Tuesday, December 3, 2019

MARGALI MALAI-25


  మార్గళి మాలై-25
 ***************


  ఇరవై ఐదవ పాశురం
  *****************
 ఒరుత్తు మగనాయ్ పిరందు,ఓర్ ఇరవిల్
 ఒరుత్తు మగనాయ్ ఒళ్త్తు వళిర
 తరిక్కిలాన్ ఆంగితాన్ తీంగు నినైనద
 కరుత్తై పిళ్ళైపిత్తు క్కంజన్ వయిత్తిల్
 నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! ఉన్నై
 అరుత్తిత్తు వందోం ; పరై తరువదియాగిల్
తిరుత్తక్క శెల్వముం శేవగమం యాంపాడి
వరుత్తముం తీరందు మగిళిందు ఏలోరెంబావాయ్!

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో



 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.

 ఒకతల్లి గర్భమున రాతిరి పుట్టినవాడు
 మరొకతల్లి ఇంటచేర యమునను దాటినవాడు

 హింసింపదలచిన కంసుని దుష్టప్రవృత్తిని
 నిర్భయముగ తానె వెడలి నివృత్తిచేసినవాడు

 అష్టాక్షరిగా పుట్టి-ద్వయమంత్రముగా పెరుగుతు
 ఆబాల గోపాలమున అడుగో ఆడిపాడుచున్నాడు

 "పర" మాకు ఇచ్చినను-లేకున్నను సమ్మతమే
  కదలనిభక్తి కైంకర్యపు పరంపరలు ప్రసాదించు

 భక్తిప్రపత్తులతో స్వామి జన్మవైభవమును కీర్తింపగ
 ఆండాళ్ అమ్మవెంట తరలి రారో! తరుణులార!

  " దేవకీ గర్భ సంకాశం-కృష్ణం వందే జగద్గురుం" నమో నమః.ఒక్కొక్క పాశురముతో ఒక్కొక్క మెట్టును గోపికలచే ఎక్కిస్తున్నది ఆచార్యస్థానములో నుండి గోదమ్మ.

  ఈ పాశురములో గోపికలు శ్రీకృష్ణ జన్మరహస్య సంభాషణమును తమ జన్మరాహిత్య సంస్కారముగా భావించినారేమో,గోదమ్మ పలుకుతున్న ప్రతి పదము పరమార్థమును వివరించుచున్నది.

   గోదమ్మ ఈ పాశురమును "ఒరుత్తు మగనాయ్" ఒకతె కొడుకు అని అంటున్నదే కాని దేవకీదేవి-యశోదాదేవి అని కాని,వారి కొడుకుగా కృష్ణుని నామమును గాని పేర్కొనలేదు. ఏమిటా ఒరుత్తు? అదే ఒకేఒక మూలపదార్థము.దానికి నామ రూపములు లేవు.మనలను అనుగ్రహించుటకు మనకోసము కాసేపు,మనము ఏ విధముగా మన చేతి వేళ్ళను ఒకసారి మూసి,మరొకసారి తెరిచి,ఇంకొక సారి కొన్ని మూసి-కొన్ని తెరిచి చేస్తుంటామో,అదే విధముగా మూలపదార్థమైన పరమాత్మ,దేవకీ-వసుదేవులుగాను,యశోద నందులుగాను ,తాము-మాయ గాను అనేక రూపములను దాల్చి,అనేక నామములను ధరించి,మనలను అనుగ్రహించుచున్నాడు,తన జన్మవృత్తాతమును తెలియచేస్తూ,

  ఇంక రెండవ విషయము " ఓర్ ఇరవిల్" అర్థరాత్రి సమయము.అది అద్భుతమయమైన అద్వితీయ రాత్రి.స్వామి తాను సామాన్య మానవుల వలె పుట్టినాడు "పిరందు" అని చెప్పించిన రాత్రి.మన కథలో మూల పదార్థము ఇద్దరు స్త్రీ మూర్తులుగా మారి ఒకరు గర్భవాస వరమును,మరొకరు స్థన్య పాన వరమును మరొక భాగమయిన కుమారుని వలన పొందినవి.

