ఓం నమః శివాయ-39
*********************
గుట్టలిచ్చు ఆసనమున కుదురుగ కూర్చుంటావు
చెట్లు చేయు అభిషేకము చెలిమితో స్వీకరిస్తావు
మిణుగురుల కదలికలను దీపములనుకుంటావు
పూలగాలి తాకగానే పరవశించిపోతావు
షట్పదీ ఝంకారము స్తోత్రములని అంటావు
షడక్షరీ మంత్రమంటు సంతసించి పోతావు
పిట్ట పారివేయు పండు ప్రీతి నైవేద్యమంటావు
ఉట్టి చేయి చూపిస్తే సుగంధతాంబూలము అంటావు
అడవిలో నెమలి నాట్యము మదర్పితము అంటావు
ఉప్పుమూటలాడుతుంటే గొప్పవాహనమంటావు
షోడశోపచారములా ఇవి నిషేధ అపచారములని
గ్రక్కున ప్రశ్నించవేరా? ఓ తిక్క శంకరా.
శివుడు పధ్ధతి లేని పనులను తనకు చేయు షోడశోపచారములని భ్రమపడుతుంటాడు.రాళ్ళతో కఠినముగా నున్న శిలను చూపించి ఇది నీకు ఆసనమనగానే,సరేనని కుదురుగా దానిమీద కూర్చుంటాడు.రాళ్ళుగుచ్చుకుంటాయని అనడు.చెట్టు తనపై బడిన మంచును దులుపుకుంటు చమత్కారముగా వృక్షరూపమున నున్న శివా! నీకు నేను అభిషేకము చేస్తున్నాను అంటే,నిజమనుకుంటాడు.మినుకుమినుకుమనుచున్న మిణుగురులను చూసి అవి తమకు దీపసేవ చేస్తున్నాయని భ్రమపడతాడు.పూలసువాసన గాలివాటమునకు వస్తే,అగరుధూపమును వేసాయంటాడు.మకరందమునకు పూవును చేరు తుమ్మెద ఝంకారము చేస్తుంటే తన కొరకు షడక్షరీ స్తోత్రమును ఆలపించుచున్నదంటాడు.పండును ముక్కున కరచుకొనిన పిట్టనోటి నుండి అనుకోకుండా పండు జారి క్రింద పడితే తనకు పిట్ట నైవేద్యమును సమర్పించినదని సంతసపడతాడు.ఆకు-వక్క-సుగంధద్రవ్యములకు బదులు కొన్ని అక్షింతలనుంచగానే తాంబూలపరిమళములకు పరవశించిపోతాడు. ఎక్కడో అడవిలో నాట్యముచేయుచున్న నెమలిని చూపిస్తు నాకు నాట్యసేవ చేస్తున్నదని,తండ్రి కొడుకును వీపుమీద ఎక్కించుకొని ఉప్పుమూట ఆడుతుంటే తనకు వాహనముగా మారిన భక్తుడని మురిసిపోతుంటాడు.యాదృచ్చికముగా జరిగే పనులను యద్యత్ కర్మ కరోతి సర్వం అఖిలం శంభో తవారాధనం" అనగానే నిజమనుకునే అమాయకుడు శివుడు-నింద.
కొండ నమః శివాయ-బండ నమః శివాయ
భ్రమయు నమః శివాయ-భ్రమరం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
"నమః కిగ్ ం శిలాయచ క్షయణాయచ" రుద్రం.
చిన్నచిన్న రాళ్ళుగల ప్రదేశములందును-నివాసయోగ్యమగు ప్రదేశములందుండు రుద్రునకు నమస్కారములు.
""ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో
త్వయైవ క్షంతవ్యాశివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్ కర్తవ్యం మదవన మియం బంధుసరణిః"
శివా నీవుదీన బంధువుగా పేరుపొందినవాడవు .నేను కడు దీనాతిదీనుడను కనుక నన్ను రక్షించుటయే బంధురీతి-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.