Wednesday, October 18, 2017

SIVA SANKALPAMU-50

ఓం నమ: శివాయ  -50

అగ్ని కార్య ఫలితములు అన్నీ ఇంద్రునికైతే
బృహస్పతి చేరాడు బుద్ధితో ఇంద్రుని

సరస్వతి చేరింది బృహస్పతిని చూసి ఆ ఇంద్రుని
వరుణుడు చేరాడు ఆదరణకై ఆ ఇంద్రుని

భూమికూడ చేరింది ఈవి కోరి ఆ ఇంద్రుని
గాలి వీచసాగింది నేరుగా ఆ ఇంద్రుని


విష్ణువు చేరాడు స్పష్టముగా ఆ ఇంద్రుని
అశ్వనీ దేవతలు ఆశ్రయించారు ఆ ఇంద్రుని


అవకాశమిది అని ఆకాశముం చేరింది ఆ ఇంద్రుని
పంచభూతములు నిన్ను వంచించేస్తుంటే


స్వార్థమంత గుమికూడి అర్థేంద్రముగా మారింది
నిన్ను ఒక్కడినే వేరుచేసి ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-51

 ఓం నమ: శివాయ-51

 మౌనము మాటాడునట మాయేదో చేసావులే
 మేథా దక్షిణా మూర్తిగా బోధించేది మాయేలే

 మూగయు మాటాడునట మాయేదో చేసావులే
 మూక పంచశతిగా కీర్తించేది మాయేలే

 కాళ్ళకింద పద్మాలట మాయేదో చేసావులే
 పద్మపాదుడు అతడట గురుభక్తి మాయేలే

 పూవులే పళ్లట మాయేదో చేసావులే
 పుష్పదంతుడు అతడట పుణ్యాల మాయేలే

 బోడిగుండు శివుడట మాయేదో చేసావులే
 శంకర భగవత్పాదుడట శంక లేనే లేదులే

 మాయా సతిని చూసి అమ్మయ్య అని నీవు మోస్తుంటే,నే
 బిక్కచచ్చి పోయానురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-52



        ఓం నమ: శివాయ-52

 ఆంతర్యము ఏమోగాని వెలుగసలే తెలియని
 అమావాస్య జననానికి ఆనందపడతావు

 విడ్డూరము ఏమోగాని వినయమే తెలియని
 గంగ అభిషేకములకు పొంగిపోతు ఉంటావు

 పూర్వపుణ్యము ఎమోగాని పువ్వులే తెలియని
 మారేడు దళములకు మగ ఆనందపడతావు

 ఇంద్రజాలమేదోగాని అందమే తెలియని
 బూది పూతలకు మోజుపడుతుంటావు

 నీదయ ఏమోగాని నియమములే తెలియని
 నికృష్టపు భక్తులని నీదరి చేర్చుకుంటావు

 కనికట్టో ఏమోగాని అసలు నీ జట్టే తెలియని
 ఒక్కడిని ఉన్నానురా ఓ తిక్క శంకరా

SIVA SANKALPAMU-53


   శివ సంకలపము-53
 నిన్ను బాణముతో కొట్టితే బాగా కరుణిస్తావు
 నిన్ను పాషాణుడివని తిట్టితే పరమ సంతోషిస్తావు

 నిన్ను రోకలిబండతో కొట్టిన కలికిని కనికరిస్తావు
 నిన్ను రాళ్ళతో కొట్టితే రయమున కనిపిస్తావు

 నిన్ను లెక్కచేయని వాని మొక్కులందుకుంటావు
 నిన్ను సేవించని వానికి సేవకునిగ మారుతావు

 నిన్ను ముప్పతిప్పలు పెట్టినా గొప్ప భక్తులంటావు
 నిన్ను రాపాడే వారినే కాపాడుతు ఉంటావు

 పరమ హింసలను చేస్తుంటే పరమ హంసలు అంటావు
 ఆత్మస్తుతి చేసేవాడిని ఆత్మీయుడు అంటావు

 నిజ భక్తుల కరుణించి నీచ భక్తులను నీవు
 పక్కకు పొమ్మనవురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-54

