Sunday, October 7, 2018

SREE MANNAGARA NAATIKA-10

అమ్మ చేయి పట్టుకొని ఆడుతూ-పాడుతూ సాగిపోతున్నాను.ఇంతలో అమ్మ ముఖములో ఆనందచ్చాయలు వీడి,ఆందోళన పొడచూపసాగింది.నాకే బాధనపించింపించి అమ్మనలా చూస్తుంటే.అమాయకముగా ఏంజరిగిందని అడిగాను? ఒక సారి క్రిందకు చూడమంది.చూశాను మెల్లగా.అంతే బాబోయ్
.
ఎందరో గంధర్వులు-కింపురుషులు-యక్షులు-కిన్నెరులు-ఋషులు-మానవులు అమ్మ పాదాలను అందుకోవాలని ఆర్తితో ప్రయత్నిస్తున్నారు.కాని పాపం ఏదో మాయా వలయం వారిని అడ్డుకుంటున్నది.అవ్యాజ కరుణాంతరంగ అయిన అమ్మ అక్కడే నన్ను నిలబడమని వారికి తన చేతులను అందిస్తూ,పైకి చేరుస్తున్నది.అమ్మ నా ఒక్కనిదే అనుకున్న నా స్వార్థానికి ఉక్రోషం వచ్చింది.వీళ్లందరు మనతో చింతా మణి గృహమునకు వస్తారా అని అడిగాను.నన్ను చూసి అమ్మ మందహాసం చేసింది.అందులో ఏమి మహత్తు ఉందోగాని నా బుద్ధి తిరిగి ప్రచోదనము కాసాగింది.అదే నీ వొళ్ళో నేను కూర్చుందామనుకున్నాను.నువ్వు సరేనన్నావు.మరి వీళ్ళందరిని? అయోమయముగా చూసాను.అక్కున చేర్చుకొని,నన్ను ముద్దాడి,మరి నేను మీ అందరికి అమ్మను కదా! నీలాగేనే వారికి నా ఒడిలో కూర్చోవడము ఇష్టము.మీ అందరిని నా ఒడిలో లాలించము నా సహజగుణము అన్నది ఆ స్వరములో ఏ మంత్రమున్నదో గాని,మారు మాటాడకుండా అమ్మ వెంట నడుస్తుంటే రానే వచ్చేసింది, అనిర్వచనీయ అద్భుత చింతామణిగృహము. అపురూప ఆనందోఆస ఆరామము.అవ్యక్త సుందర మనోహరము.ఆర్త్రత్రాణ పరాయణి ఆసీనురాలగు శివాకార.....  అమ్మో అమ్మో ఆనందాతిరేకముతో ఆడుచున్న నా మనసు మూగబోయినదా లేక వర్ణించగల వాక్యములు దొరకక దిగాలుపడి అమ్మ పాదములకు నమస్కరించుచున్నదో తెలియని ఉద్వేగముతో ఊగిసలాడుచున్నది.తల్లీ నీపాద ధూళి నన్ను పరమపవిత్రము చేయుచున్న వేళ పలుకులను అనుగ్రహించవమ్మా అని ప్రార్థిస్తున్నది.అంతే అమ్మ మందహాసము మరంద ధారలై,

     అమ్మా-ఆనందమయీ-అనురాగమయీ-అమృతమయీ,
  ***************************************
పరమపావనమైన నీపాదరజకణము
పతితపాలకమైన పరమాత్మ స్వరూపము

ఏకాంత-శృంగార-జ్ఞాన-ముక్తి మంటపములు
సహస్ర మండపముల సూర్య-చంద్ర  ప్రకాశితము

శక్తితత్త్వములు అమరినవి పది సోపానములుగా
శివతత్త్వము మారినది శుభాకార మంచముగా

సకలలోక సౌభాగ్య సంకల్పితము అపురూపము
కుడి-ఎడమగా విడివడినది ప్రూషికా రూపము  (    అద్వైతము

సంతత చిత్ప్రకాశక చింతామణి గృహములో
అమ్మ ఒడిలో నేను ఆసీనురాలినైన వేళ

జన్మధన్యమైన నన్ను వెడలిపొమ్మనకమ్మా,
అందరికి అమ్మవైన అద్భుత సౌందర్య లహరి.

