Tuesday, February 6, 2018

Siva sankalpamu-39


 బావిలో నీవున్నావని  భక్తుడిగా  నేవస్తే
 బాచిలోని కప్ప నిన్ను తనతో పోల్చుకుంది

 కొండమీద నీవున్నావని కొలువగా నేవస్తే
 బందరాయి కూడ నిన్ను తనతో పోల్చుకుంది

 బీడునేల నీవున్నావని  తోడు కొరకు  నేవస్తే
 జోడువీడు అంటు బీడు  తనతో  పోల్చుకుంది

 అటవి లోన నీవున్నావని  అటుగా నేవస్తే
 జటలుచూడు అంటు అడవి  తనతో పోల్చుకుంది

 చెట్టులోన నీవున్నావని  పట్టుకొనగ నేవస్తే
 పట్టులేక ఉన్నావనిచెట్టు తనతో పోల్చుకుంది

 సఖుడివి నీవై  సకలము పరిపాలిస్తుంతే
 ఒక్కరైనపొగడరేల  ఓ తిక్క శంకరా!.

SIVA SANKALPAMU-38


 దారుణ మారణ కాండను  కారుణ్యము అంటావు
 పొట్టచీల్చి గజాసురుని  మట్టి కరిపించావు
 చుట్టుకుంది  అతని తల నీ సుతు శరీరమునే

 కన్ను తెరిచి మదనుని కన్ను మూయించావు
 కన్నుల పండుగ అయినది నీ కళ్యాణముతో

 బాణమేసి వరాహము ప్రాణమునే తీసావు
 పాశుపతము చేరింది అర్జునుని ఆశీర్వచనమై

 హరిని అస్త్రముగా వాడి త్రిపుర సం హారము చేసావు
 విరచితమైనది  హరి మహిమ వీరత్వము చాటుతు

 ఎటు చూసిన పాతకమే  నీ గతముగ మారితే

 " మహాదేవం మహాత్మానాం మహా పాతక నాశనం" అను
  మొక్కులందుకునేవురా  ఓ తిక్క శంకరా!.

SIVA SANKALPAMU-37


  కళల మార్పుచేర్పులతో కదులుచున్న చంద్రుడు
  నీసిగముడుల చీకట్లలో  చింతిస్తు ఉంటాడట

  కుబుసపు  మార్పుచేర్పులతో కదలాడు పాములు
  నీలలోహిత చీకటిలో చిబ్తిస్తు ఉంటాయట

  కునుకురాక  తెరువలేక కుదురులేని  మూడో కన్ను
  తెరతీయని చీకటులలో చింతిస్తు ఉంటుందట

  ఆకాశము నుండి జారి సాగ  అవకాశము లేని గంగ
  బంధిఖాన చీకటిలో చింతిస్తు ఉంటుందట

  చీకటులను తొలగించలేని జ్యోతి శివుడేనట
  చింతను తొలగించలేని వింతయు శివుడేనట

 దోషము తొలగించలేని  వానికి ప్రదోషపూజలా? అంటు
 ఒక్కటే  గుసగుసలు  ఓ  తిక్క శంకరా!.


SIVA SANKALPAMU-36


  పాల కడలి జనించిన గరళము నిను చేరితే
  మురిపాల పడతి లక్ష్మి హరిని  శ్రీహరిని చేసింది

  శరభ రూపమున నీవు  శ్రీహరిని  శాంతింప చేస్తే
  విభవమంత  హరిదేగా  ప్రహ్లాద  చరిత్రలో

  చిలుకు ఏకాదశినాడు చక చక నిద్ర లేచేసి
  దామోదరుడు నిన్ను చేరినది  మోదము కొరకేగా

  అభిషేక  జలాలతో నీవు  ఆనందపడుతుంటే
  అలంకారాలన్ని  హరి తన  ఆకారాలంటాడు

  అనుక్షణము నీవు అసురత చండాడుతుంటే
  లక్ష్ణముగ హరి తులసిని పెండ్లాడాడు

  అలసటయే  నాదని  ఆనందము హరిది అని
  ఒక్క మాట చెప్పవేరా ఓ తిక్క శంకరా!. 

