తిరుప్పావై-పాశురం-19
*********************
" నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థం స్వశృతిశతశిరస్సిద్ధమధ్యాపయంతీ
స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తుభూయః."
పూర్వ పాశుర ప్రాభవము
******************
పదిమంది గోపికలతో నందగోపభవనమునకు వచ్చి,వారిని నోమునకు రమ్మని వినతిచేసిన గోదమ్మ,నప్పిన్నాయ్ నీళాదేవిని మేల్కొలిపినది.బదులు రాలేదు వారికి.స్వామితో ఆమె ఏకాంతములో నున్నదని భావించినగోదమ్మ గోపికలతో పాటుగా వారిరువురిని మేల్కొలుటకు వచ్చినది.
ప్రస్తుత పాశుర ప్రాభవము.
***********************
రహస్యమును సదస్యము చేయుచున్నట్లుగా చర్మచక్షువులను భ్రమింపచేసే పాశురము,వారి అనుగ్రహమైనవేళ అత్యంత ఆఢ్యాత్మికము.అమృతగుళిక.మనకు అమ్మ-అయ్యల
1.దివ్య మైథునము
2.వారి మంచపు కోళ్ళు
3.దానిపై నున్న పరుపు
4.చుట్టు వేలాడుచున్న దీపములు
5.పరిమళములు
6.తలుపుతీయుటకు వారి సంభాషనము
7.అనుగ్రహించుచున్న స్వామిని అడ్డుకొనుట
8.వారి సంకీరనము
అది జీవాత్మ-పరమాత్మ దివ్య మైథునము.అమ్మ వేరు-అయ్యవేరు కాదు.వారు అవిభాజ్యులు.అనుగ్రహము పరిపూర్ణము.అందుకే వారి మధ్య నేను ముందు తలుపు తెరుస్తాను అంటే/నేను ముందు అన్న వాదులాట.
నారి మంచము నాలుగు కోళ్ళను కలిగి ఉంది.అవి
నాలుగు వర్ణాశ్రమములుగను,నాలుగు పురుషార్థములుగను,"ఆర్తో-జిజ్ఞాసి-అర్థార్థి-జ్ఞాని" అను నాలుగు అవస్థలుగాను,సమన్వయిస్తుంటారు.
పరుపు విషయమునకు మెత్తన్ని పంచశయనిత్తిల్" పంచశయన విశేషములను సంకేతిస్తారు.
1.తెల్లదనము-మృదుత్వము-విశాలము-పరిమళము-చల్లదనము అను ఐదు శుభలక్షనములను కలిగియున్నది వారి శయ్య.ఇది బాహ్యము.
ఇదియే "అర్థ పంచకము" అనగా చేతనుల ఐదు స్థితులు.
1.ప్రాప్యస్య బ్రహ్మణో రూపం-నేనెవరిని అన్న సందేహము
2.ప్రాప్యస్య ప్రత్యగాత్మః-నాలోని ఆత్మ ఎవరు?
3.ప్రాప్యస్య ఉపాయం-నేను ఏ ఉపాయముతో దానిని గుర్తించగలను
4.పేఅప్యస్య ఫలంప్రాప్తే-దాని వలన నాకు లాభమేమిటి?
5.ప్రాప్యస్య విరోధిచ-నేనెందుకు దానిని చేరలేక పోతున్నాను అన్న ఐదు భావముల సమస్యకు పరిష్కారమే ఆ దివ్యదంపతుల శయ్య.
నేనెవరు? భగవంతుడెవరు? వాని దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి? వెళితే ప్రయోజనం ఏమిటి?
నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను అన్న ఐదు సందేహములే అర్థపంచకము.
దానిని తొలగించగలిగేది కుత్తు విళక్కులు,గుత్తి దీపములుగా వేలాడుతూ ప్రకాశిస్తున్న ఆచార్యుల ఉపదేశములు.దానిద్వారా లభించే జ్ఞానమే ఆ పరిమళము.అటువంటి జ్ఞానమును అందించుచున్న,
ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ పాశురములోనికి ప్రవేశిద్దాము.
పాశురము
********
పంతొమ్మిదవ పాశురము.
******************
కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ర పంచశయనత్తిల్ మేలేరి
కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నయై కొంగైమేల్
వెత్తుకిడంద మలర్మార్పా వాయ్ తిరవాయ్
మైత్తిడం కణ్ణిణాయ్ నీ ఉన్ మణాలనై
ఎత్తనై పోదుం తుయిలెళ ఒట్టయ్ కాణ్
ఎత్తన ఏలుం పిరివాట్ర గిల్లయాల్
తత్తువ మన్రు తగవేలో రెంబావాయ్.
ఓం నమో లక్ష్మీ నారాయణాయనమః
******************************
ఈ పాశురములో గోదమ్మ మనకు లక్ష్మీనారాయణుల అమలిన-అమరిన మైధునపు మహోత్కృష్టతను విశదపరుస్తున్నది.
గోపికలు క్షణమైననను స్వామిదర్శనమును మరచి ఉండలేని ధన్యులు
.వారు నీలమ్మను మేల్కొలిపి స్వామిని వ్రతమునకు తీసుకుని రమ్మని చెప్పినను వారి అడుగులు ముందుకు సాగుటలేదు.ఒకసారి స్వామిని మేలుకొలిపి చూసి అమ్మను అనుగ్రహించమని అర్థించి తరలుదాము అని నీలమ్మ ఇంటిముందు నిలబడి మనసులో వారున్నస్థితిని దర్శిస్తూ,ప్రస్తుతిస్తున్నారు.