మణిద్వీపమునకు బ్రహ్మరంధ్రము వంటి చింతామణి గృహములో తల్లిచిత్ప్రకాశముతో దర్శనభాగ్యమును ప్రసాదిస్తుంటుంది.చింతతో ప్రమేయము లేకుండగానే చింతితార్థ ప్రదాయిని చెంతనేఉండి రక్షిస్తుంటుంది.అందుకేనేమో తల్లిని "సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితా"   ( సంసారమనే పంకము లో (బురదలో) చిక్కుకుని యున్న మనలను ఉధ్ధరించే సద్గతిని చూపే) తల్లీ అని
   సన్నుతిస్తారు.సహస్రాక్షి-సహస్రపాత్ సహస్ర స్తంభ నిర్మితమైన చతుర్విధఫలపురుషార్థములైన ఏకాంత-శృంగార-జ్ఞాన-వైరాగ్య మండపములలో విరాజితమై విలక్షణముగా మనలను పాలిస్తుంటుంది.ఆహా! ఏమి నా సౌభాగ్యము. సృషి స్థితి కారిణి మనకొరకు కుడి-ఎడమలుగా పురుష-స్త్రీ రూపములుగా విడివడి ప్రూషికగా మారినది.తల్లి నిర్హేతుక కరుణాకటాక్షము నన్ను అమ్మ ఒడిలో ఆసీనురాలిని చేసినది.ధన్యోస్మి తల్లీ ధన్యోస్మి.నాతోబాటు మీ అందరిని మక్కువతో తన అక్కునచేర్చుకుంటానని తల్లి నాతో అంటున్న సంతోష సమయమున నన్ను నీ ఒడినుండి నుండి విడదీయకమ్మా,

అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురాలులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ, దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

     అవ్యాజకరుణామూర్తియైన అమ్మ మనమీది అనురాగముతో ఈ ఆపదను అంతమొందించి,ఆనందమయముగా అవనీతలమును ఆశీర్వదించును గాక.

  అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉన్నట్లే
  అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉన్నట్లే
  అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉన్నట్లే.

  ప్రియ మిత్రులారా మీరు అందించిన ప్రొత్సాహమునకు సవినయ ధన్యవాదములు.సోదరి.నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

   సర్వేజనా సుఖినో భవంతు.

       స్వస్తి. శుభం భూయాత్.


  





SREEMANNAGARA NAAYIKA-09

మాహేశ్వరి మనోసంకల్ప నిర్మిత మరకతమణి ప్రాకారము మహిమాద్భుతము.ఇందులో రెండు త్రికోణములు గలభవనము కలదు.పైవైపున నున్న త్రికోణ బిందువులలో త్రిమూర్తులు తేజరిల్లుచుంటారు.క్రిందివైపునకున్న త్రికోణ బిందువులలో వారు శక్తులతో ఉంటారు.గణపతి-కుబేరుడు-దక్షిణామూర్తి ఇంకా ఎందరెందరో దేవతలు అమ్మదయతో అధిష్ఠితులై ఉంటారు.పవిత్రత-ప్రశాంతత-ప్రావీణ్యత గల ఆ మరకతమణిప్రాకారమున నున్న నన్ను పరమేశ్వరి అనుగ్రహము తరింపచేయుచున్నట్లున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు. 

"పంచమీ-పంభూతేశి" తల్లిని సేవించునవి పంచభూతములు.అవి నీరు-నిప్పు-నింగి-నేల-గాలి.అవి తల్లి కనుసన్నలలో పంచభూతములను గమనించుచు,వాటి గమనమును నిర్దేశించుతు,ఋతువులననుసరించి,ప్రపంచ సౌభాగ్యమునకు సమతౌల్యతతో-సంస్కారముతో ఉండునట్లు చేయుశక్తులు పంచభూతస్వామినులు..అలాకాకుంటే ప్రళయమే కదా.


   శ్రీమాత పూజా విధానములో సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహ విధానములలో,బిందురూప పూజ. (సృష్టి) స్థితిపూజలో అర్చించిన దేవతలు కాకుండా మిగిలిన దేవతలను (మంత్రపూరితమైన వారిని) ఆమ్నాయ దేవతలు అంటారు.వారు నాలుగు దిక్కుల పేర్లతో-ఊర్థ్వ-అథో స్థానములను పాలిస్తుంటారు.

 నవరత్నమణి ప్రాకారములో పంచభూతదేవతలు-దిక్కులను కాపాడుచున్న ఆమ్నాయ దేవతలు
 ఆనందముతో నన్ను ఆశీర్వదిస్తున్న సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.అమ్మ దయతో కొనసాగుతుంది.


  ( శ్రీ మాత్రే నమః.)

