Tuesday, October 17, 2017

SIVA SANKALPAMU-86

ఓం నమ: శివాయ-86
పాలకడలి జనించిన " గరళము" నిను చేరితే
మురిపాల పడతి హరిని "శ్రీహరిని" చేసింది
"శరభరూపమున" నీవు శ్రీహరిని శాంతింప చేస్తే
విభవమంత హరిదేగా " ప్రహ్లాదచరిత్రలో"
" చిలుకు ఏకాదశి " నాడు చకచక లేచేసి
" దామోదరుడు" నిన్ను చేరినది మోదము కొరకేగా
" అభిషేక జలాలతో" నీవు ఆనందపడుతుంటే
" అలంకారాలన్నీ" హరి తన ఆకారాలంటాడు
అనుక్షణము నీవు "అసురులను చెండాడుతుంటే"
లక్షణముగా "హరి తులసిని పెండ్లాడాడు"
" అలసటయే నాదని"" ఆనందము హరిది" అని
"ఒక్క మాట" చెప్పవేర ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-87

ఓం నమ: శివాయ-87
"పెద్ద దేవుడనని" అని నీవంటే" మద్ది" తెల్లబోయింది
"అంబే శివుడిని" అని నీవంటే "జంబూ" బెంబేలెత్తింది
"భూత నాథుడిని" అని నీవంటే "చూతము" చూతమంది
"దొడ్డవాడిని" అని నీవంటే " గడ్డి" అడ్డుచెప్పకుంది
"చెలకని వాడను" అని నీవంటే "చెరకు" ఊరుకున్నది
"మీ రేడును" అని నీవంటే "మారేడు" మారాడకున్నది
"ఉబ్బు లింగడిని" అని నీవంటే "కొబ్బరి"నిబ్బరించుకుంది
"నిర్వాహకుడిని" అని నీవంటే "ఉర్వారుకము"నవ్వింది
"యోగిని" అని నీవంటే నీవంటే "రేగి" ఆగి పోయింది
" వృక్షేభ్యో- హరికేశేభ్యో" అని మొహమాటముతో అనగానే
"అన్ని చెట్లు" నీవంటే "అక్కసుతో" పచ్చి అని,నిన్ను
వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా. 

SIVA SANKALPAMU-88

ఓం నమ: శివాయ-88
కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవా
సిగ పూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలదా
కట్టుకున్న గజ చర్మము నీకు పట్టు పుట్టమీయ గలదా
నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను ఈయగలదా
కరమున ఉన్న శూలము నీకు వరములు అందీయ గలదా
పట్టుకున్న పాములు నీకు పసిడిని అందీయ గలవా
కదలలేని చంద్రుడు నీకు ఇంద్రపదవిని ఈయగలడా
కాల్చుచున్న కన్ను నీకు కాసులనందించ గలదా
కరుగుచున్న నగము నీకు మెరుగు తరగని సంపదీయ గలదా
ఆది శక్తి పక్కనున్న ఆది భిక్షువైన నిన్ను
" ఓం దారిద్య్ర దుఖ: దహనాయ- నమ: శివాయ" అని పొగడుతుంటే
ఒక్కరైన నమ్మరురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-89

ఓం నమ: శివాయ
***************
సుగంధిపుష్టి కర్తకు సుప్రభాత దీపములు
నిటలాగ్ని హోత్రునికి నిత్య ధూప దీపములు
పాషాణపు దేవునికి ప్రభల వెలుగు దీపములు
కందర్ప దర్పునికి కర్పూర దీపములు
పరంజ్యోతి రూపునికి ప్రమిదలలో దీపములు
జలజాక్షునికి వేడుకగా జలములోన దీపములు
ప్రమథ గణాధిపతికి ప్రదోషవేళ దీపములు
ఆశాపాశ రహితునికి ఆకాశదీపములు
మా ఆర్తిని తొలగించే కార్తీక దీపములు
దీపములను పేర వెలుగు నీ నామ రూపములు
జాణతనము తోడుకాక జ్వాలాతోరణములో
చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా

SIVA SANKALPAMU-90

"అసంగోహం అసంగోహం-అసంగోహం పున: పున:"ఓం నమ: శివాయ
శివుని తల్లి "బెజ్జ మహాదేవి" అంటున్నారు
"శిలాదుడు" తండ్రి అని నేను వింటున్నాను
శివుని అక్క "మగాదేవి" గారాబం చేస్తుందట
శివుని పత్ని "పార్వతి" పరిపాలించేస్తోందట
గణపతి-గుహుడు శివుని సుతులంటున్నారు
శివుని సఖుడు "హరి" అట చెప్పుకుంటున్నారు
శివ భక్తి "తమదని" పక్షులు చెప్పుకుంటున్నాయి
శివ లీలలు "యుగయుగములు" కనువిందు చేస్తున్నవి
భావనలో నిండినది "బహు చక్కని కుటుంబము"
"బ్రహ్మజ్ఞాన వలీనము" బహు చక్కగ చెబుతున్నది
"అసంగోహం-అసంగోహం
అసంగోహం-పున:పున:"
చక్కనైన మాటలేరా ఓ తిక్కశంకరా.

SIVA SANKALPAMU-91

" నాస్తి శర్వ సమో దేవ
నాస్తి సర్వ సమో గతి
నాస్తి శర్వ సమో దానే
నాస్తి సర్వ సమో రణే"-యుద్ధంలో శర్వునితో సమానుడు లేడు.
ఓం నమ: శివాయ
నారి ఊడదీయమనగానే " జారిపోవ చేసావు"
అమ్ములు దాచేయమనిన" గమ్మున దాచేసావు"
విల్లు కనపడకూడదనిన "వల్లె" అని అన్నావు
పినాకమే కానరాని "పినాకపాణివి" నీవు
మంచపు కోడును కూడా" కనిపించకుండ చేసావు"
ఖట్వాంగమే కానరాని" ఖండోబా దేవుడవు"
పరశును మొద్దుచేయమనిన" పదునును తీసేసావు"
" ఖండ పరశు కానరాని" పరమేశ్వరుడవు నీవు
లేశమైన లేకుండా" ఆశాపాశము తీసేశావు"
" పాశుపతాస్త్రము లేని" పశుపతివి నీవు
రుద్రములో చెప్పారని వద్దనక,అన్ని, చేస్తుంటే, నిన్ను
తెలివితక్కువ అంటారురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-92

" గళే ౠండమలం "తనౌ సర్పజాలం"
మహాకాలకాలం గణేశాధిపాలం
ఝటాజూటభంగోత్తరంగైర్విశాలం
శివం శంకరం శంభుమీశానమీడే. "
ఓం నమ: శివాయ
" విషమును దాచిన వాని వివరము" నీకెందుకంటు
అతని భక్తులము మేము "అనుక్షణము వదలమంటు"
నీ" పాద మంజీరమైన పాము" వదలని" ఆపదగా మారింది"
నీ" నడుముకు చుట్టుకున్న పాము" "నరకము తానేనంది"
నీ" జందెమైన పాము" నన్ను" బంధించిస్తోంది"
నీ" కరకంకణమైన పాము" నాపై "కనికరమే లేదంది"
నీ "మోచేతిని తాకుపాము" "వెతలకతగ మారింది"
నీ "మెడను తిరుగు పామేమో" "సంసారము తానంది"
"నీ జడను ఆడుచున్న పాము" నన్ను" జడముగా మార్చింది"
పోనీ అని "నువ్వు వాటిని రానిస్తే","కాని పనులు చేస్తూ"
కాలకూటము చిమ్మి "నన్ను" కాటువేయ చూస్తుంటే
" ఒక్క మాటైన అనవురా" ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-93

" ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ||"
ఓం నమ: శివాయ
*****************
ఆపివేయ పలికినదియేగా "శివతాండవ స్తోత్రము"
శాపమీయ పలికినదియేగా "శివ మహిమ స్తోత్రము"
కనకాభిషేకమునకై కదిలినదేగా" కాశీఖండము"
వీర శైవ ఉన్మాదమేగ" బసవ పురాణము"
శాశ్వత స్థావరమునకేగా "శంకరాచార్య విరచితములు"
మేక మేథ బోధలేగ "నమక చమక స్తోత్రములు"
దిగ్గజ అక్కజమేగా" శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యము"
అడిగి ఆలకిస్తావు ఆనంద భాష్పాలతో
అతిశయముగ చూస్తావు హర్షాతిరేకముతో
"నిష్కళంక మనసు" నిన్ను కొలిచినది" శూన్యము"
యుక్తితో ముక్తి కోరువారిని "నీ భక్తులు" అను మాయలో
చిక్కు కున్నావురా! ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-94

"అజ్ఞానాద్దేవ దేవేశ యదస్మాభి రణుస్థితం
కర్మణా,మనసా,వాచా తత్సర్వం క్షంతుమర్హసి.
నమో భవాయ భవ్యాయ భావనాయోద్భవాయచ
అనంత బల వీర్యాయ భూతానాం పతయే నమ:"
ఓం నమ: శివాయ
***************
తిరుగుచున్న భూమి అనే తీరులేని "రథముతో"
నారి కట్టలేని మేరుకొండ అనే" వింటితో"
చేతి నుండి జారిపోవు కోతి అనే" అస్త్రముతో"
ఎదుటిసేన కాంచలేని" ఎగుడు దిగుడు కన్నులతో"
బారెడైన కప్పలేని కరిచర్మపు " కవచముతో"
పుర్రెతప్ప మోయలేని "కుర్రదైన చేతితో"
వీరముపై నీళ్ళుజల్లు " నెత్తిమీద కుండతో"
శత్రువుల మూలమెరుగలేని "శూలముతో"
పురములు దగ్గరైన" రిపుజయ శాపమున్న వారితో"
నేనెవరో తెలుసా అంటూ నీవు" డంభముతో"
లోహ త్రిపురులను జయించి " ఆహా అనుకుంటుంటే" నేను
"బిక్కమొగము" వేసానురా! ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-95

" ఓం నమ: శివా య "-95
****
" నీ పిరికితనమును" చూసి" నీ నామము" భయపడినది
ఎందుకైన మంచిదని పొంచిపొంచి" దాగినది"
రెండు వేదముల మధ్య "యజుర్వేదమును" పెట్టింది
అష్టము వాకము "రక్షణ అని" సుస్పష్టము చేసినది
" ఓం నమ:"-" య" అను శబ్దములను అటు-ఇటు నిలిపింది
"రెండు" అక్షరములను "దాచలేని" దైవము నీవేనంది
" పంగ నామమును " పెడతావని బెంగ పడుతున్నది
"గంగపాలు" చేస్తావని గజగజలాడుతున్నది
" నామ స్మరణము" నావగ దరి చేర్చేస్తుందట
భయపడు "నీ నామమే" భవహరణమవుతుందట
"పరిహాసాస్పడుడవగు" నిన్ను "పరమేశ్వరుడు" అని
మొక్కుతున్నారురా! ఓ తిక్క   శంకరా.

SIVA SANKALPAMU-96

" కంబు గ్రీవం కంబు కంఠం ధైర్యదం ధైర్య వర్ధకం
శార్దూల చర్మ వసనం మహాదేవం నమామ్యహం."
ఓం నమ: శివాయ
నీకు పూజచేస్తే పున్నెమని విన్నానురా,వినయముతో
కాళ్ళుచేయి కడుగ నీళ్ళకెలితే గంగ కస్సుమన్నదిరా
"స్నానమెట్లు చేయిస్తు" సముదాయించర గంగను
"నిన్ను కూర్చోమనగానే" వేటకై తుర్రుమన్నదిరా పులి
"జందెమైన ఇద్దమన్న" చరచర పాకింది పాము
"కట్టుకోను బట్టలన్న" కనుమరుగయింది కరి
"నైవేద్యము చేయబోవ" విషజంతువులన్ని మాయము
వెతుకులాడి వెతుకులాడి" వేసారితిరా శివా"
అక్కజమేముందిలే నీ అక్కర తీరిందేమో
ఒక్కటైన కలిసిరాదు "చక్కనైన పూజసేయ"
మాయ తొలగిపోయె నేడె "మానస పూజ చేయగ"
దిక్కులే ధరించిన! ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-97

" నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చవోనమః".
" కుంభకారులకు నమస్కారము. లోహకారులగు మీకు నమస్కారము."
ఓం నమ: శివాయ
"కుమ్మరివి నీవంటే" ఓటికుండ నవ్వుకుంది
"కమ్మరివి నీవంటే "లోహము నమ్మకమే లేనంది
"వడ్రంగివి నీవంటే" కొయ్యముక్క అయ్యో అంది
"విల్లమ్ములు నీవంటే" రెల్లుపూజ చెల్లు అంది
"పైరు పచ్చ నీవంటే" పంట-పంటలేసుకుంది
"వైద్యుడివి నీవంటే" ఔషధము నైవేద్యాలే అంది
"గురువువి నీవంటే" స్వరము విస్తుపోయింది
"చల్లని ఇల్లు నీవంటే "ఇల్లరికము ఇదే అంది
"నమో విరూపేభ్యో విశ్వ రూపేభ్యో" అని అనగానే
"అన్ని రూపములు నీవేనని" ఆరోపించుకుంటుంటే ,నీతో
చిక్కేనురా ఎప్పుడు ! ఓ తిక్క శంకరా

SIVA SANKALPAMU-98

" సంపూర్ణ కామదం సౌఖ్యం భక్తేష్ట ఫలకారణం
సౌభాగ్యదం హితకరంచ మహాదేవం నమామ్యహం "
ఓం నమ: శివాయ
ఉదారతను చాటగ " అసురుని ఉదరములో నుంటివి"
" గంగిరెద్దు మేళము" నిన్ను కాపాడినది ఆనాడు.
వరముగ కోరాడని " అసురుని హస్తమున అగ్గినిస్తివి"
" మోహిని అవతారము" నిన్ను కాపాడినది ఆనాడు.
భోళాతనమును చాటగ " అసురునికి ఆలినిస్తివి"
" నారద వాక్యము" నిన్ను కాపాడినది ఆనాడు.
ఆత్మీయత అను పేర " ఆ అసురునికే ఆత్మలింగమునిస్తివి"
" గణపతి చతురత" నిన్ను కాపాడినది ఆనాడు
భ్రష్టులైనవారిని "నీ భక్తులు" అని అంటావు
రుసరుసలాడగలేవు "కసురుకొనవు అసురతను"
మ్రొక్కరని అసురులకు " గ్రక్కున వరములు ఇస్తే"
" పిక్క బలము చూపాలిరా" ఓ తిక్క శంకరా.
భావము

SIVA SANKALPAMU-99

" ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్సూచెఁ దా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధా విర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు; నీ పాదసం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా! "
ఓం నమ: శివాయ
" అనిశము వశమగుతావు" పశునామములకు నీవు
"పశుపతి" అని పిలువగానే పరవశమేగా నీకు
"కాల భైరవుని" కాశికాపురపతిని చేసావు
"శరభమువై" నరసిమ్హుని శాంతింప చేసావు
మిక్కుటమగు ప్రేమగల "కుక్కుటేశ్వరుడివి" నీవు
వ్యాళము మీద మోజుగల "కాళేశ్వరుడివి" నీవు
"స్కంధోత్పత్తికి" వనమున లేడిగ క్రీడించావు
వ్యాఘ్రమునకు మోక్షమిచ్చి "వ్యాఘ్రేశ్వరుడివి" అయ్యావు
జంబుకమును అనుగ్రహించిన " జంబుకేశ్వరుడివి"
శ్రీ,హస్తి,కాళములను దయ తలచిన "శ్రీ కాళ హస్తీశ్వరుడవు"
" పాశమేసి" నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని
"కప్పల తక్కెడ" అంటావురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-100

