Sunday, November 20, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-28


  




 న రుద్రో రుద్రమర్చయేత్-28


 ******************


 "" ఇళాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్లసం తం చ జగద్వరేణ్యం


    వందే "మహోదార తర" స్వభావం  ఘృశ్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే"




  స్వామి మహా ఔదార్యమును చెప్పకనే చెబుతున్నది పై ధ్యాన  శ్లోకం.


  మనో వాక్కాయ కర్మలను మారుస్తూ స్వామి చేసే లీలను మానవమాత్రురాలిని నేనెలా గుర్తించగలను.


 నేటి సాత్వికము రేపు తామసమునకు పెద్దపీట వేయగలదు.యుక్తాయుక్తమును దూరముచేయగలదు.మంచి-చెడుల మధ్య తాను దాగి మాయ,  మనలను ఆడించగలదు.లేవలేనంత పతనములోనికి పడవేయగలదు. అదియే తనలో నిజమును గ్రహించలేని మాయాజాలము.


 మనము చెప్పుకోబోవు కథలోని రెండు పాత్రలు అక్కా-చెల్లెలు.ఒకరు మాయామోహితులు-మరొకరు మాయాతీతులు.



 వారిలో ఒకరిని వశపరచుకొనిన అసూయ తీవ్రమై ఏ విధముగా దురాకృతములను చేయించినదో,మరొకరి దరిచేరలేని అరిషడ్వరగములు స్వామి మహోదారత వలె ,ఎంతటి ఔదార్యమును ప్రదర్శించినదో తెలుసుకుందాము.


 ప్రియ మిత్రులారా! 


   ఈనాటి మన బిల్వార్చనలో మనము " అసూయ" అను పదము తెచ్చిన అనర్థములను గురించి,వానిని అవలీలగా దాటించిన మహోదారుడైన మహేశుని గురించి స్మరించుకొని తరిద్దాము.


 రుద్ర నమకములో సైతము,




 4.చ అనువాకము-3.వ మంత్రము




 " నమో గృత్సేభ్యో-గృత్స పతిభ్యశ్చవో  నమః"


    ఉభయతో నమస్కార యజస్సు.



  గృత్స-అనగా ఆశపడు స్వభావము,ఇంద్రియ లౌల్యతకలవారి రూపములో నున్న రుద్రునకు నమస్కారము.



 ఆమెయే మనకథలోని సుదేహ.


 గృత్స పతి-వారిని సైతము సంస్కరించి-సంరక్షించు స్వామికి,స్వామి భక్తురాలైన ఘృశ్న కు నమస్కారములు.


 భగవంతునికి-భక్తురాలికి అభేదము.


 మితిమీరిన అసూయ ఆగ్రహమునకు దారితీస్తుంది.అరాచకములను చేయిస్తుంది.



 అదే విషయమును నమకము,


 2వ అనువాకము-4.వ మంత్రము


 " నమో వంచతే-పరివంచతే స్తాయునాం పతయే నమః"


 విశ్వాసపాత్రునిగా/పాత్రురాలిగా నటిస్తూ సంతోషమును/వైభోగమును అపహరించిన వాని రూపములో నున్న రుద్రునికి నమస్కారములు.



 వంచన గుప్తము నుండి ప్రకటన స్థితికి మారుట -అదియే పరివంచతే-బాహాటముగా వంచించుట.



 అసూయను అధిగమించిన అనాలోచిత అకృత్యముల పరాకాష్ఠ.


 దాని కార్యాచరణమే,


8.అనువాకము-5వ మంత్రము


 నమో  అగ్రే వధాయచ.


 ఎదుట నున్న శత్రువులను చంపు రుద్రునకు నమస్కారములు.




  8. అనువాకము-6వ మంత్రము


 " నమో హంత్రేచ-హనీయసేచ"


   శత్రువులను చంపువాడును,


 హనీయసేచ-ప్రళయ కాలమున అతిశయముగా చంపు రుద్రునకు నమస్కారములు.



   ఆ రుద్రుని కీర్తించలేని నా అసహాయత,కథ వైపునకు కదులుతున్నది.


  ఓం నమః శివాయ.