SREE MANNAGARA NAAYIKA-08

అమ్మకు నమస్కారములు.అదిగో ఇంద్రనీల ప్రాకారము.కాళి-కరాళి-ఉష-దుర్గ-సరస్వతి లక్ష్మి ఇత్యాది పదహారు శక్తులు పదహారు దళములుగా గల పది యోజన విస్తీర్ణ పద్మాకార భవనము.

అష్టమాతృకాశక్తుల వైఢూర్య నిలయములను  దాటిన తరువాత,పదహారు ఇంద్రనీలమణి రేకులున్న పద్మాకార భవనము ప్రజ్ఞావైభవమై ప్రకాశిస్తోంది.పద్మము జ్ఞానమునకు సంకేతము.పద్మము సూర్యుని ఉషోదయ కిరణాలతో వికసిస్తుంది.బురదలో పుట్టి,బురదలోనే ఉంటున్నప్పటికిని దానిచే ఏ మాత్రము ప్రభావితము కాకుండా ప్రకాశతత్త్వముతో పరిమళిస్తుంటుంది.పద్మాకారా భవనములోని పదహారు రేకులు అమ్మచే సంకల్పమాత్ర సంభవములైన జ్ఞాన సంకేతములు.పద్మాసనే-పద్మకరే సర్వలోకైక పూజితే-నమో నమః.ఇంద్రనీలమణి ప్రాకారములో దయాసింధువైన పరాశక్తిని ధ్యానములో దర్శించుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.ఎంత మధువును గ్రోలినను తనివితీరని నన్ను ముత్యాలప్రాకారము మురిపిస్తు పిలిచినది.


 నిత్యకళ్యాణి మనోసంకల్పిత ముత్యాల ప్రాకారము స్వచ్చతకు-సత్యమునకు ప్రతీక అయిన తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుండి.అచ్చటి ఎనిమిది రేకులు పద్మము అనంగ మదనాది ఎనిమిది శక్తులుగ ,వారు అందించు సర్వజీవుల- సర్వకాల-సర్వావస్థల సమాచారములను కాంతులను వ్యాపింప చేస్తు ,సత్కృపకు  పాత్రులను చేస్తుంటుంది.అంతేకాదు అమ్మవారి కంఠములో అలంకరించబడిన  అటు-ఇటు కదులుచున్న 
 అందమైన ముత్యాలతో అల్లబడిన రత్నాల హారము అందముగా కనిపిస్తోంది.ఇది పైకి కనిపించే అర్థము.కాని కొంచము నిశితముగా పరిశీలిస్తే, ఆ ప్రాకారములోని శక్తుల సత్వ-రజోగుణ సంకేతములు.తల్లి విశుద్ధ చక్ర సరస్వతీరూప సాక్షాత్కారములు.అక్కడ నల్లని తమోగుణము అసలు లేనే లేదు.అంతా తేటతెల్లనైన సత్వ ప్రకాశము.హృదయ మలినములు లేని-తొలగించుకొనిన సాధకుల సాహచర్యముతో సర్వేశ్వరియే  సత్యము అన్న విషయము నేను తెలిసికొనుచున్న సమయమున చెంతనేనున్న నా చేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు. 

 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.అమ్మ దయతో కొనసాగుతుంది.

  ( శ్రీ మాత్రే నమః.)

SREEMANNAGARA NAAYIKA-07

అమ్మకు నమస్కారములు.

  ఉదయించుచున్న సహస్ర సూర్యకాంతిగల తల్లి సంకల్పిత గోమేధిక ప్రాకారము దశయోజన విస్తీర్ణము దండనా సామర్థ్యము కలది.ఇంద్రాణి-రుద్రాణి-నారాయణి ఇత్యాది ముప్పదిరెండు శక్తుల విలసితము.ఒక్కొక్క మహాశక్తికి పది అక్షౌహిణి సైన్యము కలదు. ( (అక్షౌహిణీ-21,870 రథములు,21,870 ఏనుగులు,65,610 అశ్వములు,1,09,360 కాలిబంట్లు.) విద్య-పుష్టి-సినీవాలి ప్రభ నందాది సకల సద్గుణ శోభితము.