" న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్."
" అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు."
ఓం నమ: శివాయ
" అభిషేకములను చేస్తే" శుభములను ఇస్తాడట
" బూది పూతలను పూస్తే" మోదములే ఇస్తాడట
"దీపము దానము చేస్తే" పాపము పోగొడతాడంట
"రాయిని దానము చేస్తే" సాయము అవుతాడట
'శివ నామము" జపియిస్తే పరవశుడే అవుతాడట
తమ వాడని తలిస్తే "మమేకమే అవుతాడట"
"పురాణ పఠనము చేస్తే" పునర్జన్మ తొలగునట
బ్రహ్మ రాక్షసుడు వినగానే" బ్రహ్మజ్ఞాని అగునట"
"కృత్తికా నక్షత్రము" కృతకృత్యులను చేస్తుందట
"కార్తిక దామోదరుడంటు" హరి శివుని చేరునట
"పదకొండు నెలలు వదిలినా" కైవల్యమును పొందగా
"ఒక్క కార్తికము చాలునట"! ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-101

   శివ సంకల్పము-101

 తామరలున్న కొలనులో తిరుగాడు కప్పను నేననుకో
 తామసమడచి ఆ కప్పను తుమ్మెదగా మార్చరాదో

 మధురసమున్న పాత్రలో తిరుగాడు తెడ్డుననుకో
 మేధను అనుగ్రహించి తెడ్డును జిహ్వగ మార్చరాదో

 కొమ్మకు చుట్టుకుని తిరిగాడు గాలిపటము నేననుకో
 ఇమ్ముగ జాలిచూపి దానిని చుక్కల పక్కకు చేర్చరాదో

 వాన నీరు వృధాచేయు సంద్రమునునేననుకో
 పన్నీరై క్తుథతీర్చు పంటబీడు చేయరాదో

 శివుడెంత అని అన్న గర్వపు గంగను నేననుకో
 శివపాదమే తనకు సర్వమన్న గంగగా చేయరాదో

 ఇన్ని మార్పు చేర్పులకు కూర్పువైన నిన్ను
 ఎన్న తరము కదురా నా కన్నతండ్రి శంకరా.

SIVA SANKALPAMU-102

   శివ సంకల్పము-102

 కాసులేని వాడివని ఏవేవో రాసేస్తున్నాను
 బేసికన్నులను చూసి నే రోసిపోయి ఉన్నాను

 దోసములే నీ పనులని నే ఊసులెన్నో చెప్పాను
 వేసమేమిటో అంటూ నేను ఈసడించుకున్నాను

 కైలాసమును ఎత్తిన వాడు నీ విల్లు ఎత్తలేక పోయాడు
 సహకారము ఈయనిది అతని అహంకారమేగ శివా

 అహంకారమును వదిలేస్తే అధీనుడిని అంటావు
 ధీటులేని నీ భక్తితో రాటు చేస్తుంటావు

 స్వల్ప కాలిక లయముతో(నిద్ర) శక్తిని ఇస్తుంటావు
 దీర్ఘ కాలిక లయముతో ముక్తిని ఇస్తుంటావు

 నిన్ను తక్కువన్న నా తెలివి పక్కదారి మళ్ళించి
 మొక్కనీయరా భక్తితో ముక్కంటి శంకరా.

SIVA SANKALPAMU-103


   శివ సంకల్పము-103

 చిలుకగ నే జన్మిస్తే చిదంబరుడ అంటాను
 కోడిగ నే జన్మిస్తే కోటిలింగేశ్వర అంటాను

 కాకిగ నే జన్మిస్తే కాళహస్తేశ్వర అంటాన్
 ఆవుగ నే జన్మిస్తే అంబాపతి అంటాను

 మేకగ నే జన్మిస్తే నే మేలమాడుతుంటాను
 పాముగ నే జన్మిస్తే భృస్మేశ్వర అంటాను

 ఏనుగుగ నే జన్మిస్తే ఏకాంబరేశ్వర అంటాను
 కీటకముగ నే జన్మిస్తే నే కీర్తిస్తూనే ఉంటాను

 జన్మకాదు ముఖ్యమనే కర్మసిద్ధాంతపు సాక్షిగా
 ఏ జన్మలో నేనున్నా ఏలినవారి దయతో

 "త్వమేవాహం" అని తలుస్తు నన్ను తరియింప చేయగా
 బిరమున నన్ను బ్రోవరా పరమైన శంకరా.

SIVA SANKALPAMU-104

  శివ సంకల్పము-104

 భూత నాథుడు తిరుగు భూమికి దండాలు శివా
 విశ్వనాథుడుండు వాయువుకి దండాలు శివా

 అగ్ని నేత్రధారి యజ్ఞ అగ్నికి దండాలు శివా
 జటాధారి బంధించిన జలమునౌ దండాలు శివా

 ఆకస గంగను దించిన ఆకసమునకు దండాలు శివా
 క్రౌర్యము నిర్వీర్యము కావించిన సూర్యునికి దండాలు శివా

 చల్లని దయ కిరణాల జాబిలికి దండాలు శివా
 అర్థ నారీశ్వరమైన పరమార్థమునకు దండాలు శివా

 శంక రహిత శాశ్వత శంకరార్చిత దండాలు శివా
 చేద గలవు పాపములు ఈ ఐదు అక్షరములు శివా

 ఖేదమేది నేనుండగ నీ పాదముల శంకరా.

SIVA SANKALPAMU-105

శివ సంకల్పము-105

 నువ్వు తిక్కలోడివని అంది నా మూఢత్వం
 నిన్ను చక్కదిద్దాలనుకుంది నా మూర్ఖత్వం

 నీకేమి తెలియదంది నా అహంకారం
 నీకు తెలియచేయాలనుకుంది నా అంధకారం

 నిన్ను గౌరవించలేనంది నా తాత్సారం
 నీతో గారడి చేయాలనుకుంది నా మాత్సర్యం

 నీకు నాగరికత లేదంది నాలోని ఆటవికం
 నిన్ను నాగరికుడిని చేయాలంది నాలోని ఆధునికం

 నీకు పాఠము చెబుదామనుకుంది నాలోని ఆర్భాటం
 నీకు పరీక్ష పెట్టాలనుకుంది నాలోని ఆరాటం

 సముద్రాన్ని పరీక్షించు ఉప్పుబొమ్మ నేనైతే
 నా తప్పు చెప్పినావురా ఓ గొప్ప శంకరా.

SIVA SANKALPAMU-106

  శివ సంకల్పము-106

 తిక్కవాడివై నీవుంటే భక్యుల మొక్కులెలా పెరుగుతాయి
 మండే చెట్టూవై నీవుంటే పక్షులెలా వాలుతాయి

 కరిగే కొండవై నీవుంటే మృగములెలా తిరుగుతాయి
 పారని గంగవై నీవుంటే జలచరముఎలా బతుకుతాయి

 స్వార్థపరుడివై నీవుంటే అర్థనారీశ్వరమెలా అవుతుంది
 శితికంఠుడివై నీవుంటే స్థితికార్యమెలా జరుగుతుంది 

 లయకారుడివై నీవుంటే సృతిలయలెలా నిన్ను చేరతాయి
 మన్నించమని నేనంటే నిన్నెంచను అని అంటావు

 ఆదరమేమో నీది అవగతమయ్యెను అంతలోన
 ఆ నిందా వాక్యములు అవి గతమయ్యెను వింతలోన

 అంతలేసి మాటలాడ ముద్దుమాటలంటావురా
 అద్దమంటి మనసున్న ఓ పెద్ద శంకరా.

