Friday, April 21, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(HIRAnYARETA NAMOSTUTE)

 " లోకంబులు లోకేశుడు

    లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం
    జీకటికవ్వలనెవ్వం
    డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్".
               -బమ్మెర పోతనామాత్యుడు.


  అది అజ్ఞాన- అజ్ఞేయ తత్త్వపూరితమైన స్థితి.సృష్టికి పూర్వదశ.లోక త్రయములు పాతాళమునందలి బురదలో పడినవో లేక చీకటిలో కలిసినవో ,అసలున్నవో-లేవో తెలిసికొనలేని అయోమయ పరిస్థితి.జ్ఞానము లుప్తమైన/గుప్తమైన వేళ అజ్ఞానము అధిష్టించి,సమస్తమును అజ్ఞేయమను నిస్సారపు పొరతో కప్పివేసిన స్థితి.కదలికలేక కనుమమరుగైనవో లేక కాలరాయబడినవో కనుగొనలేని దుస్థితి.

  సమస్తము అస్తవ్యస్తమై,మిక్కిలి చిక్కనిదై,అట్టడుగున చేరి,అచేతనమై,తననుతాను మరుగుపరచుకొనిన మర్మస్థితి.కర్మలకు దూరమైన దయనీయపరిస్థితి.

 అట్టిస్థితిలో మనోవాక్కాయ కర్మలను త్రిశక్తులు,సత్వరజో తమో గుణములను మూడు గుణములు,స్థూల-సూక్ష-కారణమను మూడు శరీరములు,ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములు,కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములను ఆరు శత్రువులు అసలే కానరాని అయోమయస్థితి.

   మనము ఆధారములుగా-కారణములుగా వీటిని పరిగణిస్తే వీటికి ఆధేయములు-కార్యరూపములైన పక్షులు-పశువులు-పదార్థములు-ప్రాణులు,పంచభూతములు-పంచేంద్రియములు,అష్టదిక్కులు-భూగోళ-ఖగోళములు,నదీనదములు,సముద్రములు,అరణ్యములు,ఉద్యానవనములు తమ ఉనికిని కోల్పోయిన హృదయవిదారక స్థితి.

 బాహ్యము-అభ్యంతరము తమ స్వరూప- స్వభావములు సమసిపోయిన స్థితి.వృధ్ధి-క్షయములు,జనన-మరణములు,సుఖ-దుఃఖములు,సంకల్ప-వికల్పములు,చీకటి-వెలుగులు లేని చింతిత స్థితి.

  ఆకార-వికారములు లేవు.పొట్టి-పొడుగు,నలుపు-తెలుపు,ధనిక-పేద,లేదు.జాగ్రత్-నిద్ర-సుషుప్తి అవస్థలు లేవు.అంతా జగము జడముగా మారిన కూష్మాంద స్వరూపము.అంతా చీకటి.నిశ్శబ్దము.శూన్యమో/పరిపూర్ణమో పరిశీలించలేని ప్రమత్తస్థితి.పరవస్తు-స్వవస్తు విషయ పరిజ్ఞానములేని విషయములు విషమించిన ముద్ద,అది జగములు జడముగా మారిన ఒకేఒకటైన ఘనకూష్మాండము.

 కాని విచిత్రము.సంకల్పము-వికల్పము రెండును తానైన పరబ్రహ్మము ముద్దుగా తాను ఆ ముద్దలో ఇమిడిపోయినది.అవ్యాజ కరుణతో ఉధ్ధరించుటకు ఉపేక్షను వీడినది.వికల్పమునకు వీడ్కోలు పలికినది.సంకల్ప మాత్రముచే సహస్ర కిరణ తేజోపుంజముగా -శ్రావ్యమైన ప్రణవమును తోదుతెచ్చుకొని తనకు తాను ప్రచ్ఛన్నమును వీడి,స్వఛ్చందమై ప్రకటింపబడినది.

