Thursday, May 28, 2020

OM NAMA SIVAYA-09

ఓం నమ: శివాయ

భక్త పరాధీనతతో బడలిపోయి ఉన్నావని
నక్తపు నియమాలతో నకనకలాడుతున్నావని

భక్ష్యభోజ్య చోహ్యములు,లక్షణమగు లేహ్యములు
చవులూరు చెరకు రసము,ఆహా అను అతిరసములు

నారికేళ జలాలు,నానా తినుబండారాలు
మధురస మామిడిపళ్ళూ,మంచి నేరేడు పళ్ళు

చక్కెరకేళి పళ్ళు,చక్కనైన ద్రాక్షపళ్ళు
ఆరు రుచుల ఆథరువులు ఆత్మీయ సమర్పణలు

పోషణలేక నీవు సోషతో సొక్కిపోతావని
మక్కువతో తినిపించగ గ్రక్కున నేను వస్తే

విషము రుచి నీకంత విపరీతముగా నచ్చిందా
ఒక్కటైన ముట్టవేర ఓ తిక్క శంకరా.

భావము

ఒక్కపూట ఆహారముతో (నక్తము) శివుడు నీరసముగా,చిక్కిపోయి ఉన్నాడని,అనేక మథుర పదార్థాలను సమర్పించుదామని,తినిపించుదామని భక్తుడు వస్తే,శివుడు వాటిని స్వీకరించుటలేదు-నింద.

పరమేశ్వరుడు సర్వజనుల మేలుకొరకు మథురస పదార్థములకన్న విషము స్వీకరిచడానికి సంసిద్ధుడైనాడని స్తుతి.

( ఏక బిల్వం శివార్పణం ) 

OM NAMASIVAYA-08

ఓం నమ: శివాయ

కాదనలేవుగ పాముని,కాదనలేవుగ చీమని
కాదనలేవుగ లేడిని,కాదనలేవుగ వేడిని
కాదనలేవుగ దండని,కాదనలేవుగ కొండని
కాదనలేవుగ తేటిని,కాదన లేవుగ నీటిని
కాదన లేవుగ బూజుని,కాదనలేవుగ బూదిని
కాదన లేవుగ మేథని,కాదన లేవుగ వ్యాధిని
కాదనలేవుగ గౌరిని,కాదనలేవుగ శౌరిని
కాదనలేవుగ సుతులని,కాదనలేవుగ నుతునులని
కాదన లేవుగ విందుని,కాదనలేవుగ విందుని
కాదనలేవుగ మునులని,కాదనలేవుగ జనులని
ఒకే ఒక్కసారి నిన్ను ఒక్కడినే రమ్మంటే,ఈ
తొక్కిసలాటేమిరా ఓ తిక్క శంకరా
...............
శివా నువ్వెక్కిడికైనా వెళ్ళాళంటే నీతో పాటు పాముని,చీమని,అగ్గిని,లేడిని,పూలదండలుగ మారిన భక్తులని,మంచు కొండని,అమ్మవారి తుమ్మెదలవంటి జుట్టుని(అర్థనారీశ్వరము)నీ జడలలోనున్న గంగని,సాలె పురుగు నీకై నేసిన బూజుని,మన్మథుని శరీరము నుండి వచ్చిన బూడిదని,దక్షిణా మూర్తిగా మేధను,భక్తుల వ్యాధిని,కొడుకులను,పొగడ్తలనుమునులను,జనులను విందుకు పిలిచిన భక్తుని దగ్గరకు తీసుకెళ్తాడని నింద.వాటికి,శివునికి భేదములేదని స్తుతి.

OM NAMA SIVAYA-07



  ఓం నమ: శివాయ-07

******************

కృతయుగము వాడివి అనిచెప్పి కృతకృత్యులైన వారు కొందరు
త్రేతాయుగము వాడివని తేల్చేసిన మరికొందరు

ప్రాచీన గోచరుడివి అనిచెప్పే ఆచార్యులు కొందరు
ద్వాపరము వాడివి అని చెప్పిన దార్శనికులు కొందరు

శతాబ్దముల వాడివి అని చెప్పే లబ్ధ ప్రతిష్టులు మరి కొందరు
తరతరాల పురాతనమే అన్న పండితులుకొందరు

పరమ ముసలివాడివి అన్న ప్రళయ సాక్షులు కొందరు
అబ్బో కాలాతీతుడు అని నీ తెలివిని పొగిడే కొందరు

"నమ: శివాభ్యాం నవ యవ్వనాభ్యాం" అని అన్నారే అనుకో
నవ్వుకుంటు విని దానిని నువ్వు చిందులేస్తుంటే

పరుగులు తీసే వయసును నువు మరుగున దాచేస్తున్నావని
ఒక్కటే గుసగుసలు ఓ తిక్క శంకరా.

  శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఉమా మహేశ్వర స్తోత్రములో శివుని నవయవ్వనుడు అనగానే,తాను ఎప్పటినుండియో ఉన్నప్పటికి తన వయసును దాచేసి,సంతోషముతో శివుడు నాట్యము చేస్తున్నాడని నింద.
    "నమో పూర్వజాయచ-పరజాయచ" శివుని తాపై అభరణమైన చంద్రవంక,చేతిలోని పుర్రె శివుని కాలాతీత తత్త్వానికి సంకేతములుగా సంకీర్తించుచున్నవి.

