తిరువెంబావాయ్-24
*************
ఇన్నిశయ వీణయన్ యాళినర్ ఒరుపాల్
ఇరుక్కొదు తోత్తిరం ఇయంబినర్ ఒరుపాల్
తున్నియ పిణై మలర్ కయ్యనార్ ఒరుపాల్
తొళి కయ్యర్ అళుకయ్యర్ కువల్ కయ్యర్ ఒరుపాల్
చెన్నియ అంజలి కుప్పినార్ ఒరుపాల్
తిరుప్పెరున్ తురై యురై శివపెరుమానే
ఎన్నయు అండుకొండు ఇన్నరుళ్ పురియుం
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె
అత్మనాథస్వామి తిరు వడిగలే పోట్రి
***************************
తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో భగవదనుగ్రహము-భగవదారాధన, ఏ విధముగా బహు ముఖములైభాసించుచున్నవో వివరించుచున్నారు.
భగవదనుగ్రహము ఆధారమైతే దానిని ఆలంబనము చేసుకొని అర్చించుచున్నభగవద్భక్తి ఆధేయము.
స్వామి,
అండుంకొండుం-అనేకానేకములైన/అనేకవిధములైన/ఈ తీరుననే అని నిర్ణయించలేనిదైన,
నీ అనుగ్రహ ఆశీర్వచనము ఎన్ని విధములుగా ప్రకటింపబడుతున్నదో,
పురియం-నాకు పరిచయముకావింప బడుతున్నదో,పరమ సంతోషాంతరంగముతో నీకు నివేదిస్తాను.
ఈ పక్క-ఒరుపాల్,ఆ పక్క అనికాదు.ఎటు పక్క చూసినను నీ అర్చనావిధానము,అతి రమణీయమై అలరారు చున్నది.
మొదటిది,
ఒరుపాల్-ఒక పక్కన,
ఇన్నిశయ వీణయర్-నీమహిమలను నినదించుచున్న,
వీణయర్
యుళినర్-వీణా నాదములు,
రెండవది,
ఒరుపాల్-ఇంకొక పక్కన,
ఇయంబినన్-శ్రావ్యముగా వినబడుచున్నది ఆ నాదము, ఏమిటది?
తోత్తిరం-స్తోత్రములు/వేద స్వరూపినిగా నిన్ను కొనియాడబడుచున్న స్తోత్రములు మమ్ములను పునీతులను చేయుచున్నవి.
చెవులే కాదు మా కన్నులును ఎంతటి భాగ్యమును చేసుకొనినవో తెలియదు.
కనుకనే అవి చూడగలుగుతున్నవి.ఎటువంటి దృశ్యములను?
మొదటిది,
మలర్ కయ్యనార్-చేతులలో పూలతో,పూలదండలతో,భక్తిని నింపుకొని యున్న/నీ సేవకై కుతూహలముగా వేచియున్న,
తున్నియె పిణ్ణై-భాగ్యశాలులైన పిల్లలు.
రెండవది,
ఒరుపాల్-ఇంకొక వైపున,
రుద్ర భాష్యము చెప్పినట్లు,
అంగన్యాస-కరన్యాసములతో ఆ పరమాత్మను తమ యందు న్యాసము చేసుకొనుచున్నారా యన్నట్లు,మన శరీరావయములను-మనసును దివ్యత్వముతో నింపుకొనుచున్నారా యన్నట్లు,
తొళుకయ్యన్-వారి హస్తములను భుజముల మీద,
కువల్ కయ్యర్-తమ శరీరమునందుంచి,పవిత్రము చేసికొనుచు,
అశ్రునయనులై-అళు కయ్యర్,
నీ ఆరాధనకై వేచియున్నారు.
ఒరుపాల్-మరొక వైపు ,
శెన్నయ్ అంజలి కుప్పినార్-త్రికరణములో నమస్కారములను అర్పించుచున్నారు.
ఒక పక్క వినిపించు వీణా నినాదములు,
ఒక పక్క ఘోషించు వేద నాదములు,
ఒక పక్క నిను చేర పూలహారములు,
ఒక పక్క నిండైన నమస్కారములు
అటువైపు-ఇటువైపు-ఎటువైపు చూసిన
శరణు ఘోషలు నిన్ను స్మరియించు వేళ,
ఎం పెరుమానె-నా పాలిటి రక్షకుడా,
మేలుకొని,మమ్మేలుకోవయ్యా.
ఇక్కడ మనకొక చిన్న విషయము గుర్తుకు వస్తుంది.వీరందరు స్వామి దర్శన సౌభాగ్యమున తమను తాము సంస్కరించుకొను సౌభాగ్యవంతులే.
స్వామిదర్శనము కాలేదని తాళలేని పరిస్థితిలో నున్నవారే.వారికి స్వామి అనుగ్రహమేమో కాని ఉపచారములే ఉపశమనమునకుకారణములైనవి. కలతను ఉపశమింపచేయుచున్నవి.
స్వామి ఇక ఆలస్యము చేయకుండా నీ దివ్యమంగళ సందర్శన భాగ్యమును అనుగ్రహించు.సదా మీ సేవకులము.
తిరుపెరుంతురై అరుళ ఇది
ఆత్మనాథ తిరువడిగళియే పోట్రి.
నండ్రి.వణక్కం.