధముగా వినూత్నముగా దక్షిణాచారా పధ్ధతిలో పూజింపబడు తల్లి షోడశి.తన నామములోని పదహారు మంత్రాక్షరములను చంద్రుని షోడశ కళలుగా ప్రకటింపచేసిన నిత్య కళయే షోడశిమాత. తన ముందరి శక్తులైన కాళి-తార బ్రహ్మవిద్యారూపాలుగా కనుక మనము పరిగణించగలిగితే,బ్రహ్మవిద్యతో పాటుగా సుందరీయోగమును జోడించి,తాను మాత్రమే కాకుండా,సకల జగములను సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దినది.పూవులు-పళ్ళు-పక్షులు-నెమళ్ళు-వివిధ వృక్షములు-సువాసనలు-శుభసంకేతములు.అద్భుతము అద్వితీయము తల్లి కల్పనాచాతుర్యము. వీటన్నిటితో ఆడుతు-పాడుతు తల్లి లలితయై ,సుందరియై(,కాళి తత్త్వమును సత్యము అనుకుంటే-తారా తత్త్వమును శివముగా భావిస్తే)-షోడశి సుందరమై కను విందు చేస్తున్నది. సుందరము అంటే బాహ్యము తాత్కాలికము కాదు అనే విషయమును తెలియచేయుటకై తల్లి సత్యమును-శుభమును కలుపున్న సుందరత్వముగా భాసించుచున్నది. కాళి-తార మాతలు తటస్థమును అధిరోహిస్తే,షోడశి మాత పంచకృత్య సింహాసనమును అధిష్టించినది.సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహములను ఐదు పనులు తాను చేయుచున్నానని చెప్పకనే చెప్పినది తల్లి.కాళి జగములను సృష్టిస్తే-తార జగములకు వెలుగును శబ్దమును ఇస్తే-షోడశి ఇంకొక ముఖ్యమైన జ్ఞానశక్తికి ప్రతీకగా పాలిస్తున్నది.తల్లి త్రిపుర సుందరి.అనగా త్రిగుణములు దరిచేరలేని సుగుణరాశి .త్రిగుణాతీత జ్ఞాన శక్తియై స్థూలములోని ఉపాధుల ఇంద్రియ వ్యామోహములను జయించుటకు పాశమను ఆశను,దానిని తీసివేసే శక్తిగాఅంకుశమును,విల్లమ్ములను ధరించిన తల్లి రూపము సూచిస్తున్నది. తల్లీ సూక్ష్మ రూపమున సర్వరోగహర చక్ర నివాసివై,(లలాట వాసియై )నా ఇంద్రియములకు సహకరించుచు- వానినిసవరించుచు కన్నులు-కంఠము-శిరము లో జనించు తమోభావములను తరిమివేయుచు,జ్ఞానశక్తి స్వరూపివై యుక్తాయుక్త విచక్షణను వివరించుచున్న నిన్ను వీడని భక్తితో వినుతిచేయనీయవమ్మా. ధన్యోస్మి మాతా ధన్యోస్మి.

PRAPAsYANTEE MAATAA-02

ప్రపశ్యంతీ మాతా-02 ******************* యా దేవి సర్వభూతేషు తారా రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నంస్తస్త్యై నమోనమః. శక్తి చిఛ్చక్తిగా ప్రకటింపబడుతోంది తారాదేవిగా.తృ అనే ధాతువునుండి ఏర్పడిన నక్షత్రము అనే భావమిచ్చునది తల్లి నామము.అంతే కాదు తరింపచేయునది. కాళి అను మూలము నుండి వేరొక రూపకల్పనకు సహాయపడు నాభీస్థాన నివాసిని తల్లి.బొడ్డుతాడు ఏవిధముగా తల్లికి పెరుగుచున్న శిశువుకు వారథిగా ఉండి సహాయపడుతుందో అదేవిధముగా కాళి తత్త్వమునుండి తనకు కావలిసినవి స్వీకరించి కొత్తరూపును సంతరించుకున్నది తారాదేవి. కాళిని నల్లని చీకటిగా కనుక మనము భావిస్తే దానిని చీల్చుకొని తేజమును-శబ్దమును వెంట తీసుకుని వచ్చిన శక్తి తార.మూలమైన శక్తి కాళియై సృష్టిని చేసింది.ఇంకొక శక్తిని ప్రకటింపచేసి,సృష్టిలోని అజ్ఞానమును కత్తిరించమంది.అందుకు వెలుగును వాక్కును సహాయకారులుగా పంపించింది. తారాదేవి ముఖ్యముగా వాగ్రూపశక్తి .వాక్కు పర-పశ్యంతీ-మధ్యమ-వైఖరి అని నాలుగు విధములుగా విభజింపబడినది.స్థూలములో గమనిస్తే ఉరుములు-చెట్టు కొమ్మలనుండి వచ్చు శబ్దములు-అలల ఘోష-జంతువుల అరుపులు-మానవ సంభాషణలు తల్లి వాగ్రూపముగా చెప్పుకొనవచ్చును. మూలము నుండి బయలు దేరిన వాక్కు-దర్శనమై-భావమై-భాషయై బహుముఖముల విరాజిల్లుతుంటుంది. కాళిమాత మన గుండెను పనిచేయిస్తుంటే,తారామాత మన వాక్కుకు వారధియై వ్యక్తపరిచేటట్లు చేస్తుంది. తల్లీ నీవు అత్యంత దయతో నీ నివాసమైన నా నాభీక్షేత్రము నుండి నాకొరకై పైపైకి పాకుతు మూలకారణమైన పరావాక్కును పశ్యంతీ గా దర్శింపచేస్తూ,ూ,మధ్యమగా దానిని భావముగా మారుస్తూ,వైఖరి గా భాషను అలది బహుముఖములుగా వీనుల విందు చేయుచున్నావు.నిన్ను ప్రస్తుతించక మనగలనా తల్లీ. ధన్యోస్మి మాతా ధన్యోస్మి.

