Sunday, March 3, 2019

SIVA MAHIMNA STUTI-PUSHPADAMTA

 మహిమల సామి నీదయతో మారెనుగ శాపము
 అహమును పారద్రోలి అపురూపపు వరముగ
 పాహి పాహి,నీ స్మరణము ఇహపరసాధనంబు
 మహదేవ స్వీకరించు "శివ మహిమ్నా స్తోత్రము".


1. మీరిన భక్తి నిను కొలువ మితిమీరిన ఆశతో తోటలోని
 పూలను తస్కరించ-బిల్వములపై నడిచిన నేను పాపిగ
 కూరిమి శాపమిచ్చి అహంకారము సంహరించిన పాదము
 చేరినవి పశ్చాత్తాప పలుకులు పుష్పమాలలుగ నిన్ను కొల్వగన్

2.సగుణమా-నిర్గుణమా,అది-ఇదికాదు గోచరమవదు
  అను సందిగ్ధములోనున్నవి మూడు వేదములు ఓ చరాచర
  స్వరూప భేదములతో స్వభావ భేదము లేని పాదములు
  చేరినవి పశ్చాత్తాప పలుకులు పుష్పములుగ నిన్ను గొలువగన్.

3.ప్రవహించగ పశుపతికృత వేదమరందము ,గ్రహియింపగ
  పరికించగ బృహస్పతి ప్రస్తుతి వింతకాదు,గమనార్హము
  తరియింపగ జిహ్వను ,తరలినవి జంగమ పాదము చెంతకు 
  పరిణిత పలుకులు పరుగున, పుష్పములై నిన్ను కొలువగన్.

4. ఖండించెదరు, వాదనలు  సలుపుదురు మూర్ఖులు
   అఖండమూర్తి నీ త్రిగుణాత్మకత నెరుగని మర్త్యులు
   వివరము వేగమె విన్నవించగ, వరప్రదాత పాదములు
   చేరినవి బిరబిర  పలుకులు పరిమళ పుష్పమాలయై.

.ఎవ్వని సృష్టి ముజ్జగము? సహాయము చేసినదెవ్వరు?
  ఆవలనున్న అతీతశక్తితత్త్వము అవగతమవ్వని 
  నిరుపయోగ వాదనల నిగ్గును తేల్చు పాదములు 
  శరణని చేరినవి నా పలుకులు భక్తితో ప్రస్తుతింపగన్.

6. జగములకల్పనసాధ్యము నమ్ము జగదీశుడు లేనెలేక
   ఉండిన పిండిబొమ్మలవి జవసత్వము మెండుగ నిండక
   మందమతి సందియముల్ తొలగించు పాదములు గతి యని
   చేరినవి మందహాసము చేయుచు పలుకులు మందారములై.

7.సాంఖ్యము-యోగము-శైవము-వైష్ణవ-శక్తి నామములు
నమ్మిన విభిన్న మార్గములు వింతగ చేర్చు గమ్యమును
దయాసాగర సంగమంబునకు సాగుచు వాహినులై
చేరినవి పలుకులు పాదములు పాహిమాం అనుచు.

8.ఖట్వాంగము గొడ్డలి వృషభము స్వామి వస్తు-వాహనములు
  పాములు బూడిద పులిచర్మము మేలగు అలంకారములు
  మృగతృష్ణయే విషయవాసనలని,మృగధారి చరణములు
  శరణమన తరలినవి పశ్చాత్తప పలుకులు పారిజాతములుగ.

9. కరిగిపోవునది సర్వముగా, భావించుచు కొందరు
   పరిణామములివి  పరముగా, భావించుచు మరికొందరు
   భేదముతో నుండగ, వక్తను కాని, నా వాక్కులు భక్తితో
   పరుగులు తీయుచున్నవి నీ పాద పంకజములను చేర.

10.సరివారము అనుకొని, కనుగొనలేదుగ అగ్నిస్తంభ నీ పరిమాణము
    హరి-విరించి ఆరాధించిరి, భక్తి-శ్రద్ధ ప్రకటియమాయెగ నీ కరుణ
    నిను గుర్తించని నిర్భాగ్యము వలదని శివ పదములకై సరగున
    పరుగులుతీయుచున్నవి పలుకులు పరిమళ పుష్ప మాలలై


 11.అద్భుత రావణు యుద్ధ సన్నద్ధత కారణంబు నిబద్ధత
   అనన్య భక్తి సంభరిత  శిర సరోరుహ నైవేద్యపు ఘనత
   అగణ్య శక్తి సంభావిత  వరమనుగ్రహించెగ శివంబు ఆర్ద్రత
   పొగడగ నిన్ను చేరినవి పలుకులు పరిమళ పుష్పమాలలుగ.

12నీవందించిన భుజ పరాక్రమము కృతఘ్నతగ
  నీకొండనె కూల్చ,అహంకరించి హుంకరించెగ
  నీదయ నిష్కృతి చూపెగ,కాలి కొనగోటి తాడనముగ
  నీ దరిచేరనీ, పలుకులను పరిమళ పుష్పమాలికలుగ.

13.నీ చరణ సేవానుగ్రహమే కద బాణుని త్రిభువనాపేక్ష
   నీ కరుణావలోకనమే కద శోణపురికి శ్రీరామరక్ష
   నీ శరణాగత రక్షణమే కద హరి పెట్టిన ప్రాణభిక్ష
   శిరమును వంచి తరలినవి పదములు శివపాదము కొలువగ

4. అనిశము తరియింపంగ తనకొక అవకాశముగ
    అనీశునిగళముననిలిచినది గరళము ప్రకాశముగ
    విషమరూప సామర్థ్యమే విషపరీక్షా విజయముగ
    విషయము చాటుచున్నవి ప్రభో! వినయ పుష్పములుగ.

 15. ఘోర-అఘోర నిర్గుణ గురువని గురుతెరుగనివైనవి
    గురి తప్పని మరుబాణములు తక్షణమే కనుమరుగైనవి
    తత్త్వజ్ఞాన బోధనా జ్ఞాపక పరికరములైనవి,నీ దయ
    "తత్త్వమసి" అనుచున్నవి నీ పాదసన్నిధి పదములు.

 16.ఉమాపతి జటాజూటములో ఉక్కిరిబిక్కిరిగ గగనము
    ఉషాస్తమయ తాండవములో ఉద్ధతి కోరగ భువనము
    వేయి కన్నులు చూడగలేని మునిశాపము నిరుపయోగము
    తాండవకేళిని చూడగ తరలినవి పదములు తామరలుగ.

20.యజ్ఞము-యజ్వ-ఫలితము మూడును తానైనవాడు
   మూడు అవస్థలు లేని ముక్కంటి దొర వాడు
   జాగరూకుడు-యాగ ఫలితమునందించుచున్నాడు
   యోగమన పదములు చేరినవి యోగి పాదములు కొలువ.

21. నిశ్చలభక్తి నినుకొలువని యాగము నిష్ప్రయోజనము
    నిర్లక్ష్యపు ధోరణి కూడిన దక్షుని యజ్ఞము సాక్ష్యము
    సోమయాజిని అనుగ్రహించు వరప్రదాతవు,శంకర
    కోమల పాదముల కొలువ చేరెను పదములు సోమశేఖర.

22.ఆత్మసుతపై కలిగినది అజునకు అధర్మ వ్యామోహము
   శివ శస్త్రఘాతములు కలిగించినవి ఆకాశపలాయనము
   ధర్మస్థాపనకే కద విలుకానిగ క్రోధ స్వరూపము,విజయపు
   వినుతులు చేయ సాగినవి పదములు, నీ పదములమహిమన్

23. కనుగానని గర్వము కూల్చిన త్రిపురాసుర  సంహారకుడు
    కందర్పుని  దర్పము కాల్చిన  సర్వేంద్రియ నిగ్రహుడు
    అర్థనారీశ్వర తత్త్వపు పరమార్థమును తెలిపిన వానిని
    శరణార్థులై చేరినవి పదములు నీ శుభచరణసేవకై.