  చిమ్మచీకటి-చుట్టు  గుండుసూది పడినను వినగల నిశ్శబ్దము. శ్రావణ బహుళ అష్టమి అర్థరాత్రి.బ్రహ్మాదులు బహువిధముల ప్రస్తుతించుచుండగా నల్లనయ్య పన్నెండు నెలలు గర్భవాసము చేసి,సామాన్యుని వలె పుట్టినాడు.దేవకీదేవి దివ్యరూపమును ఉపసమ్హరించి,చిన్ని బాలుడు గా మారమనగానే వల్లె అనినాడు.ఇక్కడి నుండి అద్భుతములు మొదలు.ఇన్నని చెప్పనలవి కానివి.

  కారణము కార్యము రెండు తానైన స్వామి కార్యభారమును తన జనకునకు అప్పగించినాడు.రూపధర్మమును గౌరవించినాడు.
 తనతో తోడ్కొని వచ్చిన యోగమాయను యశోద పిరాట్టు గర్భమున నిక్షిప్తము చేసినాదు.

  స్వామి లీలలు సామాన్యులకు అర్థము కావు.ఇప్పుడు తను తండ్రి సహాయముతో గోకులమునకు వెళ్ళవలెను.వింతలు మొదలైనది.పంచేంద్రియములు వంచబడ్దవి మధురలో.ద్వారపాలకులు చేతనులు.ద్వారములు అచేతనములు.ద్వారములు వాని గడియలు చేతనములైనవి.ద్వార పాలకులు అచేతములై మూర్ఛపోయినారు.తలుపు గడియ విడివడినది.అచేతనములైన సంకెళ్ళును విడివడి సహకరించినవి. పంచేంద్రియ నిద్రాణమేమిటి? అని మనమనుకో వచ్చును.

 యధారాజా-తథా ప్రజా.వారు పరమాత్నను దర్శించలేదు.బ్రహ్మాదుల స్తుతులు మధురలో వినపడలేదు.కదలలేరని గద్దించనులేదు.స్వామి తులసిమాల పరిమళమును ( రాబోవు పరిణాములను )వాసన పీల్చలేదు.విడివడిన తలుపు గడియను తిరిగి బంధించను లేదు.అంతా చీకటి-నిశ్శబ్దము.తమోగుణ భూయిష్స్ఠము.
 అటువంటి చీకటికదా తమ స్వామిని సేవించి తరించినది అని ఆళ్వారులు చీకటిని గౌరవించి కీర్తిస్తారు.దానికి కారణము మధూర ప్రభువు కంసుడు సహిత రాగ భయక్రోధుడు.

  బయలుదేరినాడు వసుదేవుడు.భూమాత పులకించినది.గగనము హర్షించినది.వాయువు సుగంధభరితమైనది.(జలము) యమున వినయశీలతో తన ఒరవడిని తగ్గించి సహకారమను పేరుతో సత్కరించినది.అగ్ని మధురలోని తమోగుణమును తరిమివేసి ప్రకాసవంతమై వసుదేవసుతుని నందనందనుని చేసినది.

  మధురలో తమస్సు.గోకులములో ఉషస్సు.సంబరములు.సంతోషములు కారణము గోకులము వీతరాగ భయక్రోధము.స్వామి అనుగ్రహ సంపర్కముతో తిరిగి దరిచేరలేనంత దూరము తొలిగి పోయినవి.కనుకనే వారు నీ అనుగ్రహసంపదను పొందిన మేము" మగిళుందు"శేగమే" సంతోషముతో ఆదుతూ-పాడుతూ నిన్ను సేవిస్తాము అంటున్నారు స్వామితో.


