Friday, June 23, 2017

jai SreemannaaraayaNa

జై శ్రీమన్నారాయణ.
*****************
భగవత్ బంధువులారా!
మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి.
ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో
.
" అందరికి వందనములు."
మంద బుద్ధినైన నాపై అమ్మ కృపాకటాక్షము ప్రసరించినదేమో తెలియదు కాని,పదిమందితో పంచుకోవాలనే పరమార్థ తత్వమును, "నా" అనబడే ఈ జీవిలో ప్రవేశింప చేసి,
" నీ పాదము పట్టి నిల్చెదను
పక్కనె నీవు ప్రస్తుతి వ్రాయుమా" అని పలికించినది.
అవ్యాజమైన (ఏ అర్హత లేకుండానే) అమ్మదయతో, ఆండాళ్ తల్లి,అసలు పటుత్వమేలేని,నా చేతిని తాను పట్టుకొని,, శ్రీ రంగనాథ కృపా కటాక్షమనే కలమును పట్టించి,నా మస్తకమనే పుస్తకముపై,శ్రీ వ్రత శుభ సమయములో,"ఒక గోపిక అంతరంగం" అను దివ్య పరిమళ పారిజాత మాలను,"స్వామి కైంకర్యమునకై" అల్లుతోంది.ఇంతలోనే,ఇదేమి చోద్యమో! మాయా మోహితమైన (నా) అహంకారము దొంగలా ప్రవేశించి దోషములను ముళ్లను చేర్చుతోంది.
కావున సత్ చిద్రూపులారా! అన్యధా భావించక,మాలను సంస్కరించుటను," శ్రీ గోదా-రంగనాథుల సేవ" గా భావించి,సహకరించగలరని ఆశిస్తూ,
సవినయ నమస్కారములతో -మీ సోదరి.
సద్గురు పరంపరకు సాష్టాంగ ప్రణామములు.
( ఆండాళ్ తిరువడిగలే శరణం.)

ఓం నమో నారాయణాయ-01

 " శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-1
***********************
విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" గా మారినది
"విష్ణు చిత్తీయమై" శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
బ్రాహ్మీ ముహూర్తమనే సత్వగుణ ప్రధానమైన
సమ శీతోష్ణత గల " శ్రీ మహా విష్ణు మాసములో"
ధన్యతనందించ గలుగు "ధనుర్మాస వ్రతమైన"
అంగనలారా! మంగళ "శ్రీ రంగనాథుని సేవలలో"
భక్తి తత్పరతయే భవతారణ భాగ్యమైన
బాహ్యాభ్యంతర శుచియగు " భాగీరథీ స్నానములో"
"పర-రూప-విభవ-అర్చ-ఆంతర్యాది" రూపమైన
" ధర్మార్థకామమోక్ష" భాసురమను పాశురములలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ "భక్తి"పూల మాలలతో నేడె
భావము
"మార్గళి" సుప్రభాత సమయము శుభ ప్రదమైన " శ్రీ వ్రతమును" మనందరము కలిసి ఆచరించుటకు సానుకూలముగా నున్నది.పరమ పావనమైన "శ్రీ గోదా-రంగనాథ" మూర్తులయందు విహరించుచున్న నా మనసు,పవిత్రమై,పాశురములను కీర్తించుచు,భక్తి పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లుచున్న హారములను స్వామికి సమర్పించుటకు, చెలులారా!కదిలి రండి.తెల్లవారు చున్నది.


ఓం నమో నారాయణాయ-02



శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-2
్్్్్్్్్్్్్్్్్్్్్్్
విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" మారినది
"విష్ణు చిత్తీయమై" శ్రీ హరి సంకీర్తనమే కోరుతోంది
'పాలు-నీరు--దేహాలంకరణ" నిరాకరణమైన
పాలకడలి నాథుని '"వ్రత నియమ సం యమనములో"
నిస్తుల వైభవ స్తుతులే " కస్తూరి తిలకమైన"
నాసాగ్ర మౌక్తికమూర్తి భక్తుల " సత్య వాక్య పాలనలో"
హరిచందనమూర్తిని సంకీర్తించు "వేదాంత దేశికులైన"
సాధు సజ్జనుల సమర్పణము " సవినయ భిక్ష రూపములో"
కృతకృత్యులనొనరించు " నిత్య నిరంజనమైన"
"కాత్యాయినీ వ్రతమును" చేయుచున్న గోప కాంతలలో
"తెల్లవార వచ్చెనమ్మ" చెలులారా రారె
తెల్లబరచగ "భక్తి" పూలమాలలతో నేడె.
భావము
వ్రత నియమానుసారము దేహాభిమానములేని వారియందు,సత్యవాక్య పరిపాలకుల లోను,సాధు పుంగవులకు అర్పించు సవినయ భిక్షలలోను,సర్వ సంపత్ప్రదమగు "కాత్యాయినీ వ్రతమును" చేయుచున్న గోప కాంతలలోను నిమగ్నమైన నా మనసు, మీతో కలిసి పాశుర పఠనము చేయుచు,భక్తి అను పూలను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు త్వరత్వరగా కదిలిరండి.తెల్ల వారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