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా సంకల్పిత గోమేథిక ప్రాకారము మందారకుసుమ ఎర్రని రంగుతో తాపస మందారి కరుణ ప్రకాశిస్తుంటుంది.ఈ ప్రాకారములో తరువులు.ఆకులు,పండ్లు,భూమి.దేవతశక్తుల ఆభరణములు అన్ని గోమేథిక మణిమయమే.ఎర్రని వీరతిలకమా అన్నట్లు శక్తులు-వీరులు తేజోవంతులై ఉంటారు.ఇక్కడ బుద్ధి,జ్ఞానము,పుష్టి,విద్య సర్వజీవులను ఆదరిస్తూ-అనుగ్రహిస్తుంటారు..తల్లి తేజము నాలో ప్రచోదనమైనదేమో !పరాశక్తి ప్రణామములు. నా మనసు -బుద్ధి ఒకటికొకటై తల్లి తత్త్వముతో తన్మయమగు సమయమున,చెంతనేనున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.(సినీ వాలి-ఒక్కొ అమావాస్య యందు సన్నని రేఖలా కనిపించు చంద్ర రేఖ.)గోమేధిక ప్రాకారమును దాటగానే అత్యంత మనోహరమైన వజ్రప్రాకారము మనసును దోచుకొనుచున్నది.

అత్యంతవైభవోపేతమైన మణిభవనములు,వాని ముందు ఎన్నో కోట్ల మైళ్ళ దూరమువరకు గల అసంఖ్యాక అశ్వములు-గజములు-రథములు-వాహనములు కొలువుతీరిన అమ్మవారి సైరంధ్రీ జనము
(అమ్మను అలంకరించు చెలికత్తెలు-పరిచారికలు అనలేము)వారి పూర్వ జన్మపుణ్యఫలముగా అపూర్వ సేవాసౌభాగ్యమును పొందియున్నారు.కొందరు సత్వ-రజో-తమోరూపముకన్ను అని చర్చించుకొనుచు చల్లనికాటుకను తయారుచేసి,అమ్మవారికి అందించుచున్నారు.సాక్షాత్తుచంద్రుని కన్నుయందు నిలుపుకొనిన తల్లికి చల్లదనమునకై కాటుకను తయారుచేసి అందించుట వారిభక్తితత్త్వమును చాటుచున్నది.మరికొందరు విశాలఫాలభాగమున శోభాయమాన కస్తురిని అలదుచున్నారు.కస్తురి మృగపుణ్యమేమో తల్లి నుదుటను తాను సుగంధముగా ప్రకాశించుతోంది.కొందరు పట్టుచీరలను-కంచుకములనునేసి పట్టరాని సంతోషముతో తల్లికి చుట్టబెట్టుచున్నారు.ఆభరణములతో,అందమైన సుగంధద్రవ్య భరిణెలతో ,మువ్వలతో,అలంకరణలను అర్చనకు ఆత్రుతగా నున్నారు.మరికొందరు తల్లికి రకరకములైన (తాటాకు-తామరాకు-వింజామర) విసనకర్రలతో వీచుచున్నారు.చమరీమృగమా ధన్యతనొందితవి వింజామరగా పరిణితినొంది. అమ్మ పరిచర్యలకై వజ్రప్రాకారములోని వ్రజముతో పాటు నేను తల్లిని సేవించుచున్నసమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయతో కొనసాగుతుంది.


   ( శ్రీ మాత్రే నమః)

SREEMANNAGARA NAAYIKA-06

 అమ్మకు నమస్కారములతో,

   ఆరు ఋతువులను ,ధాతు ప్రాకారములను దాటిన నా మనసు ఆరు శతృవులను జయించినదా అన్నట్లు ప్రశాంతమై,పరమ పావన పాదసేవకు పరుగులు తీస్తున్న సమయమున,కనిపించిందొక అద్భుతము అమ్మ వరము.

.
" కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితా" సంకల్ప నిర్మితమైన పుష్యరాగ ప్రాకారమునకు సమిష్టి దిక్పాలకులు నాయకులు.ఇక్కడ తరువులు-పత్రములు-ఫలములు-పక్షులు-సరోవరములు అన్ని ఎర్రని కాంతితో ఉంటాయి.ఉత్తరమున కుబేరుడు-పశ్చిమమున వరుణుడు-వాయవ్యమున వాయుదేవుడు-ఆగ్నేయమున అగ్నిదేవుడు ఈశాన్యమున రుద్రుడు మహాతేజోవంతులై వారివారి శక్తులను,ఆయుధములను ధరించి అమితోత్సాహముతో నున్నారు.ప్రమథగణ సంసేవితుడైన పరమేశుడు అష్టమూర్తియై,ఇష్టకామ్యములను తీర్చుచున్నాడు.అతి సుందర అమరావతి పట్టణమున అలౌకిక ఆనందముతో నున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

 ఇది నిజమా? కలా? అని ఇది ఇహ-పర వారధియా? నాలో ఇంత అద్భుత పరివర్తనను అందించిన అతీతశక్తికి అభివాదములిడుచుండగా అగుపించినది అత్యంత ప్రేమతో నన్ను ఆహ్వానిస్తు