24.సర్వభూత వ్యాపకత్వ ప్రతీక భూత-ప్రేత-పిశాచ సహవాసము
    చివరి స్వరూపమిది యను సందేశమె చితాభస్మలేపనము
    కాలాతీతుని శాశ్వతత్త్వ సూచనయే కపాలమాలధారణమని
    పదములు పరుగిడుచున్నవి పాదముల త్రికాల పూజలకై.

 25. యోగీశ్వరుల  ఆత్మపరిశీలనా శోధనము, అవ్యక్తపు సత్యస్వరూపము
    ప్రాణాయామ యమనియమ పరిణామము పరమాత్ముని నిత్య పరిచయము
    మథుర మకరాందాబ్ధిని తేలియాడుచు పొందు ఆనందభాష్పానుభవము
    తడిసి పోవగ తామును తరలినవి వాక్యములు నీ పాదసన్నిధికి.

26.సూర్య చంద్రాగ్నులు జల వాయువులు భూమ్యాకాశములు నిండిన
   సూక్ష్మతత్త్వమును ప్రకటిత అష్టమూర్తిత్వమని గ్రహించిరి ఎందరో
   శివగోచరము కాని ప్రదేశము కనుగొనుట దుర్లభమని.గ్రహించిన
   పదములు ప్రస్తుతించుటకు పరుగులు తీసినవి పాహిమాం అనుచు.

27.జాగ్రత్స్వప్న సుషుప్తావస్థలు , అ-ఉ-మ, మూడు వేదములు
   ప్రకటిత ముగ్గురు మూర్తులు ప్రభవించిన మూడులోకములు
   ప్రస్తుతి చేయుచున్నవి ప్రభు,ప్రణవము ఓంకారము నీవని
   స్తుతులనందించగ వాక్కులు వడివడి తరలినవి శివా.

28.భవ-సర్వ-రుద్ర-ఈశ-పశుపతి-భీమాది నామములు
   స్తవనీయములైనవి తరియించంగ వేదత్రయములు
   సురుచిర సుందర మందస్మిత స్తోత్రవాక్యములు
   ఆనందముతో నున్నవి నీ పాదసన్నిధి తాదాత్మ్యతతో

29. ఏకాంతము- సమూహము,దగ్గర-దూరము,స్థూలము-సూక్ష్మము
    బాల్యము-వృద్ధాప్యములను ద్వంద్వములు ,నీ దయ,నిర్ద్వంద్వము
    ఏకాంబరేశ్వర నీవే స్థిరము-చలనము మూలము- పాలనమని
    పాదములు చేరినవి పలుకులు పరిపరివిధ నమస్కృతులుగ.

30.రజోపరివేష్ఠిత విశ్వకర్తా భవాయ నమోనమః
   తమోపరిపూరిత లయకర్తా హరాయ నమోనమః
   సత్వప్రకాశక విస్వభర్తా మృడాయ నమో నమః
   త్రిగుణాతీత తురీయస్థిత నిర్గుణాయ నమోనమః.

 31.పరిపూర్ణముగా నున్న దయ పరమార్థము తానే నన్నది
   అపరిపక్వతతో నున్న మది అసలు అర్థము కాలేదన్నది
   నడిచిన బిల్వపత్రములే నా నడకను సంస్కరించినవి
   పశ్చాత్తాప వాక్య హారములు నడిచినవి ప్రాయశ్చిత్తములై.


