పాహిమాం మహిషాసురమర్దిని-రమ్యకపర్దిని శైలసుతే
*********************** ॥ (సౌందర్యలహరి)
"భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం-
ఇతి స్తోతుం వాంఛన్ కథయతి" భవాని" త్వమితి యః ।
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా."
తల్లీ భవానీ!
ముకుంద-బ్రహ్మేంద్రాదులు వారి రత్నమయ కిరీటములతో శిరసు వంచి నీపాదపద్మములకు హారతులు పట్టుచున్నారు అని అమ్మను సంస్తుతిస్తున్నారు శ్రీ ఆదిశంకరులు.
క్షీణే పుణ్యం...పుణ్యము యొక్క హెచ్చు-తగ్గుల లెక్కలే కూడికల-తీసివేతలే జీవుల కర్మఫలితములు అని తెలియచేయు దివ్యచరితములే దేవికథలు-కథనములు.సూత్రధారియైన ఆ జగన్మాత ఎన్నో పాత్రలను/ఎందరో పాత్రధారులను కల్పించి కామితార్థములను అనుగ్రహిస్తుంది.
అందుకు ఉదాహరణమే బ్రహ్మ-విష్ణు-ఇంద్రాదులు,(మకుటనీరాజిత.)
భవాని త్వం దాసే అంటూ అమ్మను స్తుతించటము.
త్రిమూర్తులు మాత్రమే కాదు
శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రములో నుతింపబడినట్లు,తల్లి
"దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా"
ఆ పరాత్పరి అనిశము,
బ్రహ్మాదులను దేవతల చేతను,నారదాది దేవర్షుల చేతను,వశిష్టాది ఋషుల చేతను ఆదిత్యాది గణముల చేతను స్తుతింపబడు కొత్త అవతారమును ప్రకటించుకొనుటకు కారణము?
" ఆనందామృతాకర్షిణి-అమృత వర్షిణి
హరాది పూజితే శివే-భవాని." ముత్తుస్వామి దీక్షితారు.
ఆకర్షించుట-వర్షించుట అనగా ప్రకాశము-విమర్శ రెండును తానైన భవాని మహిషాసురమర్దినిగా అవతరించుటకు కారణమెవరు?
ఇంకెవరు? మహిషాసురుడు.
సంకేత పరముగా చూస్తే స్రక్/చర్మము/స్పర్శ అను ఇంద్రియములు
మందముగా కలవాడు.
మనము వింటూనే ఊంటాము.చురుకుదనములేని వానిని గురించి
చెప్పేటప్పుడు"దున్నపోతు మీద వాన పడ్డట్లు" అంటూ.
మామూలు వర్షమునకే చలించని చర్మముగల మహిషము అమృత వర్షమును ఆస్వాదించగలదా? అనునది ఒక సందేహము.
అంతేకాదు.తామసమునకు/చీకటికి మారురూపైన నల్లని ఛాయ.తామస ప్రవృత్తి.
అంతటితో ఆగలేదు.
అహంకారమునకు ప్రతీక రెండు వాడి కొమ్ములు.
రూపమును వివరిస్తుంటే ముట్టెతో/గిట్టలతో తన్నే స్వభావము మరచిపోకూడదనిపిస్తుంది.
ఇష్టమొచ్చినట్లు మాట్లాడటము ముట్టెతో తన్నటము. బలముతో అణిచివేయాలనే తత్త్వము కాలిగిట్టలతో తన్నడము.
ఇన్ని అవలక్షణములను ఒకేచోట పోగుచేసుకుని ఉన్న అసురీశక్తులను మర్దించవలెనన్న
అమ్మ కొత్త రూపమును-స్వభావమును అనుగుణముగా ప్రకటించవలసినదే.వానిని/మనలను వాటి నుండి విముక్తులను చేయవలసినదే.మనము ప్రస్తుతించవలసినదే.
అప్పుడే కదా మనమా ఆనందామృతవర్షధారలలో ఆడిపాడగలము.
