Saturday, October 3, 2020
PRASEEDA MAMA SARVADAA-03
ప్రసీద మమ సర్వదా-03
చంద్రఘంట మాతా నమోనమః
" పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతా
ప్రసాదం తమతేహ్యం చంద్రఘంటేతి విశ్రుతా".
శైలపుత్రీ మాత మనలను బ్రహ్మచరిణి మాతకు అప్పగిస్తే తల్లి పరమేశుని అర్థాంగిగా పరిణయమాడు సమయమున తాను సౌమ్యరూపియై-తన నాథుని సౌమ్యరూపునిగా ప్రకటించుకొనమని అర్థించి,శివశక్త్యైకరూపిణియై,సౌభాగ్యచిహ్నముగా తానును నుదుటను ఘంటాకృతిలో నున్న చంద్రఘంటను ధరించి,వినూత్న శోభలతో విశ్వేశ్వరుని అర్థాంగి గా మారినది.
తల్లి ధైర్యమునకు గంభీరతకు ప్రతీకయైన పెద్దపులినిగాని/సింహమును గాని వాహనము చేసుకొని శివునిశక్తియై శుభములనొసగుచున్నది.
తల్లి నామములో చంద్ర-ఘంట అను రెండు పదములున్నవి.ఇవి రెండు విభిన్న స్వభావముల సంకేతములు.అమ్మ ఘోర/అఘోర రూపములను దుష్టశిక్షణకు-శిష్ట రక్షణకు ధరించు విధానమును పరిచయము చేస్తున్నవి.
చంద్ర పదము చంచలత్వమును-ఘంట పదమును నిశ్చలత్వమును తెలియచేస్తున్నవి.ఇక్కడ చంద్రుని రూపమును గాక స్వభావములకు సంకేతములుగా పరిగణిస్తే రెండు పరస్పర విరుధ్ధభావములైన చంచలత్వమునకు-నిశ్చలత్వమునకు ప్రాతినిధ్యము వహించుచున్నవి.
"చంద్రమా మనసో జాతః" చంద్రుడు మన మనోభావములకు అధిపతి అయినప్పుడు వృధ్ధి-క్షయ స్వభావము కల చంద్రకళలు మన మనోభావములపై తమ ప్రభావమును చూపుతాయి.అవి అనేకానేకములై-ఆలోచనా రహితములై-ఆందోళనా పూరితములై-అసహాయకములై మనసు యుక్తాయుక్త విచక్షణాజ్ఞానమును కోల్పోవునట్లు చేస్తాయి.అసమర్థమైన మనసు సత్యాన్వేషనను చేయలేక మూగపోయి ఉంటుంది.సత్-చిత్-సాక్షాత్కారమును సందిగ్ధములో పడేస్తుంది.ముముక్షత్వానికి ముందరికాళ్ళ బంధమవుతుంది.
అమ్మ మనలను అటువంటి పరిస్థితిలో ఉంటే ఆదుకోకుండా ఉంటుందా? అందుకే ఓంకార ప్రతీకమైన ప్రణవనాద మూర్తిగా,
తన ఘంటానాదమునుతో నిశ్శబ్దమును నిష్క్రమింపచేస్తుంది.నిశ్చలత్వమును నిర్మిస్తూ మన మనస్సునుకు బుధ్ధి అనే శక్తిని జోడించి,నాదమయియై వేదమాతయై విషయమును వివరిస్తుంది.విజయపథము వైపుకు మనలను నడిపిస్తుంది.
అమ్మ చెంతనున్న మనకు ఇతరచింతనలేల?
అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది.
అమ్మ చరణములే శరనము.
PRASEEDA MAMA SARVADAA-02
ప్రసీద మమ సర్వదా-02
బ్రహ్మచారిణి మాతా నమోనమః
"దధనాకర పద్మాభ్యాం అక్షమాలా కమందలా
దేవీ ప్రేదతుమయీ బ్రహ్మే చారిణ్యనుత్తమం."
ఒకచేత జపమాల-మరొకచేత జలపాత్రతో "అజాయమాన బహుదా విజాయతే" అను సూక్తిని శుభకరము చేస్తూ,తల్లి తన రెండవ దుర్గారూపమైన బ్రహ్మచారిణిగా ప్రకటితమగుచున్నై.ఎంతటి భాగ్యశాలురమో మనము.ఈ తల్లికి ఏటువంటి వాహనముమనకు గోచరమగుటలేదు.దానికి కారణము తల్లి చారిణి.నిరంతరము సంచరించు స్వభావము కల చలనశక్తి.
బ్రహ్మచారిణి అను నామము రెండుపదముల ద్వారా రెండు విషయములను తెలియచేయుచున్నవి.అందులో మొదటిది బ్రహ్మము.రెండవది అందులో తల్లి సంచారము.
" పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే"
పురుషసూక్త ప్రకారము అపరిమితమైన బ్రహ్మములోని ఒక భాగమును సమస్తచరాచర విశ్వముగా మనము చూడగలుగుతున్నాము.అమృతమయమైన మిగిలిన మూడు భాగములు మనకు అగోచరములు-అనూహ్యములు.
నాశనమయ్యే మన దేహములోని నాశరహిత చైతన్యమే బ్రహ్మము.విజ్ఞులు బ్రహ్మమును భగవతత్త్వము అని కూడా భావిస్తారు.వారి సిధ్ధాంతము ప్రకారము "భ" శబ్దము తేజోవంతమైతే"గ" శబ్దము గమనశీలత్వము.తేజోవంత గమన చైతన్యమే బ్రహ్మము.
నిరాకార-నిర్గుణ-నిరంజన-నిరుపమాన బ్రహ్మమును నిర్వచించుట అసాధ్యము.ఒకవేళ ఆ ప్రయత్న్మే చేసినచో అపరిమితమును మన మూర్ఖత్వముతో పరిమితముగా భావించుచున్నటే.ఆ మూర్ఖత్వము మనలను వీడాలంటే తేజము వైపు మన గమనమును ప్రారంభించాలి.ఆ ఆలంబన శక్తియే బ్రహ్మచారిణి.
ఎందరో మహానుభావులు.అందులో అన్నమాచార్యులు ఒకరు.ఆయన ద్రష్ట కనుకనే అంతర్యామియై,"బ్రహ్మమొక్కటే-పరబ్రహ్మమొక్కటే" అని ప్రస్తుతించగలిగారు.
బ్రహ్మము అను పదమునకు తపము (తెలిసికొనుటకు తపించుట) అని కూడా అంటారు .సర్వకాల-సర్వావస్థలయందు సత్తుగా ఉండే పరబ్రహ్మమును చేరుటకు (మన భాషలో పరమేశ్వరుని పరిణయమాడుటకు) తల్లి తపో మార్గములో సంచరించుచున్నది కనుక బ్రహ్మచారిణి.
చారణము అనగా కదులుతూ ఉండుట.బ్రహ్మములో తిరుగుట సత్తులో తిరుగుట కనుక సంచరించుట.మనము స్త్రీమూర్తిగా భావించే తల్లి బ్రహ్మములో శివశక్త్యైక మూర్తిగా రూపుదిద్దుకొనుటకు సంచరించుచున్నది కనుక తల్లి బ్రహ్మచారిణి.
మనకొరకు అమ్మ చేయుచున్నటుగా లీలావిసేషమును చూపుతు,దానికి కావలిసిన రెండు పరికరములైన జపమాలను-జలపాత్రను సంకేతములు మనకు చూపుచున్నది.ఇవి రెండు జ్ఞాన-వైరాగ్యములకు ప్రతిబింబములు.
జపమాల చలనశక్తియే కాక అక్షమాల స్వరూపమైన (అక్షరమాల0జ్ఞాన సంకేతము.అది నిరంతరము కదులుతూనే ఉండాలి.అంతే నిరంతరము అమ్మ తన కృపాకటాక్షవీక్షణములను సర్వత్ర ప్రసరిస్తూ సమస్తమును పాలించుచున్నది.మనకు సాధన మార్గమును సూచించుచున్నది.
నిరంతర సాధన ఫలితము నీ చేతికినిర్మల జలపాత్రను అందించగలుగుతుంది.పూర్వము ఎండిన గుమ్మడి కాయను జలపాత్రగా ఉపయోగించేవారట.దానిలోని విత్తనములను అహంకారముగా-గుజ్జును మమకారముగా భావించి,వానిని తీసివేసి శూన్యమును అర్థము చేసుకొనేవారట.కాలక్రమేణా లోహపాత్రలు వచ్చినప్పటికిని దాని లోపలి భాగము శూన్యసంకేతమే.అదేవిధముగా మనలను అంటిపెట్తుకున్న విషయవాసనలు కుళ్ళిపోవునవే అని గమనించి,వానిని తొలగొంచివేసిన పాత్ర జలముతో అమృతమయమై,సకలదేవతా నివాసమైనట్లు మన అంతరంగము నిర్మలమై సత్-చిత్తుతో నిండి ప్రకాశిస్తుంది.మలినములు తొలిగి బ్రహ్మమును దర్శించగలిగి బ్రహ్మానందమమవుతుంది.
పరమేశుని ఇల్లాలగుట పరమేశ్వరి సంకల్పము
పరమాత్మను మనలో దర్శించగలుగుట మన సంకల్పము.
అమ్మ చెంత నున్న మనకు అన్యచింతనలేల?
అమ్మ దయతో మన ప్రయానము కొనసాగుతుంది.
అమ్మ చరణములే శరణము.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...