.
  "అరుణాం కరుణాంతరంగతాక్షి" సంకల్పిత పద్మరాగ మణి ప్రాకారము రక్షక స్థానము.చతుషష్టి కళలనెడు అరవై నాలుగు శక్తిస్వరూపములు-అరివీర భయంకరులైన వీరులు ధనుర్బాణ ధరులై,ధర్మపాలన చేస్తుంటారు.అసంఖ్యాక రథములు-గజములు-అశ్వములు-యుద్ధభూమి పయనమునకు సిద్ధముగా ఉంటాయి.ఆదిశక్తి అరివీరభయంకర సంకేతముగా,కుంకుమ సమ అరుణకాంతి భూభాగములో మండపములు-పక్షులు-వృక్షములు-ద్వారములు-సరోవరములలో పద్మరాగమణుల కాంతులు ప్రకాశించుచున్నవి.అమ్మదయతో నాలోని అరిషడ్వర్గములు అంతరించుచున్న సమయమున,చెంతనే నున్న నాచేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

 అమ్మ దయ యుంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయతో కొనసాగుతుంది.

  ( శ్రీ మాత్రే నమః.


.


SREE MANNAGARA NAAYIKA-05

 అమ్మకు నమస్కారములతో,

   వెండికొండపై బంగరు కాంతులీను చేతిని పట్టుకొని,చిత్ప్రకాశము వైపు పరుగులు తీస్తున్న నా మనసు మహోత్సాహముతో  ,రాకాచంద్ర కాంతిని తలదన్ను రజత ప్రాకారము లోనికి ప్రవేశించినది.

  "కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా" సంకల్పిత స్వర్ణప్రాకారములోని వారి భక్తి సాధనకు ఇది తొలిమెట్టు.ఈ ప్రాకారమునకు నాయకుడు శిశిర ఋతువు.అతడు తన భార్యలైన తపశ్రీ-తపస్య శ్రీలతో ఇచటి కదంబ వన ఫలముల మద్యమును సేవిస్తూ,ఆత్మానందమును పొందుతుంటాడు.ఇది బాహ్యార్థము.పవిత్ర ప్రాకారములో మద్యపానమా? అని అనిపించినప్పటికిని,కొంచము నిశితముగా పరిశీలిస్తే.....కదంబ వనఫలములు అనగా అమ్మ కరుణతో అందించిన అనుగ్రహ ఫలితములు.వాని నుండి స్రవించు మద్యము అమ్మ కరుణాకటాక్షమను అమృతము.దానిని దర్శించి-భావించ గలుగుట పానము.దాని పరిణామమే ఆత్మానందము.ఇది అనుభవైవేద్యమే కాని ఈవిధముగా ఉంటుందని మనము చెప్పలేనిది.


  మరొక విషయము ఇది చివరి ధాతు-ఋతు ప్రాకారము.శిశిరుని భార్యల నామములు వాటిలో దాగిన ప్రత్యేకతను సూచిస్తున్నవి.అవి తపము-తపోఫలితము.శిశిరములో చెట్లు తమ ఆకులను రాల్చివేసి,నిరాకారముగా,ఎండిన మోడులుగా కనిపించును.కాని అవి నిర్వికారమైన నిశ్చలతతో వసంతమునకై ఎదురుచూచును.ప్రతి జీవి వ్యామోహములను తన ఆశల ఆకులను రాల్చివేసి,నిరాడంబరముగా,ఏ వ్యామోహము లేకుండా,తల్లి దయ అను వసంతమునకు నిర్వికారముగా-నిశ్చలముగా ఎదురుచూచు మానసిక స్థితికి వస్తాడు.అతడిలోని ద్వంద్వ ప్రకృతి నిర్ద్వందమై పోయి ఆధ్యాత్మికతకు ఆలవాలమా అన్నట్ట్లున్నది. ఈ విచిత్ర భావన నాలో ఈశ్వరి సంకల్పమైన సమయమున,నా మోహావేశములు పటాపంచలై,నా మనసు శుద్ధమై నీ పూజా పుష్పము గా మారుచున్నవేళ,  చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

  అమ్మ దయయుంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయతో కొనసాగుతుంది.

  ( శ్రీ మాత్రే నమః.)

.