ఓం నమో నారాయణాయ-03



" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-3
**********************
విచిత్రముగ నామది " శ్రీ విల్లి పుత్తూరు" గా మారినది
"విష్ణుచిత్తీయమై" శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది.
పునీతులు-గోపికలు పురుషార్థ ప్రదమైన
పుణ్య స్నానములు చేయుచున్న తీర్థములలో
నింగి-నేల స్నేహముతో హితము రంగరించినదైన
పల్లెతల్లి పులకింతల పచ్చని పంట పొలములలో
నింగి-నేల-జలము దాగుడుమూతలాడుచున్నవైన
పారుచున్న సరసులోని చేపల కేరింతలలో
మరుగుజ్జు రూపమున ముజ్జగములు కొలిచిన వాడైన
ఆ వామనమూర్తి త్రివిక్రమ పరాక్రమములో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
పుష్కర తీర్థములలోను,పంట పొలములలోను,వాటి మధ్యనున్న సరసులలో ఆడుచున్న చేపలలోను,మరుగుజ్జు రూపములో యాచకునిగా మారి ముజ్జగములను కొలిచిన వామన మూర్తి పరాక్రమములోను నిమగ్నమైన నా మనసు,మీ అందరితో కలిసి, పాశురములను కీర్తించుచు,భక్తి పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను, స్వామికి సమర్పించుటకు, చెలులారా!త్వర త్వరగా కదిలిరండి.తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం)

ఓం నమో నారాయణాయ-04



శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-4
*************************
విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" మారినది
" విష్ణు చిత్తీయమై" శ్రీహరిని కీర్తించుటనే కోరుతోంది.
పాండవ రథ సారథి " శౌర్యపు గర్జనయైన"
కడలినీరు కడుపునిండ " గర్జనవలె త్రేంచు మేఘములో"
దుష్టశిక్షణార్థము " రాముని శరవేగ పోలికయైన"
వేగముతో వర్షించే " అలుపెరుగని మేఘములో"
శిశుపాలుని వధియించి శ్రీకరముగ" మెరయుచున్నదైన"
"సుదర్శన చక్రము" వలె " మెరయుచున్న మేఘములో"
" నామ,రూప,సారూప్యములు" అవిభాజ్యములైన
"సాక్షాత్ నీలమేఘ శ్యాముడైన" ఆ నీలి మేఘములో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
శ్రీ కృష్ణుని పరాక్రమము వలె గర్జించు మేఘములో,రామబాణ వేగముతో సమానమైన వేగముతో వర్షించు మేఘములో,శిశుపాలుని వధించి,తెల్లనైన కాంతితో మెరయుచున్న సుదర్శన చక్రము వంటి మెరుపులున్న మేఘములో,ఇన్ని మాటలేల! సాక్షాత్ ఆ నీల మేఘ శ్యామునితో అభేదమైన ఆ నీలిమేఘములో నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పూలను శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించ, చెలులారా కదిలి రండి.తెల్ల వారుతోంది.
( ఆండాళ్ తిరువడిగళై శరణం )