ఏ విధముగా చిన్నపిల్లలను భోజనముచేసావా? అని అడిగితే బిత్తరచూపులు చూస్తారో,ఆం తిన్నావా అని అడిగితే బదులిస్తారో,అదే విధముగా అమ్మా-నాన్నల అనురాగములో ఆనందపడాలనే మనకోసము పెరుమాళ్ళు నీలాదేవిగా-నీలమేఘశ్యామునిగా ఏనుగు దంతములు కోళ్ళుగా పెట్టబడిన మంచముపై,మెత్తని ఐదు శుభలక్షణములు కలిగిన పానుపుపై,చుట్టు గుత్తిదీపములు వెలుగు చుండగా,దయా సముద్రమనే నీలమ్మ ఎదపై,దయాళువైన స్వామి నిదురిస్తున్నట్లుగా వారికి దర్శనమిస్తున్నారట శ్రియఃపతులు.
అంతే కాదు వారు పరస్పరానురాగులుగా ప్రకటితమగుచున్నారు.
ఇట్టి రహస్య సన్నివేశమును సదస్యముగా, సభాప్రవేశము కలదానిగా చూపించుట ఎంతవరకు సమంజసము అను సందేహము కలుగ వచ్చును.
మనము దీనిని అర్థముచేసుకోవాలంటే చర్మచక్షువులతో కాకుండా పరిణితిపొందిన జ్ఞానచక్షువులనాశ్రయించాలి
వారిమంచము నాలుగు కోళ్ళు స్వామి కువలయపీడనముచేసి తెచ్చిన దంతపు కోళ్ళు.
వారి మంచము
క్కోట్టుక్కాల్ కట్ట్-ఏనుగుదంతములు నాలుగు నాలుగు కోళ్ళుగా కలది.
ఏమా నాలుగు కోళ్ళు? చతుర్వేదములు/చతుర్విధ పురుషార్థములు./ధర్మ-అర్థ-కామ-మోక్షములు.
ఆ మంచము మీద మెత్తని పంచగుణ ప్రశస్తమైన పరుపు ఉన్నదట. ఏమా పంచప్రకాశములు?
అవి,
1.స్వస్వరూపము
2.పరస్వరూపము
3.పురుషార్థస్వరూపము
4.ఉపాయస్వరూపము
5.విరోధిస్వరూపము అను
పంచవిధములుగా ప్రకటింపబడుతున్న స్వామి స్వరూప విలాసం అని కొందరు భావిస్తే,
దేవ-మానుష-తిర్యక్-స్థావర-జంగమములుగా కూడ అన్వయించేవారు మరికొందరు.పంచేంద్రియ-పంచభూత ప్రకృతిగా ప్రస్తుతించువారు కొందరు.
ఆ సెయ్య చుట్టు గుత్తిదీపములు ప్రకాశించుచున్నావట.అవి తాము కదులుతు,వెలుగులు వెదజల్లుతు చీకట్లను(అజ్ఞానమును) పారద్రోలే ఆళ్వారులు/ఆచార్యులు.
స్వామి దయాసముద్రమైన తల్లి యెదపై తలపెట్తుకుని నిదురించుచున్నాడట/విశ్రమిస్తున్నాడట.
వెత్తు కిడంద-విశ్రమిస్తున్నాడు.స్వామి సర్వజగద్రక్షణ చింతనలో నున్నాడు.
తల్లి కొప్పులో ముడువబడిన ,
కొత్తలర్ పూంగుళల్-అలర్కొత్త-పూలగుత్తులు,కొంగై-పరిమళిస్తున్నాయ్.
అమ్మ ముడిచినపూలు వికసనమును వీడనివి.విభూతులను వెదజల్లునవి.గోదమ్మ, అనంతాచార్యుని అమ్మ ధరించిన పువ్వులుగా సూచించుచున్నది.స్వామిసేవకై తిరుపతిలో బృందావనమును నిర్మించి,పూలదొంగ యనుకొని సాక్షాత్ జగన్మాతనే బంధించిన భాగ్యమును పొందిన ధన్యుడు.అతడికి అనుగ్రహముతో బంధింపబడిన తల్లి,గుర్తుగా కుసుమములను ధరించు తల్లి నీవు సద్గుణభూయిష్ఠవు.స్వామిని వీడలేక మాకు దర్శన భాగ్యమునీయక పోవుట నీకు తగదు.
తల్లీ-మైత్తిడం కణ్ణిణాయ్-కాటుక కన్నులతో స్వామిని నీ కనుసన్నలయందుంచుకొన్న దాన,కన్నులకు చక్కదనమును-చల్లదనమునందించుటకాటుక ప్రత్యేకత.తల్లీమాకు నీ దివ్యరూపసందర్శనమను చక్కదనమును-అవ్యాజ అనురాగమను చల్లదనమునందించు నీలాదేవి,
ఎత్తన ఏలుం-క్షణకాలమైనను,
పిరివాట్ర-స్వామిని వీడుట
ఎల్లాయాం-ఇష్టపడని నీవు,
మాకోసము,స్వామిని
ఎత్తైనై పోదుం-ఇప్పుడు కుదరకపోతే,మరెప్పుడైన కాసేపు,
తుయిలెళ-మేల్కొలిపి,స్వామి దర్శన భాగ్యమును
మాకు అనుగ్రహించుతల్లి,
మలర్ మార్పావాయ్-ఆశ్రితవాత్సల్యముతో వికసించిన విశాల వక్షస్థలుని
నీ నాధుని,మా జగన్నాధుని
దర్శనభాగ్యమునుకొంచముసేపైన
ప్రసాదించవమ్మా అని అర్థిస్తున్న గోదమ్మ చేతిని పట్టుకుని మనము మన అడుగులను కదుపుదాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం..