మార్గళి మాలై-01
****************
మొదటి పాశురం.
***************
మార్గళిత్తింగళ్ మది నిరైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్
శీర్మల్లుం ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్కాళ్
కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళం సింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్ మరియంపోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైదరువాన్
పారోర్ పుగళప్పడిందు ఏలోరెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతొ
*************************
శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.
గోకులమున కురవసాగె మార్గళి పున్నమి వెన్నెల
వేలాయుధుడై నందుడు జాగరూకుడుగా ఉన్నాడు
కాలము-సంకల్పము కలిసివచ్చిన వేళ "పర"కై
నవవిధ భక్తిరూపములను నగలన్నింటిని ధరించి
యమునలో జలకములాడగ నందకిశోరుని పిలిచి
తరలి వచ్చినది తల్లికరుణతో తానొక గోపికయై,
పాశురములములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
" నప్పిన్నాయ్ తిరుప్పావై" వ్రతమాచరింప రారో! ఓ గోపికలారా!
కోదై (పూలమాలిక) తల్లి నిర్హేతుక కృపాకటాక్ష ఆవిష్కరణమే "తిరుప్పావై" అను,సర్వస్య శరణాగతితో స్వామి సారూప్య-సామీప్య-సాయుజ్యములను వరమును(పర) అందించు ద్రవిడవేదము.దీనజనోధ్ధరణమునకై తల్లి తనను ఒక గోపికగా భావించుకొని,తోటి గోపికలను కలుపుకొని,భావనలో రేపల్లెగా భావించి,శ్రీవ్రతమును చేయించి,ఆ రంగనాథుని లోక కళ్యాణమునకై పరిణయమాడినది.
గోపికలను తలకడిగితే మొలకడుగరు-మొలకడిగితే తలకడుగరు అని మన అజ్ఞానము తీర్మానిస్తే,వారి శృత పాండిత్యము దేహమును మొలతో,ఆత్మను తలగా భావించి,ఆత్మార్పణ సమయమున బాహ్యపు విచక్షణ అవసరమా మనని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది.వారి వినయశీలత వారి అర్హతను సందేహపరుస్తుంటే,తల్లి ,వారికి కాలౌచిత్యమును "నన్నానాళ్" అని ప్రస్తావించి మార్గళితింగళ్,తాము వ్రతముచేయుటకు స్వామి అనుగ్రహముగా-వారి అర్హతగా చెప్పినది.ఉత్తరాయణ పుణ్యకాలమునకుమార్గళి బ్రహ్మీ ముహూర్తమని,అంతే కాకుండా మనసు నిండా చంద్రుడు పూర్ణకళలతో వెన్నెలలు కురిపిస్తున్న సమయమని చెప్పింది.తల్లి ఆచార్యుల అనుగ్రహమును పూర్ణచంద్రకళలతో కురియుచున్న వెన్నెలగా కీర్తించినది.
వ్రతము చేయుటకు దృఢనై సంకల్పమను (పోదువీర్) తప్ప కులము గోత్రము విద్య సంపద మొదలగునవు అర్హతలు కావు.వ్రతముచేస్తే ఫలితము ఉంటుందో-ఉండదో అన్న అనుమానము వద్దు.కన్ననికి ఏ ప్రమాదము రానీయకుండా వాడియై వేలాయుధమును ధరించి,నందుడు తిరుగు తుంటాడు అనగానే ఎక్కడ గోపికలకు కృష్ణ సౌర్యముపై నమ్మకము తగ్గుతుందేమో నని,కన్నడు కొదమ సింగమువంటివాడు.
కృష్ణభావనలో లీనమైన తల్లి నారాయణనే అని సంబోధిస్తుంది.స్వామి పేరు చెప్పిన కంసుడు ఏమిచేస్తాడోనన్న భయముతో నట.ఎంతటి మధురభావన.
నిశితముగా అమ్మదయ మనలను పరిశీలింపచేస్తే ఇక్కడ గోపికలు ధరించిన ఆభరణములు నవవిధభక్తి సంకేతములు.వారు తడుస్తున్న వెన్నెల జ్ఞానగుణ అనుగ్రహము.స్వామి గుణగణ నామసంకీర్తనములో స్వామి తమతో ఉన్నట్లుగా భావిస్తుండుట యమునలో మార్గళి స్నానము చేయుట.స్వామి కుసుమకోమల సుందరుడు.అంతే కాదు అసమ శూరుడు.శ్రీకృష్ణునితో ఆడిపాడుచున్న నందవ్రజము (శెల్వచ్చిరు ) మిక్కిలి భాగ్యశాలురు..మనము అంధకారబంధురమైన ఆయ్పాడిలో(గోకులములో)నున్నవారము.స్వామి ధరించినట్లుగానే మనము ఒక ఆయుధమును ఈ చీకట్లను తొలగించుకొనుటకు ధరించుదాము.అది ఏమిటంటే ఈ పవిత్ర మార్గశీర్షమాసమున స్వామిని స్నాన-సంకీర్తన సౌగంధిక పుష్పమాల సమర్పణమును చేయు శ్రీవ్రతమను చేయు" దృఢ సంకల్పము".దానిని విడిచిపెట్టవద్దు.అంతేకాదు మన ఆభరణములు అలౌకికమైనవి.అత్యత ఆలంబననందించు నవవిధభక్తులు.వాటిని ధరించి మనము యమున స్నానమునకు వెళ్ళుచున్నప్పుడు,చంద్రుడ్రు జ్ఞానధారలను ( ఆచార్యుల అనుగ్రహ ధారలు)
కురిపిస్తున్నాడు.వాటిని ఆస్వాదిస్తు,ఆనందిద్దాము.జ్ఞాన సాగర
ములోనికి మనము దిగగలమా అను సందేహము వద్దు.ఆ గోదా తానే రేవు మెట్లగా మారి,మనలను చేయి పట్టుకొని,జ్ఞానసాగరములోనికి దింపుతుంది.తిరిగి మెల్లగ ఒడ్డునకు చేరుస్తుంది.శాంతి-క్షమ-సత్యము-ధర్మము అను పరిమళ పూలమాలలను అల్లటము నేర్పిస్తుంది.,పాశురములను పఠిస్తూ,పెరుమాళ్ళకుమాలలను సమర్పింప చేస్తుంది.
అనంతకళ్యాణ గుణ శోభితుడైన రంగనాథుడు,(నమక్కే) భాగవతోత్తములను అనుగ్రహించువాడు.(పారోర్ పహళ్) శరణాగత రక్షకుడు.అంతేకాదు (పరై తరువాన్) పరమార్థమైన పరమును (వాయిద్యము కాదు-మోక్షము) అందించువాడు.కనుక ఓ గోపికలారా!తమోగుణమును వీడి తరలిరండి ఆ రంగనాథుని సేవకు అని తల్లి వారిని తనతో తోడ్కొని పోవుచున్నది.
( ఆండాళ్ దివ్య తిరువడిగళై శరణం.)