ఓం నమో నారాయణాయ-05

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-5
************************
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
పాలుతాగినంతనే పూతన పాపాలు పరిహారమైన
మురిపాల బాలగోపాలుని మేలుకొలుపులలో
యశోదమ్మ పున్నెమేమో తనకుతాను కట్టుబడిన వాడైన
మన్నుతిన్న వాడన్న దామోదర రూపములో
వ్యత్యస్త పాదారవిందములతో కాళియమర్దనమైన
ప్రస్తుతించి పులకించిన పశుపక్షి గణములలో
మధుర నిర్వాహకుడు మన వ్రతనాయకుడైన
ఆగామి సంచిత హరుని ఆగమ స్తుతులలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా! రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె
భావము
పాలుతాగి,పూతన పాపాలను తొలగించిన నల్లనయ్య మేలుకొలుపులలో,అమ్మకు పదునాలుగు లోకములు చూపించి,తనకు తానుగా దొరికి యశోదచే రోటికి కట్టబడిన దామోదరునిలో,( పొట్ట మీద తాటిగుర్తు కలవాడు),కాళియ మర్దనముతో పశు-పక్ష్యాదులను కాపాడిన వానిలో,సర్వ పాపములను పోగొట్టువాడును,మన వ్రత నాయకుడగు కృష్ణుని యందు నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో,అల్లిన హారములను,స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి.తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

ఓం నమో నారాయణాయ-06

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే
ఓం నమో నారాయణాయ-6
*************************
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
నాయందే కలడనుకొనుచు బృందావన వాసుడైన
గోవిందుని అనుగమించు గొల్లెతల పెడకొప్పులలో
వేదవేదాంత వేద్యుని వేణుగాన పరవశులైన
యమునా రాస విహార రమణుల కుడిపైటలలో
మధురానగర విహారి మధుర గంభీర ధ్వనియైన
శంఖధ్వనితో కూడిన మోగిన జేగంటలలో
ఆ మాయావి ఏమిచేసెనో శతక్రతు సమానమైన
వ్రత వైభవమును మరచి నిదురించుచున్న గోపికలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె
భావము
పదిమందికి స్వామి అనుగ్రహమును పంచదలచి,గొల్లెతగా కుడిపైట-పెడకొప్పు ధరించి,శంఖధ్వనిని వినమని,వ్రతము మరచి నిదురించుచున్న గోపికను జేగంట వినపడుచున్నది కనుక నిద్రలెమ్మని అనుచున్న అమ్మలో,నిమగ్నమైన నా మనసు పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను,స్వామికి సమర్పించుటకు,చెలులారా! కదిలి రండి.తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం)v

ఓం నమో నారాయణాయ-07

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే
ఓం నమో నారాయణాయ-7
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
భరధ్వాజ పక్షులకు భగత్చింతన యైన
ఖగరాజ వాహనుని సుప్రభాత సేవలలో
ముద్దరాలు ఈమె అని నిద్దురలేపుచున్నదైన
ప్రేమ పూరితమగు "పిచ్చి పిల్లా " అను పిలుపులో
నవ మన్మథుని మించిన నగధర రూపమైన
అగణిత గుణగణుని కొలుచు అగరు ధూప పరిమళములో
రేపల్లెలో గొల్లెతలు చల్ల చిలుకు వేళయైన
నల్లనయ్యను పిలుచు కవ్వపు సవ్వడులలో
తెల్లవర వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
పుణ్యాల పంటైన భరధ్వాజ పక్షుల కిచకిచలలోను,ఆండాళ్ తల్లి గోపికను ప్రేమతో పిలిచిన "పిచ్చిపిల్ల" అను పిలుపులోను,స్వామి కైంకర్యములో ధన్యమగు చున్న అగరుధూపముల లోను,గొల్లెతల కవ్వపు శబ్దములలోను నిమగ్నమైన నా మనసు,
పాశురములను సంకీర్తించుచు,భక్తి అను పూలను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను సమర్పించుటకు చెలులారా కదిలిరండి.తెల్లవార వచ్చుచున్నది.
(ఆండాళ్ తిరువడిగళే శరణం )

ఓం నమో నారాయణాయ-08



" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే'
ఓం నమో నారాయణాయ-8
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామసంకీర్తనమే కోరుతోంది
వేణుగానలోలునినయన భానూదయ ప్రసాదమైన
లేగ దూడలు మేయుచున్న లేలేత చిగురు పచ్చికలో
రేపల్లెలలో రేయి-పవలు గోవింద రూపములైన
గోపాలుర-గొల్లెతల పావై-పామర భాషలలో
చందన చర్చిత ధారి చదరంగపు పావులమైన
ఇదిగో! అని ఇస్తున్న "పఱి" అను పురుషార్థములో
పదిమందికి పంచగలుగు పారమార్థికమైన
భువనమోహనుని కొలుచు బుద్ధి పాశురములలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
ఉదయముననే లేత పచ్చిక తినుచున్న లేగ దూడలలో,రేపల్లె వాసుల పండిత-పామర భాషలలో,స్వామి అనుగ్రహించబోతున్న పఱి అను  వాయిద్యములో,పదిమందితో కలిసి జరుపుకునే పరమ పావనమైన పెరుమాళ్ సేవతెలుపు బుద్ధి పాశురములో నిమగ్నమైన నామనసు పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించగ చెలులారా కదిలిరండి.తెల్లవార వచ్చు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