SIVA SANKALPAMU-33

  
 కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవ
 సిగపూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలద

 కట్టుకున్న గజచర్మము నీకు పట్టు పుట్టములు అందీయగలద
 నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను అందీయగలద

 అలదుకున్న విభూతి నీకు వైభవమును అందీయగలద
 కరమున ఉన్న శూలము నీకు వరములు అందీయగలద

 కరుగుచున్న నగము నీకు వరములు అందీయగలద
 కాల్చున్న కన్ను నీకు కనక వర్షము అందీయగలద

 పట్టుకున్న పాము నీకు రత్నరాశులను అందీయగలద
 కదలలేని చంద్రుడు నీకు ఇంద్రపదవిని అందీయగలడ

 "ఓం దారిద్ర్య దుఖ: దహనాయ"అనగానే నువు ఔనంటే విని
 ఒక్కరైన నమ్మరురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-32


  సగము మహాదేవుడట  సగము మహాదేవి అట
  సగము తేట తెలుపట సగము పసిడి పసుపట

  సగము చంద్రబింబమట  సగము మల్లెదండలట
  సగము జటాజూటమట  సగము సుందర థమ్మిల్లమట

  సగము బూదిపూతలట  సగము కస్తురి తిలకమట
  సగము నాగ హారములట  సగము నానా హారములట

  డమరుక దక్షిణ హస్తమట  వరద  వామ హస్తమట
  సగము పులితోలేనట  సగము చీనాంబరములట

  సగమున తాందవ పాదమట సగము మంజీరములట
  చెరిసగము  స్త్రీపురుషులట  కొనసాగించగ సృష్టి యట

 నగజ-అనఘ జతలో మిగిలిన సగమేది అంతే
 దిక్కులు చూస్తావేమిరా  ఓ తిక్క శంకరా!.


 శివ పార్వతులు చెరిసగమైనారు కనుక మిగిలిన సగభాగముల గురించి అడుగగా శివుడు సమాధానము చెప్పలేదు.నింద.

  చర్మ చక్షువులు తెలుసుకోలేని ఎన్నో గొప్ప విషయములు జ్ఞాన చక్షువులు తెలియచేస్తాయి.దిక్కులే వస్త్రములుగా గల శివుడు అర్థనారీశ్వర తత్త్వములో తనను పార్వతిలో దర్శింపచేసి అనుగ్రహించాడు.స్తుతి.
  

SIVA SANKALPAMU-31


  భక్త పరాధీనతలో  బడలిపోయి  ఉన్నావని
  నక్తపు నియమములతో  నకనకలాడుతున్నావని

  భక్ష్య-భోజ్య చోహ్యములు లక్షనమగు లేహ్యములు
  చవులూరు  చెరుకురసము  ఆహా అను అతిరసము

  నారికేళ జలాలు  నానా తినుబండారాలు
  మధురస మామిడిపళ్ళు  మంచి నేరేడు పళ్ళు

  చక్కెరకేళి పళ్ళు  చక్కనైనద్రాక్షపళ్ళు
  ఆరు రుచుల  ఆధరువులు  ఆత్మీయ  సమర్పణలు

  పోషణలేక నీవు శోషతో సొక్కిపోతావని
  మక్కువతో తినిపించగ గ్రక్కున నేనువస్తే

 విషము రుచి నీకంత విపరీతముగ నచ్చిందా
 ఒక్కటైన ముట్టవేర  ఓ తిక్క శంకరా!

 భక్తులు శివునికి ఆకలిగాఉన్నదని అనేక మధుర పదార్థములను తినిపించాలని వస్తే,వాటిని కాదని విషమును తాగుతునాడని నింద.

  విషమును లోకహితమునకై సేవించిన గరళకంఠుడు జగద్రక్షకుడని స్తుతి,
.