   ఓం నమ: శివాయ-54

 విశ్వ నాథుడివని నిన్ను విబుధులు మాట్లాడుతుంటే
 అనాథుడిని నేనంటూ ఆటలాడుతావు

 పరమ యోగీశ్వరుడవని నిన్ను ప్రమథగణము అంటుంతే
 పార్వతీ సమేతుడినని ప్రకటిస్తూ ఉంటావు

 భోళా శంకరుడవని నిన్ను భక్తులు భళి భళి అంటుంటే
 వేళాకోళములేయని  అంటావు   వేడుకగా

 నాగాభరణుడవని నిన్ను  యోగులు స్తుతి చేస్తుంటే
 కాలాభరణుడిని అంటు లాలించేస్తుంటావు

 విషభక్షకుడవు అంటు ఋషులు వీక్షిస్తుంటే
 అవలక్షణుడిని అంటూ ఆక్షేపణ తెలుపుతావు

 మంచి చెడులు మించిన చెంచైన దొర నీవు
 వాక్కు నేర్చినాడవురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-55

  ఓం నమ: శివాయ-55

 గడ్డి పరకలతో చేసే బహుదొడ్డవైన పూజలు
 మే,మే అని స్తుఇంచే మేకతల రుద్రాలు

 కమ్ముకోను మేమనే నమ్ముకున్న తుమ్మిపూలు
 ప్రత్యర్థుల బెదిరింపుకు పుట్టమైన పులితోలు

 తప్పనిసరి ఐతేనే విచ్చుకునే కన్నులు
 పరుగుతీయలేనట్టి మృగమున్న చేతివేళ్ళు

 అమ్మ బాబోయ్ చలి అంటు మూతపడ్డ గుడులు
 హద్దులు మీరుతు ఆకాశాన్నితాకే జడలు

 దుమ్మెత్తిపోస్తుంటే గమ్మత్తుగ నవ్వులు
 పాడుబడ్డగుహనున్నావని పాడుచున్న భక్తులు

 పరిహాసాస్పదుడవగుచు  పరమ శివుడు నేనంటే

 ఫక్కున నవ్వుతారురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-56

  ఓం నమ: శివాయ-56

 మన్మథ బాణము అంటే మాయదారి భయము నీకు
 కోపము నటించి వానిని మాయము చేశేసావు

 కోరికలతో కొలుచు వారంటే కొండంత భయము నీకు
 చేరువగ రాకుండా పారిపోతు ఉంటావు

 అహముతో నిను కొలిచే అసురులంటే అంతులేని భయము నీకు
 దారి ఏదిలేక వారికి దాసోహము అవుతావు

 సురలందరు నిన్ను కొలువ కలవరమగు భయము నీకు
 అనివార్యము అనియేగ గరళకంఠుడివి అయినావు

 ధరించినవన్నీ తరలుతాయేమోనని దాచలేని భయము నీకు
 జగములు గుర్తించకుండ లింగముగా మారావు

 "నమో హిరణ్య బాహవే సేనానే దిశాంగపతయే"అని కీర్తించే
 మొక్కవోని ధైర్యమురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-57


     ఓం నమ: శివాయ-57

 ఎంగిలి జలములతో నీకు అభిషేకము చేయలేను
 ఎంగిలి పడ్డ పూలతో నీకు అర్చనలు చేయలేను

 ఎంగిలున్న నోటితో ఏ మంత్రములు చదువలేను
 సుగంధిపుష్ఠికర్తకు ఏ పరిమళము అందీయగలను

 జ్యోతిర్లింగమునకు ఏ నీరాజనమును అందీయగలను
 నీదికానిదేదైనా నీకు నైవేద్యము చేయాలిగా

 నైవేద్యానంతర సేవలు నా శివునికి చేయాలిగా
 కాదనక కనికరించి కొనసాగనీయని పూజను

 నిన్ను ధ్యానించమనిన తన పని కాదంటుంది
 నిలకడగ ఉండమంటే అటు ఇటు పరుగిడుతుంది

 బుద్ధి లేక ఉంటుంది,హద్దు మీరుతుంటుంది,నా
 తైతక్కల మనసు నీది ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-58


       శివ సంకల్పము-58

 పొగడ్తలకు పొంగిపోతే ఉబ్బు లింగడు అని అంటున్నారు
 చిరాకును చూపిస్తుంటే చిందేస్తున్నాడంటున్నారు

 కోపముతో ఊగుతుంటే మూడోకన్ను తెరిచాడంటున్నారు
 చిట్టిచీమ కుట్టగానే శివుని ఆన అంటున్నారు

 బిచ్చగాడివి నీవంటు ముచ్చటించుకుంటున్నారు
 శుచిలేనిది చూస్తుంటే శివ శివ అంటున్నారు