ఓం నమో నారాయణాయ-09



" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-9
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
వేద సం రక్షణార్థము " వేదాంతవేద్యుడైన"
జలచరమై జయమొసగిన "మత్స్యావతారములో"
"ధర్మ సంస్థాపనకు" క్షీరసాగర మథనమైన
ఉభయచరమై ఉద్ధరించిన " శ్రీకూర్మావతారములో"
" పరమపునీత భూమాత" అసురహస్తగతమైన
అమ్మను రక్షించిన " ఆదివరాహరూపములో"
"దశేంద్రియములు మేల్కొలుపు" దశావతారములైన
వివిధరూపములు ధరించిన " విరాట్రూపములో"
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
( దశ,శత,సహస్ర మొదలగు శబ్దములు సంఖ్యను తెలియచేటయే గాక విశేషార్థములో లెక్కలేనన్ని అనికూడా సూచించు చున్నవి."దశ" అను శబ్దమునకు పది అను సంఖ్యవాచకము మాత్రమే కాకుండా ధర్మమును రక్షించే స్థితి అను అర్థమును ఆర్యులు సెలవిచ్చారు కదా!ఉదా దశ తిరుగుట-స్థితి మారుట.) నాలుగు వేదములను కాపాడిన స్వామి చేప అవతారములోను,మంధర పర్వతమును మునుగకుండ కాపాడిన తాబేటి అవతారములోను,భూమాతను రక్షించిన ఆదివరాహస్వామి లోను,నాలోని దశేంద్రియముల (జ్ఞానేంద్రియములు 5,కర్మేంద్రియములు 5) బాధ్యతను తెలియచేయుచున్న స్వామి మూలరూపమునందు నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి. తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

ఓం నమో నారాయణాయ-10

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-10
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
ప్రభువుల,పడతుల,ద్విజుల కర్తవ్యపాలనమైన
నెలకు, ఆరక కురియుచున్న మూడు వానలలో
బురద అంటనీయని వైరాగ్యపు భాష్యమైన
"మణి కైరవ" దిగుడుబావి విరబూసిన తామరలలో
పూర్వ పుణ్యఫలముగా యోగ తాదాత్మ్యమైన
అంభోరుహనేత్రి పోవుచున్న కుంభకర్ణుని నిద్రలో
'ఉడైయార్ ఆరుఙ్ లమే"అని అగస్త్యుని తలపించినదైన
^
అమ్మ కీర్తించుచున్న ఆ ఆభరణపు పాశురములో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
సస్య శ్యామలతకు కారణమైన వానలలో,బురదలోనుండి పుట్టినప్పటికిని,ఏ మాత్రము అంటనీయకుండా ప్రకాశించే పద్మాలలో (మహాను భావులైన ఆళ్వారులలో) ( శ్రీ రామానుజులులా) గోపిక యొక్క యోగ తాదాత్మ్యములో,"ఉడైయార్ ఆరుఙ్ లమే" అని అమ్మచే అన్యాపదేశముగా కీర్తింపబడుచున్న అగస్త్య మునిలో,జ్ఞానాభరణ ...^... పాశురములో నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను,స్వామికి సమర్పించుటకు,చెలులారా! కదిలి రండి.తెల్ల వారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