SREE MANNAGARA NAAYIKA-04

 అమ్మకు నమస్కారములతో,

   నన్ను వశము చేసుకొన్న సీస ప్రాకారము ఇంకా ముందు ముందు ఏమి వింతలను వైభవములను చూడబోతున్నానో అను కుతూహలమును కలిగిస్తుంటే,రానే వచ్చింది మరో సౌందర్య నిధి నన్ను మురిపిస్తూ,

 దయార్ద్ర-నిష్కళంక- నిర్విరామ అమృతాధారా ప్రవాహ మయము, ఏడు యోజనముల విస్తీర్ణముగల ఇత్తడి ప్రాకారము.స్థలము-సమయము-సందర్భములను గమనిస్తూ,మేఘవాహనుడు (శ్రావణ-భాద్రపదములైన) నభశ్రీ-నభస్య శ్రీ అను తన రాణులతో పాటు ,సర్వస్య-రస్య మాలిని-నితంతి-భ్రమయంతి-వర్షయంతి-వారిధార-మేఘయంతిక -వారిధార-చిపుణిక-మదవిహ్వల అను శక్తులను కూడి,తల్లి సంకేతానుసారముగా( నిమిత్తమాత్రుడై) వర్షిస్తూ.బాధాతప్త హృదయాలకు చలివేంద్రమై వర్షిస్తుంటాడు.జయహో  జగదీశ్వరి.అక్కడచిత్ప్రకాశ ధారలలో చిత్తుగా నేను తడుస్తున్నను.నాతో బాటుగా   అనేకానేక సిద్ధులు-దేవతలు ఉల్లాస భరితులై సతీ సమేతులై ఆ పవిత్రధారలలో పునీతులగుచున్న సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారము


   నన్ను  చిత్తు చేస్తున్న ఇత్తడి ప్రాకారమును వదలలేక సాగుచున్న నాకు వరమై కనిపించింది పంచలోహ ప్రాకారము.పరమాద్భుతము.



" పంచమీ -పంచ భూతేశి,పంచ సంఖ్యోపచారిణి" సంకల్ప నిర్మిత,పంచమ-పంచలోహ ప్రాకారము,ఇషలక్ష్మీ-ఊర్జలక్ష్మీ సమేత శరదృతు నాయక చంద్రికాపాలితమై ,ప్రకాశిస్తూ ఉంటుంది.

   నీ పాదకమల సేవయు
   నీ పాదార్చకులతోడి నెయ్యమును,నితాం
   తాపార భూత దయయును
   తాపస మందార నాకు దయసేయగదే. (సహజకవి బమ్మెర పోతన)

    తాపస మందార-సేవక మందార-భక్త మందార అను పదములను మనము తరచుగ వింటూనే ఉంటాము.మందార  శబ్దము పుష్పజాతినే కాక,కొండజాతి,జలజాతి,వనజాతులను తెలియచేస్తుంది.అంతే కాదు.
దైవ క్షిప్ర ప్రసాద గుణముగా ( అతి త్వరగా  అనుగ్రహించు స్వభావముగా) కీర్తింపబడుచున్నది.


  మహామహోన్నతమైన మందార వాటికలో నా డెందము చిందులువేయుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయతో కొనసాగుతుంది.

    ( శ్రీ మాత్రే నమః.)

SREEMANNAGARA NAAYIKA-03

 అమ్మకు నమస్కారములతో, ఏ మాత్రము అర్హత లేని నన్ను, అమ్మ తన అమృత హస్తపు వేలితో నాచేతిని పట్టుకొని నడిపించుచున్నదన్న విషయము అర్థమై ఆనందభాష్పములు జాలువారుచున్న వేళ నేను,మరొక దివ్య ప్రాకారములోనికి  అడుగిడబోవుచున్నానన్నమాట.ఆ  ప్రాకారము అద్భుతము.

చదరపు ఆకారములో సప్తయోజన విస్తీర్ణ గోడలతో రాగి ప్రాకారము ప్రకాశిస్తుంటుంది.కల్పక వృక్ష వాటికలు బంగారు ఆకులతో,రతనాల పండ్లతో,వజ్రాల గింజలతో అమృత మధువును స్రవిస్తూ,పది యోజనములకు వరకు పరిమళములను వ్యాపింప చేస్తుంటాయి.గాన ప్రియులైన గంధర్వ యువతీ-యువకులు మధువును సేవిస్తూ,మదన పరవశులై ఉంటారు.అందులో పుష్ప బాణుడు పువ్వుల గొడుగు క్రింద,పువ్వుల సింహాసనముపై ,పువ్వుల మాలలను అలంకరించుకొని,తన భార్యలతో పువ్వుల మథువును త్రాగుతూ పూబంతులాడుచున్న సమయమున, వారిచెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు. అమ్మ అనురాగముతో ఆర్ద్రమైన నా మనసు రాగిప్రాకారమును దాటి సీసప్రాకారములోనికి ప్రవేశిస్తున్నది.