 కలసిరాక దిగులుంటే గంగపాలు అంటున్నారు
 అలసత్వముతో ఉంటే అచ్చోసిన ఆంబోతు అంటున్నారు

 కన్నీళ్ళు కార్చుతుంటే నెత్తిన గంగమ్మ అంటున్నారు
 దిక్కుమాలిన ఉపమానాలతో నిన్ను తొక్కేస్తున్నారు

 మంచుకొండ దేవుడిలో మంచితనము ఏది అంటూ
 ఎక్కిరించారురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-59

                 శివ సంకల్పము-59

 పాశము విడువనివాడు యమపాశము విడిపించగలడ
 గంగను విడువనివాడు నా బెంగను తొలగించగలడ

 మాయ లేడిని విడువనివాడు మాయదాడిని ఎదిరించగలడ
 పాములు విడువనివాడు పాపములు హరియించగలడ

 విషమును విడువనివాడు మిషలను కనిపెట్టగలడ
 ఉబ్బును విడువనివాడు జబ్బును పోగొట్టగలడ

 నృత్యము విడువనివాడు దుష్కృత్యముల బాపగలడ
 భిక్షాటన విడువనివాడు శిష్ట రక్షణము చేయగలడ

 చిన్ముద్రను విడువని వాడు ఆదుర్దాను గమనించగలడ
 వింతరాగమున్న వీడు వీతరాగుడు అవుతాడా


  అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారా
  చుక్క చుక్క నీరు త్రాగు ఓ తిక్క శంకరా. 

 .

SIVA SANKALPAMU-60


         శివ సంకల్పము-60

 మాతంగ పతిగ నీవుంతే ఏది రక్షణ వాటికి
 గణపతి అవతరించాడు కరివదనముతో

 అశ్వపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
 తుంబురుడు వచ్చాడు గుర్రపు ముఖముతో

 నాగ పతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
 పతంజలి వచ్చాడు పాము శరీరముతో

 వానర పతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
 నారదుడు వచ్చాడు వానర ముఖముతో

 సిం హ పతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
 నరసిం హుడు వచ్చాడు సిం హపు ముఖముతో

 పశుపతిగ నీవుంటే అశువుల రక్షణ లేకుంటే
 ఎక్కడ న్యాయమురా ఇది ఓ తిక్క శంకరా .  

SIVA SANKALPAMU-61

             శివ సంకల్పము-61

 పట్టుబడతానన్న భయముతో పరుగుతీసిన దొంగ
 ప్రదక్షిణము చేసానని ప్రగల్భాలు పలుకుతాడు

 సోమరియై నిదురబోవు తామసియైన దొంగ
 నిష్కళంక సమాధియని నిష్టూరలాడతాడు

 సందుచూసి విందుభోజనము చేయు ఒకదొంగ
 వివరపు నైవేద్యమంటు వింతగ మాటాడుతాడు

 కడతేరుస్తారేమోనని కవచధారియైన దొంగ
 కానుకగా నా ప్రాణమంటు పూనకమే పూనుతాడు

 మాయదారి పనులనే మానస పూజలంటుంటే
 ఆయాసము లేకుండా ఆ యశమే కోరుతుంటే

 పోనీలే అనుకుంటూ వారిని నువు ఏలుతుంటే
 మొక్కాలిరా నీకు ఓ తిక్కశంకరా.

SIVA SANKALPAMU-62

               శివ సంకల్పము-63

 భూత నాథుడిగ కానరాకుంటే నే భూతద్దములో చూడాలా
 సింధువులో కానరాకుంటే నే బిందువులో చూడాలా


 సీమ పందిలో కానరాకుంటే నే చీమలో చూడాలా
 ఇంద్ర భవనములో కానరాకుంటే నే ఇసుక రేణువులో చూడాలా

 బ్రహ్మాండములో కానరాకుంటే నే భస్మములో చూడాలా
 పరివారములో కానరాకుంటే నే  చూడాలా
 పరమాణువులో

భువనములో కానరాకుంటే నే హృదయములో చూడాలా
 భాషలో కానరాకుంటే నే భావములో చూడాలా

 స్థూలములో కానరాకుంటే నే సూక్ష్మములో చూడాలా
 భక్తితో నీవు కానరాకుంటే నే యుక్తితో చూడాలా

 చిన్న రూపులలోనున్న నిన్ను చూచుటకు నే
 చిక్కి శల్యమవ్వాలా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-64