  (ఏక బిల్వం శివార్పణం)



OM NAMA SIVAAYA--06


  ఓం నమః శివాయ-06
  ****************

  జలచరముల ఎంగిలిజలములు అభిషేకములు
  ఝంకారములు వినిన  మల్లియలు అలంకారములు

  లాలాజలమున తడిసి, మేలైనవి మంత్రములు
  గాలివాటమునకు కదిలి గుబాళించు పరిమళములు


  హృద్యమో/చోద్యమో చెంచులు పంచుతున్న ప్రసాదములు
  ముంతలు-వింతలు-వంతలు-ఇంతే సంగతులు

  నీదికానిదేదైనా నీకు నైవేద్యము చేయాలిగా
  నిన్ను ధ్యానించమనిన తనపని కాదంటుంది

  నిలకడగ ఉండమనిన అటు-ఇటు పరుగిడుతుంది
  వద్దన్న పనులుచేస్తు,తనను ముద్దాడమంటుంది

  బుధ్ధిలేక ఉంటుంది-హద్దు మీరుతుంది,నా
  తైతక్కల మనసు నీది ఓ తిక్కశంకరా.



  శివునికి ఎంగిలి నీళ్ళ అభిషేకము,ఎంగిలి పూలమాలల అలంకారము ఇష్టము.మంచి-చెడు వాసనలను సమముగా స్వీకరించు గాలి తెచ్చిన పరిమళములు ఇష్టము.అంతే కాదు చెంచులు అందించు మద్యమాంస సమర్పణము ఇష్టము.నైవేద్యముగా స్వీకరించి వారికి ప్రసాదమును అందిస్తాడు.వారి మాటలకు తాన-తందాన అని వంత పాడుతాడు.అట్తి శివుని నా తైతక్కలమనసే సరియైన నైవేద్యము.-నింద



  " నమో విరూపేభ్యో-విశ్వరూపేభ్యశ్చః" నమో నమః.మనము ఏది వికారరూపము అనుకుంటామో-విశిష్ట రూపము అనుకుంటామో-విశ్వము అనుకుంటామో అన్నియును రుద్రుని రూపములే.జలము-జలములోని జలచరము.పూవు-పూవు మీద వాలిన తుమ్మెద,పరిమళము-దానిని వ్యాపింపచేయు వాయువు,చెంచు-చెంచు చేయు పూజ అన్నియును శివస్వరూపములే.స్వామి కరుణయే పదార్థమును ప్రసాదముగా మలచుచున్నది.స్వామి నా తైతక్కల మనసును స్పృశించి,దానికి ఆధ్యాత్మిక అనుభవమును అనుగ్రహించు.నమస్కారములు.-స్తుతి.


   ఏక బిల్వం శివార్పణం.

.

OM NAMA SIVAAYA-05

 ఓం నమః శివాయ-05
  ******************

  తిండిధ్యాస నేర్పావు తినమంటు చీమకి
  దాచుకుంటుంది తప్ప దానమేది దానికి

  భిక్షాటన నేర్పావు శిక్ష అంటు పుర్రెకి
  అడుక్కుంటుంది తప్ప ఆతిధ్యమేది దానికి

  పట్టుబడుట నేర్పావు పరుగుతీయు లేడికి
  కవి చమక్కులు తప్ప కలిసొచ్చినదేమి దానికి

 పొర విడుచుట నేర్పావు కుబుసముల పాముకి
 పైపై అందములు తప్ప పరమానందమేది దానికి

 పంచుకొనుట నేర్పావు మాతల్లి పార్వతికి
 గురుదక్షిణ సగమైతే సగభాగమే మిగిలినది

 పరిహాసపు గురువు నీవు పరమగురువుల
 లెక్కలోకి రావురా! ఓ తిక్క శంకరా.


శివుని కరుణతో చీమ గింజగింజ పోగుచేసుకొంటున్నది.పుర్రె భిక్షాపాత్రగా మారినది.లేడి పరుగులు ఆపివేసినది.తల్లి స్వామికి తన సగభాగమును అర్పించి అర్థనారీశ్వరిగా మారినది-.నింద

   సర్వాంతర్యామి యైన సదాశివుడు ఉపాధులను అనుసరించి ప్రతి జీవికి కొన్ని ప్రత్యేకలక్షణములను ప్రసాదించినాడు.దేని ప్రత్యేకత దానిదే.చీమలో ముందు చూపు,పుర్రెలో కాల సంకేతము,( అవి బ్రహ్మ పుర్రెలు) పాములో సస్వరూపము,లేడిలో స్థిరచిత్తము,తల్లిలో మూలప్రకృతి తత్త్వమును వివరించుచు,ఏ వేదంబు పఠించె లూత"
 స్వామి చరణసేవా సన్సక్తియే గాని ఉపాధి కాదని సద్గతికి చాటినాడు.-స్తుతి.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...