  స్వామి నుండి వరములు తీసుకొన దలచిన గోపికలు ఇప్పుడు పరిపూర్ణులై స్వామినే తమ వరముగా కోరుకుంటున్నారు.ప్రశంసనీయము.

   ధర్మ సంరక్షకుడైన స్వామి మధురకు తానే వెళ్ళి,కంసునికి ముక్తినొసగినాడు.

    అన్యథా  శరణం నాస్తి-త్వమేవ  శరణం మమ అని గోపికలతో పాటుగా మనము స్వామిని ఆశ్రయిద్దాము.

  (ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.)




MARGALI MALAI-24

  మార్గళి మాలై-24
 ***************

   ఇరువది నాలుగవ పాశురం
   *************************
 అన్రు ఇవ్వులగం అళందాయ్ !అడిపోత్తి
 శెన్రంగు త్తెన్నిలింగై శెత్తాయ్! తిరల్ పోత్తి
  పొన్ర చ్చగడం ఉదైత్తాయ్! పూగళ్ పోత్రి
 కన్రు కుణిలా ఎరిందాయ్! కళల్ పోత్తి
 కున్రు కుడైయా ఎడుత్తాయ్! గణం పోత్తి
 వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయల్ వేల్ పోత్తి
 ఎన్రెన్రున్ శేవగమే ఏ తిప్పరై కొళివాన్
 ఇన్రుయాం వందోం ఇరంగు ఏలోరెంబావాయ్.

 తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.

  శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
  శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము



  నాడు భూమిని కొలిచిన వామన పాదములకు మంగళం
  లంకకేగి రావణు కూల్చిన రామ పాదములకు మంగళం

  శకటాసురుని కూల్చిన స్వామి పాదములకు మంగళం
  వత్సాసుర కపిత్సాసుర సంహారి పాదములకు మంగళం

  గోవర్ధనగిరి నీత్తిన గోవిందుని పాదములకు మంగళం
  శుభకర కరమున నున్న వేలాయుధమునకు  మంగళం

  ఒకటా? రెండా? మూడా? ఎన్నని కీర్తించగలము
  మాధవా! దయతో మంగళ హారతులను స్వీకరించు


 రంగనాథ స్వామికి మంగళాశాసనములు పాడరారె
 అంగనలారా! అందరు ఆండాళ్ అమ్మ వెంట నేడే.

  తండ్రికి దగ్గ తనయ మన గోదమ్మ.కనుకనే శ్రీమాన్ పెరియాళ్వారులు ప్రతిపాదించిన " పల్లాండ్లను" ప్రస్తుతులను కూడిన మనగళా శాసనములను మనకు పరిచయము చేయుచున్నది.

  ఈ పాశురములో,

  వాత్సల్యము! వత్సుని (పుత్రుడు/పుత్రిక)అందలి ఆత్మీయానురాగము.ఇక్కడ వాత్సల్యము గోపికలపై స్వామికి,స్వామిపై గోపికలకు పరస్పరాశ్రితము. ఆత్మానంద స్థితికి ఇది నేత్రోత్సవము.స్వామి గోపికలకు వాత్సల్యమును అందించుచు తాను వారినుండి పొందకోరిన హేల!కృష్ణ లీల!

విదేహమహారాజు సీతమ్మను రాముని చేతిలో పెట్టుచు "భద్రం" అన్న మాట ఎంత పవిత్రమైనదో గోదా సమేత గోపికల మంగళాశాసనము అంతే పవిత్రము.రాక్షస సం హారముచేసి స్వామి శరీరము ఎంత కందెనో,స్వామి ఎంత అలిసిపోయేనో అని తలచు పసి మనసులు వారివి.పసితనము అనగా కపటము లేనిదివయసుకు సంబంధించినది కాదు.ఎన్ని కన్నులు కుట్టినవో స్వామిని అని యశోదతో కూడి మన గోపికలు స్వామికి దిష్టి తీసిరి.అనుభవైక వేద్యమైన ఆత్మ సాక్షాత్కార పురస్కారము..