              శివ సంకల్పము-64

  పొంగుచున్న గంగను నువు జటలలో బంధిస్తే
  పంచాక్షరి వింతగ నిను పట్టి బంధించిందా

  బ్రహ్మ పుర్రె పట్టుకుని నీ చేయి బిచ్చమెత్తితే
  బ్రహ్మర్షులు చిత్రముగ నిన్ను బిచ్చమెత్తారా

  అరిషడ్వర్గములను ఆహా నువు బెదిరిస్తుంటే
  అసుర గణము అహముతో నిన్ను బెదిరించిందా

  నందిని,భృంగిని నీద్వారకాపరులుగ నియమిస్తే
  బాణుడు శోణపురి కాపరిగ నిను నియమించాడా

  పరమ గురువు శివుడని భక్తుడు ప్రస్తుతిస్తుంటే
  అప్రస్తుతమని విస్తుబోవ అంతా పరిహసిస్తున్నారా

  బందీలెవరో తెలియని నా సందేహము తీర్చకుంటే
  నిక్కమనుకుంటారా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-65

                శివ సంకల్పము-65

  నగుమోముతో నగములు నిన్ను బంధువు అంటున్నవి
  సాలెపురుగు పాలె దోమ నిన్ను దయా సింధువు అంటున్నది

  తుమ్మెద అమ్మమ్మ నిన్ను కమ్మని చుట్టము అంటున్నది
  కరిరాజు పరివారము నిన్ను వారి సరివాడివి అంటున్నది

  ఎద్దు తరపు పెద్ద నిన్ను పెద్దయ్యవి అంటున్నది
  లేడి చేడియ నిన్ను ఐనవాడివి అంటున్నది

  వ్యాళపతి వాసుకి నిన్ను చుట్టమని చుట్టుకుంది
  తిన్నని కన్న అడవి నిన్ను కన్నతండ్రి అంటున్నది

  హరి సంగతి సరేసరి అసలు చుట్టమంటాడు
  ఇందరి చుట్టమైన నీవు నన్ను చుట్టుకోకుంటే

  "నరత్వం దేవత్వం నగ వన మృగత్వం" అన్న లహరి
  లెక్కలోకి రాదురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-66


   శివ సంకల్పము-66

మరునిశరము పూవుగా నిను మనువాడమని
మదనుడు అనగానే గౌరీపతివి అయ్యావు

క్షీర సాగర మథనములో విషము స్వీకరించమని
అర్థాంగి అనగానే గరళకంఠుడివి అయ్యావు

గంగ వెర్రినెత్తిమీద సుతిమెత్తగ మొత్తమని
భగీరథుడు అనగానే గంగాధరుడివి అయ్యావు

గంగిరెద్దు మేళములో నీకు రంగు వస్త్రము తానని
కరిరాజు అనగానే గజ చర్మధారివి అయ్యావు

భృంగి సైగచేయగానే నీ సింగారపు నాట్యమట
"సంధ్యారంభిత విజృంభితవు" నీవు కావని

"సం జ్ఞారంభిత విజృంభితుడవు" పాపం నీవని
పెక్కు మార్లు విన్నానురా ఓ తిక్క శంకరా .  

SIVA SANKALPAMU-67

శివ సంకల్పము-67

 వెండికొండ దేవుడవని వెండికొరకు నే వస్తే
 దండిగా ఉన్న మంచు వెండి వెండి నవ్వింది

 మేరుకొండ విల్లుందని మేరువుకై నే వస్తే
 చాటుగా ఉన్న విల్లు చిలిపిగా నవ్వింది

 రాగి జటాజూటమని రాగి కొరకు నే వస్తే
 విరాగి జట ఎంతో విచిత్రముగా నవ్వింది

 నీల లోహితుడవని ఇనుముకై నే వస్తే
 చాల్లే అంటూ విషము గేలిగా నవ్వింది

 కుబేరుడు చెంతనున్నాడని ధనమునకై నే వస్తే
 చేతులు కట్టుకున్నానని చేతగాక నవ్వాడురా
 చిక్కులు విడదీయవేరా ఓ తిక్క శకరా. 
 చిక్కులు విడదీయవేర ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-68