 32.అంబుధి పాత్రచేసి,అసితాచలమును నింపి ద్రవముగా

   కల్పతరు శాఖను కలమును చేసి,ధరాతలమున వ్రాయనెంచగా
   నీ సద్గుణగణములు శంకర! సరస్వతికైనను సాధ్యము కాదు
   సద్గతినీయు నీచరణములు విడువను నేను సాంబసదాశివ.


33. సురాసుర మునీంద్రవందితము శివసౌందర్యము
    కనుగానని కావర ఫలితము,శాప పరిణామము
    గంధర్వ పుష్పదంతార్పితము శివ మహిమ స్తోత్రము
    పఠనము-శ్రవణము-మననము పరమార్థమునొసగున్.



34. త్రికరణశుద్ధి పఠియించిన శివస్తోత్రము 
    ఇహపరములనిచ్చును వెండికొండగా
    అకళంక భక్తి స్మరించిన శివనామము
    శివపదమును చేర్చును అండదండగా.


35.మహేశ్వరుని మించిన దైవము లేడు
   మహిమస్తోత్రమును మించిన స్తుతిలేదు
   శివ నామమును మించిన మంత్రములేదు
   శివుని మించిన గురువు లేడు.ఇది సత్యం

36. శివ మహిమ స్తోత్ర పఠన ఫలములో పదహారవ వంతు ఫలితమును కూడ జపతపాదులు,యజ్ఞయాగములు,తీర్థయాత్రలు,యోగసాధనలు ప్రసాదించలేవని ఆర్య వాక్యము.

 37.పుష్పదంత నామధేయుడైన గంధర్వ ప్రభువు చంద్రశేఖరునికి దాసానుదాసుడు.శివ నిర్దేశ ప్రకారము తన పూర్వ వైభవమును కోల్పోయినప్పటికిని,శివానుగ్రహముతో శివ మహిమ స్తోత్రమును శివపాదముల ముందుంచి,శివ సాయుజ్యమును పూర్వ వైభవముతో పాటుగ పొందగలిగెను.

 38.ఐహికాముష్మిక ప్రాప్తికి సురలు-మునులు-కిన్నరులు ముకుళితహస్తులై,ఏకాగ్రతో స్తుతించు " శివ మహిమ స్తోత్రము" అనంత ఫలదాయకము.

 39.అనితర సాధ్య-అసమాన-అనుపమాన శివమహిమ స్తోత్రమును పుష్పదంతుడు ఆనందభాష్పములతో ముగించుచున్నాడు.

 40.శివ పాద పంకజములకు సమర్పించిన స్తోత్రము మనలకందరకు శివసాయుజ్యమును ప్రాప్తించునట్లు సహాయపడును గాక.

 41.శివ పరిపూర్ణత్వమును గ్రహించలేని వాడినైనప్పటికిని,వినమ్రుడనై శివ వైభవమునకు వందన సమర్పణమును చేయుచున్నాను.

42.ఒక రోజులో ఒకసారి-రెండు సార్లు-మూడు సార్లు అవకాశమును బట్టి,శివ మహిమ స్తోత్ర పఠనము పాప క్షయమును చేయుటయే కాక,పరాత్పర పాదసన్నిధిని చేరుటకు సహాయపడును గాక.

 43.ఇంతటితో ముగియుచున్న,శివునికి అత్యంత ప్రియమైన పుష్పదంత వాక్పుష్ప శివ మహిమస్తోత్రము  శాశ్వత శివ సాయుజ్యమును అనుగ్రహించు గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)

   ప్రియమైన మిత్రులారా,

  పుష్పదంతుల వారు సెలవిచ్చినట్లు సామర్థములేనప్పటికి,శివ పరికరమై ఈ పుష్పమును మీకందించుటకు ప్రయత్నించుచున్నాను.నా స్తోత్ర లోపములను శివ స్వరూపులు మన్నించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.

   ఓం తత్ సత్.

 ఏక బిల్వం శివార్పణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...