ఆరుసార్లు చేయు మంగళా శాసన విశిష్టత ఏమిటి? .అమృతధారలుగా అరుదైన విషయములు అనుసరించినవి.ఆరు ఋతువులందును,ఆరు రుచుల యందును,ఆరు శత్రువుల యందును,ఆరు విషయములందును ( పంచేంద్రియములు+మనసు) ఆరు పోయుట యందును (వారు పోయుట)స్వామి ఆరు రంగనాథ క్షేత్రములందును( ఆద్య రంగము-పరిమళ రంగము-వట రంగము-సారంగము-అప్పలి రంగము-అంతరంగము) ఆనందమయముగా నుండుటకు గోపికలు మంగళమును పాడిరి.అవన్నీ పరమాత్మ రూపాలే కదండీ!
  తన వాడనుకున్న స్వామి తత్త్వమును అర్థముచేసుకొనుచున్నారు గోపికలు.వారికి స్వామి సకల అవతార విశేషములు కళ్లముందు కదలసాగినవి.యుగ విభజనను విస్మరించారు.జ్ఞాన దశను ( సకలమును బాహ్యస్థితి నిజమనుకొను) జరిపివేసినది వారి అతిశయమైన ఆప్యాయత.ఇక్కడ గోపికలు స్వామి త్వమేవాహం-త్వమేవాహం (నీవే నేను-నేనే నీవు) అనుకునే స్థితిలో ఉన్నారు.హెచ్చుతగ్గులు లేని ముచ్చటైన స్థితి.  కనుకనే వారు స్వామి నుండి తాము వరములను పొందాలనే స్థితిని దాటి స్వామికి తాము ఏమివ్వగలము అని ఆలోచించేలా చేసినది.

   అన్ని రూపములు ఇందే ఆవహించెను అని అన్నమయ్య అనుకున్నట్లుగా వారిలో రామావతారము-కృష్ణావతారము స్వామిలో కనిపించసాగినవి.

 గోదమ్మ గోపికలను రెండు వర్గములుగా చేసినది.కొందరు రామునిగా భావించి,ఆశీర్వదిస్తున్నారు.మరి కొందరు కృష్ణునిగా బలపరచి ఆశీర్వదిస్తున్నారు.అదినేనే-ఇదినేనే అయిన స్వామి వినోదిస్తున్నాడు.

   భూమండలము తమోమయము.మాయా మోహితులను చేసేది.రాళ్ళు-రప్పలు ఎత్తు-పల్లాలు అటువంటి భూమిని దేవతల కొరకు ,ఒక్కసారిగా పెరిగి కొలిచిన స్వామి పాదములు ఎంత కందిపోయినవో కదా! లబ్ధిపొందిన ఇంద్రుడు మరెవరు ఆ విషయమును తలవ లేదు అన్నరు కృష్ణుని వర్గము వారు. నిజమునకు ఇది స్వామి మనకు అందించిన ధూళి ప్రసాదము.

  రామ వర్గము వారు ఊరుకుంటారా? చాల్లే1 మీ స్వామి ఉన్న చోటనే ఉండి చేసిన పనిని గొప్పగా చెప్పు కుంటునారు.అదే మా రాముడు అడవులను.సముద్రములను,కొందలను,గుట్తలను దాటి లంకాద్వీపమునకు వెళ్ళి రావణుని సమ్హరించాడు.మాస్వామి పాదములెంత కంది పోయినవో అన్నారు.నిజమునకు దశ ఇంద్రియములు రావణుని పదితలలు.వాని అహంకార రూపమే రావణుడు.వాటిని మర్దించిన స్వామి మా రాముడు అంటున్నారు.