 ఏం మాయ చేసాడో చెప్పలేను కాని అయోమయము మాయమైనది.ప్రకృతి తన స్వస్వరూపమును పాంచభౌతిక రూపములతో బాటుగా ప్రస్ఫుటము చేసుకొనినది.కదలికలు మొదలైనవి.తోడుగా వచ్చిన శబ్ద సహకారముతో

 పక్షులు-పశువులు-ప్రాణులు పర-పశ్యంతి-మధ్యమ-వైఖరి శబ్దములకు ప్రాణప్రతిష్టను చేసినవి.మేఘములనుండి వచ్చు గర్జనలు.చెట్లు గాలి వీచునపుడు చేయు శబ్దములు పర-పశ్యంతిగా పరిగణిస్తే,పక్షుల కూతలు మధ్య అని,భావగర్భిత భాష వైఖరిగా తన విశిష్టతను వివరిస్తున్నది.చేతనత్వముతో నింగి నేల స్నేహ-బాంధవ్యాలను సమృధ్ధిచేసుకుంటున్నాయి.

 ఏకము అనేకమై మనతో మమేకము అవుతున్నది

తం సూర్యం ప్రణమామ్యహం.


ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM( SADAA RAAKSHASA SEVITAM)

 


  విశ్వసృష్టి విస్తరణకై బ్రహ్మ ఆదేశానుసారముగా కశ్యప మహర్షి తీవ్రతపమొనరించెను.దాని ఫలితముగా అనంత తేజము అతని నుండి బయల్వెడలెను.బ్రహ్మాదేశానుసారము దానిని సముద్రప్రవేశము చేయించి తదుపరి కార్యక్రమముగా అండజములను,స్వేదజములను,బుద్బుజములను,భూరుషములను,జలచరములను,భూచరములను,ఖేచరములను అనేకానేక ఉపాధులతో సృష్టిచేసెను.వీటిలో కొన్ని త్రిగుణములకు సంబంధించినవి.

 కశ్యప ప్రజాపతి-దితికి జన్మించిన సంతానమే దైత్యులుగా-రాక్షసులుగా వ్యవహరింపబడుచున్నారు.నిజమునకు వీరు తమోగుణ ప్రధానులు.

 రాక్షసులు సూర్యరథమును ముందుకు జరుపుచుందురు అని సనాతనము చెప్పుచున్నది.

 తిమిరహరుడు,దినకరుడు-దివాకరుడు-భాస్కరుడు చీకట్లను పారద్రోలుటకు సంసిద్ధమగుచున్నాడనుటయే రాక్షసులు సూర్య రథమును వెనుక నుండి ముందుకు జరుపుచున్నారన్న మాటలోని రహస్యము.

 1.మధుమాసములో-హేతి అను రాక్షసుడు

 2.మాధవ మాసములో-ప్రహేతి అను రాక్షసుడు

 3.శుక్ర మాసమునందు-పౌరసేయుడను రాక్షసుడు

 4.శుచి మాసములో-సహజన్యుడు

 5.నభ మాసములో-వార్య రాక్షడును

 6.నభస్య మాసములో-వ్యాఘ్ర రాక్షుడును

 7.ఇష మాసములో-బ్రహ్మపేత రాక్షసుడును

 8.ఊర్జ్య మాసములో-మఖపేత రాక్షసుడును

 9.సహ మాసములో-విద్యుత్చాత్రి రాక్షసుడును

 10.సహస్య మాసములో-స్పూర్జ రాక్షసుడును

 11.తప మాసములో-వాల రాక్షసుడును

 12.తపస్య మాసములో-వర్స రాక్షసుడును

    సూర్య రథమును ముందుకు జరుపుతూ స్వామిని సేవించుకుందురు.

 తం సూర్యం ప్రణమామ్యహం.


ANIVERCHANEEYAM-ADITYAHRDAYAM(ANISAM-MUNISEVITAM)

 


 'అంతః బహిః యత్ సర్వం వ్యాప్త నారయణస్థితః" అన్నది మంత్రపుష్పము.

 లోపల-బయట సర్వత్రా నామ-రూపములుగా వ్యాపించియున్న పరమాత్మను గుర్తించగలగటమే ఈ మునులు ప్రతిదినము సూర్యరథ గమన ప్రారంభమునకు ముందుగా చేయు వేదపారాయణమను సంప్రదాయము.మనము ముందు చెప్పుకున్నట్లు వాలిఖ్యాది మునులు సైతము ప్రకాశించబోతున్న పవిత్రము చేయబోతున్న సూర్కిరనములకు సంకేతములే.

 ఋఇగ్వేద సంప్రదాయములో ప్రతి మంత్రమును రుచము అని వ్యవహరిస్తారు.సూర్యకాంతి సర్వలోకముల బయటనే కాకుండా అంతరంగములందును ప్రసరించి అజ్ఞానమనే చీకటిని నశింపచేస్తుంది.

