Thursday, July 14, 2022

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

1.సుందరి సుమంగళి నిరంతరి దురంధరి జ్యోతిస్వరూపమే నీవు

శుక్రవారమునాటి నీదివ్యదర్శనము కిల్బిషము కడతేర్చునమ్మా
నీ పాద చింతనమే భవతాపహరణము
భావనామాత్ర సంతుష్టవు
జగమంత నీ మాయలో మునిగిన తరుణాన నేనేమని కీర్తించగలను
నీ సొంత సంతతిని వేగమే రక్షించు బిరుదు నీకున్నదమ్మా
శివ శివ మహేశ్వరి పరమనిలయేశ్వరిశిరోన్మణి మనోన్మణియు నీవే
శాంకరి శుభంకరి యశోధరి పరాత్పరి అనాధరక్షకియు నీవే
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
****
2.ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు
చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును
ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం
గరళకంఠుని సతిగ మంగళముగ అలరారు తాళి ఘనము
శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు
జగములన్నింటికి వెలుగుతానైనది జనని నీ వదన మిహిర.
అత్తి వరదుని చెల్లి శక్తి శివ రూపిణివి అథముడిని వర్ణింపగా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే
***********
3.నిన్ను నెరనమ్మి నీ పాదాలపై వాలి శరణుశరణన్నగాని
తగదమ్మ నామీద కనికరమునే మరువ,తాత్సారమది యేలనో

కఠినాత్మురాలవను విషయము తెలియక మనసార నమ్మినానే

క్షిప్రప్రసాదినిగ దాసుని రక్షింప జాగు నీకేలనమ్మా

వరమొసగు కరములు దరహాస ముఖముగల ఆదిపూజ్యుని తల్లివమ్మా

మాధవ సోదరి మాత పరమేశ్వరి మాయాస్వరూపిణివి నీవే

అధికారిణివి నీవు ఆశ్రయనిరాదరణ అప వాదు తగనిదమ్మా

అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.

****
4.భూలోకమున ఎన్ని జన్మలెత్తినగాని ఏ క్షేత్రములు చూడలేదు

సత్పురుషులను దర్శించి భక్తితో వారిని ప్రస్తుతించినదియు లేదు
వామి నీవని, శివగామి నీవని తల్లి నిన్ను నోరార కీర్తించలేదు
మాతా పిత యనుచు పాదములు తాకి నే వందనము చేయలేదు

జ్ఞానులను గుర్తించి జాగరూకతతోడ సవినయ కైమోడ్పులీయలేదు

సద్గురువు పాదాలపై వాలి సాష్టాంగములు చేయలేదు
పరికించి చూచినను నా వంటి మూఢుడు
నీకెందు కానరాడు
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
5పాహియని రక్షింప పాదములు పట్టితిని జాగుచేయుట తగనిదమ్మా

ఇంత కాఠిన్యము ఎందును కనరాదు నీ పతిని మరచితినమ్మా

భక్తులను బ్రోవ నీ చిత్తమే కాకున్న పెడముఖము పాడికాదు

జాలియన్నది మరచి శిక్షింపగ నన్ను పక్షపాతము చూపకమ్మా

ఇంతటి మోసము సరికాదు సరికాదు ఇది ధర్మమనరే ఓ అమ్మా

సుంతైన రక్షించ చింతించకున్నావు ఇది నీతికాదె ఓ యమ్మా

కరిముఖునిపై ప్రేమ కనికరము మరచినది "కుమాతవు" నీవు కావమ్మా

అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.

6.మాధవుని సోదరివి మరకత వల్లివి మంత్రస్వరూపిణివి నీవే

మాయా మహాశక్తి మాహేశి మానిని మలయాచలేశు పుత్రీ

మాత మీనాక్షివి సద్గుణవర్షిణివి దయానిధి విశాలాక్షివి

జగములను పాలించు జగన్నాయకి నీవు శరణాగత రక్షకి

శివ వామభాగిని భువనైక మోహిని చిత్స్వరూపిణివి నీవే

ప్రణవ స్వరూపిణి అరుణాచలేశ్వరి అఖిలాండమంత నీవే

ఆర్త జన పోషిణీ ఆనందవల్లినీ అఖిలాండ సంధాయినీ

అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే అంబ కామాక్షి ఉమయే.