SIVA SANKALPAMU-30


  చిన్ముద్రలు  ఇష్టము  రుద్రాక్షలు ఇష్టము
  అభిషేకములు  ఇష్టము   అవశేషములు ఇష్టము

  మహన్యాసము  ఇష్టము  మహ శివరాత్రి  ఇష్టము
  బిల్వములు  ఇష్తము  బిలములు  ఇష్తము

  తుమ్మిపూలు  ఇష్టము   తుమ్మెదలు  ఇష్టము
  తాండవము ఇష్టము   తాడనము ఇష్టము

  నిష్టూరములు  ఇష్టము  అష్టోత్తరములు ఇష్టము
  లయగ ఆట ఇష్టము  లయముచేయుట ఇష్టము

  కాల్చుటయు  ఇష్టము  కాచుటయు ఇష్టము
  చందనాలు  ఇష్తము  వందనాలు ఇష్టము

  కష్టాలలో నున్న నాపై నీ ఇష్టము చూపించుటకు
  మొక్కులెన్ని మొక్కాలిరా  ఓ తిక్క శంకరా!



   శివుడు శుభాశుభములను,మంచి-చెడులను  ఉచ్ఛ నీచములను గుర్తించకుండ అన్ని ఇష్టమే అంటాడు-నింద.

  సర్వ సాక్షి అయిన సదాశివుడు  సమవర్తి అని స్తుతి.

SIVA SANKALPAMU-29


  పాట పాడుచు నిన్నుచేర  పాటుపడుచు  ఒక భక్తుడు
  నాటకమాడుచు  నిన్ను చేర  పోటీపడుతు ఒక భక్తుడు

  నాట్యమాడుచు నిన్నుచేర  ఆరాటపడే  ఒక భక్తుడు
  కవిత వ్రాయుచు  నిన్నుచేర  కావ్యమైన  ఒక భక్తుడు

  తపమాచరించుచు  నిన్నుచేర  తపియించుచు  ఒక భక్తుడు
  ప్రవచనములనిన్నుచేర  పరుగుతీయు  ఒక భక్తుడు

  చిత్రలేఖ్నముతో నిన్నుచేర  చిత్రముగా ఒక భక్తుడు
  నిందిస్తూనేనిన్నుచేర  చిందులేస్తూ   ఒక భక్తుడు

  నిలదీస్తూనే  నిన్నుచేర కొలిచేటి  ఒక భక్తుడు
  అర్చనలతో  నిన్నుచేర  ముచ్చటించు  ఒక భక్తుడు

  ఏ దారిలో  నిన్నుచేరాలో   ఎంచుకోలేని  ఈ భక్తుడు
  నువ్వు  నక్కతోక  తొక్కావురా ఓ తిక్క శంకరా.



  శివుడు  ఒక నిర్దిష్ట పూజా విధానమును  భక్తులకు  తెలియచేయలేదు కనుక ఎవరికి తోచిన విధముగా  వారు శివుని కొలుస్తున్నారు.నింద.

  భోళా శంకరుడు భక్తులు తమకు ఇష్టమైన ఏ మార్గములోనైనను  లోపించని భక్తితో కొలిచిన  తప్పక  అనుగ్రహిస్తాడు.-స్తుతి.

SIVA SANKALPAMU-28

  మన్మధ బాణము అంటే మాయదారి భయము నీకు
  కోపము నటించి వానిని మాయము చేశేసావు

  కోరికలతో కొలుచు వారంటే కొండంత భయము నీకు
  చేరువుగా రాకుండా పారిపోతు ఉంటావు

  అహముతో నిని కొలుచు అసురులంటే అంతులేని భయము నీకు
  దారి ఏదిలేక వారికి దాసోహము అంటావు

  సురలందరు కొలువ నిన్ను కలవరమగు భయము నీకు
  అనివార్యము అనియేగ గరళ కంఠుడివి అయినావు

  ధరించినవి అన్ని తరలుతాయేమోనని దాచలేని భయము నీకు
  జగములు గుర్తించకుండ లింగముగా మారావు

  "నమో హిరణ్య బాహవే సేనానే దిశాంగ పతయే"అయిన నీది
  మొక్కవోని ధైర్యమురా ఓ తిక్క శంకరా.

