Friday, November 15, 2024

TANOTU NAH SIVAH SIVAM-15




  

 

 

  

      




  తనోతు నః శివః శివం-15


  ****************


 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే


   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"




  మహాదేవా!


 " నీ దయామయ దృష్టి దురితమ్ములార


   వరసుధాదృష్టి నా వాంఛలీడేరా


   ...


  నియమాన నీ దివ్య నామసంస్మరణా


  యేమరక చేయుదును భవతాపహరణా"(శ్రీ సముద్రాల రాఘవాచార్య)





  పంచకృత్యములను చేయుచున్న మహాదేవుడు పరమదయాళువు..తన జటాజూట దర్శనమును మనందరికి అనుగ్రహించిన స్వామి తన కంథర దర్శనమును అనుగ్రహించబోతున్నాడు.


   స్వామి నీలకంథరుడు కనుకనే


 నీలకంథరా దేవా-దీనబాంధవా రారా


   నన్ను కావరా అని ఆహ్వానించగలిగాడు రావణుడు.


     స్వామి కంథసీమ అప్పుడే వర్షించుటకు సిద్ధముగా నున్న నల్లని మేఘముల సమూహము వలెనున్నదట.


   ఆ నల్లదనము కుహు నిశీధిని తలపిస్తున్నదట.


  చాంద్రమానము ప్రకారము కృష్ణపక్షములోని పదిహేనవ రోజు అమావాస్య తిథి.


  న-మా తిథి చంద్రుడు కనుపించనిరోజు అమావాస్య అని ఒక సిద్ధాంతము.


  చంద్రుడు-భూమి-సూర్యుడు ఒకే సరళరేఖపై నున్న /ఎదురుబొదురుగా సూర్య-చంద్రుల నివాసము అమావాస్య అని వైజ్ఞానిక సిద్ధాంతము.


  ఒక విధముగా సూర్యేందు పరస్పర అవలోకనము.


 చంద్రుడు షోడశకళానిధిగా కీర్తింపబడుతున్నాడు వేదజ్ఞులచే.


  చంద్రునికి 16 కళలున్నప్పుడు పదిహేను తిథులలో మాత్రమే చంద్రకళలలో హెచ్చు-తగ్గులు మనము చూడగలుగుతాము.


   ఆ పదహారవ కళయే నిత్యకళ.స్థిరకళ.


  అమరకోశము అమావాస్యలను రెండు విధములుగా వర్గీకరించినది.


 " సా దృష్టేందుః సినీవాలీ-సా నష్టేందు కళాః కుహుః" అని.


     అంటే,


 సన్నని చంద్రకళ/నిత్యకల కనిపించే అమావాస్య సినీవాలీ అమావాస్య.


    వృద్ధి-క్షయములు చంద్రకళలకే కాని చంద్రునికికాదు.


  ఏ ఒక్కచంద్రకళ కానరాని అమావాస్య " కుహు అమావాస్య."


  స్వామి కంఠము ఏ మాత్రము చంద్రరేఖ కానరాని కారుచీకటి వర్ణముతో నున్నదట.


    సంస్కృత సంప్రదాయములో,


 అమా అనగా కలిసి,వాస్య అనగా జీవించడం.సూర్య-చంద్రులు కలిసి జీవించే తిథి అమావాస్య.


  యాజ్ఞికుల అభిప్రాయము ప్రకారము తిథి పూర్వార్థమును కుహు సమయముగాను -ఉత్తరార్థమును సినీవాలి సమయము గాను భావిస్తారు.


 సినము అంటే అన్నము-వాలీ అంతే ప్రశస్తమైన( అన్నము.)


   అనగా హవిస్సులను అర్పించకముందు కుహు తత్త్వముతో నున్న పరమేశ్వర తత్త్వము హవిస్సులను స్వీకరించి(అగ్నిముఖమై) నిత్యకళను ప్రకటింపచేస్తుంది/సినీవాలీగా మారుతుంది..


   స్వామి కంథరము తానే కుహుగా-తానే సినీవాలిగా (ప్రచండ-ప్రసన్న తాండవములతో) విశ్వపరిపాలనమును చేస్తున్నది.ఇది కాలభ్రమణ సంకేతము.మహాదేవుడు

 కాలాయ-కాలాంతక మర్దనాయ-నమోనమః.


   స్వామికి నలుపు-తెలుపు వర్ణములపై గల మక్కువను తనకంఠము యొక్క రంగుల పరిణామములతో,తాను ధరించిన గజచర్మము నల్లదనమును-చంద్రరేఖ వెన్నెలల తెల్లదనముతో మేళవించి తాండవిస్తున్నాడు అర్థనారీశ్వరముగా.


   అంతేకాదు,


 తనది కర్పూరగౌరార్థ  వర్ణము-తల్లిది అసిత వర్ణము


    వారిరువురి తాందవ-లాస్యములు


  జగములకు క్షేమమును కలిగించును గాక.


   కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ

   మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ

   ఆనంద భూమి వరదాయ తమోమయాయ

   దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ.


     కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ


       శివ భజమేవ నిరంతరం


     ఏక బిల్వం శివార్పణం.



  






  


 


 


  


     



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...