  కృష్ణ వర్గము వారు ఊరుకుంటారా? మీ స్వామి బాల్యములో ధనుర్విద్యలు నేచిన వాడు.అంతే కాదు పెండ్లి అయిన వాడు.ఆ వయసులో రావణుని కూల్చుట ఏమంత ఘనకార్యము.
 పాపము మాస్వామి చిన్న బాలుడు.గొల్ల కులములో నున్న వాడు.క్షాత్ర ధర్మ్మేది? అయినప్పటికిని కపట శకటుని కాలితో తన్ని సంహరించాడు.మన శరీరమే శకటమైతే కామ-క్రోధములు దానిని నడిపించే రెండు చక్రములు.కామము తీరనప్పుడే కదా అది క్రోధముగా తన స్వభావమును మార్చుకుంటుంది.అట్టి దానిని తన కాలితో తన్ని విరిచినప్పుడు,ఆ పాదమెంత కందెనో కదా అంటూ,రామ వర్గము వారికి అవకాసము ఇవ్వకుండా స్వామి రక్షనను మరొక మూడు సంఘటనలతో చెప్పుకొచ్చారు.

 కపటదూడ మోహము-వెలగ పందు వాసన.దూడగా-వెలగ చెట్టుగా వచ్చిన (మారువేషములలో) దూడను పట్టుకొని వెలగ చెట్టుపైకి విసిరి,ఒకేసారి ఇద్దరు రాక్షసులను కూల్చినప్పుడు స్వామి పాదములెంత కందెనో.

  అంతే కాదమ్మా.ఏ ఇంద్రునికైతే స్వామి బలిని పాతాళమునకు పంపి,రాజ్యమును ఇచ్చినాడో,ఆ ఇంద్రుడే అహంకారముతో రాళ్ళవాన కురిపించినపుడు ఏడు పగళ్ళు-ఏడు రాత్రుళ్ళు,తన చిటికెన వేలుపై గోవర్ధనగిరి న్)ఎత్తి,గోవులను-గోపాలకు;లను కాచిన స్వామి పాదపు వంపు ఎంత కందెనో అన్నారు.వాదన వేడుకను చాలించుకొని గోపికలందరు స్వామిని దిష్టి తీసి,మంగల హారతుల నిచ్చినారు.

 ( ఇక్కడ ఏడు పగలు-రాత్రి వారము అని కాదు.ఎన్ని రోజులు గడిచినా అదే అది నుండి శని వారములు అని అంతరార్థము)

.



( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం )


                               

MARGALI MALAI-23


  మార్గళిమాలై-23
  *************


       ఇరవదిమూడవ పాశురం
      *********************
 మారిమలై ముళింజిల్ మన్నికొడందు ఉరంగం
 శీరియసింగం అరిఉత్తు త్తీవిళిత్తు
 వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేరొందు ఉదరి
 మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు
 పోదరుమా పోలే ,నీ పూవై పూవణ్ణా! ఉన్
 కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి,కోప్పడయ
 శీరియసింగాసనత్తు ఇరుందుయాం వంద
కారియం ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్.

  తల్లికి క్షమాపణాభ్యర్థనలతో.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 వర్షాకాలములోన కొండగుహలో నిదురించుచున్న
 సింహ కిశోరము మేల్కొని కాళ్ళను చేరచాచి

 జూలును విదిలిస్తు-గంభీర గర్జనను చేస్తూ
 అడవిని పాలింప గుహవీడి వెడలు శోభ

 ఓ పురుష సింహమ! నిదురను చాలించి నీవు
 ధీర గంభీర నడకను దారిని ఉధ్ధరిస్తూ

 విరగబూసిన అవిసెల విభవమలర.ప్రేమతో
 గోకులమును పాలింప వేగమే కదలిరమ్ము

 కువలయమునంతటిని కూర్మితో  కుశలమడుగుచును
 సింహాసనమును చేరి,  కైంకర్యములు స్వీకరించు.