prapaSyanti maata-01

ప్రపశ్యంతి మాతా -01 *************** యా దేవి సర్వభూతేషు కాళి రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః. పదిశక్తుల పరమార్థము - కాళి ప్రథమశక్తి. ************************ ప్రియ మిత్రులారా! మీకు తెలియని విశేషములు కావు..ద్వంద్వమయమైనఈ జగతిలో రాత్రింబవళ్ళు-సుఖదుఃఖములు-జ్ఞాన-అజ్ఞానములు-కలిమి-లేములు-ఉఛ్చ్వాస-నిశ్వాసములు-స్త్రీ-పురుషులు ఉన్నట్లు శ్రీవిద్యోపానలో దక్షిణాచార-వామాచారములు ప్రాంతములను బట్టి,పరిసరములను బట్టి పరంపరను బట్టి ద్వివిధములుగా నున్నందున కాళి శక్తిని పూజావిధానమును తాంత్రికముగా భావించి భయపడుట తల్లిని సరిగా అర్థము చేసుకొనలేని మాయపొరయే. తల్లి మనలో సూక్ష్మముగా జగతిలో స్థూలముగా మనలను రక్షించుటకు ప్రకటింపబడుతు,పరిపాలిస్తుంది.ఇది నిర్వివాదము. అంధకారములో సమస్త ఆకారములు సమానమయి గుప్తస్థితిని పొందినపుడు ఇచ్చాశక్తి స్వరూపిణి అయిన కాళిమాత తిరిగి సృష్టిని ప్రారంభిస్తుంది.శివశక్తైక స్వరూపములో శివ స్వరూపముగా అచేతముగా నుండి సృష్టి కార్యమును ప్రారంభించలేని దశలో తటస్థమైన శివశక్తిని కుండలిని ద్వారాజాగృత పరచే శక్తియే కాళిమాత. అంతే కాదు.శివ శక్తి జాగృత మగుటచే రాత్రి స్వరూపమైన కాళి పగటి స్వరూపమైన శివుని శక్తిని కలుపుకొని సంపూర్ణ దినముగా రూపుదిద్దుకుంటుంది.సృష్టి-స్థితి కార్యములను నిర్వహిస్తోంది. ఇది స్థూల విచారణ అయితే సూక్ష్మముగా మన గుండె కరిపే రక్త ప్రసరణ కాలిసక్తియే.రక్తము సదా ప్రవహించే అనాత చక్రమునందుండి,తన నాలుకలనే నాళములతో రక్తమును తాగుతు-విడుస్తూ శ్వాసక్రియను తల్లి శాసిస్తోంది.రూపము కఠినము-స్వభావము కారుణ్యము మన సాధన రూపముతోనే ఆగిపోకూడదని,తరచి తరచి తత్త్వమును అందుకోవాలని అమ్మ తన నుండి అనేక శక్తులను వివిధ నామరూపములతో ప్రభవింపచేసి,ప్రస్తావింపచేసి-పరమార్థమును అందించుచున్నది. కలయతీతి కాళి- కాలపు స్థితిగతులు నీవని,నా నాళముల నడకలు నీవై నన్ను నడిపిస్తున్నావని తల్లీ నీ కరుణచే పశ్యంతీ.చూడగలుగుతున్నాను.కాదు కాదు ప్రపశ్యంతీ-సంపూర్ణముగా చూడగలుగుతున్నాను. ధన్యోస్మి మాతా ధన్యోస్మి. దోషములకు మన్నించగలరు.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...