Monday, June 8, 2020

OM NAMA SIVAAYA --86


 ఓం నమః శివాయ-86
 **************

 గణపతిని శిక్షించగ గజముతలను పెట్టావు
 అంధకుని  రక్షించగ భృంగిగా మార్చావు

 దక్షుని జీవింపచేయ మేకతలను పెట్టావు
 బ్రహ్మ తలలు పడగొడుతు భిక్షపాత్రలంటావు

 నరసింహుని శాంతింపగ పక్షితలతో వెళతావు
 వ్యాఘ్రపాదుడంటు కాళ్ళకు పులిపాదములతికిస్తావు


 తలరాతల మార్పులంటు తలలనే మారుస్తుంటావు
 వెతలను తీరుస్తానంటు కతలనే రాస్తావు

 నా కతవినిపించానంటే నా తల మారుస్తావేమో
 తలమానికము నేనంటు తలల మార్పుచేర్పులతో

 తలకొక మాదిరిగ తరియింపచేయువాడనంటు,వారిపై
 ఉక్కుపాదమెందుకురా ఓ తిక్కశంకరా.

 శివుడు తాను తలరాతలను మారుస్తానంటూ,చేతకాక వారి తలను తీసి వేరొక తలను అతికిస్తుంటాడు.అంతటితో ఆగకుండా కాళ్లకు పులిపాదములను అతికిస్తాడు.భ్రింగికి మూడుకాళ్ళు కలిగిన వికృత రూపమునిచ్చాడు.బ్రహ్మకల్పము ముగుసిన వెంటనే వాని తలలను దండగా గుచ్చుకొని వేసుకొని మురిసిపోతు,నేను తలమానికమైన వాడినని గొప్పలు చెప్పుకుంటాడు.-నింద.

 కతలు నమః శివాయ-వెతలు నమః శివాయ
 శర్భం నమః శివాయ-శర్వుడు నమః శివాయ

నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" భ్రంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా
  హ్లాదో నాదయుతో మహాసి తవపుః పంచేణా చాదృతః
  సత్పక్షో సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో
  రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసి విభుః."

   శివానందలహరి.

 భృంగి ఇష్టపడునట్లుగా నాట్యము చేయువాడును,గజాసురుని మదమణచిన వాడును,ఢక్కా నాదమును చేయువాడును,శుధ్ధస్పటిక తెల్లదనమును కలవాడును,నారాయణునకు ప్రియమైన వాడును,సజ్జనులను కాపాడుటలో మంచిమనసున్న శ్రీశైల భ్రమరాంబిక పతి శరణు-శరణు.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.

.

OM NAMA SIVAAYA-85


  ఓం  నమః శివాయ-85
  **********************
గట్టిగానే వారు నిన్ను ప్రార్థించారనుకుంటు,అందరిని
నెట్టుకుంటు వచ్చినీవు మట్టిలింగమవుతావు

 సుతిమెత్తని బాలుడని వెతలను తొలగించాలంటు,అద్భుత
 కతలను అందీయగ వచ్చినీవు సైకతలింగమవుతావు

 అఖిలజగములకు మేము అమ్మా-నాన్నలమంటు,చక్కని
 వలపుచాట వచ్చినీవు తెలుపు-నలుపు లింగమవుతావు

 ఆకలిదప్పులతో నున్నారని-పాలధారలివ్వాలని,ఆగని
 ఆతురతతో వచ్చినీవు అమృతలింగమవుతావు

 హుటాహుటిని హడావిడిగా హనుమ పట్టుకొచ్చాడని,భళిరే
 మెచ్చుకుంటు వచ్చినీవు అనేక లింగములవుతావు

 లింగము అంటే గుర్తు అని-బెంగ తీరుస్తుందని వస్తే
 ఒక్క గుర్తునుండవురా ఓ తిక్క శంకరా.

 సివుడికి తొందర ఎక్కువ తన రూపమును గురించి,దానికి సంబంధించిన సంకేతమైన లింగము గురించి ఒక నిర్దిష్టమైన ప్రకటనమును చేయలేనివాడు.కనుకనే ప్రార్థనలకు ఉబ్బి తబ్బిబ్బై, అందరిని నెట్టుకుంటు వచ్చి మట్టిలింగముగా వెలిసినాడు.ఆ విషమును గమనించకుండ మార్కండేయుని అనుగ్రహించుటకై ఇసుకలింగముగా మారి పూజలందుకునే వాడు.ద్రాక్షారామ భీమేశ్వరుని భక్తుడు నీలో మీ ఇద్దరిని చూడాలని ఉందంటే సరే నని తాను అమ్మ తెలుపు-నలుపు రంగులలో ( ఒకేలింగముగా) దర్శనమిస్తానన్నాడు.ఉపమన్యు అను బాలభక్తునకు పాలను అందించుటకు బాణమును వేసి,అక్కడే క్షీరలింగముగా ఉండిపోయాడు.రామేశ్వర పూజకై హనుమంతుడు అనేక లింగములను పట్టుకురాగ కీసరగుట్టలో అనేక లింగములుగా అనుగ్రహిస్తున్నానంటాడు.ఒక చోట పొట్టిగ,మరొకచోట పొడుగుగా అసలు ఒక పధ్ధతిలేకుండ కనిపిస్తు నేనే శివుడనని,ఈ పలురకములైన లింగములు నా గురుతులంటు,భక్తులకు సంశయమును కలిగించే వాడు శివుడు-నింద.

  మట్టి నమః శివాయ-ఇసుక నమః శివాయ
  రంగం నమః శివాయ-లింగం నమః శివాయచ.

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


 "నమ ఇరిణ్యాచ ప్రపధ్యాయచ" రుద్రనమకం. చవిటినేలలందు-నడుచు మార్గములను తయారుచేయు రుద్రునకు నమస్కారములు.దానికి ఉదాహరణయే కంచిలోని ప్రథివీలింగము.నమోనమః. నమ స్సికత్యాయచ" ఇసుకరూపములో నున్న ఈశ్వరా ప్రణామములు.అద్వైతమునే ద్వైతముగా చమత్కరించే అర్థనారీశ్వరా అభివాదములు.లోకములోని ఏకానేక స్వరూపా అనేకానేక నమస్కారములు.సర్వము-సకలము నీవై నిఖిలజగములను సంరక్షించి సదాశివా సకల శుభములను చేకూర్చుము.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.










































TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...