ఓం నమో నారాయణాయ-11

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-11
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
" మాధవ కణంగల్" అనబడు సాధురూపములైన
అరిషడ్వర్గములంటని సురభుల గోష్ఠములో
అస్ఖలిత బ్రహ్మమునకు అనిశము శిరోధార్యమైన
అస్ఖలిత బ్రహ్మచారి ఆ బర్హి పింఛములో
"సెండ్రుం-సెరుం-సెయ్యం" అంటు అతిపరాక్రమములైన
అరి సం హారముచేయు బుద్ధికుశలతలో
పుట్టలోపల చుట్టినదేహముతో పడగ విప్పినదైన
పుట్టినింటి గౌరవమును పెంచు ఆ " బంగరు మొలకలో"
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
లెక్కపెట్టలేనన్ని సద్గుణముల ప్రోవులైన గోగణములున్న గోశాలలలోను,ప్రశాంత ప్రసన్న సౌందర్యమైన నెమలి లోను,దుష్టత్వమను శత్రువును గుర్తించి,తనకు తానుగా దండెత్తి,శాంతిని నెలకొల్పు భుజ పరాక్రమములోను,పుట్టలో చుట్టుకున్న దేహముతో,పడగ విప్పి పరవశించు పామువంటి గోపిక యందు, ( ఇది సామాన్యార్థము )
లెక్కలేనన్ని సద్గుణములు కల సాధు పుంగవుల ఆశ్రమములలోను,శిఖిపింఛమౌళి అనుగ్రహ సౌందర్యములోను,మనలోని దుర్గుణములను శత్రువులను గుర్తించి తనకు తానే వాటిపై దండెత్తి సమసింపచేయు గొల్లస్వామి పరాక్రమమునందును,వినయ ప్రతీకగా తన శరీరమును పుట్టయందు చుట్టుకొని, (మాయా జగతి పుట్టలో తన శరీరమునుంచి-భక్తి అను పడగను విస్తరింప చేసిన)భక్తిభావ పడగను విస్తరింపచేయుచున్న,"బంగరు మొలక" అని అమ్మచే పిలిపించుకుంటున్న గోపికలో,( ఆళ్వారులో) నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లుచున్న హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదలి రండి. తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

ఓం నమో నారాయణాయ-12

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-12
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
మూగదో,చెవిటిదో అని, ముదితల పరిహాసమైన
ముద్దరాలు నిద్దరోవు అద్దాలున్న పానుపులో
ఉవిద భక్తి ఉత్కృష్టమై కృష్ణునితో మమేకమైన
వక్షస్థలమందు నున్న పుండరీకాక్షునితో
పక్కనున్న అత్తను నిద్దురలేపమనిన వారైన
బద్ధకమును వదిలి,లేచి గడియ తీయమనుటలో
అనవరత ధ్యానములో ఆమె-అంతర్ముఖమైన
బహిర్ముఖము చేయుటకు "ఎన్ఱెన్ఱు నామం పలవుం" అనుటలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
వ్రత సమయము సమీపించుచున్నను నిదురలేవని గోపిక వద్దకు వచ్చిన గోపకాంతలు, ఆమెను మూగదో,చెవిటిదో, మూఢురాలో అని అపహాస్యము చేసారు.అయినప్పటికి నిదురలేవలేదని పక్కనున్న ఆమె తల్లితో అత్తా! ఆమెను నిద్దురలేపి గడియతీయించమనిరి.తల్లి లేపినను ఆమె నిదురను చాలించకపోతే,ఆమె చెవిలో మాధవ నామమును చెబుతూనే ఉండమన్నారు.(ఇది సామాన్యార్థము.)
నెమలిలో,పాములో,గోవులలో,సాధువులలో కృష్ణభక్తిని దర్శించిన గోపిక,ఆ పరమాత్ముని దయతో నేడు కృష్ణభక్తిలో అంతర్ముఖమైన మరొక గోపికను చూస్తోంది.వ్రతమాచరించుటకు బహిర్ముఖము చేయవలెను కనుక అత్తా!
నిద్దురలేపమన్నది.(అత్తరూపములోనున్నది భాగవతోత్తముడు) అయినను గోపిక నిద్దురలేవక పోవుటచే( కారణము ఆమె భక్తి పరాకాష్ఠత మాత్రమే కనుక )ఆమె చెవిలో మాధవ నామమును కీర్తించుచునే ఉండమన్నారు.అంతర్ముఖములో దర్శనీయములు బాహ్యములో స్మరణీయములు కావలెనుకదా అని గోపిక చింతలో నున్న నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను,స్వామికి సమర్పించ,చెలులారా! కదిలి రండి.తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

