Wednesday, October 17, 2018

POOJACHAEYUDAMU RAARE

పూజ చేయుదము రారె
నిత్య కళ్యాణిని నిలిపి నీవె మాకు శరణు అనుచు
పూజ సేయుదము రారె విరాజమాన పాదములకు.
......
పూర్ణ కుంభమును నిలిపి పరిపూర్ణ భక్తిని అందు కలిపి
షడ్వికారములు వదిలి షోడశోప చారములతో
....
ఆవాహనమును చేసి ముదావహమును అందు కలిపి
మూర్ఖత్వము వదిలివేసి అర్ఘ్య పాద్యములతో
......
పంచామృతములు కలిపి మంచిని మరికొంత కలిపి
సంకుచిత తత్వమును వదిలి సుగంధ అభిషేకములతో
......
పట్టు వస్త్రమును తెచ్చి పట్టుదలను పైన పేర్చి
బెట్టులన్ని కట్టిపెట్టి పట్టు చీర చుట్టబెట్టి
....
తిమిరంబులు తిప్పికొట్టి త్రికరణ శుద్ధిని పెట్టి
అంతర్జ్యోతిని చూపి పరంజ్యోతిని ప్రార్థించగ
....
ఏలా లవంగ పూలతో జాజి చంపకములతో
మాలతి మందారులతో మాహేశ్వరిని మరి మరి
....
మల్లెలు మొల్లలు మంచి పొన్నలు పొగడలు తెచ్చి
రంగుల రోజా పూలతో రాజేశ్వరిని రమణీయముగ
....
మరువము దవనము తెచ్చి మరువక మదిని తలచి
పచ్చని చామంతులతో పరాశక్తి పాద పద్మములను
........
హ్రీంకారికి ఓంకారికి శ్రీంకారికి శంకరికిని
శ్రీ మత్ పంచదశాక్షరి శ్రీ లలితా త్రిపుర సుందరికి
....
అథమత్వమును వదిలి అథాంగ పూజలు చేసి
కథలు గాథలు వింటూ మధురస నైవేద్యాలతో
......
ఆకులు పోకలు తెచ్చి ఆటు పోటు మరిచి
గొప్పలు చెప్పుట మాని కర్పుర తాంబులము ఈయగ
......
అహరహములు నీకు దాసోహము మేము అనుచు
అహమును మరిచి చేసే బహుముఖ వాహన సేవకు
........
బంగరు తల్లిని కొలిచి అంగనలు అందరు కలిసి
సంగములన్నీ విడిచి మంగళ హారతులీయగ
........
నవ ధాన్యము తెచ్చి నవ విధ భక్తిని చేర్చి
నవరాత్రోత్సవములలో " శ్రీ మన్నగర నాయకి" కి
పూజ సేయుదము రారె విరాజమాన పాదములకు.
(శరన్నవరాత్రి సందర్భముగ నిష్కళంక భక్తి పుష్పము.)

 అయ్యలార ! నమస్కారములు.

     ఈ పదిరోజులు అమ్మ తత్త్వమును వారివారి గుంపులలో పెద్దమనసుతో ప్రచురించుటకు అనుమతించుట వారి సంస్కార దర్పణము.వారందరికి పేరు పేరున ధన్యవాదములు.


  ప్రియ మితృలారా! శుభకామనలు.

     కొండంత రాగమును తీసి..... ఏదో పాట పాడినట్లు ఎంతో మహిమాన్వితమైన మణిద్వీప వర్ణనమును, సూచనాప్రాయముగనైనను వివరించలేక పోవుటకు కారణము కేవలము నా అజ్ఞానము-అసమర్థతయే .దర్శించిన ప్రాకారములు కొండంత.మీకందించినది కనీసము గోరంత కూడాకాదు.అనిర్వనీయ ఆనందానుభూతిలో మునిగిన నా మనసు సర్వమును మరచి ,తిరిగి యథాస్థితికి వచ్చులోపల ఎన్నెన్నో వింతలు జరిగినప్పటికిని నా మస్తిష్కములో భద్రపరచుకొని వాటిని మీకందించ లేకపోయితిని.నన్ను మన్నిస్తారు కదూ.




  చాలా వరకు దాటవేసినదని సూటిగా మాట్లాడుతూ పెదవిని చప్పరించినను,తానేదో అమ్మ చేతిని పట్టుకొనినట్లు తెగ సంబరపడిపోతున్నదని ఎగతాళి చేసినను,ఆమోదయోగ్యమే కాదని వాదించినను,పోనీలే ఏదో చిన్న ప్రయత్నమని పెద్ద మనసుతో ప్రోత్సహించినను ఈ ప్రస్థాన ఫలితము పరమ పుణ్యము.అమ్మ అమృతధారా జలపాతములలో మనలను ముంచివేయుట ముమ్మాటికిని సత్యము. ఇది" అమ్మ మాట."

  మరొక మంచి ప్రయత్నముతో నన్ను మీముందుంచమని ప్రార్థిస్తూ,




  సర్వం శ్రీమాతా చరణారవిందములకు సవినయముగా సమర్పిస్తూ,

     మీ సోదరి నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

   శ్రీ మాత్రే నమః.   ఓం తత్ సత్.


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...