Friday, June 23, 2017

ఓం నమో నారాయణాయ-17

ఓం నమో నారాయణాయ-17
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామసంకీర్తనమే కోరుతోంది
మోదపు ప్రదానముతో "దానపు నిధానమైన"
ఆనంద గోపాలుని తండ్రి " ఆ నంద మహారాజులో"
" నదీతీరముల మొలుచు" అతిసుకుమారములైన
" ప్రబ్బలి" చిగురుబోడి గొబ్బెత "యశోదమ్మలో"
"ఆదిశేషుడే" స్వయముగ స్వామికి" అన్నగారైన"
హలాయుధుడు " బలరాముని కాలి కడియములో"
స్థూల-సూక్ష్మములన్నింట్లో " మూలము" తానేయైన
పంకేరుహలోచనుని " శంఖు-చక్ర పాదములలో"
అతి" పవిత్రమైన వ్రతము " ఆచరింప రారె
" ఆముక్తమాల్యద" ఆండాళ్ " అమ్మ వెంట" నేడె.
భావము
దాన యశోవిరాజితుడగు నంద మహారాజుని,ప్రబ్బలి సౌకుమార్యముగల యశోదమ్మను,బలరాముని కాలి కడియమును,శంఖు-చక్రములున్న స్వామి పాద పద్మములను,అమ్మ వెంటనున్న మన గోపిక భావించగలుగుతున్నది.(ఇది సామాన్యార్థము)
స్వామి పాదములోని శంఖము సకల జీవుల నాద రూపమునకు ( ఓంకారము),చక్రము సకలజీవుల తేజో రూపములకు సంకేతములు.మన గోపిక,ఆండాళ్ తల్లిలో యశోద సౌకుమార్యమును,నందుని సౌశీల్యమును దర్శించ గలుగుతున్నది.(శ్రీ మహా విష్ణువు ఎనిమిదవ అంశ నలుపు-తెలుపు రంగులలో ఏర్పడి తెలుపు అంశ దేవకీ గర్భమునుండి రేవతీ గర్భమునకు తరలించబడినదని భాగవతోత్తములు చెబుతుంటారు).స్వామికి అన్నయైన రాముడు అతి బలపరాక్రమవంతుడగుటచే బలరాముడని,బలవంతుడని నామసార్థక్యతము పొందినాడు.రెండు గర్భములలో ఎదిగిన వాడగుటచే సంకర్షణుడు అని కీర్తింపబడుచున్నాడు.హలము (నాగలి)ఆయుధముగా కలవాడు కనుక బలరాముని హలాయుధుడు అని కూడా వ్యవహరిస్తారు." రామో రామశ్చ రామశ్చ" త్రయములో ఒకడు.
శ్రీ కృష్ణుడు పాడికి,బలరాముడు పంటలకు (స్థితి కార్యములకు) నిర్వాహకులు.సమర్థ స్థితి కార్య నిర్వహణకు యాదవులు సమర్పించిన గౌరవ సూచనలే కాలి కడియములు.ప్రబంధ యుగములోని గండపెండేరమునకు మూలముగా తోచుచున్నవి.మన గోపిక స్థితికారుని ద్వైత (రెండు) రూపాలలోని ఒక్క (అద్వైత) రూపమును అనుభవించుటకు అమ్మవెంట నడుచుచున్నదన్న తలపులో నిమగ్నమైన నా మనసు పాశురములను కీర్తించుచు అమ్మతో వ్రతము చేయుటకు సాగుచున్న గోపికలతో కలిసి,ముందుకు అడుగులు వేస్తున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...