   




 దేవగిరి దుర్గములో సుధర్ముడు అను బ్రాహ్మణుని ధర్మపత్ని సుదేహ.ఆమె పేరులోనే ఆమె ఏ విధముగా ఇంద్రియములకు వశమై చేయరాని పనులను చేసినదో సంకేతిస్తున్నది.సంతానము కొరకై,వారి వంశాభివృద్ధికొరకై,తాను మాతృత్వమును పొందలేని కారణమున తన భర్తకు,తన చెల్లెలైన ఘృశ్న ను ఇచ్చి వివాహము చేయదలచినది.భర్త రాబోవు పరిణామములను ఊహించి,తగదని హితవు చెప్పినను వినలేదు.కాలాతీతుని ఆటగా కాలము పరుగిడుచున్నది.



 ఘృశ్న పరమ సాధ్వి.పరమ శివభక్తురాలు.ప్రతిరోజు 108 పార్థ్వివ శివలింగములను తయారుచేసుకొని,శివార్చనము పిదప అక్కడ  నున్న కోనేటిలో నిమజ్జనము చేసెడిది.


 ఈశ్వరానుగ్రహముగా ఘృశ్నకు పండంటి కుమారుడు జన్మించి దినదిన ప్రవర్ధమానమగుచున్నాడు.



 వానితో పాటుగా సమ ఉజ్జీనే నేనంటు సిదేహలో అసూయ సైతము అవధులను మించి తాండవిస్తున్నది.


   కుమారునికి వివాహము జరిగినది.ఏ నోట విన్నా వారి జంట చక్కదనము-ఘృశ్న వైభవము పదే పదే వినబడుతూ,చాలదన్నట్లు కనబడుతూ సుదేహలోని విచక్షణను మింగివేసింది.



 స్వరూపము యథాతథముగా నున్నప్పటికిని స్వభావమును పూర్తిగా మార్చివేసినది.


 ఏ అఘాయిత్యమునకు పూనుకుంటున్నదో,ఏ అమాయకునికి మూడుతున్నదో,ఏ సాధ్విని లోకోత్తర శక్తిగా చూపించబోతున్నదో 


 అంతా  లోకేశునకే ఎరుక.


 ఆదమరచి నిదురించుచున్న అమాయకపు బాలుని వైపునకు సుదేహ క్రోధము మళ్ళించినది.వీని వలనే గా ఆ ఘృశ్నకు గొప్పదనము.వీనిని అంతమొందించిన చాలు అనుకుంటూ కత్తితో వానిని ముక్కలు ముక్కలుగా నరికింది.అయినా అక్కసు తీరలేదు.అవయవములను మూటగట్టి ఘృశ్న పూజించు కొలనులో పడవేసినది.ఎంతటి పైశాచికమో ఆమెను నడిపిస్తున్నది.


 తెల్లవారినది.పతి కనబడని కారణమును గమనించినది కోడలు..ఏమి తెలుసుకోలేని అమాయకత్వము.


       సుదేహ  అంతటితో ఆగలేదు.ఘృశ్న ను అనుసరిస్తూ,గమనిస్తున్నది.ప్రతిరోజు మాదిరి 108 లింగములకు అభిషేకము జరిపినది.ఆనందముతో నిమజ్జనమునకై  కొలను దగ్గరికి వెళ్ళినది.


 కనిపించినది కుమారుని మృతదేహము..కదలలేదు మహాసాధ్వి.అంతా ఈశ్వరుని లీల.కాదనలేము కదా.


  నోరు విప్పి ఎవరిని నిందించలేదు.స్థిరచిత్తముతో శివనామము చేయుచున్నది.


 భక్తురాలి ప్రవర్తన భగవంతునికి ఆగ్రహమును కలిగించినది.

  కొలను నుండి కోపముగా ప్రకటనమయినాడు.



 సుదేహను శిక్షించెదనని ముందుకు దూసుకు వస్తున్నాడు త్రిశూలి.అక్కను క్షమించమని వేడుకున్నది.


 కాదనగలడా తన భక్తురాలి అభ్యర్థనను.


 క్షమించాడు సుదేహను.కాదు కాదు మార్చివేశాడు సుబుద్ధిగా.


 కొలను తీరము నుండి కదిలి వచ్చాడు ఘృశ్న కుమారుడు .


 ఈశ్వరాన ఎవ్వరెరుగరు కదా.


 కారుణ్యమునకు ముందు కాఠిన్యమును పంపుతాడు కరుణసామి .


 ఘృశ్న పేరు తన పేరుగా మార్చుకొని స్వామి మనలను సైతము సంస్కరించి,అనిశము సంరక్షించును గాక.


  మరొక కథా కథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.


 ఏక బిల్వం శివార్పణం. 




TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...