Friday, July 24, 2020

OM NAMA SIVAYA-74


 ఓం నమః శివాయ-74
 **********************

 నీ కళ్యాణపు కర్తయైనాడుగ ఆ రతిరాజు
 నీ సేమపు మామ యైనాడు ఆ హిమరాజు

 నీ శిగపై కొలువైనాడు ఆ నెలరాజు
 నీ మేనికి వస్త్రమైనాడు ఆ కరిరాజు

 నీ కంఠపు కంటెయైనాడు ఆ భుజగరాజు
 నీమ్రోలన్ నిలిచినాడు ఆ వృషభరాజు

 నీతో పాటుగ కొలువైనాడు ఆ యమరాజు
 నీవంటే నిరసనతో యున్నాడుగ ఆ దక్షరాజు

 విరాజమానుడిని అని నీవు అన్నా,నువ్వు రాజువు కాదని
 ఇందరు రాజులు నిన్ను ఆడించగ మందహాసముతో

 నటరాజను ఒక రాజును నీకొసగిరి ,నీ
 తక్కువ చాటేందుకేర ఓ తిక్కశంకరా.

OM NAMA SIVAYA-73

  ఓం నమః శివాయ-73
  *****************

 అసత్యమాడు బ్రహ్మపుర్రె అంతగా నచ్చిందా
 ఆభరనముగా చేసి అలంకరించుకున్నావు

 హింసకు గురిచూసే బోయకన్ను నచ్చిందా
 రక్తాశ్రువులను కార్చ అనురక్తిని చూపావు

 అమ్మ దగ్గర ఉండనన్న అర్భకుని వాక్కు నచ్చిందా
 అమృతధారగ మారి ఆర్ద్రతనందించావు

 స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా
 ఉదారతను చూపిస్తు ఒదిగిఒదిగి పోయావు

 పృష్టభాగమున పూజలందు ఆవుచెవి నచ్చిందా
 లంకకు నేరానంటు గోకర్ణమున నిలిచావు

 పెంపును అందించుతావో పంపు అని చంపుతావో
 పెక్కుమాటలేలరా ఓ తిక్క శంకరా.





OM NAMA SIVAYA-72

  ఓం నమః శివాయ-72
  *****************

 పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో
 పాలకడలి విషము మింగ పావుగా మారావు

 అసత్యమాడిన ఆ బ్రహ్మ ఎంత చతురుడో
 తన కపాలమును చూపి దొంగవని అంటాడు

 ఫాలములో దాగిన కన్ను ఎంతచుప్పనాతిదో
 అసలు తెరువనీయవని అలుకతో ఉంటుంది

 తలపైని తైతక్కల గంగకెన్ని నిక్కులో
 అటుఇటు కదలనీయవని ఆడిపోసుకుంటుంది

 కుదురుగ ఉండలేని చంద్రునికెంత కినుకో
 రాహుకేతు బాధను కబళించవు అంటాడు

 కొంచమైనగాని  మంచి-చెడులు గమనించక
 తొక్కేస్తున్నవట గదర ఓ తిక్క శంకరా,




OM NAMA SIVAYA-71

  ఓం నమః శివాయ-71
  ***************

  కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవా
  సిగపూవగు గంగమ్మ సిరులను అందీయగలదా

  కట్టుకున్న గజచర్మము పట్టుపుట్టమీయగలదా
  నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములనందీయగలదా

  కరమున నున్న శూలము వరములనందీయగలదా
  పట్టుకిఉన్న పాములు నీకు పసిడిని అందీయగలవా

  కరుగుచున్న నగము తరగని సంపదనీయగలదా
  కదలలేని చంద్రుడు ఇంద్రపదవినీయగలదా

  కాల్చున్న కన్ను నీకు కాసులనందీయగలదా
  ఆదిశక్తి అండనున్న ఆదిభిక్షువైన నిన్ను నమ్మి

  " ఒం దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ" అంటుంటే
   ఫక్కుమని నవ్వారురా ఓ తిక్క శంకరా.

  ఓం నమః శివాయ-71
  ***************

  శివుడు ధరించిన రుద్రాక్షలు-గంగమ్మ-ఎద్దు-శూలము-మంచుకొండ-చంద్రుడు-అగ్గి కన్ను సంపదలనిచ్చు శక్తిలేనప్పటికిని,భక్తులు అమాయకంగా   దరిద్రమనే దుఃమును కాల్చివేసి,ఐశ్వర్య ప్రదుడు శివుడని నమ్మి,  కీర్తిస్తుంటేనవ్వుకుంటూ వింటుంటాడేకాని,అది అబధ్ధమని చెప్పడు-నింద.

  ధనికుడు-నమః శివాయ-దరిద్రుడు నమః శివాయ
  భావము నమః శివాయ-భాగ్యము నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

 దారిద్ర దుఖః హరణ స్తోత్రము-వశిష్ట మహర్షి విరచితము.
 ***********************************************

1.నరకము దాటిస్తాడు-సకలము పాలిస్తాడు
  శృతులను వినిపిస్తాడు-సుధలను కురిపిస్తాడు
  సర్పాలను ధరిస్తాడు- కర్పూరపు కాంతివాడు
  దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.