  శివ సంకల్పము-68

  చేతులార పూజసేయ చెంతకు రావాలంటే
  చెట్టువు కమ్మంటావని చెప్పలేని భయం

  కనులారా దర్శించి కొలవాలనుకుంటేను
  కుక్కవు కమ్మంటావని ఎక్కడో భయం

  పాహి అంటు పాదములు పట్టుకోవాలనుకుంటే
  పాముగ మారమంటావని పాపిష్టి భయం


  తోడుగ ఉందమని వేడుకోవాలనుకుంటేను
  కోడివి కమ్మంటావని నీడలా ఏదోభయం

  హర హర మహదేవుడని వరము కోరుకోవాలంటే
  శరభము కమ్మంటావని నరనరములలో భయం

  అభయము అడగాలంటే అడుగడుగున భయము నాకు
  మొక్కవోని ధైర్యమీయరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-69

 శివ సంకల్పము-59

 నీకు మల్లే నీ నామమునకు నిలకడలేదురా శివా
 పెదవులు తెరుచుకోగానే పదమని పరుగెడుతుండి

 శంభో అని పిలువగానే అంభోరుహము చేరుతుంది
 శివ శివ అని పిలువగానే శిఖరాగ్రమును చేరుతుంది

 మహాదేవ అని పిలువగానే తుహినముగా మారుతుంది
 నీలగ్రీవ అని పిలువగానే వినీల గగనము అవుతుంది

 విశ్వనాథ అని పిలువగానే విశ్వమంత తిరుగుతుంది
 ఈశ్వరా అని పిలువగానే ఈడ ఉండనంటుంది

 ఉమాపతి అని పిలువగానే ఉరకలు ఆపేసింది
 పశుపతి అని పిలువగానే వశమయ్యాను అంది

 ఎవరేమని పిలిచినా ఎక్కడికి పోవద్దని దానికి
 ముక్కుతాడు వేయరా ఓ తిక్క శంకరా. 

SIVA SANKALPAMU-70

శివ సంకల్పము-70

 నీ పిరికితనము చూసి నీ నామము భయపడింది
 ఎందుకైన మంచిదని పొంచి పొంచి దాగినది

 రెండు వేదముల మధ్య యజుర్వేదమును పెట్టింది
 యజుర్వేద మధ్యలో రుద్రాధ్యాయమును
 అష్టమ వాకము రక్షణ అని స్పష్టము చేసినది
 రక్షణదాయినిగా పంచాక్షరిని పట్టుకుంది


 పంచాక్షరి మధ్యములో పదిలముగా కూర్చుంది
 రెండక్షములను దాచలేని దైవము నీవేనంది

 పంగనామము పెడతావని నీ నామము అనుకుంటోంది
 గంగపాలు చేస్తావేమో నన్ను నీ చేతకానితనముతో

 ఇన్నాళ్ళు నమ్ముకున్న నన్ను ఇప్పుడు కాదంటే నేను
 ఎక్కడికి పోతానురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-71



  శివ సంకల్పము-71
 చీమలు పెట్టిన పుట్టలను  నీ పాములు దోచేస్తున్నాయిరా
 తేనెను చేర్చిన పట్టును నీ భృంగి దోచేస్తున్నాడురా

 కోతకు వచ్చిన పంటను నీ శిగగంగ ఎత్తుకెళ్తోందిరా
 వాటితో పోటీగా నీ చేతివాటము చూపిస్తున్నావురా

 వేటిని వదలకుండ దాటించేస్తున్నావురా
 ప్రళయమనే పేరుతో ప్రపంచాన్నే దోచేస్తున్నావురా

 ఓం నమఃచోరాయచ అని అన్నదే తడవుగా
 ఓనమాల ఆనవాలు ఓంకారము దోచేస్తున్నదిరా

 నేరమేమి కాదంటున్న దొంగతనపు దొరవు నీవు
 రాబడి సరిపోయిందని నీ దోపిడిని ఆపకుంటే

 సకల జనులు సతమవుతున్నారు, సంపదలను
 దక్కనీయమోనని ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-72

 శివ సంకల్పము-72

 శ్రీ కాళి విశ్వేశ్వరాలయములో స్ఫటికలింగ సామివి
 కాళేశ్వర క్షేత్రములో రెండు లింగాల సామివి

 భీమేశ్వర క్షేత్రములో రెండు రంగులున్న సామివి
 కొత్త కొండ క్షేత్రములో కోరమీసాల సామివి

