AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

వందనం

===========

అంబ వందనం  జగదంబ వందనం
సంబరాన కొలువుతీరె శక్తి వందనం
భవతారిణి భగవతి భక్తి   వందనం.

పారిజాత అర్చనల  పాదములకు వందనం
పాపనాశిని పావని  పార్వతి  వందనం.

గులాబీలు గుబాళించు  గుల్భములకు వందనం
గణపూజిత గుణాతిశయ  గౌరి  వందనం.

ముద్దు గణపయ్య  కూర్చున్న  ఊరువులకు వందనం
ఎద్దునెక్కు శివునిరాణి  గిరిజ  వందనం.

అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం
గిరితనయ విరిపూజిత దుర్గ  వందనం.

విదుషీమణి అలంకృత  మణిమేఖలకు వందనం
అఖిలాండపోషిణి  ఆదిశక్తి అన్నపూర్ణ  వందనం.

భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం
శక్తిపీఠనిలయ శ్రీశైల భ్రమరాంబిక  వందనం.
 
సకలశాస్త్ర ధర శుభకర కంకణములకు వందనం
పరిపాలిని శుభకారిణి గాయత్రి  వందనం.

 త్రయంబక రాణి భవాని కంబుకంఠమునకు వందనం
సృష్టి స్థితి లయ రూపిణి త్రిపుర సుందరి   వందనం

బుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం
లక్షణ రూపిణి సన్నుత కొళాపురి మహాలక్ష్మి  వందనం

బీజాక్షర పూరిత ఓష్ఠమునకు వందనం
పూజా సేవిత  వారణాసి విశాలాక్షి వందనం
 
ముక్తిప్రదాత యోగశక్తి వక్త్రమునకు వందనం
భావ ప్రవాహ భాషా ప్రదీప  వాగ్దేవి  వందనం

నవమౌక్తిక నాట్యాల నాసాగ్రమునకు వందనం
ఆశ్రమవాసుల ఆరాధ్య రాజ రాజేశ్వరి  వందనం

తపోధనుల తల్లి నీ కపోలములకు వందనం
కన్నతల్లి కల్పవల్లి శ్రీ లలితాంబిక  వందనం

సూర్య చంద్ర చిత్స్వరూప నేత్రములకు వందనం
స్తోత్రప్రియ మూర్తిత్రయ త్రిపురసుందరి  వందనం

మణికుండలముల మెరయు కర్ణములకు వందనం
శ్రుతి స్మృతి వినుత విరాజిత అపర్ణ  వందనం

ఫాలలోచనుని రాణి ఫాలమునకు వందనం
పాలాభిషేక ప్రియ నందిని కాత్యాయిని  వందనం

అక్షయ ప్రశస్తిగ కస్తూరి కుంకుమకు వందనం
లక్ష లక్షణ ప్రస్తుత దాక్షాయిణి  వందనం

క్లేశహరిణీ పరిమళ  కేశములకు వందనం
వాసవాది వినుత కేశవ సోదరి  వందనం

సంకటనాశిని పొంకపు మకుటమునకు వందనం
కింకరపాలిని శుభగాత్రి మహిషాసుర మర్దిని  వందనం

  **************
అథాంగ పూజనము- అపరాధ క్షమాపణము
ఆపాదమస్తక వందనము- ఆపాత మధురము

అంబవందనం  జగదంబ వందనం 


Comments

Popular posts from this blog

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)