Monday, November 21, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-29


 



  న రుద్రోరుద్రమర్చయేత్-29

  ********************

 " జితం జితం తే జిత! యజ్ఞ భావన!

   త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః

   యత్ రోమగర్తేషు నిలిల్యురధ్వరాః

   తస్మైనమః కారణ  సూకరాయతే."-యజ్ఞో వై విష్ణుః.


  యజ్ఞవరాహ స్తోత్రము.


 యజ్ఞ స్వరూపుడవై,యజ్ఞరక్షకుడవై,వేద స్వరూపుడవై,వరాహరూపములో ప్రకాశిస్తున్న నీ శరీరములోని ప్రతి రోమకణములోను సమస్త యజ్ఞ కార్యములు నిండి యున్నవి.నీ నాలుగు పాదములే ఋత్విక్కులు,నీ నేత్ర చకనమే ఆజ్యము.నీ నాసికయే పెద్ద స్రుక్కు.నాసికా రంధ్రములు చిన్నగరిటెలు.నీ ఉదరము యజ్ఞకుండములోని అగ్ని.నీ చెవులు సోమరస పాత్రలు.నీ నోరు ఆహుతులు.నీ దంతములు అగ్నిహోత్రములు.


 యజ్ఞ కర్తవు-యజ్ఞ భోక్తవు-యజ్ఞ హర్తవు నీవే అని దేవతలు యజ్ఞవరాహమూర్తిని ప్రస్తుతిస్తున్నారు.


 ప్రియ మిత్రులారా!

 సనాతన ధర్మము నా (స్త్రీ) ఉపాధికి నియమించిన పరిమితిలో ,ఈ రోజు బిల్వార్చనమును "యజ్ఞ" శబ్ద వైభవమును గ్రహించే పయత్నము చేస్తాను.

  చమకములో చెప్పినట్లు సామర్థ్యమునీయమని అమ్మను ప్రార్థిస్తూ,ప్రారంభిస్తాను.


  పరమ పావనమైన  నీపాదరజ కణము

  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము


  అమ్మ మహిమ గుర్తించని చిమ్మచీకట్లలలో

  విజ్ఞత వివరము తెలియని  యజ్ఞ వాటికలలో


  అటు-ఇటు పరుగులిడు తలపులను ఇటుకలతో

  సంకల్ప-వికల్పములను సుక్కు-శ్రవములతో


  విచక్షణారహితమను  సంప్రోక్షణలతో

  కుతంత్రాల తతులనే  కుటిల మంత్రాలతో


  తమస్సులో తపస్సులను బహులెస్స హవిస్సులతో

  నా అజ్ఞానము సర్వము  యజ్ఞముగా మారుచున్న వేళ


  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా

  మానస విహారి! ఓ సౌందర్య లహరి.


      అర్చనము/అర్పణము అను అర్థమునిచ్చు "యజుః"యజుస్ అను ధాతువు నుండి "యజ్ఞము" అను పదము ఏర్పడినది.అర్పణము చేయుటకు తగిన అర్హతను సంపాదించు ప్రారంభమే యజ్ఞోపవీతధారణము.చతుర్వేదములలో రెండవదైన యజుర్వేదము శుక్ల-కృష్ణ  అను రెండు విభాగములు కలది/సంహితలు కలది.           .శుక్ల యజుర్వేదము మాధ్యందిన-కణ్వ సంహితలను కలిగియున్నది.పేరులోనే దాని స్వభావము మేలును కూడియున్నది అని తెలియుచున్నది.

 కృష్ణ యజుర్వేదము తైత్తరీయము,కథకము-కపిస్థకము-మైత్రావని సంహితలను కలిగియున్నది.

 

  ఋగ్వేద-హోత


  యజుర్వేద-అథ్వర్య


  సామవేద-ఉద్ఘాత


  అథర్వణవేద-బ్రాహ్మణ పాల్గొని,

యజ్ఞమును పరిపూర్ణమును కావింతురు.




   యజ్ఞములలో మనకు "స్వాహా" అను మంత్రము తరచుగా వినిపిస్తుంటుంది.


 మనలో వివిధరూపములలో-వివిధనామములలో దాగిన పరమాత్మను సు-ఆహ్వానమే స్వాహా మంత్రము.


 హోమ గుండము న మః నాది కాదు, అను నామమునకు న మమ అన్నదానికి సంకేతము.




 నిజముగా చెప్పాలంటే ఈశ్వర విభూతి ప్రకంపనలే యజ్ఞము.


 యజ్ఞములు నిత్యములని-నైమిత్తికములని రెండు విధములు.


 వాడుకలో క్రతువు,ఇష్టి,యాగము,యజ్ఞము ,హోమము,అగ్నికార్యము పర్యాయ పదములుగా వ్యవహరింపబడుతున్నప్పటికి,వాటిని వేటి నిమిత్తమైన చేస్తున్నామా,నిత్య విధిగా జరుపుకుంటున్నామా,స్వార్థమునకా,విశ్వ శ్రేయస్సుకా అనే అంశములు వాటి విధానమును నిర్ణయిస్తాయి.


 అహంకారముతో దక్షుడు చేసిన యజ్ఞము,ప్రతీకారముతో జనమేజయుడు చేసిన యాగము,పుత్రులు కావాలనే కోరికతో దశరథ మహారాజు చేసిన ఇష్టి,క్షాత్రముతో చేసిన రాజసూయము,అశ్వమేథము,విశ్వజిత్ యాగములు ఒక్కొక్కటి ఒక్కొక్క ధ్యేయముతో జరిపించినవి.