 కాకాని క్షేత్రములో కరుణామయ లింగసామివి
 కోటప్ప కొండలో త్రికూటేశ్వర సామివి

 అమరావతి క్షేత్రములో అతి పొడుగు సామివి
 పలిమెల క్షేత్రములో కొప్పు లింగేశ్వర సామివి

 గుడిమల్లన్న క్షేత్రములో పురుషాంగపు సామివి
 శ్రీపల్లి కొండేశ్వరములో శయనించిన సామివి

 విరూపాక్షపురములో అర్థనారీశ్వర సామివైతే
 ఎక్కడరా నీ మూలము ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-73


     శివ సంకల్పము-73

 నారాయణుడు అలరారాడు అవతారాలతో
 వాసుకి అనుసరించాడు అవతారాలతో

 ఆదిశక్తి అనుగ్రహించె అనేక అవతారాలతో
 అమరెగా ఆయుధాలు తాము అవతారాలతో

 ప్రతిజీవి పయనము పదే పదే అవతారాలతో
 యక్ష,గంధర్వులు వచ్చారు ఎన్నో అవతారాలతో

 కాల పురుషుడు కనిపిస్తున్నాడు ఆరు అవతారాలతో
 భక్తులు సేవిస్తున్నారు సరికొత్త అవతారాలతో

 భవతారణ కారణాలుగా ఎన్ని అవతారాలో
 కలియుగమున కానలేము కరుణ అవతారము,నీవు

 అవతారాలెత్త లేక అంశతో సరిపెట్టుకున్నావంటే నీకు
 ఉక్రోషము లేదురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-74

   శివ సంకల్పము-74

 నవ విధ భక్తుల కొలువగ నారాయణుడివి కావు
 నవ రత్నముల కొలువగ నారాయణివి కావు

 నవరాత్రులు కొలువగ నగజాతవు కావు
 నవనీతముతో కొలువగ నగధరుడివి కావు

 నవధాన్యముల కొలువ నవ గ్రహములు కావు
 నవ కలశమున కొలువగ దివ్య జలమువు కావు

 నవమినాడు కొలువగ నవమి పుట్టినవాడవు కావు
 నవనాడుల కొలువగ ఆత్మారాముడివి కావు

 నవమాసములు కొలువగ కన్నకొడుకివి కావు
 ఎవరివో ఏమో నీవు ఎన్నలేముగ మేము

 ముక్కంటివి అంటుంటే ముక్కోటి అంటూంటే నాలో
 పెక్కు ప్రశ్నలేనురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-75

 శివ సంకల్పము-75

నిన్నసలింతయు లెక్కచేయడుగా ఆ దక్షమహారాజు
నీ కళ్యాణపు కర్తయైనాడుగా ఆ రతిరాజు

నీ సేమపు మామయైనాడుగా ఆ హిమరాజు
నీ తలపై కొలువైనాడుగా ఆ నెలరాజు

నీ వంటికి తను వస్త్రమైనాడుగా ఆ కరిరాజు
నీ కంఠపు కంటెగ మారినాడుగా ఆ భుజగరాజు

నీ మ్రోలన్ కొలువైనాడుగా ఆ వృషభరాజు
నీతోబాటుగా తాను కూర్చుండెగా ఆ యమరాజు

విరాజమానుడివి అన్నా నువు రాజువి కాదని
ఇందరు రాజులు మందహాసముతో నిన్ను ఆడింపంగా

నటరాజు-అను ఒక రాజును నీకొసగిరి నీ
తక్కువ చాటేందుకురా ఓ తిక్క శంకరా

SIVA SANKALPAMU-76

ఓం నమ: శివాయ -76
"గంగాధర" అని పిలువగ గంగ తొంగి చూస్తుంది
"ముక్కంటి" అని పిలువగ తిక్క కన్ను పలుకుతుంది
"శశిశేఖర" అని పిలువగ జాబిలి ఊకొడుతుంది
"కపర్ది"' అని పిలువగ కచభారము కదులుతుంది
"నంది వాహన" అనగ ఎద్దు సద్దు చేయకంది
"జంగమ దేవర " అంటే లింగము పలుకలేనంది
"నాగేశ్వర" అనగానే పాము ఆగమంటుంది
"అర్థ నారీశ్వర" అనగానే అమ్మ మిన్నకున్నది
"పశుపతి" అని పిలువగానే పాశమేమిటంటుంది
"ఏక నామధారివి" కావని ఎకసక్కెము చేస్తున్నవి
"శివోహం" అను జపమాపి నేను నిన్ను పిలువగా
"ఒక్క పేరు" చెప్పవేరా ఓ తిక్క శంకరా.SIVA 