 ఈ పాశురములో గోదమ్మ వర్షాకాల సమయమున స్వామి తన సివంగితో సీరియ సింగము వలె నిదురిస్తున్న కొండగుహ వద్దకు గోపికలను తీసుకొని వచ్చినది.ఒక్కొక్క పాశురములో గోపికలు భగవత్తత్త్వమునకు ఒక్కొక్క మెట్టు ఎక్కి దగ్గరవుతున్నారు.భగవంతుడు ఒక్కొక్క మెట్టు దిగి వారిని చేరదీసుకుంటున్నాడు.వీరిద్దరి సంధాన కర్తగా ఆచార్యులు(గోదాదేవి) దగ్గరుండి నిర్వహించుచున్నది.


 క్రిందటి పాశురములో గోపికలు స్వామి నిద్రమేల్కొను సౌందర్యమును అనుభవించినారు.స్వామి మధుర వాక్కులలో స్నానమాడినారు.దాని ప్రభావమో ఏమో నర్మగర్భముగా స్వామిని గుహవీడి తన నడక సౌందర్యమును ప్రసాదించమంటున్నారు.సీరియ సింగము వలె నడచివచ్చి సకల భువనములను తన స్పర్శతో పునీతము చేసి పెద్ద సిమ్హాసానము నధిష్ఠించి,అనుగ్రహించ మంటున్నారు. ఇది వాచ్యార్థము.

  విజ్ఞుల వివరణ ప్రకారము వర్షాకాలము.చీకటి గుహ అందులో తన జంటను కలిసి నిదురించుచున్న సిమ్హము.మూలతత్త్వ స్థికి ప్రతీక.వీరి ప్రార్థనలు స్వీకరించి,స్థితి గతిగా -గతులుగా తన మూల తత్త్వమును విస్తరించుకొనుచున్నది.అదియే ప్రళయానంతరము కలుగు రజోగుణోద్భవమును స్వామి ఎర్రని కన్నులతో సూచించు చున్నది గోదమ్మ.కాళ్ళను చేర చాచుట పాంచజన్యుని నుండి పంచభూత విస్తరణ.జూలు విదిలించుట దశదిశావిర్భావము.

 భయానకమైన మూలతత్త్వములో దాగిన చేతనము పరమాత్మానుగ్రహముతో విస్తరించి కుసుమ కోమలమై,చీకట్లను తెంచుకొని ప్రకాశించ సాగినది.స్వామి పాదస్పర్శతో పావనమైన జగతి పులకించినది.సామాన్య కారణ-కార్య సంబంధమునకు (ఉపాదాన కారణము-నిమిత్త కారనము-సహాయ కారణము) అను మూడు కారణములు అవసరము.కాని తనలో అన్ని దాచుకొని " ఒకపరి జగముల వెలువల్ మరొకపరి లోపల" దాగు వానికి వాటి అవసరములేదు.స్వామి అనుగ్రహమేమో సాలెపురుగు కూడ గూటి నిర్మాణ సమయమున కారణములను వ్యక్తముచేస్తు,కార్యమును సాధిస్తుంది.

 " మారిమలై ముళింజిల్" వర్షాకాలమున కొండగుహలో శివంగి తో కలిసి నిదురించుచున్నది వీర కిశోరము.కాని చూస్తే ఒకటి గానే కనిపిస్తున్నది చర్మ చక్షువులకు.

