Tuesday, July 28, 2020

chinmayamudra-81



 నీ చిన్మయముద్రను నేను అనురక్తితోచూస్తుంటే
  నీ తలపని గంగమ్మ నన్ను తుంగతొక్కుతానంటున్నది

  నీ జటాజూటము నన్ను దక్షుడు అనుకుంటున్నది
  నీ శిరమున శశి  గ్రహణము నాకేనని అంటున్నది

  నీ కంఠములోని విషము నన్ను కబళించాలనుకుంటున్నది
  నీ చేతి డమరుకము నా వివరము అడుగుతున్నది

  నీ నడుము పులితోలు కలవరమేఅంటున్నది
  నీ వాహనమైన ఎద్దు నన్ను గద్దిస్తోంది

  నీ మంజీరమైన పాము నాపై బుసలు కొట్టుతున్నది
  వేడుకొనుట దేవుడెరుగు నిన్ను చూడనీయకున్నవి

 నీ వైనము ఏమిటి? నావైపు చూడవు భయముతో
 ఉక్కిరిబిక్కిరి అవుతున్నానురా ఓ తిక్క శంకరా!


 శివ దర్శనమునకై వెళ్ళిన భక్తుని శివుని గంగ-జటాజూటము-చంద్రుడు-విషము-డమరుకము-పులితోలు-మంజీరము ఎద్దు ఎద్దేవా చేస్తూస్వామి దగ్గరకు వెళ్ళనీయకున్నవి.శివుడు వాటిని మందలించలేని అసమర్థతతో,కళ్ళుమూసుకొని ధ్యానముద్రలో నున్నట్లు నటిస్తున్నాడు.

వైనము నమః శివాయ-ధ్యానము నమః శివాయ
భయము నమః శివాయ-అభయము నమః శివాయ

 నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" జటాభిర్లంబమానాభిరృత్యంత  మభయప్రదం
  దేవం శిచుస్మితం ధ్యాయేత్ వ్యాఘ్రచర్మ పరిష్కృతం"

  వ్రేలాడుచున్న జటలతో కూడినవాడై,నృత్యము చేయుచున్న వాడును,అభయమునిచ్చువాడును,స్వచ్చమైన చిరునగవు కలవాడును,వ్యాఘ్రచర్మముచే అలంకరింపబడినవాడును అగు సదాశివుని ధ్యానించెదను.

deepamu-90

  ఓం నమః శివాయ-65
   ********************

  సుగంధిపుష్టి కర్తకు సుప్రభాత దీపములు
నిటలాగ్ని హోత్రునికి నిత్య ధూప దీపములు
పాషాణపు దేవునికి ప్రభల వెలుగు దీపములు
కందర్ప దర్పునికి కర్పూర దీపములు
పరంజ్యోతి రూపునికి ప్రమిదలలో దీపములు
జలజాక్షునికి వేడుకగా జలములోన దీపములు
ప్రమథ గణాధిపతికి ప్రదోషవేళ దీపములు
ఆశాపాశ రహితునికి ఆకాశదీపములు
మా ఆర్తిని తొలగించే కార్తీక దీపములు
దీపములను పేర వెలుగు నీ నామ రూపములు
జాణతనము తోడుకాక జ్వాలాతోరణములో
చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా.
.............................................................................................................................................................................................................................సుగంధ భరితుడు,పోషకుడు,వృద్ధికారుడు అని చెబుతు శివుడు పొద్దున్నే వెలిగించే దీపాలకై ఎదురుచూస్తుంటాడు.కామ దహనము చేసానంటు కర్పూర దీపాలను కోరతాడు.లింగము రాయి కనుక దీపాలను చూడలేదు. పద్మములు జలములో నున్న దీపాల వేడిని తట్టుకోలేవు.మన ఆశలన్నిటిని దూరము చేస్తానంటు శివుడు ఆకాశదీపాలకై తేరిపారి చూస్తుంటాడు. తన భక్తుల రూపము నామము ఈ దీపములే అంటు ఎటుపారిపోయే దారిలేక,చేతకాక శివుడు చేతకానివాని వలె అందు ప్రవేశిస్తాడు.నింద. పరంజ్యోతి అయిన
శివుడు మన పాప ప్రక్షాళనకై మనకొరకు తాను మనలను ఉద్ధరించుటకు "జ్వాలా తోరణ ప్రవేశము" చేస్తాడని. స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)