 ప్రతి నాదము ప్రసరించే కిరణము ద్వారా ధర్మాచరణమును సంకేతిస్తుంది.నిజమునకు వేదమంత్రములే వేదబేద్యుని కిరణములు.ఈష ఉపనిషత్తు వేదపారాయణమే పరమాత్మ సాన్నిధ్య సహాయకారిగా సూచిస్తుంది.

 నాదాత్మకమైన సూర్యశక్తిని గుర్తించి పఠించుతయే గాయత్రీమంత్ర పరమార్థము.

 ఛాందగ్యోపనిషత్ ప్రకారము కదులుచున్న సూర్య పరమాత్మనుండి జనించుచున్న నాదమే ప్రణవము.

 అసలు ఈ మునులు/ఋషులు స్వామి రథమునకు ముందుగా నిలబడి వేదోచ్చారనముతో స్వామి గమనమును సంకేతిస్తారట.

 ఐతిహాసిక కథనము ప్రకారము వీరిని బ్రహ్మ మానస పుత్రులుగా కీర్తిస్తారు.

 ఆదిత్యహృదయ స్తోత్రమును శ్రీరామునకు ఉపదేశించినది కూడా అగస్త్య ఋషియేకదా.లోక కళ్యాణమునకై వీరు చేయవలసిన పనులను సూచిస్తూ శోభిస్తుంటారు.

 మౌనముగా ఉండేవాడు ముని అని కొందరు భావిస్తారు.అంటే మాటాడకుండా ఉండటము అని అనుకోరాదు.ఏదైనా దీక్షను పూని సాధన చేస్తున్నప్పుడు వచ్చే అడ్దంకులకు చలించకుండా కొనసాగించే ఆత్మస్థైర్యము కలవారని గుర్తించాలి.వీరు ఆత్మ పరిశీలనా తత్పరులు.బ్రహ్మము గురించిన అవగాహన గలవారు.

 మరికొందరు మననాత్ త్రాయతే మంత్ర అన్న సూక్తి ప్రకారము వీరిని మననశీలురుగాను భావిస్తారు.అంతరము పరబ్రహ్మములో రమించే ఆసక్తిగలవారు.వారి వేద పఠన సారాంశమును సూర్యకిరణములద్వారా సర్వజగత్తుకు అందచేస్తున్నారు.

 వీరు ,

 మధుమాసములో-పులస్త్య మునిగా

 మాధవమాసములో-పుల మునిగా

 శుక్రమాసములో-అత్రి మునిగా

 శుచి మాసములో-వశిష్టునిగా

 నభ మాసములో-అంగీరసునిగా

 నభస్య మాసములో-భృగు మునిగా

 ఇష మాసములో-జమదగ్నిగా

 ఊర్జ్య మాసములో-విశ్వామిత్రునిగా

 సహ మాసములో-కశ్యపునిగా

 సహస్యమాసములో-ఆయుర్మునిగా

 తపః మాసములో-గౌతమునిగా

 తపస్యమాసములో-భరద్వాజునిగా

 స్వామికి మార్గమును లాంఛనప్రాయముగా వేదపారాయణముతో చూపిస్తుంటారు.

 తం సూర్యం ప్రణమామ్యహం.


ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(ANISAM NAGA SEVITAM)

  పరమాత్మ పన్నెండు రూపములతో-పన్నెండు విధములుగా ప్రపంచపాలనకు ఉద్యమిస్తున్న సమయములో నాగులు/సర్పములు సైతము స్వామి రథ పగ్గములను పరిశీలించి,పయనమును సుగమము చేస్తాయట.ఒక విధముగా ఇవి సాంకేత విభాగమని అనుకోవచ్చును.

 ఐతిహాసిక కథనము ప్రకారము కద్రువ-కశ్యప ప్రజాపతి సంతానముగా వీరిని పరిగణిస్తారు.వీరిలో ముఖ్యమైన ఎనిమిదిమందిని అష్టాంగము అని కూడా వ్యవహరిస్తారు.వారే,

1.అనంత

2.వాసుకి

3.తక్షక

4.కర్కోటక

5.శంఖ

6.పద్మ

7.మహాపద్మ

8.గుళిక గా భావిస్తారు.వీరిలో

కొందరు శివపురానములో స్వామి కంఠాభరణముగాను,స్వామి వాహనముగాను,స్వామి అనుచరునిగాను కీర్తింపబడినారు.వివిధ వర్ణములతో-రూపములతో భాసిల్లే వీరు తక్షకుని పాలనలో ఉన్నట్లు చెబుతారు.చారిత్రక పరముగా కూడా నాగజాతి ఉనికి మనకు కనిపిస్తుంది.