   

 మన్మథుని కాల్చుట,భక్తులకు అందకుండ పారిపోవుట,పారిపోవుట వీలుకానప్పుడు భక్తులుచెప్పినట్లువినుట,తనకు తానులింగరూపముగా దాగుట శివుడు పిరికివాడని నింద.

     పంచేంద్రియములను-పంచభూతములనునియంత్రించేవాడు,క్షమా హృదయుడు,లోక కళ్యాణార్థము ఎంతటి సాహసమునైనా చేయగలవాడు,బాహ్యరూపమునందు  ఆసక్తి లేని నిరాకారుడు అని స్తుతి.

   ఏక  బిల్వం  శివార్పణం.

SIVA SANKALPAMU-27

 వెండికొండ దేవుడవని వెండి కొరకు నేవస్తే
 దండిగా ఉన్న మంచు వెండి వెండి నవ్వింది

 మేరు కొండ విల్లుందని మేరువుకై నేవస్తే
 చాటుగా ఉన్న విల్లు చిలిపిగా నవ్వింది

 రాగి జటాజూటమని రాగి కొరకు నేవస్తే
 విరాగియైన జట మరీ విచిత్రనుగా నవ్వింది

 నీలలోహితుడవని ఇనుముకై నేవస్తే
 చాల్లే అంటూ విషము గేలిగా నవ్వింది

 కుబేరుడు ముందున్నాడని ధనమునకై నేవస్తే
 చేతులు కట్టుకున్నానని చేతకాక నవ్వాడు

 ఎండమావులను నీళ్లనుకుని కుండ పట్టుకొచ్చాను
 ఎక్కిళ్ళు ఆపవేరా ఓ తిక్క శంకరా.
.....................................................................................................................................................................................................దు:ఖాగ్నిని చల్లబరచేది శివుని కొండ అని వస్తే నన్ను చూసి మరల మరల నవ్వుతున్నది నీ కొండ.నీ దగ్గర బంగారు విల్లు ఉందని బంగారము కొరకు వస్తే మూలదాగి ఉన్న విల్లు నవ్వింది.రాగి ఇస్తావనుకుంటే జట నవ్వింది.ఇనుము ఇస్తావనుకుంటే విషము నవ్వింది..కుబేరుడ డబ్బు ఇస్తాడనుకుంటే చేతులుకట్టుకొని దాసుని వలె ఉన్నాడు.దీనికి కారణము శివుడు-నింద 
.శివ విభూతి వీటన్నిటిని మించినది భక్తులను రక్షించునది అని -స్తుతి.

SIVA SANKALPAMU-26

 నగుమోముతో నగములు నిన్ను బంధువు అంటున్నవి
 సాలెపురుగు పాలె దోమ నిన్ను దయాసింధువు అంటున్నది

 తుమ్మెద అమ్మమ్మ నిన్ను కమ్మని చుట్టము అంటున్నది
 కరిరాజు పరివారము వారి సరివాడవు అంటున్నది

 ఎద్దు తరపు పెద్ద నిన్ను పెద్దయ్య అని పిలుస్తాడు
 లేడి చేడియ నిన్ను అయినవాడివి అంటున్నది

 వ్యాళపతి వాసుకి నిన్ను చుట్టమని చుట్టుకుంది
 తిన్నని కన్న అడవి నిన్ను కన్నతండ్రి అంటున్నది

 హరి(కోతి) సంగతి సరేసరి అసలు చుట్టమంటాడు
 ఇందరి చుట్టమైన నీవు నన్ను చుట్టుకోకుంటే

 "నరత్వం దేవత్వం నగ వన మృగత్వం" అన్న లహరి
 లెక్కలోకి రాదురా ఓ తిక్క శంకరా.
......................................................................................................................................................................................................శివుడు క్రిమికీటకములతో,వనచరములతో చుట్టరికము కలుపుకొనే ఆటవికుడు.నింద

.పాశముచే బంధించబడిన ప్రతిజీవి పశువు.పశువులను అనుగ్రహించువాడు పశుపతి-శివుడు-స్తుతి.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...