Monday, January 22, 2018

YADBHAAVAM -TADBHAVATI RATHA SAPTAMI.

  రథ సప్తమి
  *********
 రథమునకు  సప్తమికి కల సంబంధము ఏమిటి? అంతగొప్పదా  ఆ రథము అను ప్రశ్నకనుక వేసుకుంటే అద్భుత సమాధానాలు ఆవిష్కరింప బడుతాయి.ఈ రథము చక్కతో నిర్మించినదికాని లోహములతో నిర్మించినది కాని మృచ్చకటకములో ముచ్చటించినట్లు మట్టితో నిర్మించినది కాని కాదు.ఏ విధముగా వేదములు అపౌరుషేయములో అదే విధముగా ,సమస్త జీవరాశుల మనోరథమునుతీర్చుటకు అనవరతము శ్రమించు కర్మసాక్షి రథము.అందరిని ఆదరించు అరదము.
" యద్భావం తద్భవతి" ఆర్యోక్తి.ఎందరో మహానుభావులు తమతమదృక్కోణముల ద్వారా దర్శించి ,పరిశీలించి ప్రస్తుతించినారు.



 మానవ శరీరము రథమునకు సూక్ష్మ రూపము.జ్ఞానమే చక్రము.కామక్రోధాది అరిషడ్వరగములే ఆకులు.శుభేచ్చ-విచారణ-తను మనసి-సత్వాపత్తి-సంసక్తి-పదార్థభావన-తురీయము అను సప్తజ్ఞానభూమికలే ఏడుగుఱ్ఱాలు.మనసే పగ్గాలు.బుద్ధియే సారధి.హృదయమే పరమాత్మ ఆసనము.జీవుని ప్రయాణ సాధనము శరీరము. ఇదియే సూర్య రథము.

స్థూలభావముగా గోచరించిన వారికి విశ్వమే ఒక రథము.కాలమే చక్రము.ఉత్పత్తి-స్థితి-పరిణామము-వృద్ధి-క్షయము-నాశనము ఆరు ఆకులు.దేవ- మానవ-వృక్ష-మృగ-పక్షి-కీటక-జలచరములు అశ్వములు.
  యోగ శాస్త్రకారులు శరీరమును రథముగా భావిస్తారు.వారి యోచన ప్రకారము కుండలిని శక్తి ఏకచక్రము.షట్చక్రాలు ఆరు ఆకులు.భూమి-నీరు-వాయువు-అగ్ని-ఆకాశము-మహత్తు-అహము ఏడుగుఱ్ఱాలు.చిదాత్మనే సూర్యుడు.
   సంఖ్యా శాస్త్రకారుల అభిప్రాయము ప్రకారము విశ్వము 360 డిగ్రీలు గల ఒక వృత్తము.సూర్యుడు ఒకరోజుకు ఒక డిగ్రీ చొప్పున పయనిస్తూ 360 రోజులలో వృత్త గమనాన్ని పూర్తిచేస్తాడు.మిగిలిన రోజుల లెక్కలే అధికమాసములుగా పరిగణింపబడుతాయి.

    అయితే ఈ రథసాక్షాత్కారమును పొందిన దివ్యులు ఈ విధముగా స్తుతించుచున్నారు.గంధర్వులు సంగీతముతో,అప్సరసలు నాట్యముతో,నాగులు రథ అలంకరణలతో,యక్షులు అంగ రక్షణతో,వాలిఖ్యాది మునులు ప్రస్తుతులతో,నిశాచరులు అనుసరిస్తూ భక్తోపచార-శక్తోపచారములను చేస్తూ తరిస్తున్నారట. ప్రత్యక్ష సాక్షి కి నిత్యార్చనలు నెనరులు.

    సూర్య రథము మూడుకోట్ల ఆరు లక్షల యోజనముల పొడవు,తొమ్మిది లక్షల యోజనముల వెడల్పు కలిగి,పన్నెండు నెలలలో,పన్నెండు రాశులలో ,మిత్ర-రవి-సూర్య-భగ-పూష-హిరణ గర్భ-మరీచి-ఆదిత్య-సవిత-అర్క-భాస్కర రూపములతో పయనిస్తు ఋతువుల ఋజు వర్తనమునకు ఋజువైనాడు ఆ పరమాత్మ. సప్త ఋషులే రథాస్వములని , అనూరుడు సారథి అయినప్పటికిని వెనుదిరిదిగి స్వామి కనుసన్నలను అనుసరి0చు ఉరుతర రథచోదకుడు.  


    రథ విశిష్టత-సప్త సంఖ్య ప్రాముఖ్యత కొంచము కొంచము అవగతమగుచున్న సమయములో మాఘశుద్ధ పంచమి రథ సప్తమికదా.మాఘమాసము శ్లాఘనీయమేమో.ముమ్మాటికి.అఘము లేనిది.అంతే పాపము లేనిది  మాఘ మాసము.ఈ సమయము తమ స్వామిని దక్షిణాయణ గ్రహణమునుండి విముక్తునిగా చూడాలనే భక్తితో ఉత్తర దిక్కుగా  పయనింపచేస్తూ ప్రకాశింప చేస్తోంది. 

  ధర్మము అనే ధ్వజముతో గాయత్రీమాతగ, గమనము చేయు రథము,సారథి యైన అనూరుడు,స్వామి సూర్య భగవానుడు సకల చరాచర జీవరాశుల సృష్టి-స్థితి-లయములకు కారణభూతుడై,తాను అనవరతము శ్రమిస్తున్నను,మనకు విశ్రాంతిని ఇచ్చుటకు రేయిగా మనకు కనుమరుగవుతున్న ఆ సూర్యభగవానుడు అదితి-కశ్యపులకు జన్మించిన రోజు కనుక పుట్టిన రోజు శుభాకాంక్షలతో,కుటుంబీకుడైన రోజనే వారిని గౌరవిస్తు విశ్వ కుటుంబీకునికి వినమ్ర ప్రణామములతో,ఆదియునకు యధాశక్తి స్మరిస్తూ-మీ సోదరి సుబ్బలక్ష్మి నిమ్మగడ్డ.

   సూర్యునికో  చిన్ని దివ్వె.
 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...