 మారి -వర్షము ఒకటే వర్షము.చుట్టును జలమయము.అంతా చిమ్మచీకటి.చీకటికొట్టు లో ఒక సిమ్హము నిదురించుచు రెండుగా మనము భ్రమపడునట్లు చేయుచున్నది.సమస్త ప్రకృతి జలమయమై స్వమిని ఆశ్రయించి,అంతర్లీనమైనది.ప్రకృతి-పురుషుల దివ్య సంగమంది.తటస్థస్థితి.ఆ స్థితి నుండి జాగరూకుడవు కమ్మని,గుహను వెడలి నడచివచ్చి,తమను అనుగ్రహించమని వేడుకుంటున్నారు.మొరను ఆలకించినది.లేచినది,ఎర్రని చింత నిప్పుల వంటి కళ్ళతో పరిసరములను పరికించినది.అంతా రజోమయము.వెంటనే గర్జించినది.అది ప్రణవము.కాంతి-శబ్దములు ప్రభవించిన తరువాత తన కాళ్ళను ముందుకు సాచి,వళ్ళు విరుచుకొనినది.ఈ ప్పుదే పాంచజన్యుని నుండి పంచభూతములు విస్తరించుట మొదలుపెట్టినవి.దశదిసలు గుట్తలు,నదులు,జీవులు కొత్తరూపును దిద్దుకుంటున్నవి.అదియే జూలును విదిలించుట.

 పురుషుని స్వభావము మారినది.గాంభీర్యత తోసివేసి సౌకుమార్యము చోటుచేసుకొనినది.సింహము వంటి స్వామి అవిసెపూల వంటి సౌకుమార్యమును సంతరించుకున్నాడు.

  చతుర్వర్గ గతులతో స్వామి అడుగులు వేస్తూ,నడిచివచ్చి సింహాసనారూఢుడైనాడు..తన స్పర్శతో సమస్తము పునీతమైనది.సఖ్య భక్తి దాస్యభక్తిగా మారి స్వామి సింహాసనము క్రింద కూర్చుని సంతసించుచున్నది.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)







MARGALI MALAI-22

  మార్గళి మాలై-22
    ***********


       ఇరువదిరెండవ పాశురం
   ************************

  మార్గళి మాలై-22
  ************

 అంగన్ మాల్యాలత్తు !అరశర్ అభిమాన
 బంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీళే
 శంగవిందుప్పార్ పోల్ వందుతలై ప్పెయిదోం
 కింగిణివాయ్ చ్చెయద తామరై పూప్పోలే
 శెంగణ్ శిరిచ్చిరిదే ఎమ్మేల్ విళియావో?
 తింగళుం ఆదిత్తియనుం ఎళుందార్ పోల్
 అంగణ్ ఇరండు గొండు ఎంగుల్మేల్ నోక్కదియేల్
 ఎంగళ్మేల్ శాబం ఇళిందు ఏలో రెంబావాయ్.


   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
   ***********************


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ నీళా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 సుందర-సువిశాల భూమండలమేలిన రాజులు
 నీ ముందర నిలబడినారు జితబాణులు నిరహంకారులు

 సుందర-సువిశాల సంసారాంబుధి మునిగిన భామలు
 నీ ముందర నిలబడినారు జితగుణులు నిరహంకారులు

 మారాకను ప్రశ్నించుట మా పాపపు శాపము పంచుట
మావాడవు నీవనుకొను మమ్ముల దూరమునుంచుట

 ఉదయించనీ సూర్యుని-చంద్రుని ఒకపరి ఉత్సవమనుకొని
 మెమెల్లగ తాకుతు నెమ్మది శాపం దహియించమని

 అరతెరచిన కన్నుల వేడుక అగుపించని మువ్వల పోలిక
 ఆలస్యము చేయక మన వ్రతమునకు రారాదో



  ఈ పాశురములో గోదమ్మ స్వామి విరిసి-విరియని( తెరిచి-తెరవని) నేత్ర సౌందర్యమును వాచ్యార్థముగా చెప్పినప్పటికిని,అభిమాన రాహిత్యమును,అనన్య శరణత్వమును,ఆశ్రిత వాత్సల్యత్వమును అన్యాపదేశముగా వివరించుచున్నది.