*************
7.అల్లరి పిల్లల బుగ్గ గిల్లియు తల్లి బుధ్ధులను నేర్పించదో

పెనుభూతమైనను తన పిల్లలను మిగుల ప్రేమతో పెంచునమ్మా

ఆయాసపడుచున్న నా ఆర్తనాదమును పెడచెవిని పెట్టకమ్మా

ఆవగింజంతైనను జాలిలేదా నీకు కఠినశిల కరుగునమ్మా

ఆనవాలే లేని అన్ని అపరాధములు విడిచిపెట్టక ఉండకమ్మా

హెచ్చైన కరుణతో వచ్చి రక్షింపక రచ్చ చేయుట తగనిదమ్మా

దయలేని దానివను పదిమంది వేసేటి నింద నీకేల నమ్మా

అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.అంబ కామాక్షి ఉమయే.

8..ఎన్ని జన్మలలోన ఎన్నెన్నో పాపములు మూఢునిగ చేసినానో

కల్లలెన్నో పలికి చేతివాటము చూపి మోసములు చేసినానో

ఏమిటోతెలియదు ఈ క్షణము తరుముచు ఇక్కట్టు వచ్చెనమ్మా

గొప్ప మనసుతో నీవు తప్పించకున్నను
నా కలత తీరదమ్మా

అపరాజితవు నీవు అపరాధినే నిన్ను ప్రార్థించుచుంటినే అమ్మా

చిన్నబుచ్చక నన్ను మన్నించుటయు నీదు కాదనలేని కరుణయేనమ్మా

హంస వాహినివిగా ఆనందదాయివై దరిశనమునీయవమ్మా

అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే-
అమ్మ కామాక్షి ఉమయే.

******
9.ఎందరో నావలె జన్మమెత్తిన గాని ఆనందమొసగినావే
నా పూర్వ పాపమే తరుముతు వచ్చినది నీ చరణమె శరణమమ్మా

నీవె నా అభయమని నెరనమ్మినానమ్మ నీ పాదమె సాక్షి కాగా

నిన్ను మించినవారు వేరెవరు కనరారు ఎన్ని లోకములు గాలించినా

సమయమిది కాదని నువు జాలమే చేసినచో దీనునికి రక్ష ఎవరు?

భువనములు కీర్తించ బాలమార్కండేయుని బ్రతికించినట్లుగానే
ఇప్పుడైనను
వచ్చి నన్ను రక్షింపగ బెట్టు నీకేలనమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే,
****************

10.10.తారకము నీవని నమ్మినట్టి నన్ను సరగున రక్షించవే

భక్తితో నీపాద నిత్యదర్శనముల భాగ్యమే కడురమ్యము

దేహదోషంబులను చెంతరానీయనను అభయహస్తము నీయుమా

భక్తితో స్తుతియించు భాగ్యమ్ముతో పాటు జయములను వర్షించుమా

యమునిపాశము నన్ను దరిచేరలేని కడుప్రేమతో బ్రోవవమ్మా

పటుతరము కాని నా స్తుతిదోషమెంచక "చుట్టు శ్రీరామ రక్ష"

ఇసుక మహదేవుని మనసార కొలిచిన మాతల్లి ఏకాంబరియు నీవే

అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
11.11ఎన్నెన్ని జన్మలు నన్ను రాపాడినవో ఈ భూమిపై తెలియదమ్మా

ఇప్పటికైనను మరుజన్మ లేకుండ నన్ను రక్షించవమ్మా

ముక్తిదాయినివనుచు ముక్కాలములు నిన్ను భక్తితో కొలిచినానే

ముందెన్నడు నిన్ను చూడలేదనుచు నను మందభాగ్యుని చేయకమ్మా

భక్తులకు కామాక్షి విరుత్తానుగ్రహము సర్వతోముఖ విజయము

ఒప్పుకొన నీకిట్టి బెట్టుసరి శర్వాణి విభుని విడి బ్రోవవమ్మా

అక్షయంబైన నీ వీక్షణముతో మా ఆపదలుకడతేరునమ్మా

అవ్యాజకరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
************
తల్లి నన్ను పరికరమును చేసి ఆశీర్వదించి,అందించిన ఈ "కామాక్షి కామదాయిని" కామితార్థ స్తుతిలోని ప్రావీణ్యత అమ్మది.దోషములు నేను-నాచే అన్న అహంభావము-అజ్ఞానము చేయించినది.ఇది నిస్సందేహము.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...