కాత్యాయిని విద్మహే గారికి నమస్కృతులతో
***********************************
గురజాడ వెలుగుకై గురిపెట్టిన బాణంలా
ఇంతివై,ఇంతింతై,ఇంతుల పూబంతివై
యెంతెంతో ..సాధిస్తూ,రాజాస్థానము నీ
ప్రస్థానము గుర్తు చేస్తుంటే
.......................................
ఆపాత మధురమనె తాతమ్మగా
తీయగ నిను దీవించె కాకతీయ గంగమ్మ.
దినదిన ప్రవర్ధమాన దిక్సూచికి అమ్మమ్మగా
దిశా నిర్దేశం చేసె తాళ్ళపాక తిమ్మక్క.
కోటి కళల జాబిలికి రామకోటిశాస్త్రి తండ్రిగా
పాండిత్యము పోతపోసె బమ్మెర పోతన
ఇందిరాదేవి మధుర మందహాస తల్లిగా
నినుకని పెంచె మంచిపంచ కల్పవల్లి
సత్యలోక రంగవల్లికి పినతల్లిగా
బలమగు కలము నొసగె కవయిత్రి మొల్ల
ముదితల తలపుల నిండిన ముద్దూ ముచ్చటగా
పద్ధతిగా మారింది ఆ ముద్దుపళని
తరములెన్ని మారినా తరగని ఆలంబనగా
తరిలింది మీతో తరిగొండ వెంగమాంబ
ప్రపంచీకరణ విపంచికి కీరవాణిగా
పదును బాణీ నందించె ఆ మధురవాణి
భావ ప్రవాహములో సాగిరి కోయిలలుగా
నాయక రంగాజమ్మ,నేటి రంగనాయకమ్మ
విపులముగా సాగనీ రిపుసంహారము
కొత్త పాత కలముల ప్రస్తుతి" జయజయహే"
(కేంద్ర సాహిత్య పురస్కారమునే తిరస్కరించిన ధీరవనిత కాత్యాయిని గారు)