సీస ప్రాకారము సప్తయోజన విస్తీర్ణముతో,మథుర రస ఫలములు గల సంతానవాటికతో శోభిల్లుతుంటుంది.గ్రీష్మ నాయకుని భార్యలైన (జ్యేష్ఠ-ఆషాఢ మాసములు) శుక్రశ్రీ-శుచిశ్రీలు సంసార తాప ఉపశమనమునకై  సంసారవాటిక తరుమూలములలో సేదతీరుతుంటారు.అచ్చటి ప్రాణులు చల్లని నీరు త్రాగుతుంటారు.లెక్కించలేనంతగా నున్న అమరులు-సిద్ధులు-యోగినీ యోగులు తల్లిని సేవిస్తుంటారు.గ్రీష్మ తాపమును తగ్గించుకొనుటకై నవ విలాసినులు శరీరమునకు  సుగంధమును పూసుకొని,పరిమళ పుష్పమాలలను అలంకరించుకొని, తాటియాకు విసనకర్రలను వీచుకొనుచు విలాసముగా తిరుగుతుంటారు.తల్లి కనుసన్నలలో ప్రత్యక్షదైవమైన సూర్య భగవానుడు  ప్రచండుడై కిరణములను ప్రసరించు,నిస్తుల వైభవమును విస్తుబోయి చూచుచున్న సమయమున ,చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.


 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయతో కొనసాగుతుంది.



  శ్రీ మాత్రే నమః.





SREEMANNAGARA NAAYIKA-02

  అమ్మకు భక్తితో నమస్కరిస్తూ,
 బ్రహ్మాదులతో పాటుగ పరబ్రహ్మ దర్శనార్థము చేస్తున్న పయనపు పరవశ ఉక్కిరిబిక్కిరిలో అయోమయ ప్రాకారము దాటి,రెండవ ప్రాకారములోనికి ప్రవేశించితినన్న విషయము ఇప్పుడిప్పుడే తెలివికి వస్తున్నది ఇది నిజముగా ఏ పూర్వజన్మ పుణ్య ఫలమో కద.తల్లి అనుగ్రహముంటే అసాధ్యమేముంటుంది?

 అతి ఎత్తైన కంచులోహ ప్రాకారములు అమ్మ అపారకృపావీక్షణమునకు నిలువెత్తు నిదర్శనములు.పనస-శింశుప-దేవదారు- లవంగ-పాటల-దాడిమి-చందన మొదలైన అచ్చమైన పచ్చదనపు వృక్షాల( అసలు ఎండుటాకు కానరాదు) హరిత ప్రకాశము జగన్మాత స్థితికారకత్వము ,వాటి సుమనోహర పరిమళము వ్యాపించిన ఆశ్రిత వాత్సల్యమేమో .పరాత్పరికి ప్రణామములు చేస్తున్నవా అన్నట్లు చిలుకల-గోరువంకల మైత్రి,పావురముల ప్రశాంతత-రాజ హంసల రమణీయత పరుగుతీస్తున్న కాలమును సూచిస్తూ పరుగులు తీస్తున్న లేళ్ళు కన్నులపండుగ చేస్తుంటే,కోయిలలు-గండు తుమ్మెదలు తల్లిని కీర్తిస్తున్నట్లు కుహుకుహు రాగములతో-ఝంకారములతో స్వరములను మీటుచున్న సమయము ప్రణవమును జపిస్తూ,తరిస్తున్నటున్నది.ఎ0తటి మహద్భాగ్యము.ధన్యులమైనామనుకొని తన్మయత్వముతో దానిని దాటిన తరువాత.చదరపు ఆకారములో సప్తయోజన విస్తీర్ణ గోడలతో రాగి ప్రాకారము ప్రకాశిస్తుంటుంది.కల్పక వృక్ష వాటికలు బంగారు ఆకులతో,రతనాల పండ్లతో,వజ్రాల గింజలతో అమృత మధువును స్రవిస్తూ,పది యోజనములకు వరకు పరిమళములను వ్యాపింప చేస్తుంటాయి.గాన ప్రియులైన గంధర్వ యువతీ-యువకులు మధువును సేవిస్తూ,మదన పరవశులై ఉంటారు.అందులో పుష్ప బాణుడు పువ్వుల గొడుగు క్రింద,పువ్వుల సింహాసనముపై ,పువ్వుల మాలలను అలంకరించుకొని,తన భార్యలతో పువ్వుల మథువును త్రాగుతూ పూబంతులాడుచున్న సమయమున, వారిచెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.అమ్మ దయతో కొనసాగుతుంది.