SIVA SANKALPAMU-77

ఓం నమ: శివాయ -77
భక్త పరాధీనతతో బడలిపోయి ఉన్నావని
నక్తపు నియమాలతో నకనకలాడుతున్నావని
భక్ష్యభోజ్య చోహ్యములు,లక్షణమగు లేహ్యములు
చవులూరు చెరకు రసము,ఆహా అను అతిరసములు
నారికేళ జలాలు,నానా తినుబండారాలు
మధురస మామిడిపళ్ళూ,మంచి నేరేడు పళ్ళు
చక్కెరకేళి పళ్ళు,చక్కనైన ద్రాక్షపళ్ళు
ఆరు రుచుల ఆథరువులు ఆత్మీయ సమర్పణలు
పోషణలేక నీవు సోషతో సొక్కిపోతావని
మక్కువతో తినిపించగ గ్రక్కున నేను వస్తే
విషము రుచి నీకంత విపరీతముగా నచ్చిందా
ఒక్కటైన ముట్టవేర ఓ తిక్క శంకరా

SIVA SANKALPAMU-78

ఓం నమ: శివాయ -78
బావిలోన నీవున్నావని భక్తుడిగా నేవస్తే
బావిలోని కప్ప నిన్ను తనతో పోల్చుకుంది
కొండమీద నీవున్నావని కొలువగ నేవస్తే
బండరాయి కూడ నిన్ను తనతో పోల్చుకుంది
బీడునేల నీవున్నావని తోడు కొరకు నేవస్తే
జోడువీడు అంటు బీడు తనతో పోల్చుకుంది
అటవిలోన ఉన్నావని అటుగా నేవస్తే
జటలు చూడు అంటు అడవి తనతో పోల్చుకుంది
చెట్టులోన ఉన్నావని పట్టుకొనగ నేవస్తే
పట్టులేక ఉన్నావని చెట్టు తనతో పోల్చుకుంది
సఖుడివి నీవై సకలము పాలిస్తుంటే
ఒక్కరైన పొగడరరేర ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-79

ఓం నమ: శివాయ  -79
నీ నెత్తిమీది గంగను చూసి నదులు బెంగపడ్దాయట
మా నెత్తిమీదికి ఏ ఆపద ముంచుకొస్తుందో అని
నీ కంఠమంటిన పామును చూసి కొండచిలువలు బెంగపడ్దాయట
మా కంటిముందు ఏ దండన వెన్నంటి ఉందో అని
నీ చేతిలోని మృగమును చూసి వాటికి సంతోషము మృగ్యమై పోయెనట
వాడి బాణమేదో తమను దాడిచేయనుందని
నీ గజ చర్మమును చూసి గజములు గజగజలాడుతున్నాయట
పొట్టచీల్చి ఎవరు తమను పొట్టను పెట్టుకుంటారో అని
నీ బ్రహ్మ పుర్రెలు చూసి జనము విలవిలలాడుతున్నారట
రిమ్మతెగులు తగులుకొని దుమ్ము నోట కొడుతుందేమో అని
"దయనీయశ్చ దయాళుకాస్తి" అని సువర్ణమాల అనగానే
నే ముక్కున వేలేసానురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-80

ఓం నమ: శివాయ 80
****************
ఆంతర్యము ఏమోగాని వెలుగసలే తెలియని
అమావాస్య చీకటికి ఆనంద పడతావు
విడ్డూరము ఏమోగాని వివరమసలే తెలియని
గంగ అభిషేకములకు పొంగిపోతు ఉంటావు
పూర్వ పుణ్యమేమోగాని పువ్వులసలే తెలియని
మారేడు దళాలకు మహదానంద పడతావు
ఇంద్రజాలమేమో గాని అందమే తెలియని
బూదిపూతలకు నీవు మోదమెంతో పొందుతావు
నీ దయ ఏమోగాని నియమ పాలనే తెలియని
నికృష్టపు భక్తులను నీ దరిచేర్చుకుంటావు
కనికట్టు ఏమోగాని అసలు నీ జట్టే తెలియని
ఒక్కడిని ఉన్నానురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-81