SIVA SANKALPAMU-107

 శివ సంకల్పము-107

 ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా
 భక్తి మకరందమును చందనముగ పూయనా

 ఆది అనాది లేదంటు బూదిని నే రాయనా
 శాంతి సహన పుష్పాలతో పూజను నే చేయనా

 పాపరహితము అనే దీపమునే వెలిగించనా
 పొగడపూల వాసనలనే పొగలను నే వేయనా

 లబ్బు డబ్బు శబ్దాలతో స్తొత్రములే చేయనా
 ఉచ్చ్వాస నిశ్వాసలనే వింజామరమునే వీచనా

 అరిషడ్వరగములు లేని ఆతిధ్యమును నేనియ్యనా
 హర హర మహా దేవ అంటు హారతులనే ఇవ్వనా

 దాసోహం దాసోహం అంటు ధన్యతనే పొందనా
 నా పక్కనే ఉన్నావురా చూడ చక్కనైన శంకరా.

SIVA SAMKALPAMU-108

" పునరపి జననం- పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే -బహు దుస్తారే
కృపయా పారే -పాహి త్రిపురారే"
ఓం నమ: శివాయ
శివ కుటుంబములోని "చిన్ని శిశువును" నేను
"ఆకలేస్తున్నదంటే" అన్నపూర్ణమ్మకు చెప్పు
"అన్నము నే తిననంటే" ఆ జాబిలిని కిందకు దింపు
"దాహమువేస్తున్నదంటే" ఆ గంగమ్మకు చెప్పు
"నేను ఆడుకోవాలంటే" ఆ లేడిపిల్లను పంపు
ఆటుపోటులన్నిటిని" ఆదరముతో" కప్పు
కనురెప్పగ పిల్లలను" కాచుటయే ఒప్పు"
కానిపనులు చేసినను" క్షమియించుటయే మెప్పు"
"ఉప్పుబొమ్మ కరిగినది" కొత్త బొమ్మ మిగిలినది
తప్పు తెలిసికొన్నది" తరియిస్తున్నది నీ ఒడిలో"
లక్షణమగు ప్రేమతో" ఒక్క క్షణమైనను" నన్ను వీడక
రక్షను అందీయరా తక్షణమే శంకరా

......కార్తీక మాసము శివ కేశవ మాసము.రెండు రూపములు ఒకే మనసు.ఈశ్వర హృదయస్య కేశవ-కేశవ హృదయస్య ఈశ్వర అనునది ఆర్యోక్తి.కాలాతీతమైన దేవుడు కనికరముతో ఎన్ని జన్మలందైనను మనలను తన ఒడిలోనికి తీసుకొని ఆదరిస్తూనే ఉంటాడు.మాయాతీతముకాని జీవుడు
మరల మరల భగవంతుని ఎన్నో కోరికలు కోరుతూనే ఉంటాడు.శిశువుగా శివుని ఒడిలో పులకిస్తూనే ముద్దుగా తన ముచ్చటలను పురమాయిస్తూ ఉంటాడు.ఇదే శీతకన్ను వేయలేని శీతల కొండ నివాసి హేల.పరమాద్భుతమైన శివలీల.
.....................................................................................................................................................................................................ప్రియ మిత్రులారా.నా ఈ చిన్ని ప్రయత్నమునకు ఊపిరినిచ్చినది మీ ఉన్నత సం స్కారమే కాని నా
అర్హత కాదు.ఈ పవిత్ర
" శివ సంకల్ప" పలుకులను -చూసినా-చూడకున్నా,వినినా-వినకున్నా,చదివినా-చదువకున్నా,చర్చించినా-లేకున్నా,ఎప్పుడో పుక్కిట పట్టేశామని వెక్కిరించినా,గొప్పగా ఏమిలేదు అని పెదవిని చప్పరించినా,తప్పులు సవరించుటకు కనికరించినా.మేమా--తప్పులను సవరించేది అని హుంకరించినా
(ఫలశృతి)
గంగా స్నాన ఫలితమును ఇచ్చు గంగాధరుని ఆన
నాశ రహిత పుణ్యమును ఇచ్చు నాగాభరణుని ఆన
విభవమొసగు-విజయమొసగు విశ్వేశ్వరుని ఆన
సర్వ జనులకు శుభములు ఇచ్చు సదా శివుని ఆన.
( సవినయ ధన్యవాద కుసుమాంజలి)
మంగళం మహత్...హర హర మహాదేవ శంభో శంకర.


Image may contain: 1 person

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...