2.. పాము కంకణముల వాడు-పార్వతి మెచ్చినవాడు
   యమునికి యముడైనవాడు-తోయమును ధరించాడు
   కరిచర్మము ఒలిచాడు-కళాధరుని మెచ్చినోడు
    దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.

3. జలధిని దాటిస్తాడు-జన్మలు తీసేస్తాడు
   భక్తుల దగ్గరి వాడు-భ్రష్టుల శిక్షిస్తాడు
   వెలుగు గుప్పిస్తాడు-స్మరణతో నర్తిస్తాడు
   దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు
  
4. మూడు కన్నులవాడు-మువ్వల పాదముల వాడు
   బూడిద పూతల రేడు-భువనైక మనోహరుడు
   చర్మము ధరియించుతాడు-కర్మలు తొలగించుతాడు
    దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.

5. ముల్లోకములు వాడు-మూలస్థానము వాడు
   పసిడి వస్త్రములవాడు-ప్రసాద గుణమే వాడు
   చీకటి కూల్చేస్తాడు-చీకును తుంచేస్తాడు
   దరిద్రమును దహిస్తాడు-దయార్ద్రహృదతుడు శివుడు.

6. బ్రహ్మ కొలుచు వాడు-బ్రహ్మాండములు వాడు
   కాలసాక్షి ప్రియుడు-కాల కాలాంతకుడు
   చూడచక్కని రేడు-మూడు కన్నుల వాడు
   దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు 

7.శ్రీ రామునికి సఖుడు-కైలాస నిలయుడు
  సేవగణ సేవితుడు-కైవల్య వరదుడు
  పాములు మెచ్చినవాడు-పావన చరితుడు
  దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.

8. సామి శివగణములకు-సామగాన ప్రియుడు
   నామ స్మరణ ప్రియుడు-నంది వాహనుడు
   కర్మఫలమిస్తాడు-చర్మ వస్త్ర ధరుడు
   దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు. 


  ఏక బిల్వం శివార్పణం.

OM NAMA SIVAAYA-70


  ఓం నమః శివాయ-67
  *********************
 నీ పాదము పట్టుకుందమన్న చిందులేస్తు అందకుంది
 నీ నడుమును అడుగుదామన్న పులితోలు అలిగింది

 నీ హృదయము దరిచేర్చమన్న కుదరదు అని అంటున్నది
 నీ మనసుకు మనవిచేద్దామంటే భక్తులను అదిచుట్టుకుంది

 నీ చేతికి చెబుదామంటే చెడ్దపుర్రె అడ్డుకుంది
 నీ చుబుకము పట్టుకుందామంటే విషము సెగలు కక్కుతోంది

 నీ కన్నులకు కనిపిద్దామన్న కొంచమైన తెరువకుంది
 నీ ముక్కుకు మొక్కుదామంటే మూసి జపము చేస్తున్నది

 నీ జటకు ఉటంకిందామంటే గంగవెర్రులెత్తుతోంది
 నన్ను రానీయక తమ సొంతమంటు గంతులేస్తున్నవి

 నీదరి సేదతీరుతు ఆదరమునే మరచిన వాటి
 టక్కరితనమును చూడరా ఓ తిక్కశంకరా.


 సాధకుడు కష్టపడి శివానుగ్రహముతో తన ఇంద్రియములను వశపరచుకొని,శివదర్శనమునకై వస్తే.స్వామి ధరించిన పాదమంజీరము నుండి, జటలో నున్న గంగ వరకు అడ్డగించుచున్నవి.శంకరుడు తమకే సొంతమని దరిచేరనీయకుంటే,దయాళువుగా కీర్తింపబడు శివుడు నిర్దయతో తటస్థముగా నున్నాడు.దర్శన భాగ్యమును కలిగించుట లేదు-నింద.

 హృదయము నమః శివాయ-ఆదరము నమః శివాయ
 ఉపేక్ష నమః శివాయ-ఆపేక్ష నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


" తలమీదం కుసుమప్రసాద మలిక స్థానంబుపై భూతియున్
  గళసీమంబున దండ నాసిక తుదన్ గంధప్రసాదంబులో
  పల నైవేద్యము జేర్చునే మనుజుడా భక్తుండు నీ కెప్పుడున్
  చెలికాడై విహరించు రౌస్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా."

   ధూర్జటి మహాకవి.

  శంకరా! ఎవరైతే తలమీద సదా నీ నిర్మాల్యమును,నుదుట విభూతిని,మెడలో రుద్రాక్షలను,ముక్కుయందు నీ అభిషేక జలసుగంధమును,ఉదరములో నీ నైవేద్యమును కలిగియుండునో,వారు వెండికొండపై నీ స్నేహితులతో సమానముగా వర్తించగల అనుగ్రహమును పొందియున్నారు కనుక నేను వాటిని మహాప్రసాదముగా ధరించి,నీ మహిమావిశేషములను లోకవిదితము చేయుటకై,దీనిని నీచే కల్పించబడిన లీలా విశేషముగా స్వీకరింతును.శరణు-శరణు  సదాశివా-స్తుతి.

  ఏక బిల్వం శివార్పణం.



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...