 
  ఓం నమ: శివాయ -81
కళల మార్పుచేర్పులతో కదులుచున్న చంద్రుడు
నీ సిగముడుల చీకట్లో చింతిస్తూ ఉంటాడట
కుబుసపు మార్పుచేర్పులతో కదలాడు పాములు
నీలలోహిత చీకట్లో చింతిస్తూ ఉంటాయట
కునుకురాక తెరువలేక కుదురులేని మూడోకన్ను
తెర తీయని చీకట్లో చింతిస్తూ ఉంటుందట
ఆకాశము నుండి సాగి జార అవకాశము లేని గంగ
బందిఖానా చీకట్లో చింతిస్తూ ఉంటుందట
చీకటిని తొలగించలేని జ్యోతి శివుడేనట
చింతలు తొలగించలేని వింతశక్తి శివుడట
దోషము తొలగించలేని వానికి ప్రదోష పూజలా అంటూ
ఒక్కటే గుసగుసలు ఓ తిక్క   శంకరా.

SIVA SANKALPAMU-82

ఓం నమ: శివాయ -82
ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా
భక్తి మకరందమును గంధముగా పూయనా
ఆది, అనాది నీవంటూ బూదిని నే పూయనా
శాంతి,సహన పుష్పాలతో పూజలు నేచేయనా
పాప రహితము అనే దీపమును వెలిగించనా
పొగడ్తల పూల వాసనలు అను పొగలను నే వేయనా
లబ్బు-డబ్బు శబ్దాలతో స్తోత్రములను చేయనా
ఉచ్చ్వాస-నిశ్వాస వింజామరలనే వీచనా
అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా
హరహర మహదేవ అంటు హారతులనే ఈయనా
దాసోహం దాసోహం అంటు ధన్యతనే పొందనా
నా పక్కనే ఉన్నావురా చూడ చక్కనైన శంకరా.

SIVA SANKALPA MU-83

ఓం నమ: శివాయ -83
సూక్ష్మము నేనంటావు స్థూలముగా ఉంటావు
వీరుడినని అంటావు పారిపోతు ఉంటావు
ఆది నేను అంటావు అనాదిగా ఉంటావు
సన్యాసిని అంటావు సంసారిగ ఉంటావు
పంట భూమినంటావు బీడునేలవవుతావు
జలాశయమునంటావు ఒయాసిస్సువవుతావు
రాజుని నేనంటావు బంటుగా మారుతావు
ప్రణవము నేనంటావు ప్రళయముగా మారుతావు
స్థాణువు నేనంటావు తాండవమాడుతుంటావు
అనుక్షణము సాగుతావు ఆరునెలలు దాగుతావు
దాగుడుమూతలు చాలుర కుదురు లేకుంటేను
వెక్కిరింతలేనురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-84

ఓం నమ: శివాయ -84
దారుణ మారణ కాండను కారుణ్యము అంటావు
పొట్ట చీల్చి గజాసురుని మట్టి కరిపించావు
చుట్టుకుంది అతని తల నీ సుతు శరీరమునే
కన్ను తెరిచి మన్మథుని కన్ను మూయించావు
కన్నుల పండుగ ఐనది నీ కళ్యాణముతో
బాణమేసి వరాహము ప్రాణమే తీసావు
పాశుపతము చేరినది అర్జునునికి ఆశీర్వచనమై
హరిని అస్త్రముగా వాడి త్రిపుర సమ్హారము చేసావు
విరచితమైనది వీరముగా హరి మహిమ
ఎటు చూసిన పాతకమే నీ గతముగా మారితే
నీకు "మహాదేవం,మహాత్మానాం,మహా పాతక నాశనం" అని స్తుతులా అంటే
చక్క బరచుట అంటావురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-85



తిరిపమెత్తువాడవని నిరుపేద శ్రీనాథుడు
గలగల ప్రవహించనీయవని,గడుసువాడవని గంగ
చర చర పాకనీయవని చతురుడవని కాళము
పరుగులు తీయనీయవని పాశమున్నదని లేడి
కిందకు జారనీయవని నిందిస్తున్నది విషము
కదలనేనీయవని వంతపాడు జాబిలి
కట్టడి చేస్తున్నావని కట్టుకున్న కపాలములు
హద్దు దాటనీయవని వద్దనున్న వృషభము
ఆ లయకారుడు అసలు "ఆలయమున" ఉంటాడా?
మేమెంతో గొప్పవారమంటూ వంతులవారీగా
నీ చెంతనే ఉంటూ కాని చింతలు చేస్తుంటే వాని
పక్క దారి మార్చవేరా ఓ తిక్క శంకరా.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...