పరమేశ్వరి అనుగ్రహముగా మనము సర్వసౌభాగ్యదాయకచక్రమును దాటి"సర్వార్థసాధకచక్రము/బహిర్దశారము అను పదికోణములు వెలుపలగా గల ఆవరణములోనికి ప్రవేశించుచున్నాము.
" శక్తిః ఎకాం దశస్థానే స్థిత్వా సూతై జగత్రయం
విశ్వ యోనిః ఇతి ఖ్యాతాఃసా విష్ణుః దశరూపకం"
ఇదే విషయమును లలితా రహస్య సహస్రనామ స్తోత్రము,
"కరాంగుళి నఖోత్పన్నా నారాయన దశాకృతిః" అని స్తుతించింది.
వైష్ణవీ శక్తి ఒక్క స్థానములో స్థిరముగానుండిపది స్థానములలో విభిన్నముగా ఏర్పడి"కులయోగినులు"గా సహాయపడుతూ,"త్రిపురాశ్రీ" అను చక్రేశ్వరి ఆశీర్వచనముతో,ధర్మార్థ కామమోక్ష ప్రదాయకముగా కీర్తింపబడుచున్నది.
నాల్గవ చక్రమైన సర్వ సౌభాగ్యదాయక చక్రము నాడీమండలముగా నున్న చేతనాశక్తిని సాధకునికి వివరిస్తే,సర్వార్థసాధక చక్రము నాడులలో ప్రాణనాడి యైన 'సుషుమ్న" నాడి ప్రాధాన్యమును,దానిలోనిచేతనత్వమును కులయోగినుల ద్వారా సాధకునికి పరిచయము చేస్తుంది.
స్మృతి షట్చక్రములకూటమిని"కులముగా" వివరిస్తే,ఖడ్గమాల స్తోత్రము మన శరీరములో అంతర్లీనముగా నున్న సుషుమ్నను కులముగా,దాని వివిధ శక్తులను కులయోగినులుగా కీర్తిస్తుంది.
"కౌళ మార్గము"అకులమును శివతత్త్వముగాను-కులమును శక్తి తత్త్వముగాను సంభావిస్తుంది.
జ్ఞానేంద్రియ+కర్మేంద్రియముల కూటమి యైన దేహమునుకూడా కులమని వ్యవహరిస్తారు.
పదానములు/ప్రదాయకములు కులయోగినులు.వీరు సర్వత్రా,
1.సిద్ధిగా
2.సంపదగా
3.ప్రియకరిగా
4.మంగళకారిణిగా
5.కామిత ప్రదాయినిగా
6.దుఃఖవిమోచినిగా
7.మృత్యుప్రశమనిగా
8.విగ్న నివారిణిగా
9.సర్వాంగ సుందరిగా
10.సౌభాగ్యదాయముగా
అధిష్ఠించి ఆశీర్వదిస్తుంటాయి.