Wednesday, March 28, 2018

SAUNDARYA LAHARI-66

 సౌందర్య లహరి-అన్నపూర్ణ

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 భూమిలోని సహనమువై,అగ్గిలోని వేడివై
 మేఘములో జలమువై,జలము ఇచ్చు శక్తివై

 విత్తులోని చెట్టువై,చెట్టులోని పండువై
 పండులోని మధురమై,దాగిఉన్న దుంపవై

 భక్ష్య-భోజ్య-చోహ్య-లేహ-పానీయములలో చేరి
 పసి నుండి ముసలి వరకు  ఆహారముగా మారి

 "భిక్షాం దేహి-మాతాన్నపూర్ణేశ్వరి" దయార్ద్రవై
 " అన్నం పరబ్రహ్మ స్వరూపము"గ ఆకలితీర్చుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

" అన్న పూర్ణే-సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
  జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహిచ పార్వతి"

  " అన్న పూర్ణే విశాలాక్షి-అఖిల భువన సాక్షి! కటాక్షి" అని దీక్షితారు తరించారు.అన్ని అన్నివేళలా పూర్ణముగా కల తల్లి అన్నపూర్ణ.ఎడమ చేతిలో,దివ్యమైన అమృతాన్నముతోన్నిండిన మాణిక్య పాత్రతో,శుభకర కంకణముల కుడిచేతిలోని బంగారు గరిటతో ,సాక్షాత్ సదాశివునకు భిక్షను అనుగ్రహించుట,పరమేశ్వరార్పణము చేసిన తరువాత ప్రసాదమును స్వీకరించమని మనలకు చెప్పకనే చెప్పుట.

 అన్నము అన్నపదమునకు ఇక్కడ ఆహారము అనే అర్థము మాత్రమే కాకుండా,దానిని స్వీకరించుటకు ఇంద్రియములలో-జీర్ణ వ్యవస్థలో దాగియున్న శక్తి.(తల్లి అనుగ్రము.)అని భావించవచ్చును.

 ఒక్కొక్కసారి అసురత ముందు ధర్మము సహనము వహించవలసి అస్తుంది.దుర్భిక్షమును తొలగించి,జగములను సంతృప్తులనుచేయుటకు " ఆర్ద్రాం పుష్కరిణీం" పద్మముల వంటి తన కన్నుల నుండి,ఆర్ద్రత అను మకరందమును వర్షించుచున్న సమయమున,చెంతనే నున్న నా
చేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.


SAUNDARYA LAHARI-65

  సౌందర్య లహరి-రాజేరాజేశ్వరి

  పరమపావనమైన నీపాద రజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  ఇచ్చా-క్రియా-జ్ఞాన  శక్తుల అనుగ్రహదాయిని
  అష్టసిద్ధులను అనుగ్రహించు సిద్ధిదాత్రివి నీవు

  అంబా తత్త్వము వెల్లివిరియ ఆనందదాయిని
  రాజాధిరాజులను రక్షించే ఈశ్వరివి నీవు

  రజో-తమో-సత్వ భక్తిని మించినదైన పరాభక్తితో
  రాగాతీత ఉపాసనను ఉత్కృష్టము చేయుచు

  తేజోమయమైన  నీ రాజరాజేశ్వరి  రూపము
  అపరాజితగా నాలో విరాజమానమగుచున్నవేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా


  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUNDARYA LAHARI-64

  సౌందర్య లహరి-మహా లక్ష్మి-63

  పరమపావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  పువ్వులలో-ఫలములలో -ధాన్యములో-గడపలో
  ముత్యములలో-మణులలో-వృక్షములలో-గోమాతలో

  శంఖనాదములలో-శుభ గంటా నాదములలో
  త్రిగుణాత్మక దీపములలో-తులసికోట మూలములో

  ఆదిలక్ష్మి-ధాన్యలక్ష్మి-ధనలక్ష్మి-వీరలక్ష్మి
  విద్యాలక్ష్మి-విజయలక్ష్మి-సంతాన లక్ష్మి-మహాలక్ష్మిగా

  పలురూప నామములలో పరిఢవిల్లు నిన్ను చూచి
  పాహిమాం-పాహిమాం అనుచు భక్తులు ప్రస్తుతించుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానసవిహారి !ఓ సౌందర్య లహరి. 

 .

 " యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా" లక్ష్ అను ధాతువునుండి ఏర్పడిన పదము లక్ష్మి.లక్ష్యమును  నెరవేర్చునది లక్ష్మిదేవి.సర్వశుభలక్షణత్వమే లక్ష్మీతత్త్వము.నారాయణునికి  స్థితికారకత్వమునందు-సర్వ వ్యాపకత్వమునందు సహాయకారియైన తల్లి భృగు మహర్షి-ఖ్యాతి సాధ్విని కుమార్తెగా అనుగ్రహించి,భార్గవి నామముతో ప్రసిద్ధికెక్కినది.సనత్కుమార సేవిత హరికింపట్టపుదేవి-పున్నెముల ప్రోవు అయిన లక్ష్మీదేవి,శ్రావణ మాసములో వరలక్ష్మి రూపములో,దీపావళి పర్వదినమున ధనలక్ష్మిగా,శ్రీ పంచమి యందు విద్యాలక్ష్మిగా,నవరాత్రుల శమీపూజ యందు విజయ లక్ష్మిగా,మార్గశిర మాసమున గురువార మహాలక్ష్మిగా ఇంకా ఎన్నెన్నో నామములతో-రూపములతో మనలను అనుగ్రహించుచున్న తల్లిని "కరాగ్రే వసతే లక్ష్మీ" అంటూ దోసిలిలో దర్శించుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.

SAUNDARYA LAHARI-63

 సౌందర్య లహరి- గాయత్రి

  పరమపావనమైన  నీ  పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  సత్వ-రజో-తమో గుణములకు తోడుగా
  ప్రకృతి తత్త్వము అనేనాల్గవ ముఖముతో

  గుణాతీత స్వరూపముగా  ఆ ఐదవ ముఖముతో
  ఆదిత్య మండలపు ఆ దివ్యశక్తి నీవుగా

  అంతర్ముఖ-బహిర్ముఖ ఆరాధ్యదేవతగా
  ఇరవై నాలుగు అక్షరములతో భాసించుచు

  గాయత్రీ-సావిత్రీసరస్వతీ రూపాలుగా
  మూడు సంధ్యలందు నీవు మూర్తీభవించు వేళ

  నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 "గాతారం త్రాయతే యస్మాత్ గాయత్రి"అని దేవీ భాగవతము స్తుతిస్తున్నది.ఎవరు స్మరిస్తారో వారిని రక్షించే తల్లి ఛందోరూపిణిగా భాసిల్లు గాయత్రీమాత.పాంచభౌతిక తత్త్వపు ఐదు రంగులు కల( ముక్తా-ముత్యపు-తెల్లని,విద్రుమ-పగడపు-ఎర్రని,హేమా-పచ్చని పసిమి-బంగారపు,నీల-నీలమణి--ప్రకాశపు నీలపురంగు-ధవళ-వజ్రపు ప్రకాశముతో) ఐదు ముఖములతో,త్రిగుణాతీత తత్త్వముతో,సూర్య మండలములో ప్రకాశించు ప్రాణ శక్తియే గాయత్రీమాత. ప్రత్యక్ష దైవ స్వరూపిణి.గంధం-పుష్పము-ధూపము-దీపము-నైవేద్యము అను పంచాంగ పూజలలో విహరిస్తు,సర్వ వ్యాపకత్వముతో,"ఆద్యాం విద్యాంచ ధీమహి"గా " సకల విద్యలకు ఆదివైన నీ యందు నాబుద్ధిని ఏకాగ్రతతో నిలుపుటకు  త్రిసంధ్యలలో అనుగ్రహిస్తున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.  

SAUNDARYA LAHARU-62

  సౌందర్య-బాలాత్రిపుర సుందరి

  పరమపావనమైన నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  ఉద్దండ భండాసుర సుతులను ఖండింపగ
  తల్లి కవచమందించిన  పాలవెల్లి నీవుగ

  కర్తవ్యమును నెరవేర్చగ కల్ హార వాసిని
  హంసలున్న రథమెక్కిన  ప్రాణశక్తి నీవుగ

  నవనవోన్మేషముతో  నవ వర్ష బాలికగ
  నవ్యాలంకృతులతో నవరాత్రి పూజలందు

  మాలా-పుస్తక-వరద-అభయ హస్తాలతో
  బాలా త్రిపుర సుందరివై పాలించుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి. 

 " భండాసుర వధోద్యుక్తా బాలా విక్రమ వందితా"

   కాముని భస్మమునుండి జనియించిన వాడు  భండుడు.మూర్ఖుడు. కొందరిని సంస్కరించి మరికొందరిని సంహరించి అమ్మ వానిలోని అసురతను తన ఆయుధమస్పర్శ ద్వారా తొలగించి వానికి ముక్తిని అనుగ్రహిస్తుంది..భండుని కుమారులు తల్లిపై పగ తీర్చుకొనుటకు చారుబాహుని పంపగా,తల్లి సువర్ణ కవచము నుండి ఆవిర్భవించిన బాల అసుర సంహారమునకు తాను వెడలెదనని,అనుమతించమని శ్రీ మాతను కోరెను.తొమ్మిది వర్షముల లలిత కోమలాంగిని యుద్ధమునకు పంపుటకు అంగీకరించకున్నను, అమ్మబాలాదేవి దృఢ నిశ్చయమునకు దీవించి,ఆయుధములనిచ్చి , పంపినది .వీర శృంగార భరితమైన ఆ పోరులో బాలాదేవి ఆదిశక్తియై అసురతనణచి,సర్వదేవతా స్తుతులను అందుకొనుచున్న సమయమున , చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు. 
    

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...