కదా త్వాంపశ్యేయం-16 ******************* " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం" " ఆద్యావిద్యా హృద్గతా నిర్గత ఆసీత్ విద్యాహృద్వా హృద్గతా త్వత్ ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్ పదాబ్జాం భావే ముక్తే భాజనం రాజమౌళి" ఆదినుండి నాలో నిలిచిన అవిద్య తొలగిపోయినది నీ కరుణతో.సుజ్ఞానము కలిగే శుభసూచకములు గోచరించుచున్నవి.నష్టో మోహః సద్గతి కదా లబ్ధ్వా? ఆ అశుతోషుని, శంకరయ్యతోపాటు,మన మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని, ఈ నాటిబిల్వార్చనమును ప్రారంభిద్దాము. అద్భుతమైన శివుని కరుణ కొంచము కొంచము అర్థమవుతోంది పరమార్థము వైపునకు పయనమును సూచిస్తూ. " ఓం నమః శివాయ" సద్దుమణుగుతున్న శంకరయ్య ఆలోచనలు పూర్వభావములను రద్దుచేస్తున్నాయి.పెద్దవవుతున్న కొత్త ఆలోచనలు వాస్తవమును తెలుపుటకు సిద్ధమవుతున్నాయి. అది పద చలనమో-ప్రదక్షిణమో తెలియని స్థితిలో నున్న శంకరయ్యను ఒక విచిత్రదృశ్యము కట్టిపదవేసినది. శివయ్య లేడు.గిరిజలేదు.గురువుగారు లేరు.తాతగారు లేరు.బాలుడు లేడు.తుమ్మెదలు లేవు.పక్షులు లేవు.నెమలి లేదు.తెరమరుగవుతూ,కొత్త అంకమునకు రంగము సిద్ధము చేసినవి. అంతా ఈశ్వరేఛ్చ. " కరోమి యత్ తత్ శంభో తవారాధనం" అంటూ వేదిక సిద్ధమయింది. శంకరయ్యకు అంతా కొత్తకొత్తగాఉన్నది.ఇప్పుడే జన్మించినట్లవుతున్నది.అడుగులు తడబడుతున్నాయి.ఆలోచనలు వెంటాడుతున్నాయి ఆచరణను నిర్దేశిస్తూ, ఇంతలో ఒకచక్కని శ్రావ్యమైన స్త్రీమూర్తి గళము శంకరయ్య చెవులకు బంధము వేసినది. 1/అటుతిరిగి చూడగానే ,అమ్మ.అమ్మలగన్న అమ్మ.తన శిశువును కాళ్ళమీద పడుకోపెట్టుకుని లాలపోస్తోంది.విచిత్రము నీళ్ళు అక్కడ లేవు.కాని బాలుడు ఆనందాబ్ధిలో కేరింతలుకొడుతున్నాడు.సాక్షాత్తుగా గంగాదేవియే భగీరథుని కటాక్షించినదా యన్నట్లున్నది ఆ దృశ్యము. " ఆనందాశ్రుతిరాతినోతి పులకం" అంటూ " అంటూ ఆనందాశ్రువులను వర్షిస్తూ,పు లకరించిపోతున్నది ఆ "భక్తి" యనెడి తల్లి. ఓం నమః శివాయ. 2.ఎక్కడ తడిసిన శిశువుకు జలుబు చేస్తుందో అంటూ, "నైర్మల్యత్చాదనం" శుభ్రమైన-మృదువైన సత్వమనే శుద్ధవస్త్రమును చుట్టినది శిశువునకు. మెరిసిపోతున్నాడు బాలుడు మురిసిపోతున్నది భక్తిమాత. 3,శిశువునకు ఆకలవుతున్నది.పాలుకావాలని సంకేతిస్తూ,ఏడుస్తున్నాడు. మైమరపును మరుగున పరుస్తూ, అయ్యో నా చిట్టితండ్రీ ! ఆకలివేస్తున్నదా.. ఇవిగో అంటూ ఒక చక్కని శంఖము కొస నుండి "వాచా శంఖముఖే" వాక్కులనెడి శంఖము యొక్క కొసల నుండి, "శివ చరితామృత రసమును"పాలు గా త్రాగించుచున్నది, కడుపునిండా త్రాగేవరకు కదలకుండా వానిదగ్గరనె కన్నార్పకచూస్తూకూర్చున్నది. 4.ఇంతలోనే వింతగా ఆ తల్లిమనసు ఆ శిశువుకు తన దృష్టి తగులుతుందేమో నంటూ, రుద్రాక్షలను తెచ్చి ."రుద్రాక్షై దేవ రక్ష" అంటు రక్షను కట్టింది. 5 అర్భకుని మేని మిసమిసలు గుసగుసలాడుతుంటే,ముసిముసిగా నవ్వుకుంటుంటే వాటినెవ్వరు చూస్తారో అంటూ " భసితేన దేవ రక్ష" అంటూ శివభస్మమును పూసి,విస్మయము చెందుతోంది.. హరహర మహాదేవ శంభో శంకర అమ్మ ఒడిలో ఆటలాడుతున్న బాలునకు ,నిదురవచ్చినదన్నట్లుగా గమనించి, " భవత్ భావనా పర్యంకే వినివేశ్య" భక్తిజనని శివభావమనే ఉయ్యలలో/మంచముపై పరుండపెట్టినదట. నీళ్ళులేని స్నానము-కాంచలేని వస్త్రము-వాక్కులనెడి ఆహారము(పాలు) బూది అనెడి ఆఛ్చాదనము-రుద్రాక్ష అనెడి రక్ష కట్టిన తల్లిది ఎంతటి చమత్కారము. ఆ తల్లిచే సేవలనందుకొన్నశిశువెంతటి వాడో చూడాలనిపించి,మెల్లగా అటువైపు వెళ్ళాడు. "ఇదం తేయుక్తం నా" పరమశివ"కారుణ్యజలధే గతౌ తిర్యక్రూపం తవపద శిరోదర్శనధియా హరి బ్రహ్మాణౌతా దివిభువి చరంతౌ శ్రమయతౌ "కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోపి పురతః" ఉయ్యాలలోని పిల్లవాడు శంకరయ్యను చూస్తూ, హరిబ్రహ్మాదులకు సైతము కానరాని నీవు ,నాముందు కనుగొనదగినవాడివై ఎలా ఉన్నావు అని ప్రశ్నిస్తున్నాడు? ఎలా నన్ను చూడగలుగుతున్నావు అని పరీక్షిస్తున్నాడు పశుపతి. నేను శివుడినా అనుకుంటూ,మళ్ళీ ఉయ్యాలలోనికి చూశాడు. బాలశివుడు నవ్వుతూ, "నన్ను చూడటానికి వచ్చావా?శంకరయ్యా అని మేలమాడుతున్నాడు. ఆఇద్దరిలో ఎవరు శివుడు?ఎవరు జీవుడు? ఏది సత్యం? ఏదిమిథ్య? ఎవరు ఎవరి సమస్యకు ఏ విధముగా సమాధానమిస్తారు అనే ఆకోచనలు శంకరయ్యను చుట్టుముట్టాయి. కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ. 'తన్మై మనః శివ సంకల్పమస్తు వాచే మమశివపంచాక్షరస్తు మనసే మమ శివభావాత్మ మస్తు". పాహిమాం పరమేశ్వరా. (ఏక బిల్వం శివార్పణం)