 క్రిందటి పాశురములో రాజులు బాణజితులై యుధ్ధములో ఓడిపోయి స్వామి ముంగిట నిలిచియున్నారు.గోపికలును  స్వామి ముంగిట నిలిచియున్నారు.వీరు బాణ జితులు కారు.స్వామి యొక్క సద్గుణములచే ఓడింపబడిన వారు.వీడి యుండ లేని వారు.గుమ్మము దగ్గర నిలబడిన వారు లోపలికి రావచ్చును.లేక తిరిగి వెళ్ళి పోవచ్చును.కాని గోపెమ్మలు వచ్చేశాము అంటున్నారు.తిరిగి వేళ్ళే అభిప్రాయము వారికి లేదు.

 వారి పూర్వపు మనోభావములు వేరు.ఇప్పుడు వారు ఆచార్యుల సాంగత్య ప్రభావితులై.రాజులు ఏ విధముగా అందమైన గొప్పవైన సువిశాలమైన తమ రాజ్యములను తృణప్రాయముగా వదిలివేసి వస్తారో,అదేవిధముగా గోపికలు,మమకారము అను అందమైన,అహంకారము అను గొప్పదిగా భావించు విశాల సామ్రాజ్యమును వదిలివేసి వచ్చి తలుపు దగ్గర నిలబడక,నీ మంచము కోళ్ళ క్రింద ఉన్నాము అంటున్నారు. అంతే కాదు వారు అభిమానమును అవమాన పరచి వచ్చేసాము అంటున్నారు.ఆరు సూత్రముల అందమైన అరవిందము అభిమాన రాహిత్యము.అవి,1) అనుకూల సంకల్పము.2.) ప్రతికూల వర్జనము.3.) రక్షకుని యందు విశ్వాసము.4) రక్షకుని యందు విధేయత.5.)తన తక్కువ తనమును ఒప్పుకొనుట.6.)నీవే మాకు దిక్కు నిత్యము  కృష్ణా అను నమ్మిక.

 గోదమ్మ ఈ పాశురములో ఎమ్మేల్-ఎంగళ్ మేల్-ఎంగళ్ మేల్ అని మూడుసార్లు ముక్కరణముల (త్రికరణముల) అని పలుకుచు ఆశ్రయణ అతిశయమును అర్థవంతముచేసినది.చీకటికొట్టు వంటి "ఇరు తరుళ్ మాల్యానాలను" అంగన్ మాన్యాలు గా ప్రకాశవంతము చేస్తూ,స్వామి అణ్-అందమైన,ఇరండు-రెండు, కణ్ కన్నులను, కొంచము కొంచముగా తెరచి అనుగ్రహించమని ,అరవిరిసిన కన్నుల మరంద ధారలలో మునిగి జలకములాడనీయమని వేడుకొనుచున్నది.
 .
 నియమ పాలన చేయు సూర్య నేత్రము "న క్షమామి" అని అంటుంటే,అమ్మ పురుషకారము స్వామిని అనునయిస్తుండగా "న త్యజామి" అని పలికించునది చల్లని చంద్ర నేత్రమట.ఎంతటి చక్కని ఉపమానము.అదే విధముగా ఆచార్యులు ఆర్య భాషా అనుగ్రహణము సూర్య నేత్రమైతే,ద్రవిడ వేదానుగ్రహము చంద్ర నేత్రమట." యద్భావం తద్భవతి.
 తామర వంటి నోటిని తెరిచి,తేనెలూరునటుల తమతో మాటలాడి,ఆనందాబ్ధిలో జలకములాడించుట అనన్య శేషత్వమునందించుట.
.

 తమో భూయిష్ఠమైన భూలోకము సత్సంగ సద్గుణ ప్రభావముతో కాంతివంతమగునట్లు ,స్వామి 'తింగళుం ఆదియనుం ఎళుందార్" తో ప్రకాశవంతము చేయమనుచు,వ్రతము కొనసాగించుటకు మనము ఆశ్రయణ దశను అధిగమించి,అనుభవ దశలోనికి ప్రవేశిస్తున్నాము.


  జై శ్రీమన్నారాయణ-జైజై శ్రీమన్నారాయణ.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)







TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...