 వేదాంత వాదులు అనిత్యమైన శరీర సృష్టిలో దేహమును త్యజించు విధముగా నాగులు సైతము తన కుబుసమును విడిచి జీవిస్తుంటాయి అని భావిస్తారు.


  ఆదిత్య భగవానుడు,

 మధుమాసములో-వాసుకి అను సర్పముతోను

 మాధవమాసములో-కచ్ఛనీరుడు అనే సర్పముతోను

 శుక్రమాసములో-తక్షకుడు అనే సర్పముతోను

 శుచి మాసములో-శుక్ర అనే సర్పముతోను

 నభ మాసములో-ఎలపాత అనే సర్పముతోను

 నభస్య మాసములో-శంఖపాల అనే సర్పముతోను

 ఇష మాసములో-కంబలాశ్వ అనే సర్పముతోను

 ఊర్జ్య మాసములో-అశ్వత అనే సర్పముతోను

 సహస్ మాసములో-మహాశంఖ అనే సర్పముతోను

 సహస్య మాసములో-కర్కోటక అనే సర్పముతోను

 తపస్ మాసములో-ధనంజయ అనే సర్పముతోను

 తపస్య మాసములో-ఐరావత అనే సర్పముతోను రథ పగ్గ సేవలను అందుకుంటాడట.

 తం సూర్యం ప్రణమామ్యహం.


ANIRVACHANEEYAM-ADITYAHRDAYAMU(NITYAM APARASA SEVITAM.)

 


 ఋషులు-గంధర్వులు-నాగులు-అపసరసలు-యక్షులు-రాక్షసులు-దేవతలు అను సప్తగణములతో స్వామి సేవింపబడుతున్నాడు.యక్షుల గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.

 వీరిని ఉపదేవతలు అని కూడా అంటారు.దివ్యశరీరులు.దయార్ద్రహృదయులు.

 వీరు ఒక్కొక్క మాసములో ఒక్కొక్కరు సుర్య రథ గమనమునకు ముందు అశ్వములను అనుసంధానము చేస్తారని ఐతిహాసికము చెబుతున్నది.

 వైజ్ఞానిక పరముగా ఆలోచిస్తే వీరు భూగర్భ సంపదలను-వృక్షమూల సంపదలను పరిరక్షించుతకు అనుకూలముగా సూర్యకిరణ సముదాయమును నిర్దేశిస్తారట.

 యక్షుల తెగకు అధిపతిగా కుబేరుని ప్రస్తుతిస్తారు.

  సనాతనము సూర్యభగవానుని

 1.జన్మదాత

 2.అన్నదాత

 3.స్థితిదాత

 4.జ్ఞానదాత

 5.భయత్రాత గా కీర్తిస్తుంది.దీనికి ఉదాహరణముగా,

 పరమాత్మ,

 1.మధుమాసములో-రథకృత్ అను యక్షుడు

 2.మాధవ మాసములో-అతౌజుడు అను యక్షుడు

 3.శుక్ర మాసములో-రథస్వనుడు అను యక్షుడు

 4.శుచి మాసములో-చిత్రస్వనుడు అను యక్షుడు

 5.నభః మాసములో-శ్రోతస్వామి అను యక్షుడు

 6.నభస్య మాసములో-అశరణుడు అను యక్షుడు

 7.ఇష మాసములో-శతాజిత్ అను యక్షుడు

 8.ఊర్జ్య మాసములో-సత్యజిత్ అను యక్షుడు

 9.సహస్ మాసములో-తర్క్య అను యక్షుడు

 10.సహస్య మాసములో-ఊమ అనే యక్షుడు

 11.తపస్ మాసములో-సురుచి అను యక్షుడు

 12.తపస్య మాసములో-రీతు అను యక్షుడు 

    స్వామిని సేవించుకుంటారు.

  తం సూర్యం  ప్రణమామ్యహం.


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...