 నిజమునకు సర్వము ఈశ్వరానుగ్రహమే నన్న భావముతో ఈశ్వరుని సాక్షిగా ఈశ్వర సమర్పణము చేయుటయే యజ్ఞము.

 దానము ప్రాపంచికము.దాత-దానము-గ్రహీత భౌతికముగా కనిపిస్తూనే ఉంటారు.నాది ఇక మీదట నీది అన్న ద్వంద్వ భావన ఉంటుంది.

 సమర్పణము దానికి భిన్నము.దాత-త్యాగము-గ్రహీత  ఒక్కరే.అయినప్పటికిని ముగ్గురుగా ప్రకటనమగుటయే కాక,సాక్షిగా-మధ్యవర్తిగా అగ్నిహోత్రుని అనుసంధానము ఉంటుంది.ఆ ప్రక్రియ సమర్పణము హవిస్సుగా మారుతుంది.


 రుద్ర చమకము 8 వ అనువాకములో మనో-వాక్కాయ-కర్మల ద్వారా నిర్వహించు యజ్ఞమునకు కావలిసిన పరికరములు ప్రస్తావింపబడినవి.

 పాత్రలు

 *******

 1.చమసాశ్చమే-యజ్ఞపాత్ర

 2.ఆధవనీయశ్చమే-సోమలతను కడిగెడి పాత్ర

 3.ద్రోణకలశశ్చమే-మఱ్ఱిచెక్కనుండి మామిడి కాయ ఆకారములో చేయబడిన పాత్ర

 4.హవిర్ధానంచమే-హవిస్సులనుంచెడి పాత్ర

  ఇధ్మశ్చమే-సమిధలు

  బర్హిశ్చమే-గరికలు

 సుచశ్చమే-చెక్క గరిటలు

  యజ్ఞకుండము,వేదిక చెప్పబడినవి.

 /స్వరవశ్చమే/మంత్రాశ్చమే-మంత్రములు -వాక్కునకు,చెప్పిన తరువాత 

 యజ్ఞమును నిర్వహించుట వలన కలుగు ప్రయోజనములను 10 వ అనువాకములో తెలియ చేసారు.

 ఆయుర్యజ్ఞేన కల్పంతాం-ప్రాణో యజ్ఞేన కల్పంతాం అంటూ ప్రాణములు,పంచేంద్రియములు మేము చేయుచున్న యజ్ఞము వలన సమర్థవంతమగుగాక!  అని స్వస్తి వాక్యము నందించు చున్నారు.

 సమర్థవంతమైన ఇంద్రియములచే నిర్వర్తింపబడుచున్న యజ్ఞము వలన 

 పృధ్వీచమే-అంతరిక్షంచమే.దిశశ్చమే-విదిశ్చమే,భూమ్యాకాశములు,దిక్కులు-మూలలు సస్యశ్యామలమై,శాంతి-సౌభాగ్యములతో విలసిల్లును కాక అని ఆశీర్వదిస్తున్నారు.

 మనో వాక్కాయ కర్మలను పవిత్రీకరించుటకు దర్భలు త్రిమూర్త్యాత్మకములై తేజరిల్లు చున్నవి. 

 

 శ్రీ లలితా రహస్య సహస్ర నామములు "పంచ యజ్ఞ " ప్రియ అని అమ్మవారిని కీర్తిస్తున్నది.

 మానవ ఉపాధిలో నున్న మనము నిర్వర్తించవలసిన 5 ముఖ్య యజ్ఞములను

1 పితృ యజ్ఞము

2.దేవతా యజ్ణము

3.ఋషి యజ్ఞము

4.భూత యజ్ఞము

5.బ్రహ్మ యజ్ఞముగా చెబుతారు.

  మన పూర్వజుల యందు గౌరవభావముతో వారిని విస్మరించకుండుట,చేయవలసిన ధర్మములను మానకుండుట  పితృ యజ్ఞము.

 మన ఇంద్రియములను సమర్థవంతముగా సన్మార్గమున నడిపించు ప్రయత్నమే దేవ యజ్ఞము

   ఋషులు మనకు అందించిన ఇహిహాసములను,సాహిత్యమును,చదువుతు -సంస్కారమును బలపరచుకొనుటయే ఋషి యజ్ఞము

   అన్ని జీవుల యందు(భూతము అనగా ఉన్నది) ఈశ్వరుని ఉనికిని గమనించి అన్న పానములను సమర్పించుట భూత యజ్ఞము.


    ఇవి చేయవలెనన్న మన ఉనికిని మనము అధ్యయనము చేసుకొనవలెను.బ్రహ్మము-పరబ్రహ్మము మనలోనే చైతన్యముగా దాగి మనలను నడిపిస్తున్నదని విషయమును ఏమరుపాటుతో మరువక సార్థకతను పొందుటయే చేయు నిరంతర-నిరహంకార ప్రయత్నమే బ్రహ్మయజ్ఞము.

 భగవంతుని అనుగ్రహముతో మనందరము సత్యం వద-ధమం చర అను సూత్రమును పాటిస్తూ,స్వామి అనుగ్రహమును పొందుదాము.

 మరొక కథా-కథనముతో రేపటి బిల్వార్చనములో కలుసుకుందాము.

 ఏక బిల్వం శివార్పణం.




TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...