Sunday, April 1, 2018

SAUNDARYA LAHARI-71

 సౌందర్య లహరి-మహిషాసుర మర్దిని


 పరమపావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 మధుకైటభులను సంహరించితివి మాధవ సోదరి
 భండాసురుని వధించి భువన భాండము రక్షించితివి

 రక్తబీజుని అంతమొందించిన శక్తిస్వరూపిణివి
 విషంగ విశుక్రులం విషమును అరికట్టితివి

 మహిషాసురుని మర్దించిన మహిమాన్వితవి
 అవనీ పాలనకై ఎన్నో అవతారములెత్తితివి

 అంతః-బహిర్ముఖములలో  చింతలను కలిగించు
 అసుర సంహారమే నీకు అమితానందమైన వేళ

 నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.


 " జయజయహే మహిషాసుర మర్దిని"
 పై వాక్యములో ధర్మమునకు ప్రతిరూపమైన అమ్మవారు-అధర్మమే ఊపిరి యైన రంబ పుత్రుడు మహిషుడు ,ధర్మమునకు లభించిన జయము దాగియున్నవి.


  సకలదేవతా శక్తుల సమాహారమునకు-సకల దేవతలు అనుగ్రహించిన ఆయుధములు తోడై'రిపవోపి శస్త్రపూతా" (తల్లి ఆయుధముల స్పర్శ వలన శత్రువులు పునీతులగుదురు)
 అన్నట్లు మహిషాసుర సంహారమునందు ఆయుధము-వాహనము అరివీర భయంకరములైనవి.




 1.ఆయుధము.

   మహిషునిలోని అజ్ఞానము అను చీకటి (తమోగుణము),ఆడదానితో యుద్ధము అను అహంకారముతో(రజో గుణముతో) చేయి కలిపి,ఆదిశక్తి అను విచక్షణను( సత్వ గుణమును)మరగున పడునట్లు చేసినది.ఫలితముగా త్రిగుణాతీతమైన త్రిశూలముతో నిహతమైనది మహిషుని అసురత్వము.

2.వాహనము.

  మహిషుని సంహరించుటకు తల్లి సింహవాహినియై ఏతెంచినది. ఆకలియైనపుడే వేటాడు ధర్మము కలది సింహము.అధర్మము అను ఆకలియైనపుడు అసురత్వము అను ఆహారమును వేటాడినది.


    పరాకాష్ఠతనొందిన పాపములను పైకెగిరి పట్టుకొని తీసివేయుట తల్లిపైకెగురుట.తన పిల్లలను సంస్కరించుటకు తాను దిగివచ్చుట క్రిందకు దిగి,మహిషుని
హృదిపై తనపాదమును మోపుట.కొందరిని సంస్కరించి,మరి కొందరిని సంహరించి ముక్తిని ప్రసాదించుతల్లి పాదములకు అంటిన అసుర రక్తము పావన పారాణియై ప్రకాశించుచున్నదనిన,ధూర్జటి కవి పలుకులు  స్మరించుకొనుచు,పరవశించుచున్న సమయమున చెంతనే  నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.



 

 

SAUNDARYA LAHARI-70


 సౌందర్య లహరి-కనకదుర్గ-67

 పరమ పావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 సృష్టి -స్థితి  కార్యములకు  బ్రహ్మ-విష్ణువులను
 సృష్టించెను వారికి శక్తులుగ వాణి-శీలక్ష్మిని

 లయముచేయుటకుగాను  త్రినయనుని సృష్టించె
 సగభాగముగ చేరగ పార్వతిని  పంపించె

 ముగ్గురమ్మలకు  మూలముగా నీవున్నావమ్మా
 దుర్గమము అను పదము ఎపుడో నిర్గమించినదమ్మా

 పసుపు-కుంకుమలతో,పట్టుచీరలతో-గాజులతో
 కనక దుర్గ మాతగా నీవు కనికరించుచున్నవేళ

 నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస  విహారి ఓ సౌందర్య లహరి.

" దుర్లభా-దుర్గమా-దుర్గా-దుఖఃహంత్రీ-సుఖప్రదా" శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రము దుర్గమ్మను కొనియాడుతున్నది.దుర్గమ్మ స్వభావము ఎటువంటిది? తెలుసుకోవాలనుకుంటే,
దు:ఖమును తొలగించి సుఖము కలిగించునది కనికరమనే కనకము గల కనకదుర్గమ్మ.

  దుర్గమ్మ పదమునకు ముందు దుర్లభా-దుర్గమా అను రెండు పదములు కలవు. ఇక్కడ ఒక దుర్గము (ఎత్తైన గోడలు కల కోట దుర్గము) మనది.అది అరిషడ్వర్గములతో-ఐహిక బంధములతో,అజ్ఞానముతో,దట్టమైన చీకటితో నిండినది.దాని నుండి బయట పడుట సులభము కాదు కనుక మానవ దుర్గము దుర్లభము మరియు దు:ఖ ప్రదము.దానిని అధిగమించుట అసాధ్యము.

  రెండవ దుర్గము తల్లి మనకొరకు రక్షణగా నిలిపిన అనుగ్రహము.ఈ దుర్గము అనురాగ బంధముతో,అద్వైత భావముతో,అమ్మ తనముతో నిండి చీకటిలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు జ్యోతియై ప్రవేశమునకు అనుమతించు అమ్మ ఒడి.
 కనుకనే "కాత్యాయని నామ విద్మహే కన్యకుమారి ధీమహి-తన్నో దుర్గి ప్రచోదయాత్",కాత్యాయన మునిని కూతురిగా అనుగ్రహించిన తల్లీ,హిమాలయమునుండి కన్యా కుమారి వరకు నీ అనుగ్రహముతో అమృతమయము చేయుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు. 




TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...