శ్లో : స్తవైర్-బ్రహ్మాదీనాం జయ-జయ-వచోభిర్- నియమినాం
గణానాం కేళీభిర్ -మదకల-మహో క్షస్య కకుది
స్థితం నీల-గ్రీవం త్రి-నయనం-ఉమాశ్లిశ్ట- వపుషం
కదా త్వాం పశ్యేయం కర-ధృత-మృగం ఖండ-పరశుమ్
ప్రస్తుతశ్లోకములో శంకరులు సదాశివుడు ఇంతకు పూర్వము అధర్మమును ఏ విధముగా అంతమొందించినో తెలుపు సంకేతములుగా త్రినయనం-మన్మథుని మాయంచేసిన నీ మూడవకన్ను ధర్మమునకు ప్రతినిధిగా ప్రకాశిస్తున్నది.నీ నీలకంఠము అసురత్వమును అణచివేసిన దానికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నది
.ధర్మమునకు గ్లాని సంభవింపనీయని నీ చతురతయే నీ ఒక చేతనున్న( విచ్చలవిడి మనస్తత్త్వమునకు సంకేతమైన) మృగము,మరొక చేతను దానిని దండించగల ఖండపరశువు.
అధర్మము అంతరించిన వేళ జరుపుకొను ఆనందోత్సాహము బ్రహ్మాదుల స్తవములే కావచ్చును,మునుల జయ జయ ధ్వానముల స్తోత్రములే కావచ్చును,ఎద్దుమూపురమునెత్తి వేయు రంకెలే
కావచ్చును,ప్రమథగణములు చేయు వాయిద్య సంబరమైనా కావచ్చును.అంతటి సంతోషమునకు కారణము స్వామి ఉమాశ్లిష్టుడై వారికి సాక్షాత్కారమునొసగుటయే కారణము.నేను సైతము అంతటి మూర్తీభవించిన ధర్మ సంబరమును ఎప్పుడు చూచెదనో కదా అని స్వామి అనుగ్రహమునకు నిరీక్షించుచున్నారు.మనలను నిరీక్షించమంటున్నారు శంకరులు.
సర్వం పార్వతీపరమేశ్వర చరణారవిందార్పణమస్తు.