Sunday, October 7, 2018

SREE MANNAGARA NAAYIKA-05

 అమ్మకు నమస్కారములతో,

   వెండికొండపై బంగరు కాంతులీను చేతిని పట్టుకొని,చిత్ప్రకాశము వైపు పరుగులు తీస్తున్న నా మనసు మహోత్సాహముతో  ,రాకాచంద్ర కాంతిని తలదన్ను రజత ప్రాకారము లోనికి ప్రవేశించినది.

  "కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా" సంకల్పిత స్వర్ణప్రాకారములోని వారి భక్తి సాధనకు ఇది తొలిమెట్టు.ఈ ప్రాకారమునకు నాయకుడు శిశిర ఋతువు.అతడు తన భార్యలైన తపశ్రీ-తపస్య శ్రీలతో ఇచటి కదంబ వన ఫలముల మద్యమును సేవిస్తూ,ఆత్మానందమును పొందుతుంటాడు.ఇది బాహ్యార్థము.పవిత్ర ప్రాకారములో మద్యపానమా? అని అనిపించినప్పటికిని,కొంచము నిశితముగా పరిశీలిస్తే.....కదంబ వనఫలములు అనగా అమ్మ కరుణతో అందించిన అనుగ్రహ ఫలితములు.వాని నుండి స్రవించు మద్యము అమ్మ కరుణాకటాక్షమను అమృతము.దానిని దర్శించి-భావించ గలుగుట పానము.దాని పరిణామమే ఆత్మానందము.ఇది అనుభవైవేద్యమే కాని ఈవిధముగా ఉంటుందని మనము చెప్పలేనిది.


  మరొక విషయము ఇది చివరి ధాతు-ఋతు ప్రాకారము.శిశిరుని భార్యల నామములు వాటిలో దాగిన ప్రత్యేకతను సూచిస్తున్నవి.అవి తపము-తపోఫలితము.శిశిరములో చెట్లు తమ ఆకులను రాల్చివేసి,నిరాకారముగా,ఎండిన మోడులుగా కనిపించును.కాని అవి నిర్వికారమైన నిశ్చలతతో వసంతమునకై ఎదురుచూచును.ప్రతి జీవి వ్యామోహములను తన ఆశల ఆకులను రాల్చివేసి,నిరాడంబరముగా,ఏ వ్యామోహము లేకుండా,తల్లి దయ అను వసంతమునకు నిర్వికారముగా-నిశ్చలముగా ఎదురుచూచు మానసిక స్థితికి వస్తాడు.అతడిలోని ద్వంద్వ ప్రకృతి నిర్ద్వందమై పోయి ఆధ్యాత్మికతకు ఆలవాలమా అన్నట్ట్లున్నది. ఈ విచిత్ర భావన నాలో ఈశ్వరి సంకల్పమైన సమయమున,నా మోహావేశములు పటాపంచలై,నా మనసు శుద్ధమై నీ పూజా పుష్పము గా మారుచున్నవేళ,  చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

  అమ్మ దయయుంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయతో కొనసాగుతుంది.

  ( శ్రీ మాత్రే నమః.)

.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...