virraveegu


   ఓం నమః శివాయ-83
  ********************

 విర్రవీగు వారిపై వెర్రిప్రేమచూపుతావు
 స్వార్థపు అభ్యర్థనలను ప్రార్థనలని అంటావు

 అహంకార తపములకు సహకారమవుతావు
 ప్రీతిపాత్రములుగ అపాత్రవరములిస్తావు

 ఆలోచనన్నదిలేక అసురత్వమునాదరిస్తుంటావు
 నిర్లక్ష్యము కూడదంటు ప్రత్యక్షము అవుతావు

 అడిగినాడు అంటావు-అడుసు తొక్కుతుంటావు
 అదునుచూసి వారు అదుపుతప్పుతారు అనుకోవు

 గతితప్పిన ఫలితములతో గాబరపడుతుంటావు
 మేకను జయించావు-పులిని జయించావు

 మేకవన్నెపులులతో  తికమకపడుతుంటావు

 నక్కవినయములేరా అవి ఓ తిక్కశంకరా.


శివుడు తనను గురించి తపము చేశారని,ప్రత్యక్షమై,వారికి వరములను అనుగ్రహించవలెననుకుంటాదు.కాని వారు రావణుని వలె అహంకారముతో తపమాచరించుచున్నారో,స్వార్థముతో అనుగ్రహమును కోరుతున్నారో,లేక తానిచ్చిన వర ప్రభావమును తన పైననే పరీక్స్గితారో,వారి నిజ స్వభావమెటువంటిదో ఆలోచించలేడు-నింద.

 అసురులు నమః శివాయ-అమరులు నమః శివాయ
 వరములు నమః శివాయ-వగచుట నమః శీవాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ

sarabha

 ఓం నమః శివాయ-74
 **************

 గణపతిని శిక్షించగ గజముతలను పెట్టావు
 అంధకుని  రక్షించగ భృంగిగా మార్చావు

 దక్షుని జీవింపచేయ మేకతలను పెట్టావు
 బ్రహ్మ తలలు పడగొడుతు భిక్షపాత్రలంటావు

 నరసింహుని శాంతింపగ పక్షితలతో వెళతావు
 వ్యాఘ్రపాదుడంటు కాళ్ళకు పులిపాదములతికిస్తావు


 తలరాతల మార్పులంటు తలలనే మారుస్తుంటావు
 వెతలను తీరుస్తానంటు కతలనే రాస్తావు

 నా కతవినిపించానంటే నా తల మారుస్తావేమో
 తలమానికము నేనంటు తలల మార్పుచేర్పులతో

 తలకొక మాదిరిగ తరియింపచేయువాడనంటు,వారిపై
 ఉక్కుపాదమెందుకురా ఓ తిక్కశంకరా.

 శివుడు తాను తలరాతలను మారుస్తానంటూ,చేతకాక వారి తలను తీసి వేరొక తలను అతికిస్తుంటాడు.అంతటితో ఆగకుండా కాళ్లకు పులిపాదములను అతికిస్తాడు.భ్రింగికి మూడుకాళ్ళు కలిగిన వికృత రూపమునిచ్చాడు.బ్రహ్మకల్పము ముగుసిన వెంటనే వాని తలలను దండగా గుచ్చుకొని వేసుకొని మురిసిపోతు,నేను తలమానికమైన వాడినని గొప్పలు చెప్పుకుంటాడు.-నింద.

 కతలు నమః శివాయ-వెతలు నమః శివాయ
 శరభుడు నమః శివాయ-శర్వుడు నమః శివాయ

నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" భ్రంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా
  హ్లాదో నాదయుతో మహాసి తవపుః పంచేణా చాదృతః
  సత్పక్షో సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో
  రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసి విభుః."

   శివానందలహరి.

 భృంగి ఇష్టపడునట్లుగా నాట్యము చేయువాడును,గజాసురుని మదమణచిన వాడును,ఢక్కా నాదమును చేయువాడును,శుధ్ధస్పటిక తెల్లదనమును కలవాడును,నారాయణునకు ప్రియమైన వాడును,సజ్జనులను కాపాడుటలో మంచిమనసున్న శ్రీశైల భ్రమరాంబిక పతి శరణు-శరణు.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...