వరగర్వమొతో అహంకరించుచుహవిస్సులను అందనీయక, ఇంద్రునిపై దండెత్తిన మహిషుని ధాటికి తట్టుకోలేని దేవతలు స్వర్గమును వీడి,అధికారమును కోల్పోయి భూలోకమున సామాన్యులవలె సంచరించసాగిరి.
"బుద్ధిః కర్మానుసారిణి" రాబోయే పరిణామములకు సూచనగా మహిషుని పాపకృత్యములు పరాకాష్ఠకు చేరుచున్న సమయమున వానిదగ్గర సద్దుమణిగిన సత్వము దేవతలను చేరినదా అన్నట్లు వారందరు తమను ఈ ఆపదనుండి రక్షింగలిగినది ఆ పరాశక్తియే అని అర్థముచేసుకొనగలిగిరి.రాజ్యముతో పాటుగా రజోగుణము కనుమరగైనదేమో వారు ముకుళిత హస్తములతో ,
" ఓం జయంతీ మనగళా కాళీ భద్రకాళీ కపాలినీ
దుర్గా క్షమా శివాధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే
జయత్వం దేవి చాముండే జయభూతార్తి హారిణి
జయసర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే."
అని ప్రార్థించిరి.
వారిని అనుగ్రహించదలచిన ఆ తల్లి,
" ఏకస్థం తదభూన్నారీ వ్యాప్తలోకత్రయం త్విషా
యదభూచ్ఛాంభవన్ కేశా బాహవో విష్ణుతేజసా"
సకలదేవతల శరీరములనుండి పుట్టి ఒకటిగానై ముల్లోకములలో వ్యాపించిన ఆ మహాతేజస్సు స్త్రీ రూపమును దాల్చెను.
సకలదేవతల శక్తులనుండి తానొక్కొక్క అవయమును ఏర్పరచుకొని అసమాన సౌందర్యముతో అబ్బురకొలుపుచుండెను.
" అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయికరే
త్రిభువనమస్తక-శూల-విరోధి-శిరోధి-కృతాఽమల-శూలకరే "
సమస్త తేజములతో నేర్పడిన దేవిని దర్శించి దేవతలు, వారి భక్తి సమర్పణ భావముతో తలొక అలంకారమును,ఆయుధమును సమర్పించిరి.
పురాణ కథనము ప్రకారము,
కశ్యప ప్రజాపతికి దనదేవి యందు జన్మించిన దానవులలో రంబుడు-కరంబుడు అను ఇద్దరు అన్నదమ్ములు అత్యంత శక్తివంతమైన సంతానము కొరకు పరమేశ్వరుని ఈ క్రిందివిధముగా ధ్యానించసాగిరి.
రంబుడు దక్షిణాగ్ని,ఉత్తరాగ్ని,పశ్చిమాగ్ని,ప్రాగగ్ని ఉపరితలమున కల ప్రచండ సూర్యాగ్ని మధ్యమున నిలిచి ఘోరతపమును ఆచరించసాగెను
అతని తమ్ముడైన కరంబుడు జలదిగ్బంధనములో కఠోర తపమాచరించు చుండగా,దాని వలన కలుగు దుష్పరిణామ నివారణకై,ఇంద్రుడు మొసలిరూపమున దాగి,వానిని సంహరించెను.
విషయమును తెలిసికొనిన రంబుడు పగతో రగిలిపోతూ,శత్రువులను జయించాలంటే బలాఢ్యుడైన పుత్రుని సహాయము ఎంతో కలదని గ్రహించి,అగ్ని దేవుని ప్రార్థించ సాగెను.ఫలితము కానరాకున్న,తపమును మరింత ఉదృతమును కావించెను.అయినను అగ్నిదేవుడు కరుణించలేదని,తన తలను అగ్నికి సమర్పించుటకు ఉద్యుక్తుడాయెను రంబుని నిష్ఠకు సంతసించి అగ్ని వరమును కోరుకోమనెను.
రంబుడు బాగుగా ఆలోచించి కామరూపి ,అజేయుడు,ముల్లోకములను జయించగల కుమారుని కోరుకొనెను.అందులకు అగ్ని రంబుడు వెనుదిరిగి వెళ్ళునప్పుడు దేనిని చూసి/లేదా ఎవరిని చూసి మోహవివశుడగునో వారికి జనించిన కుమారుడు రంబుని కోర్కెను తీర్చగలడని పలికి అంతర్ధానమయ్యెను.
వెనుదిరిగి చనునపుడు ఎందరో సౌందర్యవతులు,అప్సరసాంగనలు తారసపడినా రంబుడు ఎటువంటి మన్మధ వికారమును పొందలేదు.ప్రయాణమును కొనసాగించుచుండగా అక్కడ
మరీచి మహాముని శాపవశియై మహిషి రూపములో సంచరించుచున్న ఒక మహిష్మతి అను గంధర్వ కన్యను చూచినంతనే మోహితుడాయెను.
తత్ఫలితముగా మహిషము గర్భమును ధరించినది.రంబుడు ఆ మహిషమును తన నగరమునకు తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా చూసుకొనసాగెను.ఒక ముహూర్తమున ఆ మహిషము దున్నపోతు తల-మానవ శరీరము గల ఒక దూడను ప్రసవించి ,శాప విమోచినియై తన గంధర్వ లోకమునకు పోయెను.
దైవ నిర్ణయ ప్రకారము మహిషుడు బ్రహ్మగురించి ఘోరతపమును చేయగా,సంతసించిన బ్రహ్మ ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను.మహిషుడు తనకు మరణములేని వరమును ప్రసాదించమనెను.అందులకు తనకా శక్తి లేదని,కల్పాంత సమయమున తానును నిష్క్రమించువాడనని,మరేదైనా వరమును అనుగ్రహించెదననెను.మహిషుడు అహంకారముతో "అబలలను అరికాలితో అణచివేయగలను" అని తలచి స్త్రీలు తప్ప ఎవరు తనను సంహరించని వరమును పొందెను.
అమ్మవారి లీలావైభవములే ఈ అసురుల విజృంభణలు
కథను ముందుకు నడిపిస్తూ,కారుణ్యము తోసివేస్తూ,కాఠిన్యమును స్వాగతిస్తూ,మహిషుడు
తాను ఆదమరచినవేళ దేవతలు సుఖసంతోషములతో నుంటున్నారని గమనించి , తన తామస ప్రవృత్తికి మరింత రాజసమును తోడుచేస్తూ సత్వమును సాంతముగా తొలగించివేశాడు.
త్రిగుణములు ఆడుతున్న ఆటకు మరింత ఉత్కంఠతను కలిగిస్తూ,మేమున్నామంటూ అరిషడ్వర్గములు వానిని చేరి గంతులు వేయిస్తున్నాయి గమ్యము తెలియని వైపుకు.
స్వర్గము మీది కామము,మోహముగా మారి దానిని వీడకయున్న వారిపై క్రోధముగా రూపుదిద్దుకున్నది.లోభము అసలు కొంచము కూడా సర్దుకోవలసిన పనిలేదంటూ వారిపై యుద్ధానికి పురిగొల్పింది.మదము-మాత్సర్యము మరింత కొత్త పుంతలు తొక్కి దేవతలను స్వర్గము నుండి పోరాడలేక వీడి పోవునట్లు చేసినవి.
వికృత సైన్యము ఒకవైపు-వినయపు స్థైర్యము మరొకవైపు దోబూచులాతున్నాయి.
అసురుని వీడిన సత్వము సురలను చేరినదా అన్నట్లు వారి తమ అశక్తతను గ్రహించి,నిశ్చలభక్తితో "అయిరణ దుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తిభ్రుతే"
ఓ జగజ్జననీ!పోరాటములయందు పొగరుబోతు శత్రువులైన అసురులను వధించుటకు సర్వదేవతా శక్తులను సమిష్టీకరించిన శరణాగత రక్షిణి'
అంటూ అమ్మ చరణములను శరణుగోరుచున్నారు.
" మామవ సదాజనని" కథను ఏ విధముగా నడిపిస్తుందో తానుగా రంగ ప్రవేశము చేస్తుందో/లేక తాను పరోక్షముగా ఉండి మరెవరినైన ప్రత్యక్ష పరుస్తుందో అమ్మ దయతో రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీమాత చరణార విందార్పణమస్తు.