  ( శ్రీ మాత్రే నమః.)

SREEMANNAGARA NAAYIKA-01

చింతామణి గృహాంతస్థా-శ్రీమన్నగర నాయిక-01
****************************************

 స్థూల-సూక్ష్మములు రెండును తానైన అమ్మ ఒక రూపము మాత్రమే కాదు.ఒక దివ్య చైతన్యము.పరమాద్భుత తత్త్వము.ఆనందకరమైన,అనిర్వచనీయమైన,అజరామరమైన పరబ్రహ్మ తత్త్వము.ఉపనిషత్తులు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమే అమ్మ.స్థూలమునకు సారమే సూక్ష్మము.అదియే మన మనోమందిరమైన మణిద్వీపము.సర్వ భువనభాంద సృష్టికర్త మణిద్వీపనిర్మాణమునకు సూత్రధారియైన అమ్మ తన అనుగ్రహ ఆశీస్సులను బ్రహ్మగారిని పాత్రధారునిగా మలచి అందించినది.అసలు విషయమేమిటంటే,

శ్రీ మహావిష్ణువు చెవి గులివి నుండి మధుకైటభులు అను అసురులు జనించి,హరి నాభికమలమున ఉన్న బ్రహ్మపై దండెత్తిరి.అనుకోని ఈ పరిణామమునకు భయపడిన బ్రహ్మ పద్మము తూడులోని కిందకు కిందకు జారి దాగుకొను సమయమున శ్రీ   హరిని దర్శించెనట.కొత్తగా చూసిన హరి నాభి కమలము తన జన్మస్థానము అర్థమైన బ్రహ్మకు అంతా అయోమయముగా తోచెను.అవ్యాజ కరుణాంతర0గ అమ్మ బ్రహ్మ సందేహ నివృత్తి చేయ దలచెను. ఒక దివ్య విమానము బ్రహ్మముందు వచ్చి ఆగెను.అందులోనుండి ఓంకారము వినబడుచున్నది.దైవ నిర్దేశముగా బ్రహ్మ ఆ విమానమును ఎక్కి హరి-హరులతో పాటు అతల-వితల-సుతల-తలాతల-మహాతల-రసాల-పాతాళ సప్త అథోకములను,భూర్లోకము-భువర్లోకము-సువర్లోకము-మహర్లోకము-జనలోకము,తపోలోకము-సత్యలోకమునకు పైననున్న సర్వలోక చింతామణి గృహమున ప్రవేశించినారట.దారిలో వారికి మరొక బ్రహ్మ విష్ణువు శివుడు కనిపించినారట.త్రిమూర్తులు తమను నడిపించు జగన్మాతను దర్శింప కుతూహముతో మణిద్వీప ద్వారము దగ్గర నిలబడినారట.అక్కడ


మణిద్వీపమునకు నాలుగు వైపుల అమృత సాగరముంటుంది.సాగరతీరములో దక్షిణావర్త శంఖములు-రతనాల ఇసుక ప్రదేశములు-రత్మ వృక్ష వాటికలతో,అమ్మ సందర్శనమునకై చిన్న పడవలతో వచ్చుచున్న భక్తులతో కళకళలాడుతుంటుంది.అంతేకాదు మొదటి ప్రాకారమైన ఇనుప ప్రాకారము నాలుగు ద్వారములలో కిక్కిరిసిన దేవ,యక్ష,కిన్నెర,కింపురుషాదులతో,నిలిపిన వారి ఆయుధములనుండి వచ్చు రణగొణ ధ్వనులతో,చెవులను చిల్లుపరచునా అనేటంత.గుర్రపు సకిలింతలతో,ఇసుకవేస్తే రాలనంతగ,ఇసుమంతయు ఒకరి మాట వినిపించలేనంతగ కోలాహపూరితమై ఉంటుండి.అరి వీర భయకరులైన,ఆయుధధారులైన,తల్లి సేవా దురంధరులైన,అప్రమత్తులైన,అనిర్వచనీయ పుణ్యశాలులైన ద్వారపాలకులు,వారిని నిర్ణీత క్రమపద్ధతితో,ఏడు యోజనముల (16038 కిలోమీటర్ల) విస్తీర్ణముగల ప్రాకారములోనికి అనుమతిస్తున్న సమయములో (నన్నుకూడ) అయోమయ (ఇనుప) ప్రాకారములోనికి ఆనందోద్వేగములతో నా అడుగులు తడబడుచున్న సమయమున,చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.


  అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే.అమ్మ దయతో కొనసాగుతుంది.


   ( శ్రీ మాత్రే నమః.)


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...