హరిక్షేత్రే కామరూపా
" కామాఖ్యే కామదే దేవి నీలాచల నివాసిని
కామస్య సర్వదే మాత మాతృసప్తక సేవితే
జామదగ్నస్య రామస్య మాతృహత్యా విమోచని
పంచ శంకర సంస్థాన భక్తపాలన తత్పరా
కళ్యాణదాయిని మాతా విప్రదర్శన నర్తనా
హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా భవసర్వదా."
మాయాసతి యోని భాగము పడిన ప్రదేశము మహాకాళి మహాలక్ష్మి మహాగౌరి త్రిశక్త్యాత్మకమై కామాక్ష్యాదేవిగా నీలాచల పర్వతమందు ప్రకటితమై మనలను పరిపాలిస్తున్నది.ఒకానకొప్పుడు తల్లి స్వామితో ఆనందవిహారమును చేయగోరిన స్థలమని,అందువలన సత్సంకల్పములు నెరవేరతాయని విశ్వసిస్తారు.బ్రహ్మపుత్రా నదిఒడ్డున కల ఈ ప్రదేశములలో ౠషులు,సత్పురుషులు అచలములై అచంచల భక్తితో అమ్మను ఆరాధించి పునర్జన్మా రాహిత్యమును పొందిరి.అమ్మ నిర్మాల్యము సహితము సర్వదుఖః హరము .
దేవి భాగవత ప్రకారము గుహరూపముననున్న దేవాలయ సొరంగము ఒక పవిత్రస్థలమునకు దారితీస్తుంది.అక్కడ ఏ విధమైన రూపము మనకు (చర్మ చక్షువులకు) గోచరించదు.కాని భూగర్భములోని సహజమైన నీటిబుగ్గలోని నీరు యోని ఆకారముగల గండశిల పగులులోంచి ప్రవహిస్తూ ఉంటుంది.ఆదిశక్తి కాళియే కాళివిద్యగా,కామాఖ్యా దేవతగా మనలను అనుగ్రహిస్తున్నది యోనిరూప విరాజితయై.ఊర్వశి గుండములో పుణ్యస్నానమాచరించిన తరువాత అమ్మవారి దర్శనము చేసుకొందురు".కమనీయాత్వాత్ కామః "రమణీయత్వము నిర్వచించుట అసాధ్యము.
"ఆత్మవిద్యా మహ విద్యా శ్రీవిద్యా కామసేవితా"
తిరిగి రూపమును పొందిన మన్మథుడు దానికి సార్థకతను కలిగించుటకై,అరవై కోట్ల యోగినీ దేవతలు,పద్దెనిమిది భైరవ శక్తులు,దశమహావిద్యలు అమ్మవారి చుట్టు చేరి ఆరాధింపబడుచున్న కామాఖ్యాదేవి ని సేవిస్తూ,తన వంతుగా విశ్వకర్మచే అత్యద్భుత ఆనంద నిలయమును నిర్మింపచేసి,అమ్మను అక్కడ ఉండమని ప్రార్థించెనట.
శ్రీ మహావిష్ణువు నల్లని కొండరూపములో నీలాచలమను పేర అమ్మను అచంచల భక్తితో ఆరాధిస్తుంటాడు అని ప్రబల విశ్వాసము.గిరి ప్రదక్షిణము చేయు సమయమున వారిని దర్శించి ధన్యులైనవారు కోకొల్లలు.అందులన ఈ ప్రసిద్ధ క్షేత్రమును "కామగిరి" కామవాటిక" అని కూడా భావిస్తారు.దేవతలు ఈ పవిత్ర ప్రదేశమునందు అమ్మను కొలిచి ఖేచరత్వమును (ఆకాశయానము) పొందిరట.
నీలాచల రూపములో హరినివాసముకనుక "హరిక్షేత్రము" అని కూడా పిలువబడుతున్నది.
ఇచ్ఛాశక్తి స్వరూపమే కామాఖ్యాదేవి అని ప్రస్తుతించబడుచున్నది.
అంబువాషీ అను నది అమ్మవారి ప్రత్యేక మహిమకు నిదర్శనము.జగన్మాత రజస్వల అని కూడా వ్యవహరిస్తారు.ప్రతి ఆషాఢ మాస సుక్ల పక్షములోని అరుద్రా నక్షత్ర/మృగశిరా నక్ష్త్ర సంధి కాలములో అమ్మవారి రజస్వల ఉత్సవమును మూడురోజుల పాటు పాటిస్తారు.ఆ సమయములో భూమిపూజలు,వాస్తు పూజలు ,భూసంబంధిత పనులు నిలిపివేస్తారు.అమ్మవారి వస్త్రములు,అమ్మవారి జలములు ఎరుపు వర్ణముతో ప్రకాశిస్తుంటాయి.
ఇక్కడి పూజారులను గారోలు అంటారు.వారు వామాచార-దక్షిణాచార (కుడి-ఎడమ) పద్ధతులలో పూజలను నిర్వహిస్తారు.
అమ్మవారికి మానసపూజ అను మరొక వార్షికోత్సవ పూజను భక్తితో చేస్తారు. శరన్నవరాత్రులలో అత్యంత వైభవముగా తెప్పోత్సవము జరుగుతుంది.
" కామాఖ్యాం పరమం తీర్థం కామాఖ్యాం పరమం తపః
కామాఖ్యాం పరమం ధర్మం కామాఖ్యాం పరమం గతిం
కామాఖ్యాం పరమం విత్తం కామాక్యాం పరమం పదం." అని
మహేశునిచే స్వయముగా పలుకబడిన కామాఖ్యాదేవి మన కామితములను తీర్చుగాక.
శ్రీ మాత్రే నమః.