OM NAMO NARAYANAAYA

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-13
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
శిరములజారిన క్షీరము "స్థితికారణ గుణమైన"
సురభుల పాలను తడిసిన " అడుసంటిన గోపికలో"
మంచు కురియుచున్నదని " హేమంతపు ఛత్రమైన"
ఇంటిచూరు కిందచేరి నిలబడిన గోపికలో
"గురు నక్షత్రపు చీకటి " కనుమరుగైనదైన
శుభకరమగు" ఉదయించుచున్న శుక్ర నక్షత్రములో"
భక్తులు కొలిచెడి దైవము " భక్త పరాధీనమైన"
"రామ -కృష్ణ రూపములను ప్రీతి పాశురములలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము.
గోవుల పాలతో తడిసిన బురద అంటుకున్న గోపికలో,మంచు కురియు చున్నదని ఇంటిచూరుకింద నిలబడిన గోపికలో,అస్తమించిన గురు నక్షత్రములో,ఉదయించు చున్న శుక్ర నక్షత్రములో,రాముని కృష్ణుని రూపములలో కనిపించిన పరమాత్ముని చూచుచున్న గోపికను,( ఇది సామాన్యార్థము.)
అంటుచున్న సంసారము అను బురదలో కృష్ణభక్తి అను గోక్షీరమును మేళవించిన గోపికను,కట్టుబాట్లు అను చలిని తట్టుకోలేక విష్ణుపాదములు అను చూరు కిందనున్న గోపికను, గురుడు దేవతలకు గురువు.కాని కపటముతో కచుని సంజీవిని విద్యకై శత్రువులవద్దకు పంపి స్వచ్చతను కోల్పోయాడు.శుక్రుడు రాక్షస గురువు కాని కచునికి " మృత సంజీవిని విద్యను" నేర్పి సంస్కారమనే వెలుగుతో ఉదయించుచున్నాడు.భక్త పరాధీనమైన భగవంతుని రామకృష్ణ రూపములను చూచుటలో నిమగ్నమైన నా మనసు, భక్తి అను పువ్వులను శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి.తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )
2
Comments

ఓం నమో నారాయణాయ-14



" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-14
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
"ముష్టికాసుర చాణూరులను" మట్టికరిపించినవారైన
ఉల్లము ఝల్లనిపించిన " మల్లయుద్ధ క్రీడలలో"
" చింతచెట్టు క్రింద కూర్చున్న" చిత్ప్రకాశరూపమైన
మధురకవితో మాట్లాడిన " శ్రీ నమ్మాళ్వారులో"
"త్రేతా-ద్వాపర యుగముల" రామ-కృష్ణ నామభేదాలైన
భక్తిభావము ఎక్కువైన " చీలిన రెండు వర్గములో"
శ్రీ రామాలింగనమునకు " ధ్యానించిన వారైన"
"శ్రీ కృష్ణ పరిష్వంగమును" కోరుచున్న గోపికలలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె
భావము
మల్లయుద్ధములో చాణూర-ముష్టికాసురులను మట్టు పెట్టిన స్వామిలో,చింతచెట్టుక్రింద దివ్యమైన ప్రకాశముతోనున్న(5వ ఆళ్వార్) శ్రీ నమ్మళ్వార్ తన మౌనముద్రను వీడి మొదటిసారిగ శ్రీ మధురకవితో మాట్లాడుటను ,రాముని ధ్యానించిన మునులను,శ్రీకృష్ణుని ఆలింగనమును కోరుచున్న గోపికలను చూచినది.(ఇది సామాన్యార్థము)
ఇక్కడ భవబంధములకు-భగవతత్త్వమునకు మల్లయుద్ధము జరుగుచున్నది.మహనీయుల దర్శనము మహా మహిమోపేతము అనుటకు నిదర్శనముగా,చింత చెట్టుక్రింద భగవత్చింతనలోనున్న మధురకవి -నమ్మళ్వార్ వారిని సందర్శించుటయే కాకుండా, మన గోపికయుస్వామి దయచే (ఆమె) శ్రవణేందియము జాగృతమై వారి సంభాషణను సైతము వినగలుగుతున్నది. రామునిలోను-కృష్ణునిలోను అభేదమును,జీవాత్మ-పరమత్మల అవినాభావ సంబంధమును గుర్తించుటకు ప్రయత్నించుచున్నది.గోపిక సాధనను సఫలీకృతము చేయుటకు సం స్కారములు జాగృతమగుచుండుటలో నిమగ్నమైన నా మనసు, పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి.తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం)

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...