Wednesday, March 21, 2018

SAUNDARYA LAHARI-53

 సౌందర్య లహరి-52

 పరమపావనమైన  నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 అధిష్ఠానదేవునిగ ఆ ఈశ్వరుడుండగా
 కనుబొమల మధ్యనున్న  సంకేతములుగా

 పరమేశ్వరి కనుసన్నల ప్రకాశతత్త్వముగా
 పంచాక్షరి ముందునున్న "ఓం" కారముగ నీవు మారి

 హ-క్షం అను అక్షరములు  రెండింటిని
 రెండు దళములుగలు గల పద్మములో ప్రకటించుచు

 విచక్షణ జ్ఞానము అను అయిస్కాంత శక్తితో
 ఆజ్ఞాచక్రములో మహారాజ్ఞిని చూచుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.


  ఆత్మజ్ఞాన దర్శని-త్రికాల దర్శిని కనుక ఆజ్ఞాచక్రమును " త్రినేత్ర చక్రము" అని కూడ కీర్తిస్తారు.శుద్ధ సత్వ రూపముగా భాసించు ఆజ్ఞా చక్రమును చేరిన కుండలినీ శక్తి అజ్ఞాన తిమిరములను తొలగించుకొని,పైనున్న సహస్రారమును చేరుటకు సిద్ధమవుతుంటుంది.విజ్ఞాన చిహ్నమై సాధకుని ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంటుంది.ఊదా రంగులో నున్న రెండు దళములు స్థూల-సూక్ష్మములకు,చీకటి-వెలుగులకు,నిరాకార-సాకారములకు-సద్గుణ-నిర్గుణములకు ప్రతీకలుగా పరమాత్మను దర్శింపచేయుటకు ప్రధాన సహాయకారులుగా ఉంటాయి.ఆజ్ఞా చక్రము సాధకున్ క్రింది ఐదు చక్రములకు పైనున్న సహస్రారమునకు వంతెన వంటిది.మూలాధారములోని "స" అక్షరము ఆజ్ఞా చక్రములోని " హం" అను అక్షరమును కలిసి "సోహం" గా మారి అజపా జపమును చేయుచున్న (గాలి పీల్చుట-విడుచుట) సమయమున,చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

SAUNDARYA LAHARI-52

సౌందర్య లహరి-51
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అధిష్ఠాన దేవునిగ ఆ జీవుడుండగా
అచ్చులను అందముగ కంఠములో పొదవుకొని
పంచభూతములలోని ఆకాశతత్త్వముగా
పంచాక్షరి నామములోని "య"కారముగ నీవుమారి
సర్వలక్షణశోభిత స్వరములు పదహారింటిని
పదహారు దళములుగల పద్మములో ప్రకటించుచు
వాక్కును అందించుచున్న వశిన్యాది రూపములుగా
విశుద్ధ చక్రములో వింత కాంతులీను వేళ
నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
జగద్రక్షణార్థము మహేశుడు గరళమును తనకంఠమునందుంచి,దానిని శుద్ధిచేసి దోషరహితము గావించెను కనుక శుద్ధిచేయబడిన పద్మమును నీలకంఠ చక్రము అను కూడా కీర్తిస్తారు.అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఋ-ౠ- ఎ-ఏ-ఐ-ఒ-ఓ-ఔ-అం-అః అను పదహారు అచ్చులను పదహారు దళములు గల పద్మములో పొదవికొని వాగ్రూపముగా ప్రకాశిస్తూ ఉంటుంది.అచ్చుల సహాయము లని హల్లులు అసంపూర్ణములు.పంచభూత సూక్ష్మరూపముగా మనలోనున్న అగ్ని సహాయముతో కుండలినీ శక్తి విశుద్ధము వరకు వచ్చి,మనము గుర్తించి సద్వినియోగపరచుకోలేకున్న తిరిగి మూలాధారములోనికి జారి నిరుపయోగమవుతుందని పెద్దలు చెబుతారు.కనుక జాగరూకతతో ఆ శక్తిని ఆజ్ఞా చక్రము వైపు మరలించుటకు సాధకుడు ఉద్యుక్తుడు కావాలి. విశుద్ధ చక్రములో వశిన్యాది వాగ్దేవతలు ప్రకటింపబడుతు కంఠస్వరముగ ప్రకాశించుచు,భక్తులచే పలువిధముల కీర్తింపబడుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...